mal practice
-
ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష అక్కడక్కడా అప శ్రుతులతో ముగిసింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా 2,26,744 మంది (84.12%) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా 1,89,963 మంది (91.11%) హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1139 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కానీ పలు పరీక్షా కేంద్రాల్లో కనీసం హాల్ టిక్కెట్లు సైతం పరిశీలించకుండా లోనికి అనుమతి ఇచ్చారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మాల్ ప్రాక్టీస్, పరీక్ష బుక్లెట్ మారడం లాంటివి కూడా చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సంతోష్‌నగర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఇన్విజిలేటర్‌పై కేసు పేపర్–1 పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాస్తున్న తన సమీప బంధువుకు జవాబులు అందజేశాడు. విషయం తెలిసిన పోలీసులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థిని, అందుకు సహకరించిన ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శిని అధికారులు సస్పెండ్ చేశారు. మూడు గంటల ముందే ప్రశ్నపత్రాల సరఫరా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సభను దృష్టిలో ఉంచుకుని గంట ముందుగా రావాల్సిన టెట్ ప్రశ్నపత్రాలను అధికారులు మూడు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేర్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని భావించిన అధికారులు ప్రశ్నపత్రాలను ముందే తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు సరఫరా చేసిన బుక్‌లెట్‌కు బదులు మరో బుక్లెట్ ప్రశ్నపత్రాలు ఇవ్వాలని హైదరాబాద్ నుంచి సమాచారం రావడంతో గందరగోళం ఏర్పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రశ్నపత్రం మార్చేందుకు కస్టోడియన్ మళ్లీ కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేరడం ఆలస్యమైంది. మరోవైపు సిరిసిల్లలో మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష నిర్వహణలో అధికారుల అలసత్వంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పేపర్–2కు బుక్లెట్–2 ఇస్తే.. సిరిసిల్లలో మాత్రం బుక్లెట్–1 ఇచ్చారు. అభ్యర్థులు పలువురు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా రాశారు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు గంట ఆలస్యంగా బుక్లెట్–2 అందజేశారు. అయితే పత్తిపాక వీధిలోని సిద్దార్థ స్కూల్లోని పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వైట్నర్తో దిద్దించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇలావుండగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల చిరునామాలు సరిగా లేకపోవడంతో సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోయారు. -
బీటెక్ పరీక్ష.. ఇదేం పని రా అయ్యా, నిజం తెలిసి ఇన్విజిలేటర్ మైండ్‌బ్లాక్!
తాడిపత్రి అర్బన్: ఒకరికి బదులుగా మరొకరిని పరీక్ష హాలులోకి పంపించారు. ఇందుకోసం విద్యార్థుల హాల్‌టికెట్లు, ఐడీ కార్డులను మార్ఫింగ్ చేశారు. ఇలా ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది నకిలీ విద్యార్థులను పరీక్షకు పంపించారు. అయితే ఇన్విజిలేటర్ క్షుణంగా తనిఖీ చేయడంతో ఈ నకిలీ విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేఎన్టీయూ(ఏ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత నెల 25 నుంచి బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల (సీవీఆర్టీ)కు చెందిన 16 మంది విద్యార్థులకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల(టెక్)లో పరీక్ష కేంద్రం కేటాయించారు. గురువారం ఉదయం పది గంటలకు డ్రాయింగ్, బీఈఈఈ పరీక్ష ప్రారంభం కాగా, ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను పరిశీలించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. మరింత క్షుణంగా తనిఖీ చేయగా, ఒకే కాలేజీకి చెందిన 16 మంది స్థానంలో వేరేవారు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ ఈవీ సుబ్బారెడ్డి, జేఎన్టీయూ(ఏ) అబ్జర్వర్‌కు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆయా విద్యార్థుల ఐడీ కార్డులు పరిశీలించగా, అవి కూడా నకిలీవని తేలింది. తమ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని భావింన సీవీఆర్టీ కళాశాల యాజమాన్యం... అసలు విద్యార్థుల ఫొటోలతోపాటు ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి పరీక్షలు రాసేందుకు వేరేవారిని పంపినట్లు గుర్తించారు. అనంతరం నకిలీ విద్యార్థుల నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసిన జేఎన్టీయూ(ఏ) అధికారులు రూల్–3 కింద చర్యలు కేసు నవెదు చేశారు. కాగా, గతంలోనూ సర్ సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనేక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులను డిగ్రీ చదువుతున్నట్లు చూపి ఫీజు రీయింబర్స్మెంట్ దందాకు పాల్పడింది. దీంతోపాటు నిబంధనల మేరకు ఇంటర్ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఇంటర్ బోర్డుకు సీవీ రామన్ యాజమాన్యం అందజేసిన పత్రాలు నకిలీవని బయటపడింది. కళాశాల యాజమాన్యం ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల కోసం ఓ బ్యాంకు మేనేజర్ సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
ఇస్తినమ్మా వేతనం.. పుచ్చుకుంటినమ్మా జీతం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత కొంతకాలంగా సదరం సర్టిఫికెట్ల విషయంలో తీవ్ర విమర్శల పాలైన వైద్యారోగ్యశాఖ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తోన్న ఓ డాక్టర్ కొంతకాలం క్రితం జిల్లాలోని మరో సివిల్ ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. ఇందుకోసం వైద్యవిధానపరిషత్ నుంచి ప్రత్యేకంగా గతేడాది సెప్టెంబరులో జీవో కూడా తెచ్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్కడ సదరు డాక్టర్ చేరినట్లు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆసుపత్రికి హాజరవడం, పేషెంట్లకు వైద్యం చేయడం తదితర విధులు నిర్వహించడం లాంటివి చేసిన దాఖలాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈమేరకు సదరు బదిలీ జీవో కాపీ సంపాదించిన ‘సాక్షి’ సదరు సివిల్ ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేసింది. అసలు ఆ డాక్టర్ పేరు తాము విననే లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. కానీ, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సదరు డాక్టర్ జీతం తీసుకుంటుండటం విచిత్రం. అసలు ఆసుపత్రికి రాకుండా జీతం ఎలా డ్రా చేస్తున్నారో? ఆ డాక్టర్‌కే తెలియాలి. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి నేరుగా ఆసుపత్రికి వెళ్లి రిజిష్టర్‌లో అన్ని రోజులు హాజరైనట్లు సంతకాలు చేసి వెళ్లిపోతుండటం విశేషం. ఈ విషయమై ‘సాక్షి’ సంబంధిత సివిల్ ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఇది పెద్దల వ్యవహారమంటూ సమాధానం ఇవ్వకుండా వెనకడుగు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైద్యులు వేళకు రాకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన కింద పరిగణించే ఉన్నతాధికారులు కాంట్రాక్టు డాక్టర్ విధులకు రాకున్నా.. వేతనం ఎందుకు ఇస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. -
ముందు రాతలు, తర్వాత అధికారులు.. వాహ్ క్యా ప్లాన్
ముందు రికార్డుల్లో రాతలు మార్చాలి. తర్వాత అధికారులను ఏమార్చాలి. ఇదీ ప్లాన్. కానీ అంతా అనుకున్నట్టు జరగదు కదా.. సంపూర్ణ పోషణ పాల అక్రమ రవాణా కేసులో కొందరు అంగన్వాడీ సిబ్బంది తప్పు మీద తప్పు చేస్తున్నారు. పాత తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త తప్పులు చేస్తున్నారు. అష్ట దిగ్బంధనమవుతున్న దశలో రికార్డుల రూపురేఖలు కూడా మార్చేస్తున్నారు. వీరి తీరు అధికార వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సాక్షి, శ్రీకాకుళం: వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రికార్డుల దిద్దుబాట్లు జోరుగా జరుగుతున్నాయి. పాల ప్యాకెట్ల సరఫరాలో తేడాలు స్పష్టంగా కనిపించడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డుల్లో అంకెలు మార్చుతున్నారు. రెండు రోజులుగా సెక్టార్ మీటింగ్‌లని చెప్పి, కార్యకర్తలను పిలిచి, సూపర్వైజర్లు దగ్గరుండి ఈ తంతు జరిపి స్తున్నారు. ఈ నెల 3వ తేదీన భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పాలప్యాకెట్ల అక్రమ రవాణా వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు ఈ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఒకవైపు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తుంటే.. మరోవైపు ప్రాజెక్టు పరిధిలో ఆ చర్యల నుంచి తప్పించుకునేందుకు, న్యాయపరంగా దొరకకుండా ఉండేందుకు రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. ఇదే విషయమై సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసేసరికి రికార్డులు మూసేయండంటూ కార్యకర్తలు సైగలు చేశారు. కానీ లాభం లేకపోయింది. ఏం జరిగిందంటే..? ►ఇటీవల భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడిన పాల ప్యాకెట్లలో తేడాలపై రికార్డులు దిద్దుబాట్లు జరపాలంటూ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ పట్టుబట్టారు. ►ఐసీడీఎస్ స్టాక్ పాయింట్ నుంచి డెలివరీ చేసిన రికార్డులకు, అంగన్వాడీ కేంద్రాలకు చేరిన పాలు నిల్వల రికార్డులకు వ్యత్యాసం ఉంది. ►ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సరఫరా చేసిన పాల నిల్వల్లో వ్యత్యాసం ఉండడం, అవే నెలలకు సరఫరా చేసిన పాల ప్యాకెట్లు పోలీసు లు పట్టబడడంతో దర్యాప్తు చేస్తున్నారు. ►వీరఘట్టం ఐసీడీఎస్ పీఓ, సూపర్వైజర్లు స్టాక్ పాయింట్ వద్ద పర్సంటేజీ రూపంలో పాల ప్యా కెట్లు మినహాయించి మిగిలిన పాలను నెలల వా రీగా అంగన్వాడీ కేంద్రాలకు అందజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే సీడీపీఓ సెలవులో ఉన్నారు. ప్రస్తుతం సూపర్వైజర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే..? వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్వైజర్ జె.జ్ఞానమ్మ ఆధ్వర్యంలో వంగర, వీరఘట్టం మండలాల సెక్టార్ పరిధి అంగన్వాడీ కార్యకర్తల సమావేశం గురు, శుక్రవారాల్లో జరిగింది. ►ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రికార్డులను అంగన్వాడీ కార్యకర్తలు దిద్దుబా టు చేసేశారు. వాటిలో కూడా తేడాలుండటంతో సెక్టార్ సమావేశంలో సూపర్ వైజర్ జె.జ్ఞానమ్మ ఒత్తిడి మేరకు పీఓ కార్యాలయం వద్ద ఉన్న రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. తొలుత కార్యకర్త లు సతాయించినా.. ఈ గండం నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న రికార్డుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నా రులు పేర్లు కొన్ని చోట్ల(ఏప్రిల్, మే, జూన్) నెలలకు సంబంధించి తొలగించడం, కొన్ని తప్పుడు పేర్లు యాడ్ చేయడంతో నిల్వలకు సరిపడినట్లు కాగితాలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ►కొంత మంది అంగన్వాడీ కేంద్రాల్లో లొసుగులు ఉండడంతో కార్యకర్తలంతా ఏమీ చేయలేక ఐసీడీఎస్ అధికారులు మాటలకు తలొగ్గి దిద్దుబాటే శరణ్యంగా భావించి రికార్డులు తారుమారు చేస్తున్నారు. ►అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రతి నెల నిల్వ ఉన్న పాలను ఆ తదుపరి నెలకు లెక్క చూపిస్తారు. అ యితే పాల రికార్డులు తప్పుల తడకగా ఉండడంతో ఆ పాలను సూపర్వైజర్లు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో నమోదు చేయడం లేదు. దీని కారణంగా దర్యాప్తులో గుర్తించిన పాలతోపాటు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో షార్టేజీ చూపించారు. దీన్ని దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దిద్దుబాటు సరికాదు సెక్టార్ సమావేశాల్లో రికార్డులు దిద్దుబాటు చేయకూడదు. సీడీపీఓ సెలవులో ఉన్నారు. ఇన్చార్జి పా లనలో ఉంది. అక్కడేం జరిగిందో తెలుసుకుని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శనివారం ఆ ప్రాజెక్టుకు వెళ్తాం. రికార్డులన్నీ పరిశీలిస్తాం. – జి.జయదేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం -
దారుణం: దురాచారం మహిళ ప్రాణం తీసింది
గుడిహత్నూర్(బోథ్): ఓ దురాచారం మహిళ ప్రాణం తీసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మం డలం ధరమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. మావల మండలంలోని వాఘాపూర్‌కు చెందిన సునీత (22)కు మండలంలోని ధరమడుగుకు చెందిన ఆత్రం సంతోష్‌తో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల కిందట బాబు పుట్టగా.. అనారోగ్య సమస్యలతో కొన్నిరోజులకే మృతిచెందాడు. మళ్లీ సంతానం కోసం నిష్టతో పెద్దలు చెప్పినట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు రుతుక్రమం వచ్చింది. వీరి ఆచారం ప్రకారం రుతుక్రమం వచ్చిన మహిళ ఇంటి బయటే ఉండాలి. దీంతో సునీత సోమవారం రాత్రి ఇంటి బయట నేలపై పడుకోగా.. రాత్రి 11 గంటల సమయంలో పాము కాటేసింది. ఆమె బాధతో మూలగడంతో.. పక్కనే మంచంపై పడుకున్న భర్త సంతోష్ వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ సునీత ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: సగం కాలిన మృతదేహాలు.. పీక్కు తింటున్న కుక్కలు -
పరీక్షకు వేళాయె..
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు మొదటి రోజు 8.15 గంటలకే హాజరుకావాలి మహారాణిపేట (విశాఖపట్నం): రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ తులసీదాస్‌తో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 262 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 62వేల 661మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 సిటింగ్ స్క్వాడ్లు పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాయని తెలిపారు. విద్యార్థులు యూని ఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో పరీక్షలకు హాజరుకావాలని చెప్పారు. బస్సు సౌకర్యం ఉ న్న ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఉచితంగా రెండు వైపులా ప్రయాణించవచ్చన్నారు. పరీక్షల కోసం నియమించిన ప్రతి ఉద్యోగి తప్పకుండా విధులు హాజరుకావాలని హాజరుకానివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరింత మెరుగైన ఫలితాలకు కసరత్తు పదో తరగతి పరీక్షల్లో ఐదేళ్లుగా మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ రాష్ర్ట స్థాయిలో మాత్రం ఆశించిన స్థానం లభించలేదు. గతేడాది ఉమ్మడి రాష్ర్టంలో జరిగిన పరీక్షల్లో 90.86 శాతం ఉత్తీర్ణతతో జిల్లా పదకొండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి జరుగుతున్న పరీక్షలకు ప్రత్యేకత ఉంది. విభజన నేపథ్యంలో 13 జిల్లాలతో కూడిన ఏపీలో తొలిసారి జరుగుతున్న పరీక్షలు కావడంతో జిల్లా ర్యాంకును మెరుగుపర్చుకోవాలని జిల్లా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేసింది. పైగా రాష్ర్ట మానవవనరుల (విద్యా) శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ జిల్లాకు చెందిన వారుకావడంతో జిల్లా అధికారులకు ఈ పరీక్షలు నిజంగానే పరీక్షగా మారాయి.హుద్‌హుద్ తుఫాన్ సమయంలో పాఠశాలలు నెల రోజులు మూతపడినప్పటికీ నవంబర్ నుంచి మార్చి వరకు ఆదివారాలు, పండగ, రెండో శనివారాల్లో పనిచేసి సిలబస్‌ను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు కేంద్రాల్లో చూసిరాతకు పాల్పడకుండా వీడియో కెమెరాలు, వెబ్‌కెమెరాలు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు అందచేశారు. హాల్‌టికెట్లు అందని వారు ‘డబ్యూడబ్యూడబ్యూ. బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పాఠశాల హెచ్ఎం సంతంకం, స్కూల్ స్టాంప్‌తో పరీక్షకు హాజరుకావచ్చు. 144 సెక్షన్ అమలు: ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సమస్మాత్మక ప్రాంతాల్లో సిటింగ్ స్క్వాడ్లు వేశారు. స్థానిక తహశీల్దార్లు, డిప్యూటీ డీఈఓలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలతో పాటు తాగునీరు ఏర్పాటు చేశారు. మెడికల్ కిట్‌తో సహా ఏఎన్ఎంను నియమిం చారు.పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రం చుట్టుపక్కల జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఇప్పటికే విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్స్టేషన్ల ద్వారా ప్రశ్నపత్రాలు : జిల్లాలో మొత్తం 262 పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను 76 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. మైదాన ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, ఏజెన్సీలో కేంద్రాలకు 76 పోలీస్స్టేషన్లు ద్వారా ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను పోలీస్లే దగ్గరుండి తీసుకొని పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. జిల్లాలో 29 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. ఇవి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రతి సమస్యాత్మక కేంద్రంలోనూ వెబ్‌కెమెరాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులకు సూచనలు: బార్‌కోడింగ్ విధానం అమల్లో ఉండడం వల్ల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తొలిరోజు గురువారం పరీక్షా కేంద్రాలకు ఉదయం 8-15కే చేరుకోవాలని డీఈవో సూచించారు. మిగతా రోజుల్లో 8-45కు చేరుకోవాలని ఆయన వెల్లడించారు. పెన్నులు, రైటింగ్ప్యాడ్లు, పరీక్షకు అవసరమైన వస్తువులు విద్యార్థులు తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కంట్రోల్‌రూం ఏర్పాటు : పదోతరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎవరైనా 9180330984 నంబరుకు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయవచ్చు. ఈ నంబర్ ద్వారా సమాధానం చెప్పేందుకు కంట్రోల్‌రూంలో ఆరుగురుని నియమించారు. -
సొమ్ముంటే సాక్ష్యాలు చూపాల్సిందే..
►రూ.50 వేలకంటే ఎక్కువ తీసుకువెళ్లేవారిపై నిఘా ►13 చెక్నాకాల ఏర్పాటుచేసిన పోలీసులు ►హవాలా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ►నేరచరితులపై ముందస్తు చర్యలు ►లెసైన్సుడ్ తుపాకులు డిపాజిట్ చేయాలని వినతి సాక్షి, ముంబై : అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు నగర పోలీసులు సమాయత్తమయ్యారు. ఇందుకు గాను రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బు ఉన్న వారి నుంచి అవసరమైన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. పత్రాలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు నిర్ణయించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బును ఎరగా ఉపయోగించి ఓటర్లను ప్రలోభపరిచే అవకాశముందనే అనుమానంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కొందరు దేశీయ, చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న 13 తుపాకీలను, 29 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నేర చరిత్ర కలిగిన 4,813 దుండగులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇకమీదట రూ.50 వేలకు పైగా నగదును కలిగిఉన్న వారిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇందుకు సంబంధించిన విత్‌డ్రా స్లిప్‌ను పోలీసులకు వారు చూపించాల్సి ఉంటుంది. ఏ ఉద్దేశంతో విత్‌డ్రా చేశారనే తదితర అంశాలను పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను తెలియచేయడంలో సదరు వ్యక్తి విఫలమైతే సదరు సొమ్మును సీజ్ చేసి ఎన్నికల కమిషన్‌కు స్వాధీనపరచనున్నట్లు ముంబై పోలీస్ అధికార ప్రతినిధి ధనుంజయ్ కులకర్ణి పేర్కొన్నారు. హవాలా కార్యకలాపాలు చేసేవారు తమ పర్యవేక్షణలో ఉంటారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు హవాలాలను ఉపయోగించుకొని రాష్ట్రానికి డబ్బు తరలిస్తుంటారని ఆయన పేర్కొన్నారు.ముందుజాగ్రత్త చర్యగా 13 చెక్నాకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి రైల్వేలపై కూడా నిఘా ఉంచనున్నాయి.దీంతోపాటు లెసైన్సుడ్ తుపాకీలను కలిగి ఉన్నవారు వాటిని డిపాజిట్ చేయాల్సిందిగా కోరామన్నారు. ఇప్పటికే 288 మంది తమ ఆయుధాలను డిపాజిట్ చేశారు. అంతేకాకుండా కొందరు నేరస్తులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశామన్నారు. ఇప్పటికే 1,808 వారెంట్లు అమలు చేశామని కులకర్ణి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించడంతో జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో లెసైన్సు కలిగిన తుపాకీల వివరాలను సమీక్షించారు. దీంతో ఓ పట్టికను తయారు చేసి సదరు వ్యక్తులను తమ ఆయుధాలను డిపాజిట్ చేయమని కోరామన్నారు. -
కాపీ కొడితే....ఇంటికే
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలను కఠిన తరం చేశాయి. విద్యార్థి కాపీకి పాల్పడితే ఇంటికి పంపే ఏర్పాట్లు చేశాయి. అలాగే విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నాయి. తాజా నిబంధనలతో విద్యార్థి మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లను ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు, మాతృస్థానం నుంచి సస్పెండ్ చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థి కాపీ కొట్టిన సంఘటనల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, సీనియర్ అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో పాటు ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను పరీక్షల విధులతో పాటు పాఠశాలల నుంచి సస్పెండ్ చేస్తారు. ఇటువంటి సంఘటనల్లో వారిని సస్పెండ్ చేసే అధికారాన్ని సంబంధిత శాఖల డీఈవో, ఆర్జేడీ స్థాయి అధికారులకు కల్పించారు. రూ. లక్ష వరకూ భారీ జరిమానా విధించే అవకాశముంది. ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేశారని నిరూపణ అయితే యాక్ట్-25 కింద క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. మూడు నుంచి ఆరేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. విద్యార్థిపై అనర్హత వేటు మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన విద్యార్థులకు షోకాజ్ నోటీసు జారీ చేసి, తదుపరి పరీక్షలకు హాజరయ్యే వీలు లేకుండా అనర్హత వేటు వేస్తారు. అనంతరం పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా జరిగే విచారణలో గరిష్టంగా ఐదేళ్ళ వరకు అనర్హత వేటు విధించే అవకాశాలు న్నాయి. పదో తరగతి పరీక్షలకు 578 మంది సీఎస్, డీవోల నియామకం ఈ నెల 27 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మొత్తం 578 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. 301 మంది పైబడిన విద్యార్థులన్న పరీక్షా కేంద్రానికి మరొక అదనపు చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించారు. ఒక్కో కేంద్రానికి 11 మంది చొప్పున మొత్తం 3,179 మంది ఇన్వజిలేటర్లను నియమించారు. పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లకు ఈనెల 6 నుంచి శిక్షణ వుంటుంది. ఈ నెల 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులతో గుంటూరులో బుధవారం సమీక్షా సమావేశం జరగనుంది.