సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష అక్కడక్కడా అప శ్రుతులతో ముగిసింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా 2,26,744 మంది (84.12%) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా 1,89,963 మంది (91.11%) హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1139 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కానీ పలు పరీక్షా కేంద్రాల్లో కనీసం హాల్ టిక్కెట్లు సైతం పరిశీలించకుండా లోనికి అనుమతి ఇచ్చారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మాల్ ప్రాక్టీస్, పరీక్ష బుక్‌లెట్ మారడం లాంటివి కూడా చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సంతోష్‌నగర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగింది.
ఇన్విజిలేటర్‌పై కేసు
పేపర్–1 పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాస్తున్న తన సమీప బంధువుకు జవాబులు అందజేశాడు. విషయం తెలిసిన పోలీసులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థిని, అందుకు సహకరించిన ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శిని అధికారులు సస్పెండ్ చేశారు.
మూడు గంటల ముందే ప్రశ్నపత్రాల సరఫరా
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సభను దృష్టిలో ఉంచుకుని గంట ముందుగా రావాల్సిన టెట్ ప్రశ్నపత్రాలను అధికారులు మూడు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేర్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని భావించిన అధికారులు ప్రశ్నపత్రాలను ముందే తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు సరఫరా చేసిన బుక్‌లెట్‌కు బదులు మరో బుక్‌లెట్ ప్రశ్నపత్రాలు ఇవ్వాలని హైదరాబాద్ నుంచి సమాచారం రావడంతో గందరగోళం ఏర్పడింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రశ్నపత్రం మార్చేందుకు కస్టోడియన్ మళ్లీ కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేరడం ఆలస్యమైంది. మరోవైపు సిరిసిల్లలో మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష నిర్వహణలో అధికారుల అలసత్వంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పేపర్–2కు బుక్‌లెట్–2 ఇస్తే.. సిరిసిల్లలో మాత్రం బుక్‌లెట్–1 ఇచ్చారు. అభ్యర్థులు పలువురు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా రాశారు.
అయితే విషయం తెలుసుకున్న అధికారులు గంట ఆలస్యంగా బుక్‌లెట్–2 అందజేశారు. అయితే పత్తిపాక వీధిలోని సిద్దార్థ స్కూల్‌లోని పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వైట్‌నర్‌తో దిద్దించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇలావుండగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల చిరునామాలు సరిగా లేకపోవడంతో సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment