వంతుల‘మారి’ వైద్యం! | shortage of doctors in government hospital | Sakshi
Sakshi News home page

వంతుల‘మారి’ వైద్యం!

Published Wed, Jan 22 2014 1:24 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

shortage of doctors in government hospital

 అసలే అది గ్రామీణ ప్రాంతం. చుట్టూ పల్లెలు, గిరిజన తండాలు. ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఎంతో అవసరం. ఈ కారణంగా అధికారులు ఆ సర్కారు ఆస్పత్రికి సదుపాయాలు సమకూర్చారు. ఎన్ని చేస్తే ఏం లాభం.. అక్కడ అసలు వైద్య సేవలే పడకేశాయి. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది.

ఇక్కడ నియామకమైన ఏ వైద్యుడూ రెండు మూడు నెలలకు మించి విధులు నిర్వహించడంలేదు. పై అధికారులను మచ్చిక చేసుకుని.. మూడు నెలలు తిరక్కుండానే నగరానికి సమీపంలోని ఆస్పత్రికి బదిలీ చేసుకునో.. డిప్యూటేషన్‌పైనో వెళుతున్నారు. అదీ కాకుంటే మూడు లేదా ఆరు నెలలపాటు దీర్ఘకాలిక సెలవు పెట్టే సౌకర్యం ఎలాగూ ఉంది.. దాన్ని ఉపయోగిస్తున్నారు.     
 
   పరిగి, న్యూస్‌లైన్: పరిగి ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు వంతులవారీగా మూడు రోజులకోసారి వచ్చిపోతుండడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆస్పత్రిలో ఆరు పోస్టులు ఉండగా ఒకరు డిప్యూటేషన్, ఇద్దరు లాంగ్ లీవ్‌లో ఉండగా.. మరో పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు డెంటల్ డాక్టర్ కాగా మరొకరు కాంట్రాక్ట్ వైద్యుడు. ఇదీ పరిగి ధర్మాసుపత్రిలో కొనసాగుతున్న వంతుల‘మారి’ వైద్యం! మేడిపండు చందం వైద్యం.

ఆస్పత్రిలో ఆరు పోస్టులున్నాయని చెప్పుకొనేందుకు మాత్రమే పనికొస్తుంది. ప్రస్తుతం ఒక్క వైద్యుడు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆయన సైతం డెంటల్ డాక్టరే. ఇక ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ వైద్యుడు సైతం నిబంధనలకు విరుద్ధంగా నియామకమయ్యారనే ఆరోపణలున్నాయి. ఆ వైద్యుడు రిటైర్ అయి 10 సంవత్సరాలు కావస్తుండటంతోపాటు ఆ ప్లేస్‌లో గైనకాలజిస్టును నియమించాల్సి ఉండగా ఎంబీబీఎస్‌గా రిటైర్ అయిన వ్యక్తిని తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 వారికి తెలిసిన పదమొక్కటే.. రెఫర్
 ఇక ఇక్కడి వైద్యం పరిస్థితి చెప్పుకోదలిస్తే.. మరీ వింతగా తోస్తుంది. ఆస్పత్రికి వచ్చే రోగులను ఎలా బయటకు పంపాలా అని చూస్తున్నారు తప్పిస్తే వారికి వైద్యం చేయటంలేదు. ఒక్కోసారి రోగులను పరీక్షించకుండానే రెఫర్ పేరుతో మామూలు వ్యాధులకు సైతం హైదరాబాద్, వికారాబాద్‌లకు పంపిస్తున్నారు. సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి ఉన్నా.. కాన్పు కాదంటూ నమ్మబలికి రెఫర్ చేస్తున్నారు. ఓపీ సైతం సక్రమంగా చూడటంలేదు.

 ఒక్కోసారి నర్సులే రోగి చేతిలో రెండు ట్యాబ్లెట్లు పెట్టి పంపించి వేస్తున్నారు. దీంతో విసిగిపోయిన రోగులు ఆస్పత్రి ఎదుట తరచూ ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల అనేక సార్లు వైద్యులు, ఆస్పత్రి పనితీరుపై ఆగ్రహించిన రోగులు ఆందోళనలు చేపట్టడం ఇక్కడ వైద్యం ఎంత బాగా అందుతోందో తెలియజేస్తోంది.

 డెంటల్ వైద్యుడే.. ఓపీ చూస్తారా?  
 అన్ని రోగాలకు ఒకే మందు అన్న తరహాలో నెలలో 15 రోజులకు పైగా ఆస్పత్రి మొత్తం డెంటల్ వైద్యుడు ఒక్కరే చూస్తారు. ఓపీ మొదలుకుని ఆయన ఉన్న రోజుల్లో అన్ని రకాల రోగాలకూ ఆయన వైద్యం చేస్తారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో గతంలో మొత్తం ఐదుగురు వైద్యులు ఉండగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఒక్క డాక్టరు రెండు రోజులు నిరాటంకంగా విధులు నిర్వహించే వారు.

 ప్రస్తుతం ఒకరు డెంటల్ డాక్టర్, మరొకరు కాంట్రాక్ట్ వైద్యుడు ఉండటంతో మూడు రోజులు ఒకరు మరో మూడు రోజులు మరొకరు.. ఇలా నెలలో పదిహేను రోజులు ఒకరు.. మరో 15 రోజులు ఇంకొకరు వంతులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు కొనసాగుతున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ వాణీ ప్రసాద్.. నిధులు మంజూరు చేసి ఆస్పత్రిని మెరుగుపరిచినప్పటినుంచీ ఓపీ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో వైద్య సేవలు దయనీయంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement