నిలిచిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులు
ఏన్సాన్‌పల్లి శివారులో రూ.324 కోట్లతో చేపట్టిన నిర్మాణం
బడ్జెట్ కేటాయించక పూర్తికాని వసతులు
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం
ప్రస్తుతం 300 పడకలతో కొనసాగుతున్న సిద్దిపేట జీజీహెచ్
సిద్దిపేటలో చేపట్టిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రోగులు పూర్తిస్థాయి వైద్య సేవలకు నోచుకోలేకపోతున్నారు. వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రి భవనంలో మౌలిక వసతులు కల్పించకపోవడం, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. దీంతో పేద ప్రజలు చికిత్స నిమిత్తం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. - సిద్దిపేట కమాన్
అప్పటి సీఎం కేసీఆర్‌తో ప్రారంభం
సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్‌పల్లి గ్రామ శివారులో రూ.324 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేశారు.
ఐదు అంతస్తులతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఒకేచోట అందుబాటులోకి తెచ్చేలా భవనాన్ని నిర్మించారు. మొదట ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో డెంటల్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీశ్‌రావు 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు.
నిధుల్లేక ముందుకు సాగని పనులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వాసుపత్రి పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా.. 300 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొనసాగుతోంది. వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. పేద ప్రజలకు అన్ని విభాగాల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
త్వరలో డెంటల్ విభాగం మూసివేత?
ప్రస్తుతం వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని డెంటల్ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓపీడీ సాధారణ శస్త్ర చికిత్స, ఓపీడీ ఆర్థోపెడిక్, బ్లడ్ శాంపిల్స్ సేకరణ, అత్యవసర విభాగం, ఫార్మసీ విభాగాలను, మొదటి అంతస్తులో ఓపీడీ కన్ను, ఓపీడీ చెవి, ముక్కు, గొంతు, డయాలసిస్ వార్డు, క్యాథ్‌ల్యాబ్, రెండో అంతస్తులో క్షయ, ఛాతీవ్యాధి వార్డు, డీవీఎల్ వార్డు, జనరల్ వార్డులను ఏర్పాటు చేశారు.
రూ.లక్షల విలువైన పరికరాలను సైతం భవనంలోని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం, సిబ్బందిని నియమించకపోవడం, మెషీన్లను ఏర్పాటు చేయకపోవడంతో భవనం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. డెంటల్ విభాగంలో సహాయకులుగా, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది మొత్తం 20 మంది విధులు నిర్వహిస్తున్నారు.
వీరికి ప్రభుత్వాసుపత్రి ఫండ్ ద్వారా జిల్లా కలెక్టర్ ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా, బడ్జెట్ లేనందున వచ్చే నెల నుంచి వీరికి వేతనాలు చెల్లించలేమని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు.. వేతనాలు చెల్లించలేమని.. విధులకు రావద్దని శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న డెంటల్ విభాగాన్ని సైతం మూసివేసి ఫిబ్రవరి మొదటి
వారంలో భవనాన్ని మూ సివేయనున్నట్లు వి శ్వసనీయ సమాచారం. దీనికి ప్రధాన కారణం నిధులు, బడ్జెట్ కొరతని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్ కేటాయించి వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ కలెక్టర్, డీఎంఈ, రాష్ట్ర హెల్త్ సెక్రటరీలకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేసినట్టు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంవో ప్రవీణ్ తెలిపారు.
ప్రభుత్వ పరిధిలోది..
వెయ్యి పడకల ప్రభు త్వ ఆసుపత్రి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నాం. త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తాం. - డాక్టర్ విమలాథామస్, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment