సాక్షి, హైదరాబాద్: ఇన్ సర్వీస్ కోటా రద్దుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేళ్లుగా వందల మంది సర్వీసులో ఉండగా, పీజీ వైద్య విద్య చదివేందుకు వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో 51 మంది మాత్రమే సర్వీసులో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులు అర్హత సాధించారు. గతంలో ఇన్ సర్వీస్ కోటా ఉన్న సమయంలో దాదాపు 150 మందికి పైగా పీజీ వైద్య సీట్లు సాధించేవారు. దీనిపై వైద్యులు, సంఘాలు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ప్రభుత్వ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల్లో పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో వైద్యులు, స్పెషలిస్టులను పెద్ద ఎత్తున నియమించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇన్‌సర్వీస్ పీజీ కోటాను ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో 11 రాష్ట్రాలు ఇన్ సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయి. దీనిద్వారా చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అయితే నీట్ పరీక్షలను తీసుకురావడంతో మొత్తం వ్యవహారం తలకిందులైంది. ఫలితంగా ప్రభుత్వ వైద్యులకు కల్పిస్తున్న ఇన్‌సర్వీస్ పీజీ కోటా రద్దు చేశారు. డిప్లొమా కోర్సులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి మెడికల్ డిగ్రీ కోర్సులకు ఏడాదికి 10 శాతం వెయిటేజీ కల్పించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు.
ఎంబీబీఎస్‌తో ఉద్యోగానికి వెళ్తే అంతేనా?
ఎంబీబీఎస్ చేశాక పీహెచ్‌సీల్లో, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగానికి వెళ్లాక, ఉన్నత చదువులు చదవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఐదారేళ్లు పనిచేశాక ‘నీట్’పరీక్ష రాయాలంటే అకడమిక్ వాతావరణం నుంచి కాస్త దూరం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉండట్లేదు. దీంతో వైద్య విద్యలో ఉన్నత చదువులకు దూరం కావాల్సి వస్తుందని ప్రభుత్వ ఎంబీబీఎస్ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌సర్వీస్ కోటా రద్దు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇదే పరిస్థితి పదేళ్లు కొనసాగితే దేశంలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రారని, ప్రభుత్వ వైద్యుల సంఖ్య తగ్గుతుందని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు. ఇన్ సర్వీస్ కోటా రద్దుపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు.
మేం పీజీ చేయొద్దా?
Published Sat, Apr 6 2019 2:24 AM | Last Updated on Sat, Apr 6 2019 2:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment