ఒట్టి హడావుడి.. మందులే లేవు మరి | Coalition government does not provide facilities in public hospitals | Sakshi
Sakshi News home page

ఒట్టి హడావుడి.. మందులే లేవు మరి

Published Thu, Feb 20 2025 5:19 AM | Last Updated on Thu, Feb 20 2025 9:14 AM

Coalition government does not provide facilities in public hospitals

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించని కూటమి ప్రభుత్వం  

మరోవైపు ఆకస్మిక తనిఖీలు, ఐవీఆర్‌ఎస్‌ సర్వేల జోరు 

విజయవాడ జీజీహెచ్‌లో వైద్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ 

అదే సమయంలో బయట మెడికల్‌ స్టోర్‌ వద్ద బారులుతీరిన రోగుల 

బంధువులు.. అత్యధిక శాతం మందులు బయటికే రాస్తున్న వైనం  

నొప్పులు, బీపీ, గ్యాస్‌ బిళ్లలకూ దిక్కులేని దుస్థితి 

పెద్దాస్పత్రి అని వస్తే స్టాక్‌ లేవంటున్నారని పేదల ఆవేదన 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ దయనీయ పరిస్థితి 

గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ  

సాక్షి, అమరావతి: విజయవాడ జీజీహెచ్‌లో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా శ్రీను, శివయ్య తరహాలోనే పదుల సంఖ్యలో రోగులు, వారి సహాయకులు ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్‌ మందుల దుకాణానికి క్యూ కట్టారు. ఎవరిని కదిలించినా లోపల మందుల్లేవ్‌.. అందుకే బయట కొనుక్కోమని చీటీలు రాసిచ్చారని చూపించారు. ఆ దృశ్యాలు రాష్ట్రంలో గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థకు అద్దం పట్టాయి. 

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు అవసరమైన మందులన్నింటినీ సరఫరా చేయలేని ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తి చూపాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వంద మందికిపైగా ఆస్పత్రిలోని ఓపీ, ఐపీ రోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్‌ వద్దకు వచ్చారు. కడుపు నొప్పి, బీపీ, గ్యాస్, నొప్పులు వంటి చిన్న సమస్యలతో పాటు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లు, కిడ్నీ, గుండె, ఇతర జబ్బుల్లో చికిత్సలకు అవసరమైన మందులు, ఇంజెక్షన్‌లు, సిరప్‌లు సొంతంగా కొనుగోలు చేశారు. 

వీరందరూ డబ్బు పెట్టి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోలేక.. ఉభయ గోదావరి,  కృష్ణా జిలాల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చారు. పశ్చి మ గోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి మెడికల్‌ స్టోర్‌ ముందు నిలబడి ‘ప్రభుత్వాస్పత్రి అంటే నే చికిత్స, మందులు, పరీక్షలు అన్నీ ఉచితం. దీంతో రానుపోను చార్జీలు, తిండి, ఇతర అవసరాలకు కొంత డబ్బు తెచ్చుకున్నాం. 

తీరా ఆస్పత్రిలో చేరాక మందుల్లేవ్‌ బయట కొనమన్నారు. రూ.వెయ్యి ఫోన్‌ పే చేయ్‌ రా’ అంటూ స్నేహితుడి ని అభ్యర్థించడం ఆవేదనకు గురి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ జీజీహెచ్‌కు సుమారు వంద రకాల మందులు ఆస్పత్రి నుంచి ఇండెంట్‌ పెట్టినా సరఫరా కాలేదు.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.

ఇంజెక్షన్‌ బయట కొనుక్కోమన్నారు
నా భర్తకు స్టెంట్‌లు వేశారు. చికిత్సలో భాగంగా ఓ ఇంజెక్షన్‌ (నికోరన్‌) రాశారు. ఇక్కడేమో అది లేదన్నారు. బయట కొనుక్కుని రమ్మన్నారు. రూ.450 పెట్టి ఇంజెక్షన్‌ కొనక తప్పలేదు.  – హృద్రోగ బాధితుడు వెంకట సురేశ్‌ భార్య, తణుకు

స్టాక్‌ లేవన్నారు
నా మనవరాలికి అనారోగ్యంగా ఉంటే చికిత్స కోసం వచ్చాను. వైద్యులు చూశారు. మందులు రాసిచ్చారు. కౌంటర్‌ వద్దకు వెళితే మందులు అందుబాటులో లేవన్నారు. బయట కొనుక్కోవాల్సిందే. లేదంటే మళ్లీ రమ్మన్నారు. మళ్లీ ఇంకో రోజు రావాలంటే రానుపోను చార్జీలు, ప్రయాసలు పడాల్సి వస్తుంది. చేసేదేమీ లేక కష్టాలుపడి డబ్బు పెట్టి మందులు కొనుకున్నాం.  – నవమ్మ, పైడూరిపాడు, విజయవాడ రూరల్‌

డాక్టర్‌ రాసిన మందులు ఇవ్వలేదు
నెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు. ఈ నెల 7న 38.23 శాతం మంది రోగులు మందులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 

షుగర్‌ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్, బీపీ, గ్యాస్‌ సమస్యలకు కూడా బోధ­నా­స్పత్రుల్లో బయటకు చీటీలు రాసిస్తున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూది, సర్జికల్‌ గ్లౌజ్‌లకు సైతం కటకటగా ఉంటోందని పలువురు సూపరింటెండెంట్‌లు వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement