ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్! | Mounjaro Injection: The First and Only GIP and GLP1 Receptor Agonist Approved for Type 2 Diabetes | Sakshi
Sakshi News home page

ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్!

Published Sun, Mar 23 2025 5:44 AM | Last Updated on Sun, Mar 23 2025 6:18 AM

Mounjaro Injection: The First and Only GIP and GLP1 Receptor Agonist Approved for Type 2 Diabetes

ఏకకాలంలో రెండింటినీ నియంత్రించే ‘మవుంజారో’ ఇంజెక్షన్‌ మన దేశంలో అందుబాటులోకి..

అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ అభివృద్ధి చేసిన ఔషధం

నెలకు సగటున అయ్యే ఖర్చు రూ.17,500

అమెరికాలో అమ్మే ధరలో ఐదో వంతుకే ఇక్కడ విడుదల

ఊబకాయం నియంత్రణ కోసం మరికొన్ని ఔషధాలు కూడా అందుబాటులో..

తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలంటున్న నిపుణులు

ఎన్ని ఔషధాలు వాడినా జీవనశైలి మార్పులతో మంచి ఫలితం ఉంటుందని స్పష్టీకరణ

భారత్‌లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అదే సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా. సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ‘మవుంజారో (టైర్జెపటైడ్‌)’ పేరిట స్థూలకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి స్పెషల్‌ డెస్క్‌

ఎలా పని చేస్తుంది?
వారానికి ఒక ఇంజెక్షన్‌ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది ‘మవుంజారో’. ఇది ‘గ్లూకోజ్‌ డిపెండెంట్‌ ఇన్సులినోట్రాపిక్‌ పాలీపెప్టైడ్‌ (జీఐపీ)’, ‘గ్లూకగాన్‌ లైక్‌ పెప్టైడ్‌–1 (జీఎల్‌పీ–1)’ హార్మోన్‌ రెసెప్టార్‌లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది’’ అని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో భారత్‌లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది.

క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ ‘మవుంజారో’ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మందు 15 ఎంజీ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోతాదు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది.

‘‘భారతీయుల్లో స్థూలకాయం, టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్‌ మేనేజర్‌ విన్సెలోవ్‌ టక్కర్‌ పేర్కొన్నారు.

నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో..
‘మవుంజారో’ ఔషధాన్ని ఇంజెక్షన్‌ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషధాలు, కాస్మెటిక్స్‌ నియంత్రణ సంస్థ అయిన ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ)’ ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా, 5 ఎంజీ రూ.4,375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.

అందుకు అనుగుణంగా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్‌ఏలో దీనికి నెలకు 1,000 – 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష అన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.

మరికొన్ని మందులున్నా..
బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో నార్డిక్స్‌ కంపెనీకి చెందిన ‘రైబెల్సస్‌’ ఔషధం మూడేళ్ల కింద అంటే.. 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాంటీ–ఒబేసిటీ మందుల మార్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది.

డ్యూలాగ్లూటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లూటైడ్‌ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన ‘సెమాగ్లూటైడ్‌’ ఔషధం పేటెంట్‌ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనరిక్‌ మందును తయారు చేసేందుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వందల కోట్ల మార్కెట్‌..
ఫార్మాట్రాక్‌ వంటి మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థల అంచనా ప్రకారం.. భారత్‌లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్‌ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్‌ నాటికి రూ.535 కోట్లకు చేరింది. ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

టైప్‌–1 డయాబెటిస్‌ వారికి ఉపయోగపడదు
మవుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయంతోపాటు టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్నవారు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 30 కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ, గాల్‌ బ్లాడర్, సివియర్‌ గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది.

టైప్‌–1 డయాబెటిస్‌కు పనిచేయదు. కొంతమంది సెలెక్టెడ్‌ పాపులేషన్‌కు మాత్రమే ఉపకరించే ఔషధం. వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి. – డాక్టర్‌ శివరాజు, సీనియర్‌ ఫిజీషియన్‌

మంచిదే కానీ.. ఇదే మ్యాజిక్‌ డ్రగ్‌ కాదు..
భారత్‌లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మవుంజారో మందు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్‌ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే ‘మ్యాజిక్‌ పిల్‌’ అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు.

దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. – డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి..
మవుంజారో మందును కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు, డయాబెటిస్‌ నియంత్రణకు ఇచ్చే మోతాదు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిస్‌ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ‘మవుంజారో’ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది.

స్థూలకాయం, అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్లీప్‌ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మందులకు తోడు మరో రెప్యూటెడ్‌ బ్రాండ్‌ కావడంతో ఎలీ లిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది. – డాక్టర్‌ గురవారెడ్డి, సీనియర్‌ నీ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌

ఈ ఔషధం చాలావరకు సురక్షితమే.. కానీ..: – డాక్టర్‌ అమర్‌ వెన్నపూస, సీనియర్‌ బేరియాట్రిక్‌ సర్జన్‌
మవుంజారోను ఇప్పుడు అధికారికంగా భారత్‌లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. ఇందులో బరువు తగ్గడమనేది జీఐపీ, జీఎల్‌పీ–1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్‌ సర్జరీలో దాదాపు 200కుపైగా బరువును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎల్‌పీ–1, జీఐపీ. సాధారణంగా ఇన్సులిన్‌ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది.

కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి. ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం.. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్‌ బ్లాడర్‌ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్‌ కేన్సర్, సివియర్‌ అలర్జిక్‌ రియాక్షన్‌ వంటివీ రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి. నిజానికి బరువు తగ్గదలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు.

ప్రాణాంతకమైన మార్బిడ్‌ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్‌ చికిత్స తప్పదు. కానీ కొందరిలో అటు మార్బిడ్‌ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే. ఇక బేరియాట్రిక్‌ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్‌ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు.

లైఫ్‌స్టైల్‌ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (కిక్‌ స్టార్‌లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులను అనుసరించడమే ఆరోగ్యకరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement