MBBS Doctors
-
కొత్త మెడికల్ కాలేజీలకు నో
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ఝలక్ ఇచ్చింది. మొత్తం 8 మెడికల్ కాలేజీలకు అనుమతి లేఖ (లెటర్ ఆఫ్ పర్మిషన్ – ఎల్వోపీ) ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు మెయిల్ పంపించింది. మౌలిక సదుపాయాలు లేకపోగా, అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించడంతో అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. సౌకర్యాలు సరిగాలేని కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా గద్వాల, నారాయణపేట, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో వైద్య కళాశాలల కోసం గతేడాది ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందం బోధనా సిబ్బంది లేకపోవడం (జీరో ఫ్యాకల్టీ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ల, ఇన్‌పేషెంట్లు విషయమై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ, ఐపీ మాత్రం ఎన్ఎంసీ నిబంధనల మేరకు లేదు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అలా ఒక్కో కాలేజీకి మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలి. కానీ రాష్ట్ర కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మినహా మిగతా సిబ్బంది లేరు. అలాగే నిబంధనల ప్రకారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా ఉండాలి. కానీ వాళ్లు లేకుండానే కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కాగా ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా సవరించుకోవాలి. లేనిపక్షంలో అనుమతులివ్వదు. కాగా ఈ విషయంపై డీఎంఈ డాక్టర్ వాణి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లెటర్ల కోసం ఎదురుచూస్తున్నామని, అవి అందిన తర్వాత అప్పీలుకు వెళ్తామని తెలిపారు. బోధనా సిబ్బంది లేరు.. వసతుల్లేవు రాష్ట్రంలో 29 ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి మొత్తం 56 మెడికల్ కాలేజీలున్నాయి. వీటిల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 3,790 సీట్లు ఉండగా ఎక్కువ కాలేజీల్లో 150 చొప్పున మాత్రమే ఉన్నాయి. వీటిల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అనేకచోట్ల పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఔట్ పేషెంట్లు రాకపోవడంతో పీజీ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను తూతూ మంత్రంగా పూర్తి చేస్తున్నారు. కొందరు పీజీ మెడికల్ కోసం కోచింగ్‌లకు వెళ్తున్నారు. ఏదో పరీక్ష పాసైతే చాలన్న అభిప్రాయం అటు విద్యార్థులు, ఇటు కాలేజీల యాజమాన్యాల్లోనూ నెలకొందనే విమర్శలు విని్పస్తున్నాయి. వాస్తవానికి వసతులు లేవని విద్యార్థులు కూడా బయటకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. చెప్పినా, నిరసన వ్యక్తం చేసినా ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోంది. గతంలోనే ఎన్ఎంసీ గరం ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అనేకచోట్ల ఇటువంటి పరిస్థితి ఉంటోందని ఎన్ఎంసీ గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం వరకు అధ్యాపకుల కొరత ఉందని ఎన్ఎంసీ గతంలోనే తేల్చడం గమనార్హం. 150 ఎంబీబీఎస్ సీట్లున్న మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్పేòÙంట్లు ఉండాలి. కానీ ఒక చాలా కాలేజీల్లో సగం మేరకు కూడా ఔట్ పేషెంట్లు రావడంలేదు. ఇది వైద్య శిక్షణకు ఏమాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు. ఇక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి 600 పడకలు అవసరం కాగా, చాలాచోట్ల 500–550తోనే నడిపిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ కేవలం 10 శాతం వరకే ఉంటోంది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం సరిపోదని చెబుతున్నారు. లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు అవసరమైన సంఖ్యలో లేవు. మెడికల్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా 450 మందికి సరిపోయేలా హాస్టల్ వసతి ఉండాల్సి ఉండగా, 150 మంది బాలికలు, 190 మంది బాలురకు సంబంధించిన హాస్టల్ వసతి మాత్రమే ఉంది. కొన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల శిక్షణ కోసం అవసరమైన అల్ట్రాసౌండ్ యంత్రాలు కూడా లేకపోవడం గమనార్హం. -
వైద్య విద్య ప్రక్షాళన అత్యవసరం
ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి ప్రాక్టికల్ అంశాలపై అవగాహన నాస్తి. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. సహజ సామర్థ్యం, అభిరుచులకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యం వారికి ఉండాలి. దానికోసం ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి. ఇటీవల వార్తా పత్రికల్లో ప్రచురితమైన రెండు వార్తలు పరస్పర విరుద్ధంగా కనిపించాయి. ఒకటేమో ప్రభుత్వం యాభై కొత్త వైద్య కళాశాలలకు అనుమతిచ్చిందన్నది. ఈ రెండు కాలేజీల చేరికతో దేశంలోని మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,07,000కు చేరుకుంటుంది. రెండో వార్త ఏమిటంటే, దేశం మొత్తమ్మీద కనీసం 38 వైద్యకళాశాలు తమ గుర్తింపును కొన సాగించేందుకు అవసరమైన ప్రమాణాలను పాటించడం లేదన్నది! ఇంకో వంద కాలేజీలూ ఇదే స్థితిలో ఉన్నట్లు ఈ వార్త చెబుతోంది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను ఇవి పాటించడం లేదన్నది ఆరోపణ. సిబ్బంది బయోమెట్రిక్ పద్ధతుల్లో అటెండెన్ ్స ఇవ్వాలన్న అంశంతోపాటు మరికొన్ని ఉల్లంఘనల కారణంగా వీటి గుర్తింపు రద్దయ్యే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. బహుశా ఈ సమస్య కళాశాలల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఉత్పన్నమై ఉండ వచ్చు. లేదా, సిబ్బంది ఒక చోట కాకుండా, మరిన్ని కళాశాలల్లో బోధనకు అంగీకరించి ఉండటమూ కావచ్చు. దేశంలో ప్రస్తుతం ఉన్న వైద్యులు ఎంతమంది? 2002 జూన్ నెలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం 13,08,009 మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసినవారు, మరణించిన వారు లేదా ఇతర దేశాలకు వలస వెళ్లినవారు ఉజ్జాయింపుగా 20 శాతం మంది ఉన్నారని అనుకున్నా ప్రస్తుతం పది లక్షలకుపైగా వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తేలుతుంది. ఆయుష్ వైద్యులు 5.75 లక్షల మందిని కూడా చేర్చితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉన్నట్లు అవుతుంది. 2014లో దేశంలోని మొత్తం వైద్య కళాశాలలు 387 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 695కి చేరింది. మరో 75 జిల్లా ఆసుపత్రులను వైద్యకళాశాలలుగా మార్చేందుకు ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిల్లో కొన్నింటిని ఇప్పటికే మార్చేశారు కూడా. జిల్లా ఆసుపత్రి కానీ, ఈఎస్ఐ ఆసుపత్రి కానీ రాత్రికి రాత్రి వైద్య కళా శాలగా మారిపోదు. ఇందుకు శిక్షణ పొందిన సిబ్బంది, మౌలిక సదుపాయాల కూర్పు వంటి అనేక మార్పులు, చేర్పులు అవసర మవుతాయి. దేశంలో ఇప్పటిమాదిరిగానే రాన్నున ఐదు, ఏడేళ్లలో ఏటా ఒక లక్ష మంది కొత్త ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి వస్తారని అనుకుందాం. అప్పటికి దేశ జనాభా సుమారు 150 కోట్లకు చేరుకుంటుంది. వైద్యుల సంఖ్య కూడా 15 లక్షల వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉంటాడు. ఈ దశలోనే పరిస్థితులు ఆసక్తికరంగా మారతాయి. ఏటా ఎంతమంది వైద్యులు అవసరం? వారందరితో సమర్థంగా పనిచేయించుకోగల పరిస్థితులు ఉన్నాయా? ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి ప్రాక్టికల్ అంశాలపై అవ గాహన నాస్తి. ఎందుకంటే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా ఎంబీబీఎస్ చదివిన వారిలో అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. పడాలి కూడా. సహజ సామర్థ్యం, అభిరుచు లకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యమూ వారికి ఉండాలి. ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. ఉదాహరణకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఫ్యామిలీ మెడిసిన్ లో పీజీ చేసిన వారిని ఎంపిక చేయవచ్చు. బోధన, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారిని వైద్య కళాశాలలకు ఉపాధ్యాయులుగా శిక్షణ అందించాలి. ఆరోగ్య రంగంలో నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తీవ్ర అంతరం ఉంటోంది. మూడింట రెండొంతుల జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నా, అక్కడ పనిచేస్తున్న వైద్యులు మొత్తం వైద్యుల్లో 30 శాతాన్ని కూడా చేరడం లేదు. గ్రామీణ ఆరోగ్య రంగ గణాంకాల ప్రకారం 2021– 22లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత యాభై శాతం కంటే ఎక్కువే! అంతేకాదు... రాష్ట్రాల వారీగా చూసినా ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పంపిణీలో తేడా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, ఢిల్లీలతో పోల్చితే... జార్ఖండ్, యూపీ, బిహార్ రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన అంశం... కర్ణాటకలోని మొత్తం వైద్యుల్లో 40 శాతం రాజధాని బెంగళూరులోనే ఉండటం! ఫలితంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఇప్పటికీ దూరంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను పెంచాలన్న విధాన నిర్ణయం తీసుకోవటం అసలు లక్ష్యమేమిటి? నగరాల్లో తగినంత మంది వైద్యులు అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంత అవసరాలను తీర్చడమా? మౌలిక సదుపాయాలు లేకపోవడం అనే కారణంతో చాలామంది వైద్యులు పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. పల్లెల్లో పనిచేస్తే పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి లేదన్న భావన కూడా కొంతమంది వైద్యుల్లో, మరీ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివిన వారిలో ఉంటుంది. దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను అప్పుడప్పుడు సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి. కొత్త కాలేజీలు ఏర్పాటవుతున్నంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. చాలా రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషలిస్టుల పోస్టులకు దరఖాస్తులే రాకపోవడం దీనికి ఒక ఉదాహరణ! తగిన మౌలిక సదుపాయాలు, పరికరాలు, పనిచేసుకునేందుకు తగినంత స్వేచ్ఛ ఉన్న ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఎంబీబీఎస్‌లోకి ప్రవేశాలను నియంత్రించేందుకు ‘నీట్’ ద్వారా గట్టి ప్రయత్నమే జరిగింది. అయితే సగం కాలేజీలు ప్రైవేట్‌వి కావడం, అక్కడి విద్యార్థుల ర్యాంకులు అతి తక్కువగా ఉండటం వల్ల దేశంలోని విద్యా ప్రమాణాల్లో సమానత లేదని తెలుస్తుంది! టెలి మెడిసిన్ టెక్నాలజీ ద్వారా దేశం మొత్తమ్మీద ఒకే రకమైన వైద్య విద్యను ఎందుకు అందించలేకపోతున్నామన్నది ప్రశ్న! ఏతావతా... దేశంలో వైద్యవిద్యను సమూలంగా మార్చాల్సిన అవసరముంది. 1910లో ఫ్లెక్స్నర్ నివేదిక తరువాత అమెరికాలో జరిగిన మార్పుల మాదిరిగా అన్నమాట. అప్పట్లో బోధనాంశాలు మొత్తాన్ని రివైజ్ చేశారు. కాలేజీల సంఖ్యను 155 నుంచి తగ్గించారు. ప్రతి అంశానికి సంబంధించిన కనీస ప్రమాణాలు, శిక్షణ, అవధులను నిర్ణయించారు. తరువాతి కాలంలో కెనడా, యూరప్‌లలోనూ ఇదే పద్ధతిని అనుసరించడం గమనార్హం. భారత్‌లో వైద్య కళాశాలల సంఖ్యను హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులను సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 2025లో మనకు చిన్న పిల్లల వైద్యులు, కంటి వైద్యుల అవసరం ఎక్కువ అనుకుందాం. అదే సమయంలో ఐదేళ్ల తరువాత న్యూరోసర్జన్లు, ఫిజీషియన్ల అవసరం ఉందని అనుకుంటే... అందుకు తగ్గట్టుగా పీజీ కోర్సులు, సీట్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు చేసుకోవాలి. రాకేశ్ కోచర్ వ్యాసకర్త ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ మాజీ అధ్యక్షులు(‘ద ట్రిబ్యూన్’ సౌజ్యంతో) -
వైద్యులకు ఇష్టమైనచోట పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ అర్హతతో నియమితులయ్యే డాక్టర్లకు ఇష్టమైనచోట పోస్టింగ్ ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వారిచ్చే ప్రాధాన్యాల ప్రకారం సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజారోగ్య సంచాలకుడి(డీహెచ్) పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి రాష్ట్ర మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో తుదిజాబితాను ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, వైద్య విద్యా సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డికి అందజేస్తారు. వారు విడివిడిగా ఆయా పోస్టులకు ప్రాధాన్యాల ప్రకారంకౌన్సెలింగ్ నిర్వహిస్తారు. త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. వీలున్నంత వరకు ఇష్టమైనచోటనే పోస్టింగ్ వచ్చేలా ప్రయత్నిస్తామని అధికారులు వెల్లడించారు. ఒకేచోటికి ఎక్కువమంది పోటీపడితే అప్పుడు వారి మార్కులు, వెయిటేజీ, భార్యాభర్తల అంశం, అనారోగ్యం వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు. అందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని... గతంలో ఒకట్రెండు సందర్భాల్లో డీహెచ్, టీవీవీపీ, డీఎంఈ పరిధిలో ప్రాధాన్యాల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో అప్పుడు అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. నాలుగేళ్ల క్రితం టీవీవీపీ పరిధిలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ సందర్భంగా భార్యాభర్తలు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగ్‌లు ఇచ్చారు. భార్యాభర్తలను విడదీసి ఎక్కడెక్కడో వేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో వందలాది మంది పోస్టుల్లో చేరనేలేదు. కొందరు చేరాక విధుల్లోకి రాకపోవడంతో అనేకమందిని తొలగించారు. డీహెచ్ పరిధిలోని డాక్టర్లకు గతంలో హడావుడిగా పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో అనేకమంది తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వారికోసం ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఇప్పుడు బదిలీల ప్రక్రియ చేపట్టారు. అందుకోసం మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్వీస్ రూల్స్, అనుభవం, ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు వెయిటేజీ అనుసరించి బోర్డు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎక్కువమంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారే ఎంపికయ్యారు. -
ఇష్టమైన చోట డాక్టర్లకు పోస్టింగ్.. వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు వారికిష్టమైన చోట పోస్టింగ్‌లు ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. భర్తీకి ముందు నిర్వహించే కౌన్సెలింగ్ సందర్భంగా డాక్టర్లు ఆప్షన్లు సమర్పిస్తే అందులో ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్ లభిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి గత నెలలో రాష్ట్ర మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఈ 14న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తదుపరి దరఖాస్తుల గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,600 మంది దరఖాస్తు... మొత్తం 969 పోస్టులకుగాను ఇప్పటివరకు 1,600 మంది డాక్టర్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే నాటికి మొత్తం 3 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఒక పోస్టుకు ముగ్గురు పోటీ పడే అవకాశముంది. అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అందుకు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు నిబంధన ప్రధాన అడ్డంకిగా భావిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిలో చాలా మంది పీజీ మెడికల్ కోర్సు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ పోస్టులో చేరితే మూడేళ్ల వరకు పీజీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు ఉద్యోగంలో చేరాక ఇన్‌సర్వీస్ కోటా పీజీ మెడికల్ సీట్లకు అర్హత పొందాలంటే మూడేళ్లు ఆగాలి. ఆలోగా నీట్లో పీజీ సీటు వస్తే చేరేందుకు ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. ఈ కారణాలతో కొందరు ఎంబీబీఎస్ అభ్యర్థులు దరఖాస్తుకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారికే ఎక్కువ చాన్స్... దరఖాస్తు గడువు ముగిసిన దాదాపు నెలకు అంటే వచ్చే నెల రెండో వారంలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డు ప్రకటించనుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్వీస్ రూల్స్, అనుభ వం, ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు వెయిటేజీని అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. దరఖాస్తు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నందున వారే ఎక్కువగా ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. -
నంబర్ ఒకరిది.. వివరాలు ఇంకొకరివి
హిమాయత్‌నగర్: ఎంబీబీఎస్ చదవకుండానే చదివినట్లు విద్యార్థుల వివరాలు తమ సైట్లో ఉన్నాయని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) తెలిపింది. స్వదేశం, విదేశాల్లో చదివినట్లు ఇతరుల పేర్లతో కౌన్సిల్లో రిజిస్టర్ అయినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ హన్మంతరావు బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అవకతవకలను చూస్తే ఆయా విద్యార్థులు నిజంగా ఎంబీబీఎస్ చదివారా లేదా అనుమానం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం రెన్యువల్ చేసే సమయంలో బయటపడిన ఈ వ్యవహారంపై తాజాగా ఫిర్యాదు చేశారు. రెండేళ్ల కిందట ఏసీబీకి.. ఇప్పుడు సిటీ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారు, ఏ సంవత్సరం చదువుతున్నారో తదితర సమాచారంతో వారి పేరుతో టీఎస్‌ఎంసీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థికి జీవితకాల రిజిస్టర్ నంబర్‌ను కేటాయిస్తారు. ప్రతి ఐదేళ్లకోసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఇలా రెండేళ్ల క్రితం రెన్యువల్ చేసుకోవడానికి వచ్చిన నలుగురి విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబర్లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అప్లికేషన్‌పై రిజిస్టర్ నంబర్ ఒకటి ఉండగా.. దాన్ని రెన్యువల్ చేసే క్రమంలో ఫొటోతో కూడిన ఐడెంటిటీ మరో విద్యార్థిది వచ్చింది. మరో విద్యార్థికి సంబంధించి రిజిస్టర్ నంబర్ ఒకటి ఉండగా పేరు మార్పు కనిపింది. ఇంకొకరు చైనాలో ఎంబీబీఎస్ చేసినట్లుగా వివరాలుండగా రిజిస్ట్రేషన్ నంబర్ వేరే వ్యక్తిది ఉంది. ఇలా నలుగురికి సంబంధించిన ఈ వ్యవహారం నాలుగేళ్ల క్రితం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ ఏసీబీ అధికారులకు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. వాళ్లు తాజాగా ఇది మాకు రాదని చెప్పి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో ఈ పంచాయితీ హైదరాబాద్ సిటీ సైబర్ క్రైంకు చేరింది. దీనిపైన ఫిర్యాదును స్వీకరించి కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ తెలిపారు. -
రికార్డు స్థాయి నియామకాలు.. 27 నెలల్లో 14 వేల పోస్టుల భర్తీ
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి. వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స అందేది కాదు. నర్సులు నియామకాలు లేక సేవలు అరకొరగానే ఉండేవి. మందులుండేవి కావు. నిర్ధారణ పరీక్షలు జరిగేవి కావు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు సరైన వైద్యం అందడానికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో 1,500 పోస్టులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 మాసాల్లోనే ఆరోగ్య శాఖలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఆ శాఖలో ఇది అతిపెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగవుతున్నాయి. వైద్యుల కొరత లేకుండా భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఒక్క బోధనాసుపత్రుల్లోనే 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు. అంతేకాదు ఒక్కో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులు ఉండాలనే లక్ష్యంతో 645 మంది ఎంబీబీఎస్ వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. వైద్యవిధానపరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు 232 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించారు. 1,499 మంది వైద్యులను ప్రభుత్వ పరిధిలో నియమించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయుష్ డిస్పెన్సరీల్లో పనిచేసే సుమారు 800 మంది ఉద్యోగులను తొలగించారు. అప్పట్లో జాతీయ ఆరోగ్యమిషన్ ఆయుష్ వైద్యుల నియామకానికి అనుమతించినా రాష్ట్ర సర్కారు చొరవ చూపకపోవడంతో కొత్త ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోయింది. మెరుగుపడిన నర్సింగ్ సేవలు గతంలో నర్సులు లేక, సేవలు అందక రోగులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం 4,683 మంది నర్సులను నియమించింది. ఇవి కాకుండా ఇప్పటివరకూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో 1,818 మంది బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లుగా నియమించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో నర్సింగ్ నియామకాలు జరగడంతో బోధనాసుపత్రుల నుంచి పీహెచ్‌సీల వరకూ సేవల్లో గణనీయ మార్పులు వచ్చాయి. 21 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించింది. త్వరలో పీహెచ్‌సీలకు నియామకాలు రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్తగా వచ్చే పీహెచ్‌సీలకు వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది నియామకాన్ని త్వరలోనే చేపడతాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటాం. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
కోవిడ్‌పై పోరులో యువ వైద్యులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ బాధితుల ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమైన వైద్య సిబ్బందికి తోడుగా మరింత మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకునేందుకు అవసరమైన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి మోదీ సోమవారం ఓకే చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నీట్–పీజీ పరీక్షకు సిద్ధమవుతున్న డాక్టర్లను కోవిడ్ విధుల్లోకి తీసుకొనేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. నిర్ణయాలను పేర్కొంటూ ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదలచేసింది. పీజీ రాయబోయే వారిని కోవిడ్ విధుల్లో వినియోగించుకునేందుకు నీట్ పీజీ–2021 పరీక్షను కనీసం నాలుగు నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్ట్ 31లోపు నీట్–పీజీ ఉండదని, పరీక్ష తేదీ ప్రకటించాక వారు ప్రిపేర్కావడానికి కనీసం నెలరోజుల సమయం ఇస్తారని ప్రకటన తెలిపింది. దీంతో కోవిడ్ విధులకు పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన వైద్యులు అందుబాటులోకి రాగలరని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విశిష్ట కోవిడ్ జాతీయ సర్వీస్ సమ్మాన్.. కోవిడ్ మేనేజ్మెంట్లో సేవలను అందించే వ్యక్తులు కనీసం 100 రోజులపాటు కోవిడ్ డ్యూటీని పూర్తి చేసిన తర్వాత రాబోయే సాధారణ ప్రభుత్వ నియామకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం 100 రోజుల కోవిడ్ డ్యూటీ పూర్తిచేసిన వారికి కేంద్రప్రభుత్వం తరపున ‘ప్రధానమంత్రి విశిష్ట కోవిడ్ నేషనల్ సర్వీస్ సమ్మన్’ ఇవ్వాలని నిర్ణయించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికల్ ఇంటర్న్‌లను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కోవిడ్ మేనేజ్మెంట్ విధుల్లోకి తీసుకొనేందుకు అనుమతించాలని నిర్ణయించారు. వీరితో పాటు ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థుల సేవలను టెలి కన్సల్టేషన్స్‌తో పాటు కోవిడ్ వ్యాధి తీవ్రత ఉన్న రోగుల పర్యవేక్షణ బాధ్యతలను వీరికి ఫ్యాకల్టీ పర్యవేక్షణలో అప్పగించనున్నారు. దీంతో కోవిడ్ డ్యూటీలో ఉన్న సీనియర్ వైద్యులపై పనిభారం తగ్గుతుంది. పీజీలో కొత్త బ్యాచ్ విద్యార్థులు చేరే వరకు ఫైనల్ ఇయర్ పీజీ విద్యార్థుల సేవలనూ వాడుకుంటారు. బీఎస్సీ లేదా జీఎన్ఎం అర్హత ఉన్న నర్సులను సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో పూర్తి సమయం కోవిడ్ నర్సింగ్ విధుల్లో ఉపయోగించుకోవచ్చు. -
అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు?
పిల్లలు మెడిసిన్ చదువుతున్నారని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. సమాజంలో అదో ప్రత్యేక గుర్తింపు. డాక్టర్ అయిపోతారు కాబట్టి ఇక జీవితానికి ఢోకా లేదనే అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం మరోలా ఉంది. కనీసం పీజీ లేకపోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంబీబీఎస్ ఎందుకూ కొరగాకుండా పోతోంది. నర్సులే వీరికంటే నయం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ డాక్టర్లకు రూ. 15 నుంచి 20 వేల కంటే ఎక్కువ జీతాలు ఉండటం లేదు. పీజీ సీటు రాక... ఇటు ఎంబీబీఎస్‌తో ఏమీచేయలేక, జీవితం ఎలా గడపాలో తెలియక ఎందరో యువ డాక్టర్లు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఆ విద్యార్థి పేరు సాగర్ (పేరు మార్చాం). అతని తండ్రి ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్. ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలన్న కోరికతో ఉన్న సాగర్, చివరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. 12 ఏళ్ల క్రితం బీ కేటగిరీ సీటు కోసం కొంత బ్యాంకు రుణం తీసుకున్నారు. కష్టపడి చదివి 2015లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టులో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశాడు. కానీ పీజీ చదవకపోతే ప్రయోజనం లేదనుకున్నాడు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్‌కు ప్రిపేరవుతున్నాడు. కానీ బ్యాంకులో తీసుకున్న అప్పు రూ. 10 లక్షలు అలాగే ఉంది. అది చెల్లించేందుకు నానాయాతన పడాల్సి వస్తోంది. రమేష్‌కుమార్... హైదరాబాద్‌లో ఉంటారు. చిరు వ్యాపారి. దిగువ మధ్య తరగతి కుటుం బం. కొడుకు యోగేంద్ర (ఇద్దరి పేర్లు మార్చాం) తెలివైన విద్యార్థి. 2012లో ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో కన్వీనర్ కోటా కింద సీటు వచ్చింది. అతని ప్రతిభను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంతో ఆనందపడ్డారు. ఎంబీ బీఎస్ పూర్తయ్యాక పీజీ సీటు కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ సీటు రాలేదు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే నెలకు రూ. 15 వేల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు పెళ్లి సంబంధాలు కూడా రాలేదు. డాక్టర్‌గా మంచి పొజిషన్లో స్థిరపడలేకపోయాననే వేదన, ఇంకోవైపు తండ్రి ఆర్థిక పరిస్థితిని చూసి తట్టుకోలేక అవమానభారంతో 2019లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఒంటిపై తెల్లకోటు... మెడలో స్టెతస్కోప్... రోగులకు వైద్య సేవలు చేస్తూ జీవితంలో స్థిరపడాలనేది అనేకమంది యువతీ యువకుల అందమైన కల. అందుకు రేయింబవళ్లు కష్టపడి ఎంబీబీఎస్ సాధిస్తారు. త ర్వాత అంతే శ్రద్ధతో చదివి ఎంబీబీఎస్ పూర్తిచేశాక అనేకమందికి మిగిలేది బ్యాంకు అప్పులే. ఆ తర్వాత పీజీ కోసం ఎన్నాళ్లు ప్రయత్నించినా రాకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తే 15 నుంచి 20 వేల రూపాయల జీతమే ఇస్తుండటం తో అనేకమంది యువ వైద్యులు ఎందుకు ఎంబీబీఎస్ చదివామా అని ఆవేదన చెందుతున్నారు. పిల్లల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. జీవితంలో స్థిరపడక పోవడం, పెళ్లిళ్లు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎంబీబీఎస్ కోసం అప్పులు పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు వస్తే సరేసరి. లేకుంటే బీ, సీ కేటగిరీలో సీటు పొందితే ఫీజులకు అప్పులే దిక్కు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు. అంటే ఐదేళ్లకు రూ. 57.75 లక్షలు అవుతుంది. ఇక సీ కేటగిరీలో ఏడాదికి రూ. 23 లక్షల వరకు ఉంది. ఐదేళ్లకు రూ. 1.15 కోట్లు చెల్లించాలి. ఇది సాధారణ మధ్య తరగతికి తలకుమించిన భారమే. అయితే బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి ఈ ఫీజులను చెల్లిస్తున్నారు. కానీ ఇంత ఖర్చు చేసి చదివాక కేవలం ఎంబీబీఎస్ కోర్సుతో స్థిరపడే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత పీజీ రావడం గగనంగా మారింది. దీంతో ఎంబీబీఎస్ డాక్టర్ల జీవితం త్రిశంకుస్వర్గంలో ఉన్నట్లుగా మారింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రైవేట్‌లో కొద్దిపాటి జీతాలకు పనిచేస్తూ, స్థిరపడని వారు దాదాపు 20 వేల మంది ఉంటారని అంచనా. (చదవండి: ఏం పర్లేదు.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఇక్కడ!) మెడికల్ పీజీ సీట్లు చాలా తక్కువ... ఎంబీబీఎస్ చదివాక మెడికల్ పీజీ, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయకుంటే ఇప్పుడు వైద్య రంగంలో భవిష్యత్తు లేని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులతో పాటు నైపుణ్యం ఉంటేనే లక్షల్లో జీతాలు ఇస్తారు. ఎంబీబీఎస్‌తో స్థిరపడే పరిస్థితి లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తే తప్ప... ప్రైవేట్ ఆసుపత్రుల్లో జీతాలు దారుణంగా ఉంటున్నాయి. అయితే పీజీ సాధించడం అంత సులువుగా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో 5,140 ఎంబీబీఎస్ సీట్లుంటే, 1,996 పీజీ సీట్లున్నాయి. అందులో నాన్ క్లినికల్ పీజీ సీట్లు 455 ఉన్నాయి. నాన్ క్లినికల్ సీట్లలో చాలామంది చేరడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాటితో సొంత ప్రాక్టీస్ చేయడానికి కానీ, ఆసుపత్రుల్లో వైద్యునిగా సేవలు చేయడానికి కానీ ఉపయోగపడవు. కేవలం అధ్యాపకులుగా పనిచేయడానికే ఉపయోగపడతాయి. అందుకే 2020–21లో ఏకంగా 170 నాన్ క్లినికల్ సీట్లు ఎవరూ చేరక మిగిలిపోయాయి. అంటే 1,541 క్లినికల్ పీజీ సీట్ల కోసమే ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీపడతారు. పైగా ప్రతీ ఏడాది పీజీ కోసం పోటీ పడే ఎంబీబీఎస్ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో పీజీ రావడం కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రతీ రెండు ఎంబీబీఎస్ సీట్లకు ఒక పీజీ సీటు ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణ రూపం దాల్చట్లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. విదేశాల్లో చదివి ఎఫ్ఎంజీఈ పాసయ్యేది 14 శాతమే దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 7 వేల మంది వరకు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. అందులో 650 మంది తెలంగాణ నుంచి వెళ్లి చదువుతున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాల అంచనా. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు తప్పనిసరిగా ఎఫ్ఎంజీఈ పరీక్షలో పాసవ్వాలి. అప్పుడే మన దేశంలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ ఉంటేనే సొంత ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఎక్కడైనా పనిచేయడానికి అర్హులవుతారు. అయితే, ఇందులో పాసయ్యేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. 2014–2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 74,202 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాస్తే, అందులో 10,400 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. అంటే కేవలం 14.01 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. పెళ్లిళ్లు ఎందుకు కావడం లేదు? డాక్టరంటే ఎవరైనా అమ్మాయిని ఇస్తారని అనుకుంటారు. కానీ ఎంబీబీఎస్ పూర్తయి, పీజీ సీట్లు రానివారిలో చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్‌తో స్థిరపడే అవకాశం లేకపోవడం వల్ల పిల్లను ఇవ్వడానికి చాలామంది ముందుకు రావడం లేదు. ఒక డాక్టర్ మరో డాక్టర్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఎక్కడైనా ఆసుపత్రి పెట్టుకొని నడిపించుకోవచ్చని, ఒకరు ఎక్కడికైనా వెళ్లినా మరొకరు దాన్ని చూసుకోవచ్చన్న భావన ఉంటుంది. కానీ ఎంబీబీఎస్ చదువుతో మాత్రమే ఆసుపత్రి పెట్టుకొని జీవితంలో స్థిరపడే పరిస్థితులు లేనందున పెళ్లి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అంతేకాదు వేరే వృత్తుల్లో స్థిరపడిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా సంపాదన లేని ఎంబీబీఎస్ డాక్టర్లంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు కొందరు పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చేశాకే పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారు. ఇలా అనేక కారణాలతో ఎంబీబీఎస్ పూర్తయిన వారికి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదని అంటున్నారు. ఆరేళ్ల క్రితం ఎంబీబీఎస్ అయిపోయింది ఎంబీబీఎస్ 2015లో అయిపోయింది. అప్పటి నుంచి పీజీకి చదువుతున్నాను. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండటంతో పీజీకి చదవడం వీలుపడలేదు. అందుకే ఉద్యోగాన్ని వదిలేసి ప్రిపేర్ అవుతున్నాను. రూ. 40 వేలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నాను. అయితే పీజీ సీట్లు తక్కువగా ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తయిన వారికి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు ఇస్తే చాలామంది స్థిరపడతారు. పల్లెలకు వెళ్లి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ అరుణ్, హైదరాబాద్ తీవ్ర ఒత్తిడిలో యువ వైద్యులు అప్పులు చేసి ఎంబీబీఎస్ చదివిన వారు తర్వాత పీజీ రాక తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయిన వారికి కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన జీతాలు ఇవ్వడం లేదు. సొంతంగా క్లినిక్ పెట్టుకునే పరిస్థితి లేదు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లిళ్లు కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను నింపితే అనేకమందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ఎంబీబీఎస్ వైద్యులు కేవలం కేర్టేకర్ల మాదిరిగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. అందుకే వారి పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. గత్యంతరం లేక పనిచేయాల్సి వస్తోంది. – డా.విజయేందర్, కన్వీనర్, తెలంగాణ డాక్టర్స్ ఫోరం ఏళ్ల తరబడి చదివినా స్థిరపడలేదు ఎంబీబీఎస్ పూర్తయ్యాక నేను అనెస్థీషియా లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పులు చేసి ఫీజులు కడుతున్నాను. 29 ఏళ్లు వచ్చినా స్థిరపడలేదు. పీజీ పూర్తయినా వెంటనే స్థిరపడిపోతామన్న గ్యారంటీ లేదు. నాలాంటి వాళ్లు ఏళ్ల తరబడి వైద్య విద్య చదివి, స్థిరపడకుండా, పెళ్లి కాకుండా ఉన్నారు. నా చిన్నప్పటి క్లాస్మేట్స్ ఇంజనీరింగ్, ఐఐటీ వంటి కోర్సులు చదివి 22–23 ఏళ్లకే సంపాదిస్తున్నారు. మా నాన్న నా చదువులకు రూ.12 లక్షలు అప్పు చేశారు. – డా.రణధీర్ కుమార్, పీజీ విద్యార్థి, హైదరాబాద్ (చదవండి: పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు) -
ఏం పర్లేదు.. ఎంబీబీఎస్ పట్టా, పలుకుబడి, డబ్బులుంటే చాలు!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేషన్‌రోడ్డులోని ఓ మహానీయుని పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండానే వైద్యం నిర్వహించారు. పరిశీలించేందుకు అధికారులు ఆస్పత్రికి రాగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అక్కడ లేరు. తీరా ఆరా తీస్తే నిర్మల్‌లో ఓ వైద్యుడి దగ్గర పనిచేసిన వ్యక్తి ఆ వైద్యుడి సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. ఆ వైద్యుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పని చేస్తున్నాడు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని మూసివేయించారు. ఏ వైద్యుడి పేరిట ఆస్పత్రి కోసం దరఖాస్తు చేశారో ఆయనకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ఏడాది కిందట రాంనగర్లో ఓ ఆర్ఎంపీ క్లినిక్ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నాడు. ఏకంగా పడకలు ఏర్పాటు చేసి సెలూన్ బాటిళ్లు సైతం ఎక్కిస్తున్నాడు. ఆ ఆర్ఎంపీ తన పేరు కింద ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు రాసుకున్నాడు. ఈ విషయం కొంత మంది వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు వైద్య పట్టా అడగడంతో ఆ నకిలీ వైద్యుడి బాగోతం బట్టబయలైంది. ఇలా చాలా మంది ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ వైద్యులు అందించే వైద్యం అందిస్తామని చెప్పడం విశేషం. వీరిలో కొంత మంది ఆపరేషన్లు చేయిస్తామని చెప్పడమే కాదు.. ప్రైవేట్ వైద్యుల దగ్గరకు పంపి వారి నుంచి కమిషన్లు కూడా తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. సాక్షి. ఆదిలాబాద్: వైద్య విద్య చదవకపోయినా ఫర్వాలేదు.. ఎంబీబీఎస్ పట్టా, పలుకుబడి, డబ్బులుంటే చాలు ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. తెలిసిన డాక్టర్‌కు చెందిన పట్టాను తీసుకువెళ్లి క్లినిక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వైద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించకుండా అనుమతి ఇవ్వడంతో కొంతమంది వైద్యం పేరిట దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ తతంగం జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో ప్రైవే ట్ క్లినిక్‌ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ప్రజల అనారోగ్యాలే పెట్టుబడి ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైద్య పరీక్షల పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు. ప్రజల ఆరోగ్యమే పెట్టుబడిగా.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 100 ప్రైవేట్ క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో 12 నర్సింగ్ హోంలు, 12 క్లినిక్‌లు, 16 డెంటల్ క్లినిక్‌లు, 5 కంటి ఆసుపత్రులు, 44 ఆసుపత్రులు, 11 ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవల జిల్లాలో ఆస్పత్రుల సంఖ్య పుట్టగొడుగుల్లా పెరిగాయి. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వైద్య వ్యాపారం చేస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్న కొంతమంది వైద్యులతో పాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు చెందిన వారితో ఒప్పందం చేసుకొని క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకున్న వైద్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ ఆ ఆస్పత్రి మాత్రం అలాగే కొనసాగుతోంది. అలాగే అర్హతలు లేకపోయినా మెడికల్ షాపుల, ల్యాబ్‌ల నిర్వహణ చేపడుతున్నారు. వైద్యుడు వారానికి ఓసారి రావడం, ఫోన్ల ద్వారానే రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వైద్యం అందిస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. టెస్ట్‌ల పేరిట దోపిడీ.. ఆస్పత్రికి రోగి వెళ్లిన వెంటనే మొదట పరీక్షల పేరిట దోపిడీ చేస్తున్నారు. ల్యాబ్‌లో అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయించడం, ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు పూర్తి చేయకపోయిన.. ల్యాబ్‌లో పని చేసి నేర్చుకున్న వారే టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆ పీహెచ్‌సీల్లో, రిమ్స్‌లో పని చేసే ల్యాబ్ టెక్నిషీయన్లు ప్రైవేట్ ఆస్పత్రి ల్యాబ్‌లో పనులు చేస్తున్నారు. తనిఖీలు నామమాత్రం.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నామమాత్రంగా చేయడంతో ప్రైవేట్ క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. అందినకాడికి ఫీజులు వసూలు చేయడం, అనవసర మందులు కొనుగోలు చేసే విధంగా చూస్తున్నారు. రోగి ప్రాణభయంతో గత్యంతరం లేక డబ్బులు దారపోస్తున్నారు. మూడు నెలలకోసారైన వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అక్కడ ఏ విధంగా వైద్యం అందుతుంది.. వసతులు ఉన్నాయా.. లేదా.? వైద్యుడు ఉన్నాడా లేడా.? అనే అంశాలపై అరా తీయాలి. కానీ ఇవేమి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు పుట్టుకొస్తున్నారు. బృందం ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తాం జిల్లాలోని ఆన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో వంద ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. వీటిన్నింటీని తనిఖీ చేస్తాం. ఇందుకు బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న వైద్యులు ఉన్నారా లేదా.? అర్హత గల ల్యాబ్ టెక్నిషీయన్ ఉన్నారా.. లేదా? అనేది చూస్తాం. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి. గ్లూకోజ్‌లు, ఇంజక్షన్లు వేయకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు ఉన్న వారే ఆస్పత్రులు నిర్వహించాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో అనవసర టెస్ట్‌లు చేస్తున్నారు నాకు ఇటీవల ఆరోగ్యం బాగా లేక ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. అంతంత మాత్రంగానే జ్వరం ఉన్నా.. అన్ని టెస్ట్‌లు చేశారు. దాదాపు రూ.3వేలు ఖర్చు అయింది. టెస్ట్‌లు అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు వచ్చాయి. అనవసరంగా పరీక్షలు నిర్వహించారు. – శ్రీనివాస్, తలమడుగు -
పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎంబీబీఎస్ పూర్తిచేసే వైద్యులు తప్పకుండా మూడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని వైద్యారోగ్య రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలా పనిచేయని వారి వైద్య డిగ్రీలను, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించింది. ఎంబీబీఎస్ వైద్యులు గ్రామాల్లో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని.. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ప్రజల అవసరాలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు మధ్య అగాధం నెలకొందని, ఈ పరిస్థితిని మార్చాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. దేశంలోని 23 రాష్ట్రాల్లో జనాభాకు తగినట్లుగా డాక్టర్లు, నర్సుల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. అందుకోసం దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్‌లు, 155 మెడికల్ కాలేజీలు నెలకొల్పాలని.. ఇందుకు అవసరమైన నిధుల్లో 60 శాతం కేంద్రం భరించాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ఎయిమ్స్‌లు, కాలేజీలు పూర్తయ్యాయని తెలిపింది. సబర్బన్ ఏరియాల్లో మెడిసిటీలు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో పెద్ద స్థాయి ఆస్పత్రులను తీసుకురావాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. మెడికల్ హబ్‌ల మాదిరిగా మెడిసిటీలు తీసుకురావాలని.. వీటిని గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేస్తే అక్కడకు డాక్టర్లు, నర్సులు వెళ్తారని పేర్కొంది. మెడిసిటీలలో పూర్తిస్థాయిలో ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఆరోగ్య రంగంలో నాణ్యతను పెంచాలని, రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని, దీని ఆధారంగా ఆస్పత్రులకు ర్యాంకులు ఇవ్వాలని ప్రతిపాదించింది. ర్యాంకులకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని సూచించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో 8 శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేఘాలయ (9.1%), ఢిల్లీ (13.7%), పాండిచ్చేరి (8.6%) రాష్ట్రాలు మాత్రమే ఆ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నాయని, మిగతా రాష్ట్రాలు 8 శాతం కంటే తక్కువే ఇస్తున్నాయని తెలిపింది. జీడీపీలో ఆరోగ్య రంగానికి 1.5 శాతమే కేటాయింపు ఉందని, వచ్చే రెండేళ్లలో 2.5 శాతానికి పెంచాలని, 2025 నాటికి 5 శాతానికి చేరుకోవాలని సూచించింది. చాలా దేశాలు 5 శాతానికిపైగా కేటాయిస్తున్నాయని వివరించింది. ప్రజలు ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చులో 62.4 శాతాన్ని సొంతంగానే ఖర్చు చేస్తున్నారని.. ఈ విషయంలో మన దేశం 15వ స్థానంలో ఉందని తెలిపింది. ఏటా ఆరోగ్య ఖర్చులు భరించలేక 4.16 శాతం మంది పేదరికంలోకి వెళ్తున్నారని స్పష్టం చేసింది. ఇష్టమైన వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటు ఇప్పటికే ట్రయల్స్‌లో ఉన్న కరోనా వ్యాక్సిన్లను ప్రోత్సహించాలని.. సమగ్రంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. ప్రజలు తమకు ఇష్టమైన కంపెనీలకు చెందిన కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటు కల్పించాలని.. కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులకు చికిత్స చేసే క్లినిక్‌లను నెలకొల్పాలని సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్ మాత్రమే ఇలా ఒక క్లినిక్‌ను నెలకొల్పిందని, అలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో కరోనా కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులు రూ. 14 వేల కోట్ల మేర నష్టపోయాయని.. కరోనా కాలంలో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 75 శాతం తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆపరేషన్లు తగ్గాయని, కీమోథెరపీ చికిత్స 64 శాతం తగ్గిందని వెల్లడించింది. నాన్ కోవిడ్ వైద్య సేవలు తగ్గాయని.. కరోనా మొదలైన మొదటి మూడు నెలల కాలంలో దేశంలో 4 లక్షల మంది చిన్నారులు ఇతర సాధారణ వ్యాక్సిన్లు వేయించుకోలేకపోయారని పేర్కొంది. కంటి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు 90 శాతం తగ్గాయని వివరించింది. కమిటీ నివేదికలోని మరికొన్ని అంశాలు ►మన దేశంలో 10.6 శాతం మంది ఏదో రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారికి అవసరమైన చికిత్స అందించే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, ఆశ వర్కర్లు తక్కువగా ఉన్నారు. కాబట్టి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా నిధులతో మానవ వనరులను పెంచాలి. ►ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలి. ►కేన్సర్‌పై పీపీపీ పద్ధతిలో పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏ ఏరియాలో ఏ రకంగా కేన్సర్ వస్తుందో గుర్తించాలి. దేశంలో 39 క్యాన్సర్ ఆస్పత్రులు నెలకొల్పాలి. ►జంతు సంబంధిత మానవ వ్యాధులు మరింతగా పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగ మించడానికి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ►దేశంలో కేవలం 13 వైరస్ జబ్బుల పరిశోధన కేంద్రాలు (వీఆర్డీఎల్) ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. ►వైద్యులకు కరోనా వస్తే వాళ్లకు ప్రత్యేకంగా సె లవు ప్రకటించాలి. ప్రోత్పాహకాలు ఇవ్వాలి. ఉన్నత చదువులకు వెళితే సాయం చేయాలి. -
రాష్ట్రంలో డాక్టర్లు 52,341
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఇప్పటివరకు 52,341 మంది వైద్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 34,546 మంది ఎంబీబీఎస్ వైద్యులు కాగా 17,795 మంది స్పెషలిస్టులున్నారు. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 7,491 మంది వైద్యుల పేర్లు నమోదయ్యాయి. విశాఖ, కృష్ణా జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లా నుంచి 1,172 మంది పేర్లు నమోదయ్యాయి. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారిలో 12.67 % మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. ఏడాదిన్నరలో భారీగా నియామకాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 1,550 మంది వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టింది. వీరిలో స్పెషలిస్టు వైద్యులే 695 మంది ఉన్నారు. మరో 700 మంది ఎంబీబీఎస్ డాక్టర్లున్నారు. మిగతా వారు డిప్లొమాతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. -
సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు..
ఇంటర్ చదివి ఎంబీబీఎస్‌గా చెలామణి అవుతున్నారు. కత్తెర పట్టి ఆపరేషన్లు చేసేస్తున్నారు. విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్లు ఎక్కిస్తున్నారు. రోగం ఏదైనా హైడోస్ యాంటీ బయాటిక్‌లు ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నకిలీ డాక్టర్లు. నగరంలో నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా మారిన వందలాది మంది వైద్యరంగంలో స్థిరపడి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. గల్లీలు, బస్తీలు, కాలనీలే టార్గెట్‌గా దొంగ వైద్యులు క్లినిక్‌లు ఓపెన్ చేస్తున్నారు. అమాయకులైన నిరుపేదలను మోసం చేస్తూ వైద్యం పేరిట దండుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో వందకు పైగా నకిలీ డాక్టర్లు ఉన్నట్లు ఇటీవల వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదులు అందాయి. ఇంకా అనధికారికంగా మరో వంద మంది వరకు నకిలీ డాక్టర్లు ఉండొచ్చని అంచనా. ఫిర్యాదులు ఎక్కువవడంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ దీనిపై విచారణకు ఆదేశించగా ఇప్పుడు నగరవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నకిలీ వైద్యులు హల్చల్ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ ఫెయిలైన వారు సైతం ఎంబీబీఎస్ చేశామని చెప్పుకుంటూ క్లినిక్‌లు తెరుస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వార్డు బాయ్‌లుగా చేసిన వారు సైతం వైద్యుడి అవతారం ఎత్తుతున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ, ఎంబీబీఎస్ వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన విశ్వనగరంలో వందకుపైగా నకిలీ వైద్యులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. మూడు రోజుల నుంచి నగరంలోని ఆయా క్లినిక్‌లలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వారి వద్ద ఉన్న మెడికల్ సర్టిఫికెట్లు, ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరీక్షిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వస్తున్నట్లు తెలిసి..వీరిలో కొంతమంది క్లినిక్‌లకు తాళాలు వేసి.. తప్పించుకుని తిరుగుతుండటం గమనార్హం. పేదల బస్తీలే వీరి టార్గెట్... గ్రేటర్ శివారు ప్రాంతాల్లో పేదలకు ఎక్కువగా నివసించే బస్తీలను ఈ నకిలీ వైద్యులు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఆరోగ్యంపై కనీస అవగాహన లేని వారికి హైడోస్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు, సిరప్లు ఇచ్చి ఎంతో హస్తవాసి ఉన్న వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఈ హైడోస్ మందులు వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి విముక్తి లభించినప్పటికీ...భవిష్యత్తులో కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత సీనియర్ వైద్యులు ఇచ్చిన మందులు కూడా పని చేయకుండా పోతున్నాయి. ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, నాగోలు, బండ్లగూడ, యాంజాల్, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, మీర్పేట్, నాదర్గుల్, బోడుప్పల్, నారపల్లి, కీసరమండల పరిధిలోని రాజీవ్‌గృహకల్ప రోడ్, ఆల్విన్‌కాలనీ, నానక్‌రాంగూడ, కుషాయిగూడ, ఉప్పల్, కాప్రా, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, రామంతాపూర్‌లలో వందకుపైగా నకిలీ వైద్యులు ఉన్నట్లు ఇటీవల ఫిర్యాదులు అందాయి. డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో సర్టిఫికెట్లు.. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న పలు డీమ్డ్ వర్సిటీల నుంచి వీరు సర్టిఫికెట్లు పొందుతున్నట్లు ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టైన వ్యక్తుల ద్వారా పోలీసులు గుర్తించారు. ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులు చదవక పోయినా..ఆస్పత్రుల్లో, ఫార్మా కంపెనీల్లో పని చేసిన అనుభవంతో పేరుకు ముందు డాక్టర్ అనే ట్యాగ్‌ను తగిలించుకుంటున్నారు. క్లినిక్‌లకు వచ్చిన వారి నుంచి ఫీజు రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా సెలైన్లు ఎక్కించి రూ.వేలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో నకిలీ వైద్యుడు రోజుకు సగటున 30 నుంచి 40 మందికి చికిత్స అందిస్తుండటం గమనార్హం. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ క్రాస్ ప్రాక్టీస్ ఆయుర్వేద, యునానీ, హోమియోపతి కోర్సులు పూర్తి చేసిన వారికి సరైన ప్రాక్టీస్ లేదు. దీంతో వీరు అల్లోపతి వైద్యులుగా అవతారం ఎత్తుతున్నారు. ఈ వైద్యుల్లో ఉన్న బలహీనతను బస్తీల్లో వెలసిన క్లినిక్‌లు మాత్రమే కాదు..బడా కార్పొరేట్ ఆస్పత్రులు సైతం అవకాశంగా తీసుకుంటున్నాయి. అల్లోపతి వైద్యులతో పోలిస్తే..వీరి వేతనాలు కూడా చాలా తక్కువ. దీంతో వారిని డ్యూటీ డాక్టర్లుగా నియమించుకుంటున్నారు. వీరు కేవలం రాత్రి పూట మాత్రమే విధుల్లో ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగి చెప్పిన విషయాలన్నీ రాసుకుని, క్రాస్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసినట్లు చెబుతున్న వారు నేషనల్ మెడికల్ కమిషన్ పరీక్ష రాయకుండా ప్రాక్టీస్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారు ఒక్క జియాగూడలోనే పది మంది వరకు ఉండటం గమనార్హం. నకిలీ వైద్యులపై కేసులు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు తమ మెడికల్ సర్టిఫికెట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ప్రాక్టీస్ ప్రారంభిస్తారు. వీరితో పెద్దగా సమస్య ఉండదు. చాలా మంది వివిధ వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి గుట్టుచప్పుడు కాకుండా వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులపై చీటింగ్ కేసుతో పాటు డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్(1940) సెక్షన్ 27 సహా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 సెక్షన్ 15, 16ల కింద కేసు నమోదు చేస్తారు. వైద్యులు లేకపోవడం వల్లే.. జనాభాకు తగినట్లుగా వైద్యుల సంఖ్య లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి పదివేల మందికి కనీసం 30 మంది వైద్యులు ఉండాలి. కానీ మన దేశంలో 1400 మందికి ఒక్కరే ఉన్నారు. దీనివల్ల నకిలీ డాక్టర్ల బెడద పెరిగింది. వెంటనే డాక్టర్పోస్టుల్ని భర్తీ చేయాలి. ప్రభుత్వం స్పందించి ప్రజారోగ్యాన్ని ప్రజలకు చేరువ చేయాలి. – డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ డాక్టర్, నిమ్స్ ప్రమాదకరం నకిలీ వైద్యులకు సరైన పరిజ్ఞానం లేక రోగికి ప్రమాదకరమైన మందులు ఇస్తున్నారు. ఇవి వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. వీరు ఇచ్చే నొప్పి మాత్రలకు అలవాటుపడిన రోగులు చివరకు అవి లేకుండా నిద్రపోని పరిస్థితికి చేరుకుంటున్నారు. యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం మంచిది కాదు. నకిలీ డాక్టర్లకు వెంటనే ముకుతాడు వేయాలి. – డాక్టర్ లోహిత్ చదివింది ఇంటరే.. మీర్‌పేట టీఎస్ఆర్నగర్కు చెందిన సాయికుమార్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి, సంతోష్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా చేరాడు. ఆ తర్వాత మీర్‌పేట క్రాస్‌రోడ్‌లో తానే స్వయంగా ఓ క్లినిక్‌ను ప్రారంభించాడు. తాను ఎంబీబీఎస్ వైద్యుడినని చెప్పుకుంటూ స్థానికులకు వైద్యం చేస్తున్నాడు. విషయం బయటకు పొక్కడంతో ఇటీవల ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యుడి వద్ద అసిస్టెంటే.. తాను సీనియర్ వైద్యుడినని, ఎంతో మంది ఉన్నత వ్యక్తులు తనకు తెలుసని చెప్పుకుంటూ ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించాడు తేజ. బెంగళూర్‌లోని ఓ వైద్యుడి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన ఇతడు.. మేడిపల్లిలో ఓ క్లినిక్‌ను తెరిచాడు. బస్తీవాసులకే కాకుండా పోలీసులకు సైతం వైద్యం చేశాడు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్, పోస్టు కోవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తానని చెప్పి రాచకొండ పోలీసులను ఆశ్రయించి చివరకు మూడు నెలల క్రితం పట్టుబడ్డాడు. మైక్రోబయాలజీ స్టూడెంట్.. నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివిన ఒడిశాకు చెందిన సుప్రజిత్ పండా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉప్పల్ హనుమాన్ సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కమ్యూనిటీ కార్డియాలజీ సెంటర్ పేరుతో ఓ క్లినిక్‌ను తెరిచాడు. విదేశాల్లో డాక్టర్ కోర్సు చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. ఆశించిన స్థాయిలో రోగులు రాకపోవడంతో వరల్డ్‌హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో ఎం.ఎస్ కార్డియాలజీ ఇన్ ఫెలోషిప్ ఐడీ కార్డును సృష్టించి ఏకంగా గాంధీ ఆస్పత్రిలో పట్టుబడ్డాడు. -
నకిలీ డాక్టర్ల ఆటకట్టు
పలమనేరు: ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని వైద్యం అందిస్తున్న నకిలీ ఎంబీబీఎస్ డాక్టర్ల ఆట కట్టించిన సంఘటన గంగవరం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. నాలుగురోడ్లు గ్రామం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రి సేవలు కావాలంటే సమీపంలోని పత్తికొండ లేదా పలమనేరు ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలోని ప్రజలు అక్షరాస్యత తక్కువగానే ఉంది. దీన్ని గమనించిన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ఎల్డూర్‌కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి తాను ఎంబీబీఎస్ డాక్టర్‌నంటూ గ్రామంలో ఆర్వీ క్లినిక్ పేరిట మూడు నెలల క్రితం హైవేకు ఆకునుని ఆస్పత్రి ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఏమైందో కానీ అతను ఉన్నట్టుండి మాయమయ్యాడు. అదే ఆస్పత్రిలో మహేంద్ర అనే కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి తాను ఎంబీబీఎస్ డాక్టర్‌నంటూ వైద్యం అందించడం మొదలుపెట్టాడు. అనుభవం, చదువు లేక కనీసం నాడి కూడా తెలియని మహేంద్ర సేవలపై అనుమానం వచ్చిన కొందరు రోగులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గంగవరం మండల వైద్యాధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పత్తికొండ పీహెచ్సీ వైద్యులు డాక్టర్ యుగంధర్ బుధవారం ఆ క్లినిక్‌ను తనిఖీ చేశారు. డాక్టర్‌గా చెలామణి అవుతున్న మహేంద్ర అసలు డాక్టరే కాదని, అతనికి ఏమాత్రం అనుభవం లేదని తేలింది. క్లినిక్‌లో ల్యాబ్, రోగులకు బెడ్లు, అక్కడే మందులు ఉండడాన్ని చూసి విస్తుపోయారు. క్లినిక్‌ను సీజ్ చేసి, అక్కడున్న బోర్డులను తొలగించారు. మహేంద్ర, శివకుమార్‌పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్టు వారు తెలిపారు. ప్రజలు ఇలాంటి వారిని నమ్మకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని సూచించారు. -
బతికించేవారే.. బతకలేక..
జనాలచేత దేవుడిలా పిలిపించుకునే ఆ వృత్తి పట్ల విపరీతమైన మక్కువ.. చిన్నప్పుడే ఎవరైనా నువ్వు ఏం అవుతావని అడిగితే డాక్టర్ అని చెప్పేవారే ఎక్కువ.. అలాంటిది ఇప్పుడు ఎంబీబీఎస్ చదివినవారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లక్షలు పోసి ఎంబీబీఎస్ చదివినా.. పీజీ సీటు రాకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఫలితంగా పెళ్లి కూడా కాకపోవడం.. మరోవైపు కన్నవాళ్లకు భారమయ్యామనే ఆవేదనలో కూరుకుపోతున్నారు. దీంతో ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సినవారు.. చేజేతులా ప్రాణాలు తీసుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన హర్షకుమార్.. 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యా యుడు కావడంతో ఎలాగైనా తన కొడుకును డాక్టర్‌గా చూడాలనుకొని హర్షకుమార్‌ను అప్పట్లో రూ.40 లక్షలు అప్పు చేసి మేనేజ్మెంట్ కోటా కింద ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేర్పించాడు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీ సీటు రావడం గగనంగా మారింది. దీంతో అప్పులు, వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. పైసా సంపాదన లేదు. దీంతో తండ్రికి భారంగా మారాననే భావనతో హర్షకుమార్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు మెడికల్ షాపు ఉంది. కొడుకు సంజయ్‌కుమార్‌ను డాక్టర్‌గా చూడాలనుకుని మేనేజ్మెంట్ కోటా కింద రూ.50 లక్షలతో ఓ ప్రముఖ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయించాడు. 2016లో ఎంబీబీఎస్ పూర్తయింది. ఆ తర్వాత సంజయ్‌కుమార్ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ క్లినికల్ సబ్జెక్టులో సీటు రాలేదు. పైగా తండ్రి అప్పు చేసి చదివించడం, 30 ఏళ్లు దగ్గరవుతున్నా పెళ్లి కాకపోవడంతో గతేడాది ఆ యువ వైద్యుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్‌బాబు వరంగల్ జిల్లాలో వ్యవసాయం చేస్తాడు. మధ్య తరగతి కుటుంబం. కొడుకు అరవింద్ తెలివైన విద్యార్థి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో కన్వీనర్ కోటా కింద సీటు వచ్చింది. ఫీజు తక్కువే కావడంతో కుటుంబం మొత్తం ఎంతో ఆనందపడింది. ఎంతో ఉత్సాహంగా అరవింద్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తర్వాత మెడికల్ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ సీటు రాలేదు. పెళ్లి కూడా కాలేదు. దీంతో అవమాన భారం భరించలేక తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లిన అరవింద్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పీజీ సీట్లు చాలా తక్కువ.. రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు 1,600 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో క్లినికల్ సీట్లు వెయ్యి వరకే ఉన్నాయి. మిగిలినవి నాన్ క్లినికల్ సీట్లు. వీటిల్లో ఎవరూ చేరరు. దీంతో వాటిల్లోని అనేక సీట్లు మిగిలిపోతాయి. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులు మరో వెయ్యికి పైగా ఉంటారు. అంటే ఏడాదికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసే వారు 6 వేల మంది ఉంటారు. ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మాత్రం ఆరో వంతే ఉన్నాయి. దీంతో ఏటా ఎంబీబీఎస్ చదివిన వారికి పీజీలో సీటు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. ఎంబీబీఎస్‌తో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైన జీతం లభించట్లేదు. వైద్య నిరుద్యోగులు రాష్టంలో పేరుకుపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దాదాపు 40 వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నారని అంచనా. దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. వాటి కోసం ఈ ఏడాది నీట్ పరీక్షకు ఏకంగా 1.4 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు హాజరయ్యారు. పీజీ స్పెషలైజేషన్ లేకపోతే సొంత క్లినిక్ పెట్టుకోవడానికి, కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసేందుకు అవకాశం ఉండదు. పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.15 నుంచి రూ.20 వేల జీతమే ఇస్తారు. డిప్రెషన్లోకి.. పీజీ సీటు రాకపోవడం, ఎంబీబీఎస్ చదువు దేనికీ పనికిరాకపోవడంతో యువ వైద్యులు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రెండు ఎంబీబీఎస్ సీట్లకు ఒక పీజీ సీటు ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణ రూపం దాల్చట్లేదు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వారు అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మన దేశంలో ఎగ్జిట్ అర్హత పరీక్ష పాస్ కావడమే గగనంగా మారింది. 2015–2018 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 61,500 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్ష రాశారు. వీరిలో 8,700 మంది మాత్రమే పాసయ్యారు. అంటే కేవలం 14.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎగ్జిట్ పరీక్ష పాసైన వారిలో పీజీ సీటు పొందేవారు 5 శాతం కూడా ఉండట్లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. స్తోమత లేకున్నా చదివిస్తున్నారు.. కొందరు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమత సహకరించకున్నా వైద్య విద్యపై పిచ్చితో పిల్లలను ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. మేనేజ్మెంట్ సీటుకు రూ.కోటి వరకు పెట్టి చదివించే పరిస్థితి నెలకొంది. భూమి అమ్మడం లేదా అప్పులు చేయడం ద్వారా తమ పిల్లలను చదివిస్తున్నారు. గతంలో ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఏడాది వాయిదా ఉండటంతో మొదటి ఏడాది ఎలాగోలా చెల్లించి.. రెండో ఏడాది చూద్దాంలే అని చదివిస్తున్నారు. కానీ రెండో సంవత్సరం వచ్చే సరికి ఫీజు చెల్లింపు తలకు మించిన భారం అవుతోంది. తెచ్చిన అప్పుల భారం పెరిగిపోతోంది. కొందరైతే చివరి రెండు వాయిదాలు చెల్లించలేక మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. పీజీ కోసం రెండు మూడేళ్లుగా కోచింగ్ తీసుకునే వారెందరో ఉన్నారు. కోచింగ్ ఫీజులు, ఖర్చులు భారంగా మారుతున్నాయి. చివరకు ఫలితం అనుకూలంగా రాకపోవడంతో డిప్రెషన్‌కు లోనవుతున్నారు. కలలు కల్లలవుతున్నాయి: డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు పీజీ సీట్లు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్తున్నారు. తల్లిదండ్రులు స్తోమతకు మించి అప్పులు చేసి మేనేజ్మెంట్ సీట్లలో చేర్పించడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్లో చేశాక, పీజీ మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనడం అంటే సాధారణ మధ్య తరగతి వారికి అసాధ్యం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల సామర్థ్యాన్ని గమనించాలి. అప్పులు చేయడం సరికాదు. పీజీ రాకుంటే డిప్రెషన్లోకి: డాక్టర్ విజయేందర్, జూడాల నేత వేలాది మంది అప్పులు చేసి ఎంబీబీఎస్ చదివిన వారు తర్వాత పీజీ రాక డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన జీతాలు ఇవ్వట్లేదు. బయట క్లినిక్ పెట్టుకునే అవకాశాల్లేవు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కావట్లేదు. ఇవన్నీ కలిపి యువ వైద్యులను తీవ్ర డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలనూ నింపట్లేదు. -
మేం పీజీ చేయొద్దా?
సాక్షి, హైదరాబాద్: ఇన్ సర్వీస్ కోటా రద్దుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేళ్లుగా వందల మంది సర్వీసులో ఉండగా, పీజీ వైద్య విద్య చదివేందుకు వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో 51 మంది మాత్రమే సర్వీసులో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులు అర్హత సాధించారు. గతంలో ఇన్ సర్వీస్ కోటా ఉన్న సమయంలో దాదాపు 150 మందికి పైగా పీజీ వైద్య సీట్లు సాధించేవారు. దీనిపై వైద్యులు, సంఘాలు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ప్రభుత్వ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల్లో పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్యులు, స్పెషలిస్టులను పెద్ద ఎత్తున నియమించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇన్‌సర్వీస్ పీజీ కోటాను ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో 11 రాష్ట్రాలు ఇన్ సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయి. దీనిద్వారా చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అయితే నీట్ పరీక్షలను తీసుకురావడంతో మొత్తం వ్యవహారం తలకిందులైంది. ఫలితంగా ప్రభుత్వ వైద్యులకు కల్పిస్తున్న ఇన్‌సర్వీస్ పీజీ కోటా రద్దు చేశారు. డిప్లొమా కోర్సులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి మెడికల్ డిగ్రీ కోర్సులకు ఏడాదికి 10 శాతం వెయిటేజీ కల్పించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. ఎంబీబీఎస్‌తో ఉద్యోగానికి వెళ్తే అంతేనా? ఎంబీబీఎస్ చేశాక పీహెచ్‌సీల్లో, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగానికి వెళ్లాక, ఉన్నత చదువులు చదవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఐదారేళ్లు పనిచేశాక ‘నీట్’పరీక్ష రాయాలంటే అకడమిక్ వాతావరణం నుంచి కాస్త దూరం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉండట్లేదు. దీంతో వైద్య విద్యలో ఉన్నత చదువులకు దూరం కావాల్సి వస్తుందని ప్రభుత్వ ఎంబీబీఎస్ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌సర్వీస్ కోటా రద్దు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇదే పరిస్థితి పదేళ్లు కొనసాగితే దేశంలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రారని, ప్రభుత్వ వైద్యుల సంఖ్య తగ్గుతుందని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు. ఇన్ సర్వీస్ కోటా రద్దుపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. -
ఫీజు కోటి.. జీతం పాతిక వేలు!
డాక్టర్ నరేందర్. 2017లో ఎంబీబీఎస్ చేశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలో దాదాపు రూ.60 లక్షల వరకు డొనేషన్ చెల్లించి మరీ వైద్యవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇంత కష్టపడి ఎంబీబీఎస్ పూర్తిచేసినా.. ఆసుపత్రిలో ఇస్తున్న వేతనం రూ.25 వేలు మాత్రమేనని ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ నరేష్. 2016లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. రెండుసార్లు పీజీ రాసినా రాలేదు. తాజాగా మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. ఎంబీబీఎస్ డిగ్రీతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇందుకు ఆయన పొందుతున్న వేతనం రూ.30 వేలు. లక్షల రూపాయల బ్యాంకు రుణం తీసుకొని ప్రైవేటులో పీజీ చేసినా తర్వాత ఆ రుణం చెల్లించే స్థాయిలో వేతనం వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్ అబ్దుల్లా 2015లో ఎంబీబీఎస్ చదివారు. ఎండీ కోసం చదువుతున్నారు. రెండుసార్లు పరీక్ష రాసినా రాలేదు. ప్రభుత్వం వైద్యుల నియామకాలు చేపట్టకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. తనకు ఎంసెట్‌లో 2వేల ర్యాంకు వచ్చి కన్వీనర్ కోటాలో సీటు పొందినా.. ఇప్పుడు పెద్దగా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ఎంబీబీఎస్ చదివిన విద్యార్థుల ఆవేదన. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసినా.. బతుకుదెరువు సమస్యగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప వేతనాలు కనీస స్థాయిలో కూడా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. కొందరు రూ.50–60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎంబీబీఎస్ కోసం డొనేషన్ చెల్లించారు. ఫలితం ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇస్తున్న వేతనం ఈ స్థాయిలో దారుణంగా ఉండటంతో.. ఎందుకు వైద్యరంగాన్ని ఎంచుకున్నామా? అని అని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో డిమాండ్‌కు సరిపడినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతుందంటున్నారు. మండలాలు, గ్రామాల్లో ప్రాక్టీస్ పెట్టినా స్థానికంగా ఉండే సమస్యలతో సతమతం అవుతున్నామని అంటున్నారు. ఎంబీబీఎస్ చదువు కోసం, డొనేషన్లు కట్టేందుకు అనేకమంది తల్లిదండ్రులు వడ్డీలకు డబ్బులు తెచ్చారు. వాటిని తిరిగి వడ్డీలతో కలిపి చెల్లించేందుకు కూడా ఎంబీబీఎస్ చదువు పనికిరావడం లేదంటున్నారు. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు అనేకమంది ఎంసీఐ అర్హత పరీక్ష పాసు కాకపోవడంతో వారికి ఇస్తున్న వేతనాలు రూ.20 వేలకు కూడా మించడంలేదు. దీంతో వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. పీజీ సీట్లు రాక ఇబ్బందులు రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 3,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు మాత్రం సగం కూడా లేవు. ఇప్పుడు నీట్ ద్వారా నింపుతుండటంతో దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్ సీట్లున్నాయి. వీటికోసం గత నెల జరిగిన నీట్–2019 పరీక్షకు ఏకంగా 1.40 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు రాశారు. ఇంత పోటీని తట్టుకుని పీజీ సీటు కొట్టడం ఆషామాషీ కాదు. రాష్ట్రంలోని ఎంబీబీఎస్, పీజీ సీట్లను పోలిస్తే.. ప్రతీ ఏడాది దాదాపుగా 2వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పీజీ చేయలేకపోతున్నారు. వీరికితోడు చైనా, ఉక్రెయిన్, పిలిప్పీన్స్ తదితర దేశాల్లో చదివిన వారూ పోటీలో ఉంటున్నారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ చదవకుంటే మార్కెట్లో కనీస గుర్తింపు ఉండడంలేదు. కేవలం ఎంబీబీఎస్‌తో వృత్తిలో ఎదిగే పరిస్థితి లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటులో పీజీ చేయాలన్నా కోట్లలో డొనేషన్లు చెల్లించాల్సి వస్తుంది. పీజీలో సీటు రాక, ఎంబీబీఎస్ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిలో తక్కువ వేతనాలకు పనిచేయక తప్పని దుస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవకాశాలు లేవు ప్రైవేటులో పరిస్థితి ఇలాగుంటే ప్రభుత్వ రంగంలో పనిచేద్దామంటే భర్తీలు లేవని ఎంబీబీఎస్ డాక్టర్లు అంటున్నారు. తెలంగాణలో 2017లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) 500 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం 5వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 1,150 పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అటు పీజీ సీటు రాక, ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాక తాము చేసేదేమీ లేదంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే రూ.25 వేలు.. ఇంటి అద్దె, తిండికి కూడా సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ‘ప్రతి పల్లెలో అంగన్వాడీ కేంద్రం ఉంది. పంచాయతీ కార్యాలయం ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్న క్లీనిక్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేలకు పైగా గ్రామాలుంటే.. కేవలం దాదాపు 700 పీహెచ్‌సీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీలను పెంచాల్సిన అవసరం ఉందని వైద్యులంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ఆ లెక్కలను ప్రభుత్వాలు మరిచిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎంబీబీఎస్‌తో బతికేదెలా? ఎంబీబీఎస్ డాక్టర్లకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేతనాలు ఘోరంగా ఉంటున్నాయి. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు కాలేజీలో చదివినా ప్రయోజనం కనిపించడంలేదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోటి రూపాయల వరకు డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివించారు. చాలామంది కట్టిన ఫీజుకు వడ్డీలు కట్టుకోలేక.. బతకడానికి డబ్బులు లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలా పోషించుకోవాలి? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ, ఆరోగ్య ఖర్చులు ఎలా భరించాలి? ఒకవేళ గ్రామాల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేయాలన్నా అనేకమంది అర్హత లేనివాళ్లు స్థానికంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిని నియంత్రించడంలేదు. ఎంబీబీఎస్ డాక్టర్లకు వంద నిబంధనలున్నాయి. అర్హత లేని వైద్యులకు అలాంటివేమీ లేదు. తప్పు చేస్తే శిక్ష విధించడం లేదు. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి, గవర్నర్ జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. – డాక్టర్ పీఎస్ విజయేందర్, అధ్యక్షుడు, టీఎస్ జూడా అవకాశాలు తక్కువ! కేవలం ఎంబీబీఎస్‌తో బయట అవకాశాల్లేని మాట వాస్తవమే. పైగా పీజీ మెడికల్ సీట్లు కూడా ఎంబీబీఎస్‌తో సమానంగా ఉండవు. కాబట్టి ఉన్న ఎంబీబీఎస్‌తోనే ముందుకు సాగాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్కువ వేతనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అందరూ హైదరాబాద్‌లోనే ఉండాలన్న భావనే. దీంతో డిమాండ్ తగ్గి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తయినవారు గ్రామాలకు వెళ్లి ప్రాక్టీసు చేస్తే ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది. కానీ చాలామంది తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవడంలేదు. అందరూ నగరానికే పరిమితమైతే అవకాశాలు ఎలా వస్తాయి? – డాక్టర్ రమేష్‌రెడ్డి, వైద్య విద్యా సంచాలకులు -
డాక్టర్ భరత్.. ఇంటర్మీడియట్!
సాక్షి, కర్నూల్ : ఆ యువకుడు చదివింది ఇంటర్మీడియట్. రష్యాలో ఎంబీబీఎస్ చేశానని చెప్పుకుని కర్నూలులోని అమ్మ హాస్పిటల్లో చేరాడు. క్యాజువాలిటీకి వచ్చిన రోగులకు అత్యవసర వైద్యం అందిస్తూ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. ఇక్కడే కాదు నగరంలోని మరో కార్పొరేట్ ఆసుపత్రిలోనూ డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం అతన్ని వలపన్ని పట్టుకున్నారు. నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ ఆకుల హుసేనయ్య కుమారుడు ఆకుల భరత్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రి వద్ద వైద్యం గురించి తెలుసుకున్న అతను ఏకంగా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారమెత్తాడు. కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్డులో ఉన్న అమ్మ హాస్పిటల్లో 2017 మార్చిలో చేరాడు. అప్పటి నుంచి క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం అతనికి నెలకు రూ.25 వేల జీతం ఇస్తోంది. అతన్ని విధుల్లోకి తీసుకునే ముందు బయోడేటా మాత్రమే చూశామని, ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకోలేదని, మళ్లీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. భరత్ ఇక్కడే గాకుండా నగరంలోని మరో కార్పొరేట్ ఆసుపత్రిలోనూ సాయంత్రం పూట క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్‌గా కొనసాగుతున్నాడు. విజిలెన్స్ అధికారులకు పట్టుబడింది ఇలా... ఆకుల భరత్‌పై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్వీఈవో శివకోటి బాబూరావు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎ.దేవదానం మూడురోజులుగా తన సిబ్బందితో ఆసుపత్రిపై నిఘా పెట్టించాడు. సిబ్బందిలో కొందరిని రోగులుగా భరత్ వద్దకు పంపించాడు. వారికి భరత్ మందులు, పరీక్షలు రాసి దొరికిపోయాడు. ఈ మేరకు సోమవారం అతన్ని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని అర్హతల గురించి ఆరా తీయగా.. తాను విజయవాడలో ఇంటర్ వరకు చదువుకున్నానని, రష్యాలో ఎంబీబీఎస్ చేశానని చెప్పాడు. కానీ భరత్ వద్ద ఎలాంటి విద్యార్హత సర్టిఫికెట్లు లేవు. విషయం తెలుసుకున్న అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సరస్వతీదేవి, డెమో ఎర్రంరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. అలాగే రిజిస్ట్రేషన్ ఒకదానికి చేసి మరొక స్కానింగ్ యంత్రం వాడుతుండడంతో దాన్ని సీజ్ చేశారు. దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ దేవదానం, ఎఫ్ఆర్వో ఖాన్, ఎంపీడీవో లలితాబాయి, అగ్రికల్చర్ ఏడీ వెంకట్, ఏఏవో గణేష్, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఇంజెక్షన్ వేయడం రాదన్న ప్రభుత్వ వైద్యురాలు
ఈ వ్యవహారం తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఎంబీబీఎస్ పూర్తిచేసి, నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టరమ్మకు సూది వేయడం తెలియదట. ఎప్పు డూ సూదే వేయలేదట. ఎక్కడో మారుమూల కుగ్రామంలో కాదు.. రాజధానికి కూతవేటు దూరంలోనే ఈ వింత వెలుగుచూసింది. దొడ్డబళ్లాపురం: ‘నాకు ఇంజెక్షన్ చేయడం రాదు. రేపు రండి. ఇవాళ నర్స్ రాలేదు. ఇంజక్షన్ ఎంతివ్వాలి, ఎలా ఇవ్వాలో నిజంగా నాకు తెలియదు.’ ఇలా అన్నది ఏ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టరో, రోడ్డుపక్కన క్లినిక్ నడుపుకునే ఆర్‌ఎంపీనో కాదు. సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నియమించిన ఎంబీబీఎస్ డాక్టరు. బెంగళూరు సమీపంలో దేవనహళ్లి తాలూకా కొయిరా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రి వైద్యురాలు రశ్మి ఇంజక్షన్ చేయడం రాదని రోగులకు చెప్పడంతో పెద్ద గందరగోళమే రేగింది. సోమవారంనాడు గ్రామంలోని చిక్కేగౌడ నాలుగేళ్ల కూతురికి కుక్క కరిచింది. కూతురికి ఇంజెక్షన్ ఇప్పిద్దామని ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. అయితే డాక్టర్ రశ్మి తనకు సూది వేయడం రాదని, అందులోనూ కుక్క కరిచిన వారికి ఇంతవరకూ సూది వేయలేదని చెప్పారు. నర్స్ ఈరోజు రాలేదు..రేపు రండి అని చెప్పారు. రెండోరోజూ అదే తంతు మళ్లీ మంగళవారం కూతురిని తీసుకుని చిక్కేగౌడ ఆస్పత్రికి వెళ్లాడు. ఈసారి సూది వేయాల్సిందేనని చిక్కేగౌడ పట్టుబట్టడంతో డాక్టర్ రశ్మి ఏడుపు అందుకున్నారు. తాను ఇంతవరకూ ఎప్పుడూ ఇంజెక్షన్ చేయలేదని, మోతాదు వివరాలు కూడా తెలియవని చెప్పారు. ఆస్పత్రిలో ఇన్నాళ్లూ నర్సే ఇంజెక్షన్లు వేస్తోందని చెప్పడంతో చిక్కేగౌడ బిత్తరపోయాడు. ఇలా మంగళవారం కూడా ఆస్పత్రికి వచ్చిన రోగులను వెనక్కు పంపడం జరిగింది. చిక్కేగౌడ గ్రామస్తులకు విషయం చెప్పడంతో గ్రామస్తులంతా కలిసి ఆస్పత్రి ముందు బైఠాయించి వైద్యం చేయడం రాని డాక్టర్‌ను తక్షణం బదిలీ చేయాలని డిమాండు చేస్తూ ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న డీహెచ్ఓ రాజేశ్, పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని ఫోన్ ద్వారా హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డాక్టర్ రశ్మి గత నాలుగేళ్లుగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
2016 నుంచి విధిగా గ్రామీణ సర్వీసు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ వైద్య విద్య చదివిన డాక్టర్లు విధిగా ఏడాది పాటు గ్రామీణ సర్వీసు చేయాలన్న నిబంధన 2016 నుంచి అమలులోకి రానుంది. 2010లో ఎంబీబీఎస్‌లో చేరిన వారికి ఇది వర్తిస్తుంది. 2010లో ఎంబీబీఎస్‌లో చేరిన వారికి 2016లో వైద్య విద్య పూర్తవుతుంది. ప్రస్తుతం కూడా ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ చేసిన వారు గ్రామీణ సర్వీసు చేస్తున్నారు. అయితే ఈ మూడు కోర్సుల్లో భాగంగా ఎప్పుడో ఒకసారి గ్రామీణ సర్వీసు చేయడానికి వీలుంది. 2016 నుంచి మాత్రం ఎంబీబీఎస్ పూర్తవగానే కచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాలి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు జారీ చేసింది. గ్రామీణ సేవల్లో చేరని వారికి భారతీయ వైద్య మండలి(ఏపీ చాప్టర్)లో వైద్యుడిగా రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. కొత్త నిబంధన అమలు వల్ల ఎంబీబీఎస్ చేసిన వారు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అనంతరం మళ్లీ గ్రామీణ సేవలు చేయాల్సిన అవసరం ఉండదు.