
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత కొంతకాలంగా సదరం సర్టిఫికెట్ల విషయంలో తీవ్ర విమర్శల పాలైన వైద్యారోగ్యశాఖ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తోన్న ఓ డాక్టర్ కొంతకాలం క్రితం జిల్లాలోని మరో సివిల్ ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. ఇందుకోసం వైద్యవిధానపరిషత్ నుంచి ప్రత్యేకంగా గతేడాది సెప్టెంబరులో జీవో కూడా తెచ్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్కడ సదరు డాక్టర్ చేరినట్లు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆసుపత్రికి హాజరవడం, పేషెంట్లకు వైద్యం చేయడం తదితర విధులు నిర్వహించడం లాంటివి చేసిన దాఖలాలు లేకపోవడమే ఇందుకు కారణం.
ఈమేరకు సదరు బదిలీ జీవో కాపీ సంపాదించిన ‘సాక్షి’ సదరు సివిల్ ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేసింది. అసలు ఆ డాక్టర్ పేరు తాము విననే లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. కానీ, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సదరు డాక్టర్ జీతం తీసుకుంటుండటం విచిత్రం. అసలు ఆసుపత్రికి రాకుండా జీతం ఎలా డ్రా చేస్తున్నారో? ఆ డాక్టర్‌కే తెలియాలి. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి నేరుగా ఆసుపత్రికి వెళ్లి రిజిష్టర్‌లో అన్ని రోజులు హాజరైనట్లు సంతకాలు చేసి వెళ్లిపోతుండటం విశేషం. ఈ విషయమై ‘సాక్షి’ సంబంధిత సివిల్ ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఇది పెద్దల వ్యవహారమంటూ సమాధానం ఇవ్వకుండా వెనకడుగు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైద్యులు వేళకు రాకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన కింద పరిగణించే ఉన్నతాధికారులు కాంట్రాక్టు డాక్టర్ విధులకు రాకున్నా.. వేతనం ఎందుకు ఇస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment