contract doctor
-
ఇస్తినమ్మా వేతనం.. పుచ్చుకుంటినమ్మా జీతం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత కొంతకాలంగా సదరం సర్టిఫికెట్ల విషయంలో తీవ్ర విమర్శల పాలైన వైద్యారోగ్యశాఖ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తోన్న ఓ డాక్టర్ కొంతకాలం క్రితం జిల్లాలోని మరో సివిల్ ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. ఇందుకోసం వైద్యవిధానపరిషత్ నుంచి ప్రత్యేకంగా గతేడాది సెప్టెంబరులో జీవో కూడా తెచ్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్కడ సదరు డాక్టర్ చేరినట్లు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆసుపత్రికి హాజరవడం, పేషెంట్లకు వైద్యం చేయడం తదితర విధులు నిర్వహించడం లాంటివి చేసిన దాఖలాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈమేరకు సదరు బదిలీ జీవో కాపీ సంపాదించిన ‘సాక్షి’ సదరు సివిల్ ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేసింది. అసలు ఆ డాక్టర్ పేరు తాము విననే లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. కానీ, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సదరు డాక్టర్ జీతం తీసుకుంటుండటం విచిత్రం. అసలు ఆసుపత్రికి రాకుండా జీతం ఎలా డ్రా చేస్తున్నారో? ఆ డాక్టర్‌కే తెలియాలి. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి నేరుగా ఆసుపత్రికి వెళ్లి రిజిష్టర్‌లో అన్ని రోజులు హాజరైనట్లు సంతకాలు చేసి వెళ్లిపోతుండటం విశేషం. ఈ విషయమై ‘సాక్షి’ సంబంధిత సివిల్ ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఇది పెద్దల వ్యవహారమంటూ సమాధానం ఇవ్వకుండా వెనకడుగు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైద్యులు వేళకు రాకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన కింద పరిగణించే ఉన్నతాధికారులు కాంట్రాక్టు డాక్టర్ విధులకు రాకున్నా.. వేతనం ఎందుకు ఇస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. -
అధికారం మాది.. నీ అంతుచూస్తా
శ్రీకాకుళం,ఇచ్ఛాపురం: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కాంట్రాక్టు వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న పొట్టా శ్రీనివాసరావుపై పట్టణ టీడీపీ కార్యదర్శి ప్రతాపం చూపారు. ఆస్పత్రిలో చేరిన రోగికి వైద్యం అందించే విషయంలో జోక్యం చేసుకుని.. అధికారం మాది.. నీ అంతుచూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చంపుతానంటూ హెచ్చరించడంతో భయభ్రాంతులకు గురైన వైద్యుడు రాజీనామా చేశారు. వైద్యం అందించారా లేదా? ఒక ప్రమాదంలో గాయపడిన రత్నాల బీమమ్మ.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. బీమమ్మ చేరిన విషయాన్ని కుటుంబసభ్యులు టీడీపీ పట్టణ కార్యదర్శి నందిక జానీకి తెలిపారు. వెంటనే ఆయన.. ఆస్పత్రికి వచ్చి.. వైద్యం అందించారా? లేదా అని వైద్యుడు శ్రీనివాసరావుతో పాటు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటివి ఆస్పత్రిలో చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన జానీ.. బుధవారం సాయంత్రం వైద్యుడు ఇంటి వద్దకు వెళ్లి దుర్భాషలాడారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. నీ అంతు చూస్తా, చంపుతా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో డాక్టర్ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వీటిని తట్టుకోలేని శ్రీనివాసరావు.. తన రాజీనామా పత్రాన్ని ఆస్పత్రి వైద్యాధికారి దామోదర్ ప్రదాన్‌కు గురువారం అందజేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్యసేవలు కరువయ్యే ప్రమాదం వైద్యులు శ్రీనివాసరావు ఆస్పత్రిలో ఐదేళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను జనవరి 26న కలెక్టర్ ధనంజయరెడ్డి ఉత్తమ డాక్టర్‌గా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన డాక్టర్.. రాజీనామాను ఆమోదిస్తే వైద్యసేవలకు అంతరాయం కలుగుతుందని ఆస్పత్రి వైద్యాధికారి దామోదర్ప్రదాన్ తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటివి జరగడం వల్ల ఆస్పత్రిలో వైద్యసేవలు కరువయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. టీడీపీ పట్టణ కార్యదర్శిపై కేసు నమోదు పొట్టా శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిక జానీపై పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి రూరల్ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం డాక్టర్ ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ బెదిరించారని, గతంలోనూ ఆస్పత్రిలో తన విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. -
వంతుల‘మారి’ వైద్యం!
అసలే అది గ్రామీణ ప్రాంతం. చుట్టూ పల్లెలు, గిరిజన తండాలు. ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఎంతో అవసరం. ఈ కారణంగా అధికారులు ఆ సర్కారు ఆస్పత్రికి సదుపాయాలు సమకూర్చారు. ఎన్ని చేస్తే ఏం లాభం.. అక్కడ అసలు వైద్య సేవలే పడకేశాయి. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇక్కడ నియామకమైన ఏ వైద్యుడూ రెండు మూడు నెలలకు మించి విధులు నిర్వహించడంలేదు. పై అధికారులను మచ్చిక చేసుకుని.. మూడు నెలలు తిరక్కుండానే నగరానికి సమీపంలోని ఆస్పత్రికి బదిలీ చేసుకునో.. డిప్యూటేషన్పైనో వెళుతున్నారు. అదీ కాకుంటే మూడు లేదా ఆరు నెలలపాటు దీర్ఘకాలిక సెలవు పెట్టే సౌకర్యం ఎలాగూ ఉంది.. దాన్ని ఉపయోగిస్తున్నారు. పరిగి, న్యూస్‌లైన్: పరిగి ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు వంతులవారీగా మూడు రోజులకోసారి వచ్చిపోతుండడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆస్పత్రిలో ఆరు పోస్టులు ఉండగా ఒకరు డిప్యూటేషన్, ఇద్దరు లాంగ్ లీవ్‌లో ఉండగా.. మరో పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు డెంటల్ డాక్టర్ కాగా మరొకరు కాంట్రాక్ట్ వైద్యుడు. ఇదీ పరిగి ధర్మాసుపత్రిలో కొనసాగుతున్న వంతుల‘మారి’ వైద్యం! మేడిపండు చందం వైద్యం. ఆస్పత్రిలో ఆరు పోస్టులున్నాయని చెప్పుకొనేందుకు మాత్రమే పనికొస్తుంది. ప్రస్తుతం ఒక్క వైద్యుడు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆయన సైతం డెంటల్ డాక్టరే. ఇక ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ వైద్యుడు సైతం నిబంధనలకు విరుద్ధంగా నియామకమయ్యారనే ఆరోపణలున్నాయి. ఆ వైద్యుడు రిటైర్ అయి 10 సంవత్సరాలు కావస్తుండటంతోపాటు ఆ ప్లేస్‌లో గైనకాలజిస్టును నియమించాల్సి ఉండగా ఎంబీబీఎస్‌గా రిటైర్ అయిన వ్యక్తిని తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి తెలిసిన పదమొక్కటే.. రెఫర్ ఇక ఇక్కడి వైద్యం పరిస్థితి చెప్పుకోదలిస్తే.. మరీ వింతగా తోస్తుంది. ఆస్పత్రికి వచ్చే రోగులను ఎలా బయటకు పంపాలా అని చూస్తున్నారు తప్పిస్తే వారికి వైద్యం చేయటంలేదు. ఒక్కోసారి రోగులను పరీక్షించకుండానే రెఫర్ పేరుతో మామూలు వ్యాధులకు సైతం హైదరాబాద్, వికారాబాద్‌లకు పంపిస్తున్నారు. సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి ఉన్నా.. కాన్పు కాదంటూ నమ్మబలికి రెఫర్ చేస్తున్నారు. ఓపీ సైతం సక్రమంగా చూడటంలేదు. ఒక్కోసారి నర్సులే రోగి చేతిలో రెండు ట్యాబ్లెట్లు పెట్టి పంపించి వేస్తున్నారు. దీంతో విసిగిపోయిన రోగులు ఆస్పత్రి ఎదుట తరచూ ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల అనేక సార్లు వైద్యులు, ఆస్పత్రి పనితీరుపై ఆగ్రహించిన రోగులు ఆందోళనలు చేపట్టడం ఇక్కడ వైద్యం ఎంత బాగా అందుతోందో తెలియజేస్తోంది. డెంటల్ వైద్యుడే.. ఓపీ చూస్తారా? అన్ని రోగాలకు ఒకే మందు అన్న తరహాలో నెలలో 15 రోజులకు పైగా ఆస్పత్రి మొత్తం డెంటల్ వైద్యుడు ఒక్కరే చూస్తారు. ఓపీ మొదలుకుని ఆయన ఉన్న రోజుల్లో అన్ని రకాల రోగాలకూ ఆయన వైద్యం చేస్తారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో గతంలో మొత్తం ఐదుగురు వైద్యులు ఉండగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఒక్క డాక్టరు రెండు రోజులు నిరాటంకంగా విధులు నిర్వహించే వారు. ప్రస్తుతం ఒకరు డెంటల్ డాక్టర్, మరొకరు కాంట్రాక్ట్ వైద్యుడు ఉండటంతో మూడు రోజులు ఒకరు మరో మూడు రోజులు మరొకరు.. ఇలా నెలలో పదిహేను రోజులు ఒకరు.. మరో 15 రోజులు ఇంకొకరు వంతులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు కొనసాగుతున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ వాణీ ప్రసాద్.. నిధులు మంజూరు చేసి ఆస్పత్రిని మెరుగుపరిచినప్పటినుంచీ ఓపీ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో వైద్య సేవలు దయనీయంగా మారాయి.