Shortage of doctors
-
పదేళ్లలో సరిపడా వైద్యులు
భుజ్ (గుజరాత్): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో దేశంలో వైద్యుల కొరత తీరిపోనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఫలితంగా వచ్చే పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు అందివస్తారని చెప్పారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్‌లో 200 పడకల కె.కె.పటేల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ‘‘జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పుడు వచ్చే పదేళ్లలో అత్యధికంగా వైద్యులు అందుబాటులోకి వస్తారు’’ అని ఈ సందర్భంగా చెప్పారు. కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సంక్షోభం సమయం లో భారత ఆయుర్వేదం, యోగాపై ప్రపంచ దేశాలు బాగా దృష్టి సారించాయన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం గుజరాత్‌లోని మార్బిలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఆవిష్కరించనున్నారు. -
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా మారింది. వివక్షకు నిలువుటద్దాన్ని తలపిస్తోంది. తెలంగాణ వైద్య ప్రదాయినిగా.. ప్రభుత్వ వైద్యరంగానికి పెద్ద దిక్కుగా ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వైద్యుల నియామకాల్లో చిన్నచూపునకు గురవుతున్నాయి. ప్రధానమైన విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు సేవల్లో జాప్యంతో పాటు వైద్య విద్యాబోధన కుంటుపడుతోంది. – గాంధీ ఆస్పత్రి గాంధీలోని 35 విభాగాల్లో 273 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు మంజూరు కాగా ఖాళీగా 51 పోస్టులు ఉండటం గమనార్హం. ప్రధాన విభాగాలైన జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, అనస్తీషియా, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎస్పీఎం తదితర విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. అనస్తీషియా, బయోకెమిస్త్రీ విభాగాలకు ప్రొఫెసర్లే లేకపోవడం అత్యంత దయనీయం. 60 మంది ప్రొఫెసర్లకు గాను 56 మంది మాత్రమే ఉన్నారు. వైద్యవిద్యా బోధనలో కీలకపాత్ర పోషించే అసోసియేట్ ప్రొఫెసర్లు 74 మందికి కేవలం 51 మంది ఉన్నారు. 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 విభాగాల్లో 139 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 115 మంది మాత్రమే ఉండగా, 24 ఖాళీలు ఉన్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సైకాలజీ, మైక్రోబయోలజీ, పెథాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఎస్పీఎం) వంటి నాన్క్లినికల్ విభాగాల్లో 59 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. శస్త్రచికిత్సల్లో జాప్యం శస్త్రచికిత్సలో కీలకమైన అనస్తీషియా విభాగంలో వైద్యుల కొరత పట్టి పీడిస్తోంది. కేటాయించిన మూడు ప్రొఫెసర్ పోస్టులతోపాటు ఒక అసోషియేట్, ఎనిమిది అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 12 పోస్టులు గత కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడంతో పలు విభాగాల్లో జరగాల్సిన శస్త్రచికిత్సలు తరచూ వాయిదా పడుతున్నాయి. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యుల కొరత, శస్త్రచికిత్సల జాప్యం కారణంగా ఆపరేషన్ థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ముందుకు సాగని వైద్యవిద్య.. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యా బోధనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో గాంధీని కోవిడ్ నోడల్ సెంటర్‌గా ఏర్పాటు చేయడంతో వైద్యవిద్య కుంటుపడింది. ఓ వైపు కరోనా, మరోవైపు వైద్యుల కొరతతో రెండేళ్లుగా చదువులు ముందుకు సాగలేదని ఓ వైద్యవిద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా రెగ్యులర్ వైద్యుల నియామకం చేపట్టకపోవడం, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న వైద్యులకు విద్యాబోధనలో అనుభవం లేకపోవడం, కేవలం రోగుల వైద్యసేవలకే పరిమితం కావడంతో వైద్యవిద్య మూలనపడింది. భర్తీ చేయాల్సిన పోస్టులివే.. గాంధీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మూడు కేటగిరీల్లో మొత్తం 51 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆ వివరాలు ఇలా.. అనస్తీషియా– 12, జనరల్ మెడిసిన్– 5, నియోనెటాల్ పిడియాట్రిక్–1, రేడియాలజీ– 1, టీబీ అండ్ సీడీ – 2, సైకియాట్రిస్ట్– 3, కార్డియాలజీ– 1, నెఫ్రాలజీ –1, యూరాలజీ– 1, అనాటమీ–1, సైకాలజీ– 2, ఫార్మకాలజీ–1, ఫోరెన్సిక్ మెడిసిన్–1, మైక్రోబయోలజీ–1, పెథాలజీ–1, ఎస్పీఎం–2, గైనకాలజీ–4, పిడియాట్రిక్– 3, న్యూరాలజీ– 2, పిడియాట్రిక్ సర్జరీ– 2, న్యూరోసర్జరీ–1, సీటీ సర్జరీ– 3 పోస్టులతో పాటు మరో 8 నాన్క్లినికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
రికార్డు స్థాయి నియామకాలు.. 27 నెలల్లో 14 వేల పోస్టుల భర్తీ
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి. వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స అందేది కాదు. నర్సులు నియామకాలు లేక సేవలు అరకొరగానే ఉండేవి. మందులుండేవి కావు. నిర్ధారణ పరీక్షలు జరిగేవి కావు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు సరైన వైద్యం అందడానికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో 1,500 పోస్టులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 మాసాల్లోనే ఆరోగ్య శాఖలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఆ శాఖలో ఇది అతిపెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగవుతున్నాయి. వైద్యుల కొరత లేకుండా భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఒక్క బోధనాసుపత్రుల్లోనే 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు. అంతేకాదు ఒక్కో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులు ఉండాలనే లక్ష్యంతో 645 మంది ఎంబీబీఎస్ వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. వైద్యవిధానపరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు 232 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించారు. 1,499 మంది వైద్యులను ప్రభుత్వ పరిధిలో నియమించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయుష్ డిస్పెన్సరీల్లో పనిచేసే సుమారు 800 మంది ఉద్యోగులను తొలగించారు. అప్పట్లో జాతీయ ఆరోగ్యమిషన్ ఆయుష్ వైద్యుల నియామకానికి అనుమతించినా రాష్ట్ర సర్కారు చొరవ చూపకపోవడంతో కొత్త ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోయింది. మెరుగుపడిన నర్సింగ్ సేవలు గతంలో నర్సులు లేక, సేవలు అందక రోగులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం 4,683 మంది నర్సులను నియమించింది. ఇవి కాకుండా ఇప్పటివరకూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో 1,818 మంది బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లుగా నియమించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో నర్సింగ్ నియామకాలు జరగడంతో బోధనాసుపత్రుల నుంచి పీహెచ్‌సీల వరకూ సేవల్లో గణనీయ మార్పులు వచ్చాయి. 21 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించింది. త్వరలో పీహెచ్‌సీలకు నియామకాలు రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్తగా వచ్చే పీహెచ్‌సీలకు వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది నియామకాన్ని త్వరలోనే చేపడతాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటాం. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
వైద్యులు ఎక్కడా.?
బజార్హత్నూర్(బోథ్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) వైద్యుల కొరత వేధిస్తోంది. సరిపడా వైద్యులు లేకపోవడంతో పేదలు మెరుగైన వైద్యానికి దూరమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 22 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 52 మంది వైద్యులు ఉండాల్సి ఉంది. కాని సగం మంది వైద్యులు కూడా లేకపోవడం విస్తుగొలుపుతోంది. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అనివార్యంగా పేదలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.జిల్లా వ్యాప్తంగా 7,8,972 మంది జనాభా ఉన్నారు. మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, 91సబ్ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో 70 శాతం గ్రామాలు అడవుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు కూడా లేవు. ఏదైనా రోగం వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే దిక్కు. అష్టకష్టాలు పడి పీహెచ్‌సీకి వస్తే వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. పీహెచ్‌సీల్లో వైద్యులు కొరత.. జిల్లాలోని 22 పీహెచ్‌సీల్లో కేవలం 22 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 52 మంది వైద్యులు ఉండాలి. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కాంట్రాక్టు పద్ధతిన సెప్టెంబర్ నెలలో మరో 21 మంది వైద్యులను నియమించారు. కాని వారు కంటి వెలుగు కార్యక్రమానికి మాత్రమే పరిమితమయ్యారు. కార్యక్రమ అనంతరం వీరు పీహెచ్‌సీల్లో కొనసాగుతారో లేదో అనుమానంగానే ఉంది. ఇక పీహెచ్‌సీకి కేటాయించిన రెగ్యూలర్ వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉన్నా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. వైద్యుడు సెలవుపై వెళ/æతే స్టాఫ్ నర్సులే వైద్యులుగా వ్యవహరించాల్సి వస్తోంది. నార్నూర్ పీహెచ్సీలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉన్నా ఒక్కరు కూడా లేరు. అది ఏజెన్సీ ప్రాంతం కావడం గిరిజనులు అధికంగా ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మెరకు హస్నాపూర్, దంతన్‌పల్లి పీహెచ్‌సీల నుంచి ఇద్దరు వైద్యులను డిప్యూటేషన్‌పై నియమించారు. ఇందులోనూ ఒకరు కంటివెలుగులో పాల్గొంటున్నారు. ఇక మిగిలిన ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. తాంసి, బేలా పీహెచ్‌సీల్లో ఒక్కరు కూడా వైద్యులు లేకపోవడంతో స్టాప్ నర్స్‌లు అన్నీ చూస్తున్నారు. ఇచ్చోడ, నేరడిగొండ తలమడుగు, దంతన్‌పల్లి, హస్నపూర్, సొనాల పీహెచ్సీలలో ఇద్దరు వైద్యులకు ఒక్కరు చొప్పున మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లది అదే దుస్థితి. జిల్లాలోని ఉట్నూర్ సీహెచ్‌సీలో 12 మంది వైద్యులకు ఎనిమిది మంది ఉన్నారు. బోథ్ సీహెచ్‌సీలో ఏడుగురికి ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఉప కేంద్రాల్లో సిబ్బంది కొరత సైతం వేధిస్తోంది. ఏఎన్ఎంలు 48, ల్యాబ్టెక్నీషియన్లు 13, హెల్త్ అసిస్టెంట్లు 36 ఖాళీలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు లేకపోవడం, ఉన్నా రోజలు తరబడి గ్రామాలకు రావడం లేదు. దీంతో చిన్న రోగానికి సైతం మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. సమయపాలన పాటించని వైద్యులు.. ఇక వైద్యులలేమి ఒక సమస్య అయితే ఉన్న వైద్యులు సైతం సమయపాలన పాటించకపోవడం మరో సమస్యగా మారింది. వైద్యులు స్థానికంగా ఉండక ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల నుంచి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధుల్లో చేరాల్సి ఉన్నా ఉదయం 10– 11 గంటల సమయంలో ఆసుపత్రికి వస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకూ ఉండాల్సి ఉన్నా మధ్యాహ్నం 2 గంటలకే తిరుగు ప్రయాణం అవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఉదయం వచ్చిన రోగులు 2గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఏదైన ప్రమాదం జరిగితే ఆసుపత్రికి వచ్చి ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా కిందిస్థాయి సిబ్బంది ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తున్నారు. తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేస్తారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ దుస్థితి మార్చాలని పలువురు కోరుతున్నారు. సరిపడా వైద్యులను నియమించి మెరుగైన సేవలందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి నిరీక్షిస్తున్నాం బజార్హత్నూర్ మండలం బద్దునాయక్ తండా మాది. భూతాయి(కే) సబ్సెంటర్లో ఏఎన్ఎం లేకపోవడంతో ఉదయం 10గంటలకు ఇక్కడి పీహెచ్‌సీకి వచ్చాను. చాలా సమయం వేచిచూసి సిబ్బందిని అడిగితే డాక్టర్ సెలవులో ఉన్నాడని తెలిపారు. జ్వరం ఎక్కువై కళ్ళు తిరుగుతున్నాయని తెలపడంతో స్టాప్‌నర్స్ ఫోన్లో వైద్యుడిని అడిగి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. – రాథోడ్ సావిత్రిబాయి, బద్దునాయక్ తండా వైద్యులు మొగ్గు చూపడం లేదు ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు మొగ్గు చూపడంలేదు. నగరాల్లో, పట్టణాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో వేతనాలు ఉండడంతో ప్రభుత్వం ఇచ్చే వేతనానికి ఉద్యోగం చేసే పరిస్థితులు లేవు. దీంతో వైద్యుల కొరత ఏర్పడుతుంది. నలుగురు వైద్యులు అవసరమున్న చోట ఒక్కరితోనే సర్దుబాటు చేస్తున్నాం. సిబ్బంది నియామకంలో ఎలక్షన్ కోడ్ ఉంది. డిసెంబర్ లేదా జనవరి నెలలో నియామకాలు చేపడతాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్యాధాకారి, ఆదిలాబాద్ -
వైద్యులు వచ్చేస్తున్నారు..
► పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖత ► జిల్లాలోని పీహెచ్‌సీల్లో 14 పోస్టులు ఖాళీ ► రిమ్స్ వైద్య కళాశాలలో అదే పరిస్థితి ► వైద్యుల భర్తీతో సేవలు మెరుగు ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో వైద్యుల కొరతతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్లతో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సైతం వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సేవలు అందక రోగులు హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్తున్నారు. వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం వైద్యులను నియమించేందుకు ప్రక్రియ ప్రారంభించడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2118 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఈ పోస్టులు భర్తీ చేసేందుకు త్వరలో పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వరి తివారికి పంపించారు. ఆయన సంతకం చేసి టీఎస్సీపీఎస్సీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్సీపీఎస్సీ నిర్ణయంతో త్వరలో ఈ పోస్టులకు భర్తీ కానున్నాయి. దీంతో జిల్లాలోని వైద్యుల పోస్టులతో పాటు, రిమ్స్ మెడికల్ కళాశాలలో సైతం పోస్టులకు మోక్షం కలగనుంది. జిల్లాలో అందని సేవలు.. జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని వైద్యశాఖలో ఖాళీల కొరత వేధిస్తోంది. వైద్యులతో పాటు, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా, డెంగ్యు, రక్తహీనత వంటి వ్యాధులతో ప్రతి ఏడాది ఎంతో మంది చనిపోతున్నారు. వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయకుండా జాప్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్‌లో 22 పీహెచ్‌సీల పరిధిలో మొత్తం 14 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యాధికారుల పోస్టులతో పాటు నర్సులు, ఏఎన్ ఎంలు, ఫిజియోథెరఫిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్ లు, ప్రజారోగ్య సహాయకులు, తదితర పోస్టులు సుమారు 100 వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చిన్నచిన్న విషయాలకు కూడా రిమ్స్‌కు రావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో సిబ్బంది పోస్టులు కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రిమ్స్‌లోనూ అదే పరిస్థితి.. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో సైతం పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 125 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 65 ట్యూటర్లు, 150 సివిల్ సర్జన్ లు, 10 డెంటల్ సర్జన్ ల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ట్యూటర్లను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమ్స్‌లో 151 పోస్టులకు గాను ఇద్దరు ప్రొఫెసర్లు, 21 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 50 మంది ట్యూటర్లు సేవలందిస్తున్నారు. ఇంకా 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం భర్తీ ప్రక్రియ ప్రారంభించడంతో రిమ్స్‌లో ఖాళీలు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సేవలు మెరుగుపడుతాయి.. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేయడం వల్ల వైద్య సేవలు మరింత మెరుగుపడుతాయి. కొన్ని పీహెచ్‌సీల్లో రెండు వైద్య పోస్టులకు ఒక్కోటి మాత్రమే భర్తీ చేశారు. వాటితో పాటు మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర సిబ్బందిని సైతం నియమిస్తే బాగుటుంది. – సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో -
‘కత్తెర’ కాన్పులు
విచ్చలవిడిగా సిజేరియన్ వ్యాపారం • గతేడాది ప్రైవేట్ ఆస్పత్రుల్లో 38వేల ఆపరేషన్లు • మహబూబ్‌నగర్, నారాయణపేట, కొత్తకోటలో అధికం • ప్రభుత్వాత్రుల్లో వైద్యుల కొరతే కారణం • ఆర్థికంగా నష్టపోతున్న సామాన్యులు • బలహీన పడుతున్న ఆడపడుచులు మహబూబ్‌నగర్ క్రైం : ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత.. వసతుల లేమి.. ఫ లితంగా పేదలు సైతం ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వైద్యులు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తూ మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దేశంలోనే సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఉమ్మడి జిల్లాల్లో సై తం సిజేరియన్లతోపాటు గర్భసంచి తొలగింపు విచ్చలవిడిగా కొనసాగుతుండటం బాధాకరం. కాస్ట్లీ కాన్పులు ఉమ్మడి జిల్లాలో 44లక్షల జనాభా ఉంటే ఏటా 80నుంచి లక్ష వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 85 పీ హెచ్‌సీలు, 5 ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లాస్పత్రి ఉంది. సిబ్బంది కొరత, వసతుల లేమి వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు జనం మొగ్గు చూపడం లేదు. 2015–16లో ప్రభుత్వ ఆస్పత్రు ల్లో కేవలం 15వేల ప్రసవాలు మాత్రమే జరిగాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో 7,600 నుంచి 8వేల చొప్పున ఏ డాదికి జిల్లాలో 80వేల నుంచి లక్ష వరకు ప్రసవాలు నమోదవుతున్నాయి. సాధార ణ ప్రసవాలపై ఆరోగ్య సిబ్బంది మొక్కుబడి ప్రచారం చేయడం, ప్రభుత్వ వైద్యంపై అపమనమ్మకమే ప్రైవేటు కాన్పులు పెరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. ఆర్ఎంపీలు, పీఎంపీల కమీషన్ల కక్కుర్తి వెరసి గర్భిణిలను ప్రైవేట్ బాటపట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహకులు వివిధ కారణాలు చూపి సిజేరియన్ల వైపుమొగ్గు చూపేలా చేస్తూ ఒక్కో శస్త్రచికిత్సకు రూ.25నుంచి రూ.35వేల వరకు దండుకుంటున్నారు. మహిళలు శారీరకంగా ఇబ్బందులకు గురవుతారని తెలిసీ వైద్యుల కోతలకే ప్రాధాన్యమిస్తుండటం విమర్శల పాలవుతోంది. అందుకు నిదర్శనం. గత ఏడాది జిల్లాలో 82వేల కాన్పులు అయితే దీంట్లో పీహెచ్‌సీల్లో 202, ప్రభుత్వాస్పత్రుల్లో 14వేలు కాన్పులు అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 69వేల ప్రసవాలయ్యాయి. రూ. కోట్లల్లో సంపాదన ఉమ్మడి జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నా యి. అవసరం ఉన్నా లేకపోయినా శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. పేదలకైతే మరీ నరకం, ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో కాన్పుకు కనీసంగా రూ.30వేల ఖర్చు అవుతుంది. ఇలా జిల్లాలో గత ఏడాది ప్రైవేట్‌లో 38వేల కాన్పులు సిజేరియన్ ద్వారా చేశారు. ఒక్క కేసుకు రూ.30వేలు లెక్కించినా 100కోట్ల ఆదాయం ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తోంది. సర్కార్ ఆసుపత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండకపోగా ప్రభుత్వమే రూ.1200 చెల్లిస్తోంది. చర్యలు తీసుకుంటాం పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిపేందుకు కృషి చేస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవకాశమున్నా సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టు తేలితే నేరుగా ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ అవసరం లేకున్నా సిజేరియన్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం కోసం వస్తే చాలు వారికి సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నా సిజేరియన్ కాన్పులు చేసేస్తున్నారు. ఏదో కారణం చెప్పి సిజేరియన్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత ప్రైవేట్ ఆసుపత్రుల్లో 98శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది 82వేల కాన్పులు అయితే వాటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10శాతం ప్రసవాలు అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 70శాతం అవుతున్నాయి. గతేడాది జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 69వేల కాన్పులు అయితే దీంట్లో 38వేలు సిజేరియన్ ఆపరేషన్లే. ఆపరేషన్ చేస్తే మహిళలు బలహీనపడి భవిష్యత్ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి ఉంటుందని తెలిసినా ఖాతరు చేయడంలేదు. ఉమ్మడి జిల్లాలో అయితే మహబూబ్‌నగర్‌తో పాటు కొత్తకోట, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జడ్చర్లలో కత్తెర కాన్పులే అధికం అవుతున్నాయి. -
కొండెక్కిన వైద్యం
వారు అడవి బిడ్డలు..తమకు ఇది కావాలని నోరు తెరిచి అడగలేని అమాయకులు వాళ్లు.. విశాఖ నగరానికి ఆమడ దూరంలో ఉన్నా కనీస సౌకర్యాలకు నోచుకోని అభాగ్యులు. అలాంటి వారికి కనీస అవసరమైన వైద్యం ఏ విధంగా అందుతుందో తెలుసుకోవడానికి ‘సాక్షి’ మంగళవారం క్షేత్ర స్థాయికి వెళ్లింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, అక్కడి సమస్యలపై ఆరా తీసింది. ఈ పరిశీలనలో గిరిజనుల దుర్భర పరిస్థితులు వెలుగుచూశాయి. ఆస్పత్రుల్లో లోటుపాట్లు బయటపడ్డాయి. సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలోని 11 మండలాల్లో 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 53 మంది వైద్యులుండాల్సి ఉండగా ఏడుగురు లేరు. ఉన్నవారిలో 18 మంది కాంట్రాక్టు వైద్యులే. ఏరియా ఆస్పత్రులు రెండు ఉన్నాయి. 194ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. పాడేరు, అరకు, హుకుంపేటలో ప్రసూతి కేంద్రాలున్నాయి. అడిషన్ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఐదుగురు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా నలుగురే ఉన్నారు. దంతవైద్యులు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా ఐదుగురే ఉన్నారు. మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 29 పోస్టులకు గానూ 20 మంది ఉన్నారు. పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టులు 18 ఉండగా 6 ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు 58 కాగా 11 ఖాళీగా ఉన్నాయి.ఫార్మాసిస్టు 40 పోస్టులకు 15 మందే ఉన్నారు. ల్యాబ్ టెక్సీషియన్ 34 మంది ఉండాల్సి ఉండగా 30 మంది ఉన్నారు. హెల్త్ సూపర్వైజర్ మేల్ 56 పోస్టులకు 43 మంది ఉన్నారు.హెల్త్ సూపర్వైజర్ ఫిమేల్ 50 పోస్టులకు 11 పోస్టులు ఖాళీ. హెల్త్ అసిస్టెంట్ మేల్ 194 పోస్టులకు 143 మంది ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ 195 పోస్టులకు 59 ఖాళీగా ఉన్నాయి.సెకండ్ ఏఎన్ఎం 194 మందికి 178 మంది ఉండగా 16 ఖాళీ. ఆశా కార్యకర్తలు 3227 పోస్టులకు 3186 మంది ఉన్నారు. పీహెచ్‌సీల్లో ప్రధానంగా వైద్యుల కొరత వేధిస్తోంది. అరకులోయ మండలంలోని 24 గంటల గన్నెల పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరిని డుంబ్రిగుడ పీహెచ్‌సీకి డెప్యూటేషన్‌పై పంపించారు. హుకుంపేట పీహెచ్సీలో నలుగురు వైద్యులకు గాను ముగ్గురే పనిచేస్తేన్నారు. పెదబయలులో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. ఉన్నవారు కూడా సమయానికి రాకపోవడంతో వారికోసం నిరీక్షించడం రోగులకు సాధారమైపోయింది. నర్సులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. వారు చేయలేని చికిత్సలకు విశాఖ పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తున్నారు.పాడేరు ఆస్పత్రిలో చాలా పరికరాలు వినియోగించక పోవడం వల్ల తుప్పు పట్టి నిరుపయోగంగా ఉన్నాయి. రోగుల కోసం కేటాయించిన గది, వార్డులోని మంచాలు దుమ్ము పట్టాయి. పాడేరులో పేరుకే పది పడకల ఆసుపత్రి కానీ 4పడకలే ఉన్నాయి. ఫార్మాసిస్టులు, ఆరోగ్యమిత్రలు, ఓపీ చీటీ రాసే సిబ్బంది కూడా లేరు. పేరుకే 24 గంటల ఆసుపత్రులు కానీ తురిచి ఉంచేది సాయంత్రం వరకే. వైద్య సిబ్బంది నివాస గృహాలు లేక ప్రయివేటు ఇళ్లులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టు డాక్టర్లకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. -
జిల్లా వ్యాప్తంగా వైద్యుల కొరత
డీఎంహెచ్ఓ భారతీరెడ్డి చిల్లకూరు : జిల్లా వ్యాప్తంగా వైద్యుల కొరత ఉందని డీఎంహెచ్ఓ భారతీరెడ్డి తెలిపారు. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 50 మంది వైద్యుల కొరత ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన నివేదికలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అలాగే ఎక్కువ జనాభా ఉన్న చోట అదనంగా వైద్యులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. చెన్నూరు పీహెచ్సీ పరిధిలో సుమారు 70 వేల మంది జనాబా ఉన్నందున మరో ముగ్గురు వైద్యులు అవసరముందని తెలిపారు. దీనిపైనా నివేదికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆరోగ్యకేంద్రాలపైనా స్థానిక ప్రజాప్రతినిధుల ప్రర్యవేక్షణ ఉండాలన్నారు. పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్ఓలు తమ పరిధిలోని ఆరోగ్యకేంద్రాలను 15రోజులకోసారి తనిఖీ చేయాలన్నారు. అలాగే ఆరోగ్యకేంద్రాల పరిధిలోని సబ్ సెంటర్లను స్థానిక వైద్యులు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలకు త్వరలో ట్యాబ్‌లు ఇచ్చేందుకు ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వెంట వైద్యులు ఏడుకొండలు, సిబ్బంది ఉన్నారు. -
నిమ్స్ సేవలు నిల్
ఆంకాలజీ.. కార్డియాలజీ.. న్యూరాలజీ.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ.. అనస్థీషియా.. నెఫ్రాలజీ.. యూరాలజీ.. ప్లాస్టిక్ సర్జరీ ఇలా కీలకమైన విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. మహిళల కోసం గైనకాలజీ విభాగం ఉన్నా ఉపయోగం లేదు. ఒక్క కాన్పు కూడా చేయడంలేదు. దంత వైద్య విభాగంలో పన్ను పీకిందీ లేదు.. పెట్టిందీ లేదు.. చాలా విభాగాల్లో కత్తి పట్టని సర్జన్లు.. నాడి పట్టని ఫిజీషియన్లు ఎంతోమంది ఉన్నారు. మొత్తం 32 విభాగాలున్నా.. రోగులకు సేవలు ఆశించిన స్థాయిలో అందడంలేదు. - ఆస్పత్రిని వీడుతున్న సీనియర్లు - మూతపడుతున్న థియేటర్లు - పట్టించుకోని యాజమాన్యం సాక్షి, సిటీబ్యూరో: దేశ రాజధానిలో ఎయిమ్స్‌కు ఎంత పేరుందో రాష్ట్ర రాజధానిలోని నిమ్స్‌కు కూడా అంతే పేరుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు మృగ్యమయ్యాయి. కీలకమైన విభాగాల్లోని ఆపరేషన్ థియేటర్లు మూతపడుతున్నాయి.. సీనియర్ వైద్యులు ఆస్పత్రిని వదలిపోతున్నారు.. ఖాళీలు భర్తీ కావడంలేదు. మౌలిక సదుపాయాల కల్పనను మరిచారు. ఇలా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల మాట అటుంచితే కనీస వైద్యమూ అందడంలేదు. నిమ్స్‌ను విస్తరిస్తామని, సేవలను మరింత మెరుగు పరుస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)కు తెలుగు రాష్ట్రాల నుంచి రోజుకు సగటున రెండు వేల మంది వరకూ రోగులు వస్తుంటారు. ఇన్ పేషంట్లుగా 1500 మంది చికిత్స పొందుతుంటారు. రోగులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే ఈ ఆస్పత్రిలో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కీలకమైన విభాగాల్లో అనుభవం ఉన్న వైద్యులు ఆస్పత్రిని వీడిపోతున్నారు. ఉన్నతాధికారుల తీరు, అంతర్గత పోరు, వనరుల లేమి, వీటికితోడు సరైన అవకాశాలు రాకపోవడంతో ఏటా పది శాతం మంది వైద్యులు ఆస్పత్రిని వీడిపోతున్నట్టు స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆస్పత్రిలో డెబ్బైకిపైగా వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు ఇక్కడి పరిస్థితులు నిరాశే మిగులుతోంది. కీలక విభాగాల్లో రాజీనామాల పర్వం.. న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానస పాణిగ్రహి ఇప్పటికే వెళ్లిపోగా, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ ఇటీవల తనపోస్టుకు రాజీనామా చేశారు. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీనామా తర్వాత మోకాలి శస్త్రచికిత్సలు పది శాతానికి పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇప్పటికే అనేకమంది ప్రతిభావంతులైన వైద్యులు నిమ్స్‌ను వీడగా, తాజాగా మరో ఇద్దరు వైద్యులు కూడా ఆస్పత్రిని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం. స్పెషాలిటీ బ్లాక్ మూడో అంతస్తులో ఆర్థోపెడిక్ విభాగానికి కేటాయించిన ఆపరేషన్ థియేటర్లను ఓ ఉన్నతాధికారి ఉద్దేశపూర్వకంగానే మూసివేయించారు. పాతభవనంలోని పలు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయడం లేదు. ల్యామినర్ ఎయిర్‌ఫ్లో లేదు. చిన్నపాటి వర్షం కురిసినా పైకప్పు కురుస్తోంది. ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుండటం వల్ల రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్టు స్వయంగా వైద్యులే చెబుతున్నారు. కీలకమైన కార్డియో థొరాసిక్ విభాగం నిర్వహణకు సరైన వైద్యులే లేరు. ఆ విభాగాధిపతిపై ఆరోపణలు రావ డంతో ఇటీవల ఓ కమిటీ వేశారు. ఇప్పటివరకు ఆ కమిటీ ఏం తేల్చిందో కూడా తెలియదు. కేన్సర్ విభాగమున్నా.. లేనట్టుగానే.. సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ జగన్నాథం గత ఏడాది పదవీ విరమణ చేశారు. ఇప్పటివరకు ఆ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం వైద్యుల కొరత వల్ల ఆ విభాగం ఉన్నా లేనట్టుగానే తయారైంది. వైద్యం కోసం వచ్చిన రోగుల ను కనీసం పట్టించుకునే నాథుడే లేరు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదిలావుంటే అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. అనస్థీషియన్ల కొరత వల్ల ఆరు ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రాష్ట్ర రాజధాని నగరంలోనే అదీ ప్రతిష్టాత్మక ఆసుపత్రి పనితీరు ఇంత దారుణంగా ఉండడం గమనార్హం. -
జిల్లా ఆస్పత్రిలో వైద్యుల మధ్య విభేదాలు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : అసలే వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా ఆస్పత్రిలో... ఉన్న వైద్యులు వారం రోజులుగా ఒకరికొకరు వాగ్వాద పడుతున్నా రు. దీంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. విధుల్లో కావాలనే వేధిస్తున్నారని గైనిక్ వైద్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గత బుధవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి లిఖిత పూర్వకంగా వారు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి వైద్యాధికారులు తమకు ఎక్కువగా బాధ్యతలు అప్పగిస్తూ కావాలని వేధిస్తున్నారని, కళాశాల ప్రొఫెసర్లుగా ఉన్న తమకు వైద్యసేవలు అందించడానికి వీలులేదని కోరుతూ లేఖలో ఆస్పత్రిలోని స్త్రీ వైద్యనిపుణులు రాజేశ్వరి, మంజుల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ప్రతిరోజు 40 ప్రసవాలు చేయాల్సి వస్తుందని, ఉన్న ముగ్గురు వైద్యులు సక్రమంగా విధులకు రాకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆస్పత్రి అధికారులు పేర్కొంటున్నారు. ఇరువురి మధ్య డ్యూటీల కేటాయింపులో తరుచుగా వాగ్వాదం చోటుచేసుకుంటున్నాయి. తమకు డ్యూటీలు వేయవద్దని వైద్యురాళ్లు, డ్యూటీలు చేయాల్సిందేనని వైద్యాధికారులు పట్టుబడుతుండడంతో వీరిమధ్య వారం రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే ఫిర్యాదు అందగానే కలెక్టర్ శుక్రవారం మెడికల్ కళాశాల అధికారులను , వైద్యులను తను చాంబర్‌కు పిలిపించుకొని సమావేశం నిర్వహించారు. వైద్యులు విభేదాలు మాని రోగులకు సేవలు అందించాలని, ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవడం తగదని హెచ్చరించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో గైనిక్ సేవలు అందించడానికి వైద్యురాళ్లు పనిభారం అనుకోకుండా, వీలైనంత ఎక్కువగా సేవలు అందించాలని సూచించారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు అదనం గా సేవలు అందించాలని కోరినట్లు తెలి సింది. లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించి నట్లు సమాచారం. కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యుల పనితీరు నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఇందులో 40 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని తెలపడంతో కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని రప్పించి వైద్యసేవలు అందిచాలని ఆదేశించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
కొత్త వైద్యులొచ్చారు..
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో కొత్త వైద్యులు కొలువు తీరారు. ఆయా పీహెచ్‌సీల్లో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకొని వైద్య పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సోమవారం 24 మంది మెడికల్ ఆఫీసర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.స్వామిని కలిసి రిపోర్టు చేశారు. వీరందరూ మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఆదిలాబాద్‌లోని డీఎంహెచ్‌వో చాంబర్లో నూతనంగా ఎంపికైన మెడికల్ ఆఫీసర్స్‌కు సోమవారం పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన వైద్యులు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. -
వంతుల‘మారి’ వైద్యం!
అసలే అది గ్రామీణ ప్రాంతం. చుట్టూ పల్లెలు, గిరిజన తండాలు. ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఎంతో అవసరం. ఈ కారణంగా అధికారులు ఆ సర్కారు ఆస్పత్రికి సదుపాయాలు సమకూర్చారు. ఎన్ని చేస్తే ఏం లాభం.. అక్కడ అసలు వైద్య సేవలే పడకేశాయి. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇక్కడ నియామకమైన ఏ వైద్యుడూ రెండు మూడు నెలలకు మించి విధులు నిర్వహించడంలేదు. పై అధికారులను మచ్చిక చేసుకుని.. మూడు నెలలు తిరక్కుండానే నగరానికి సమీపంలోని ఆస్పత్రికి బదిలీ చేసుకునో.. డిప్యూటేషన్పైనో వెళుతున్నారు. అదీ కాకుంటే మూడు లేదా ఆరు నెలలపాటు దీర్ఘకాలిక సెలవు పెట్టే సౌకర్యం ఎలాగూ ఉంది.. దాన్ని ఉపయోగిస్తున్నారు. పరిగి, న్యూస్‌లైన్: పరిగి ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు వంతులవారీగా మూడు రోజులకోసారి వచ్చిపోతుండడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆస్పత్రిలో ఆరు పోస్టులు ఉండగా ఒకరు డిప్యూటేషన్, ఇద్దరు లాంగ్ లీవ్‌లో ఉండగా.. మరో పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు డెంటల్ డాక్టర్ కాగా మరొకరు కాంట్రాక్ట్ వైద్యుడు. ఇదీ పరిగి ధర్మాసుపత్రిలో కొనసాగుతున్న వంతుల‘మారి’ వైద్యం! మేడిపండు చందం వైద్యం. ఆస్పత్రిలో ఆరు పోస్టులున్నాయని చెప్పుకొనేందుకు మాత్రమే పనికొస్తుంది. ప్రస్తుతం ఒక్క వైద్యుడు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆయన సైతం డెంటల్ డాక్టరే. ఇక ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ వైద్యుడు సైతం నిబంధనలకు విరుద్ధంగా నియామకమయ్యారనే ఆరోపణలున్నాయి. ఆ వైద్యుడు రిటైర్ అయి 10 సంవత్సరాలు కావస్తుండటంతోపాటు ఆ ప్లేస్‌లో గైనకాలజిస్టును నియమించాల్సి ఉండగా ఎంబీబీఎస్‌గా రిటైర్ అయిన వ్యక్తిని తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి తెలిసిన పదమొక్కటే.. రెఫర్ ఇక ఇక్కడి వైద్యం పరిస్థితి చెప్పుకోదలిస్తే.. మరీ వింతగా తోస్తుంది. ఆస్పత్రికి వచ్చే రోగులను ఎలా బయటకు పంపాలా అని చూస్తున్నారు తప్పిస్తే వారికి వైద్యం చేయటంలేదు. ఒక్కోసారి రోగులను పరీక్షించకుండానే రెఫర్ పేరుతో మామూలు వ్యాధులకు సైతం హైదరాబాద్, వికారాబాద్‌లకు పంపిస్తున్నారు. సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి ఉన్నా.. కాన్పు కాదంటూ నమ్మబలికి రెఫర్ చేస్తున్నారు. ఓపీ సైతం సక్రమంగా చూడటంలేదు. ఒక్కోసారి నర్సులే రోగి చేతిలో రెండు ట్యాబ్లెట్లు పెట్టి పంపించి వేస్తున్నారు. దీంతో విసిగిపోయిన రోగులు ఆస్పత్రి ఎదుట తరచూ ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల అనేక సార్లు వైద్యులు, ఆస్పత్రి పనితీరుపై ఆగ్రహించిన రోగులు ఆందోళనలు చేపట్టడం ఇక్కడ వైద్యం ఎంత బాగా అందుతోందో తెలియజేస్తోంది. డెంటల్ వైద్యుడే.. ఓపీ చూస్తారా? అన్ని రోగాలకు ఒకే మందు అన్న తరహాలో నెలలో 15 రోజులకు పైగా ఆస్పత్రి మొత్తం డెంటల్ వైద్యుడు ఒక్కరే చూస్తారు. ఓపీ మొదలుకుని ఆయన ఉన్న రోజుల్లో అన్ని రకాల రోగాలకూ ఆయన వైద్యం చేస్తారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో గతంలో మొత్తం ఐదుగురు వైద్యులు ఉండగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఒక్క డాక్టరు రెండు రోజులు నిరాటంకంగా విధులు నిర్వహించే వారు. ప్రస్తుతం ఒకరు డెంటల్ డాక్టర్, మరొకరు కాంట్రాక్ట్ వైద్యుడు ఉండటంతో మూడు రోజులు ఒకరు మరో మూడు రోజులు మరొకరు.. ఇలా నెలలో పదిహేను రోజులు ఒకరు.. మరో 15 రోజులు ఇంకొకరు వంతులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు కొనసాగుతున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ వాణీ ప్రసాద్.. నిధులు మంజూరు చేసి ఆస్పత్రిని మెరుగుపరిచినప్పటినుంచీ ఓపీ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో వైద్య సేవలు దయనీయంగా మారాయి.