గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి. వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స అందేది కాదు. నర్సులు నియామకాలు లేక సేవలు అరకొరగానే ఉండేవి. మందులుండేవి కావు. నిర్ధారణ పరీక్షలు జరిగేవి కావు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు సరైన వైద్యం అందడానికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో 1,500 పోస్టులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 మాసాల్లోనే ఆరోగ్య శాఖలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఆ శాఖలో ఇది అతిపెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు.
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగవుతున్నాయి. వైద్యుల కొరత లేకుండా భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఒక్క బోధనాసుపత్రుల్లోనే 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు. అంతేకాదు ఒక్కో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులు ఉండాలనే లక్ష్యంతో 645 మంది ఎంబీబీఎస్ వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. వైద్యవిధానపరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు 232 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లను నియమించారు. 1,499 మంది వైద్యులను ప్రభుత్వ పరిధిలో నియమించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయుష్ డిస్పెన్సరీల్లో పనిచేసే సుమారు 800 మంది ఉద్యోగులను తొలగించారు. అప్పట్లో జాతీయ ఆరోగ్యమిషన్ ఆయుష్ వైద్యుల నియామకానికి అనుమతించినా రాష్ట్ర సర్కారు చొరవ చూపకపోవడంతో కొత్త ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోయింది.
మెరుగుపడిన నర్సింగ్ సేవలు
గతంలో నర్సులు లేక, సేవలు అందక రోగులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం 4,683 మంది నర్సులను నియమించింది. ఇవి కాకుండా ఇప్పటివరకూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో 1,818 మంది బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లుగా నియమించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో నర్సింగ్ నియామకాలు జరగడంతో బోధనాసుపత్రుల నుంచి పీహెచ్‌సీల వరకూ సేవల్లో గణనీయ మార్పులు వచ్చాయి. 21 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించింది.
త్వరలో పీహెచ్‌సీలకు నియామకాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్తగా వచ్చే పీహెచ్‌సీలకు వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది నియామకాన్ని త్వరలోనే చేపడతాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటాం.
– డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment