
ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదు కాని మరణాలు ఇంకెన్నో
వైద్యసేవల్లో లోపాలే ఈ దుస్థితికి కారణం
ఆధునిక వైద్య వ్యవస్థ అందుబాటులో ఉన్నా.. తప్పని మరణాలు
ప్రభుత్వఆస్పత్రుల్లోనే 11 నెలల్లో 287 మాతృ మరణాలు
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే.. ఆ తల్లి క్షేమంగా తిరిగొస్తుందో లేదోననే భయం వెంటాడుతోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో నమోదవుతున్న మాతృ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆధునిక వైద్య వ్యవస్థ అందుబాటులో ఉన్నా.. మాతృ మరణాలు తప్పకపోవడం విస్తుగొలుపుతోంది.
నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన కవిత కర్నూలు జిల్లా కోసిగి మండలం చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. ఏడాది క్రితం ఆమెకు సచివాలయ ఉద్యోగి వినోద్‌తో వివాహం కాగా.. మూడు నెలల క్రితం ప్రసూతి సెలవులో భాగంగా సొంతూరు బానుముక్కల గ్రామానికి వెళ్లింది. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసవ సమయంలో హైబీపీ రావడంతో కవిత ఆస్పత్రిలోనే కన్నుమూసింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పురిటి సమయంలో వందల సంఖ్యలో తల్లులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 11 నెలల్లోనే (2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు) రాష్ట్రవ్యాప్తంగా 287 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ మరణాలు కేవలం ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదు కాని మరణాల సంఖ్య మరింత అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక వైద్య వ్యవస్థ అందుబాటులో ఉన్నా మాతృ మరణాలు అధికంగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
ట్రాకింగ్ సిస్టమే దారుణం
రాష్ట్రంలో గర్భిణుల ట్రాకింగ్ సిస్టం దారుణంగా ఉండటం, సకాలంలో వైద్యసేవలు అందకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా గర్భిణుల ట్రాకింగ్ సిస్టం సరిగా లేకపోవడం వల్లే ఈ దయనీయ పరిస్థితి తలెత్తుతోందని స్పష్టం చేస్తున్నారు. యాంటినేటల్ చెకప్‌కు వచ్చిన ప్రతి గర్భిణి ఇంటికి ఏఎన్‌ఎం క్రమం తప్పకుండా వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలి.
ఐరన్, ఫోలిక్ మాత్రలు ఇవ్వాలి. రక్తపోటు, మధుమేహం వంటివి పరీక్షించాలి. హైరిస్క్ ఉన్న గర్భిణులను రోజూ పర్యవేక్షించి, రెఫరల్ ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. అవసరమైతే ఇన్‌పేషెంట్‌గా చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. కొంతకాలంగా ఇవన్నీ సరిగా చేయకపోవడం వల్లే మాతృ మరణాలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం.
వైద్య ఆరోగ్య సిబ్బంది నా కుమార్తెను పట్టించుకోలేదు..
గత ఏడాది ఆగస్టులో నా చిన్న కుమార్తె లక్ష్మి బిడ్డ పుట్టాక ప్రాణాలు కోల్పోయింది. ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం చేయించాను. బిడ్డ పుట్టిన ఐదో రోజు ఇంటికి వచ్చాక రక్తపోటు పెరిగి చనిపోయింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది నా కూతురి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఒంట్లో బాగుండటం లేదని ఆస్పత్రికి వెళ్లి చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల ఇంటికి వచ్చేసింది. నా మనవరాలిలోనే కుమార్తెను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాను. – అద్దంకి మాణిక్యమ్మ, జి.మామిడాడ, తూర్పుగోదావరి జిల్లా
వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే మా అక్క బతికేది
మా అక్క రాజాన దమయంతికి మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించాడు. రెండో కాన్పు కూడా సజావుగా అవుతుందనుకున్నాం. గర్భిణిగా (ఐదోనెల) ఉన్న సమయంలో రక్తం తక్కువగా ఉందని విజయనగరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాం. ఆ రోజు సెలవు కావడంతో అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేశారు.
కేజీహెచ్‌లో చేరి్పంచిన రోజు బాగానే ఉంది. మరుసటి రోజు రక్తం ఎక్కిస్తామని వైద్యులు చెప్పారు. ఉదయం అకస్మాత్తుగా చనిపోయింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుపట్టడం లేదు. వైద్యులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందిస్తే బతికేది. – పి.నాగరాజు, దమయంతి సోదరుడు, పి.లింగాలవలస, దత్తిరాజేరు మండలం, విజయనగరం జిల్లా
మరణాలకు ప్రధాన కారణాలు
» ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం
»ఎక్కువ మందిలో ఇన్ఫెక్షన్స్ పెరగడం.. బీపీ ఎక్కువగా ఉండటం
»గతంలో సురక్షితంగా అబార్షన్ చేయకపోవడం
»ప్రసవ సమయంలో నైపుణ్యం కలిగిన వైద్యులు, నర్సులు లేకపోవడం
» వైద్యులు అందుబాటులో ఉండక.. సకాలంలో వైద్యసేవలు అందకపోవడం
» ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి పడకలు తక్కువగా ఉండటం