హక్కుల రక్షణలో ‘సుప్రీం’ | Supreme Court completes 75 years on Jan 28th | Sakshi
Sakshi News home page

హక్కుల రక్షణలో ‘సుప్రీం’

Published Tue, Jan 28 2025 6:20 AM | Last Updated on Tue, Jan 28 2025 6:22 AM

Supreme Court completes 75 years on Jan 28th

సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై నేటికి 75 ఏళ్లు పూర్తి

ప్రజాప్రయోజనాలను కాపాడటంలో ‘సుప్రీం’ కమాండర్‌

రాజ్యాంగం, సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక

1950, జనవరి 28న ఎనిమిది మంది జడ్జీలతో ఏర్పాటు

ప్రస్తుతం సీజేతో కలిపి 34కు పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య

ప్రధాన న్యాయమూర్తి పీఠమెక్కిన తెలుగువారిగా జస్టిస్‌ కోకా సుబ్బారావు, జస్టిస్‌ ఎన్వీ రమణకు ఖ్యాతి

అరవింద్‌రెడ్డి గండ్రాతి
సామాజిక న్యాయానికి విఘాతం కలిగినా.. రాజ్యాంగానికి భంగం వాటిల్లినా.. ప్రజాప్రయోజనాలు హరించినా.. రాజకీయాలు హద్దు దాటినా.. దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగ పరిరక్షణకు ఉపక్రమిస్తుంది. పౌర హక్కులను, సమానత్వాన్ని, ప్రజా స్వేచ్ఛను కంటికి రెప్పలా కాపాడుతుంది. సామాన్యుడి నుంచి దేశాధినేత వరకు అందరినీ సమానంగా పరిగణిస్తుంది.

ప్రజా ప్రయోజనాలు కాపాడటంలో ‘సుప్రీం’ కమాండర్‌గా, రాజ్యాంగం, సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటై జనవరి 28తో 75 ఏళ్లు పూర్తయింది. 1950, జనవరి 28న 8 మంది (సీజేతో కలిపి)తో ప్రారంభమైంది.. నేడు 34కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు తెలుగు వారు జస్టిస్‌ కోకా సుబ్బారావు, జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్టించారు.

రాజ్యాంగ పరిరక్షణకర్త..
సుప్రీంకోర్టు(Supreme Court) దేశంలో సర్వోన్నత న్యాయస్థానం. సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా విధులు నిర్వర్తిస్తోంది. రాజ్యాంగంలోని 5వ భాగంలో అధికరణలు 124 నుంచి 147 వరకు సర్వోన్నత న్యాయస్థానం కూర్పు, అధికార పరిధిని తెలియజేస్తాయి. ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీళ్లను స్వీకరిస్తుంది. అందుకే దీన్ని పునర్విచారణ ధర్మాసనం అని కూడా అంటారు.

తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల కేసుల్లో ఒరిజినల్‌ పిటిషన్లను, తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాల కేసులపైనా నేరుగా విచారణ జరుపుతుంది.  తొలుత భారత సమాఖ్య న్యాయస్థానంగా పార్లమెంట్‌ భవనంలోని ప్రిన్సెస్‌ చాంబర్‌లో ప్రారంభించారు. ప్రిన్సెస్‌ చాంబర్‌లో 1937 నుంచి 1950 వరకు నడిపారు. భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రెండు రోజుల తరువాత సర్వోన్నత న్యాయస్థానం 1950, జనవరి 28న ఏర్పాటైంది. సుప్రీంకోర్టుగా రూపాంతరం చెందిన తర్వాత 1958 వరకు పాత పార్లమెంట్‌ భవనంలోని ఓ భాగంలో నడిపారు.

ఇండో–బ్రిటిష్‌ వాస్తు శైలిలో..
 సుప్రీంకోర్టు భవన ప్రధాన భాగం 17 ఎకరాల స్థలంలో ఇండో–బ్రిటిష్‌ వాస్తు శైలిలో నిర్మించారు. ప్రముఖ వాస్తుశిల్పి గణేశ్‌ భైకాజీ డియోలాలీకర్‌ దీని నమూనా రూపొందించారు. శ్రీధర్‌ కృష్ణ జోగ్లేకర్‌ భవన నిర్మాణానికి నేతృత్వం వహించారు. ప్రస్తుత భవనంలోకి 1958లో న్యాయస్థానం మారింది. త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించేలా భవన నమూనా రూపొందించారు. భవన మధ్య భాగం త్రాసుకోలను ప్రతిబింబిస్తుంది. 1979లో తూర్పు, పశ్చిమ భాగాలను ఈ సముదాయానికి జోడించారు. మొత్తం 19 కోర్టు గదులున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పెద్దగా, మధ్య భాగంలో ఉంటుంది.

న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందిలా..
సుప్రీంకోర్టును ఓ ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసేందుకు 1950లో రాజ్యాంగం వీలు కల్పించింది. తదుపరి పరిస్థితుల మేరకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్‌కు దఖలుపరిచింది. న్యాయమూర్తుల సంఖ్య (చీఫ్‌ జస్టిస్‌తో కలిపి) 1956లో 11కు, 1960లో 14కు, 1978లో 18కి, 1986లో 26కు, 2008లో 31కి, 2019లో 34 మందికి పెరిగింది. తొలుత సింగిల్‌ బెంచ్‌ విచారణలు ఉండగా. ఆ తర్వాత ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాల విచారణలు ప్రారంభమయ్యాయి.

అత్యంత కీలకమైన వివాదాల సమయంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం (రాజ్యాంగ ధర్మాసనం) కొలువుదీరుతుంది. అవసరం మేరకు ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనానికి కేసును బదిలీ చేయొచ్చు. న్యాయమూర్తులను నియమించేందుకు సర్వోన్నత న్యాయస్థానంతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి. ఇవి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా జరుగుతాయి. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. భారతీయుడై ఉండి ఐదేళ్ల పాటు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి.

అవీ  ఇవీ...
హైకోర్టు న్యాయమూర్తినిగాని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని గానీ సుప్రీంకోర్టులో తాత్కాలిక (ప్రత్యేక) న్యాయమూర్తిగా నియమించేందుకు అవకాశం ఉంది.

అత్యున్నత న్యాయస్థానంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.
మతం, కులంతో సంబంధం లేకుండా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది.
ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం ముగియడానికి నెల రోజుల ముందే తర్వాతి సీజేను ప్రకటించాలి.

ప్రసుత్తం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మాస్టర్‌ ఆఫ్‌ ది రోస్టర్‌గా ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. అంటే.. ఏ బెంచ్‌ ఏ కేసు విచారణ చేపట్టాలనేది నిర్ణయించే అధికారం సీజేకు ఉంటుంది.

 ప్రస్తుతం 33 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఇద్దరు మాత్రమే. సుప్రీంకోర్టు ఏర్పాటు నుంచి దాదాపు 277 మంది న్యాయమూర్తులు నియమితులు కాగా, వీరిలో 11 మంది (దాదాపు 4 శాతం) మాత్రమే మహిళలు.
కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ (1973) కేసును ఎక్కువ మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది.

సుప్రీం కోర్టులో తొలిసారి..
తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హరిలాల్‌ జె. కానియా (1947, ఆగస్టు 14 – 1951, నవంబర్‌ 5)
తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవీ (1989)
తొలి దళిత న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ (2000)
తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ (2007)
బార్‌ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన వ్యక్తి జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రి (1971)
బార్‌ నుంచి న్యాయమూర్తిగా పదోన్నతి పొంది సీజే అయిన వ్యక్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ (2022, ఆగస్టు 27)

అత్యధిక కాలం పనిచేసిన టాప్‌–5 సీజేలు
1. జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌
ఏడేళ్ల 139 రోజులు (1978, ఫిబ్రవరి 22 నుంచి 1985, జూలై 11 వరకు)

2. జస్టిస్‌ భువనేశ్వర్‌ ప్రసాద్‌ సిన్హా 
నాలుగేళ్ల 122 రోజులు (1959, అక్టోబర్‌ 1 నుంచి 1964, జనవరి 31 వరకు)
3. జస్టిస్‌ అజిత్‌ నాథ్‌ రే
మూడేళ్ల 276 రోజులు (1973, ఏప్రిల్‌ 26 నుంచి 1977, జనవరి 28 వరకు)

4. జస్టిస్‌ సుధీ రంజన్‌ దాస్‌
మూడేళ్ల 241 రోజులు (1956, ఫిబ్రవరి 1 నుంచి 1959, సెప్టెంబర్‌ 30 వరకు) 

5. జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌
మూడేళ్ల 117 రోజులు (2007, జనవరి 14 నుంచి 2010, మే 11 వరకు)

ప్రధాన న్యాయమూర్తులుగా తెలుగువారు
1) జస్టిస్‌ కోకా సుబ్బారావు 
తొమ్మిదో చీఫ్‌ జస్టిస్‌ (1966, జూన్‌ 30 నుంచి 1967, ఏప్రిల్‌ 11 వరకు (285 రోజులు) 

2). జస్టిస్‌ ఎన్వీ రమణ
48వ చీఫ్‌ జస్టిస్‌ (2021, ఏప్రిల్‌ 24 నుంచి 2022, ఆగస్టు 26 వరకు (సంవత్సరం 124 రోజులు)

ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తులు
జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ
హైదరాబాద్‌కు చెందిన ఈయన 1988లో న్యాయవిద్య పూర్తి చేసి న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2021, ఆగస్టు 31న నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ 
హైదరాబాద్‌కు చెందిన ఈయన 1988లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2008లో ఏపీ హైకోర్టు అడిషనల్‌ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ హైకోర్టుకు కేటాయించబడిన ఈయన 2019లో పంజాబ్‌– హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021లో మణిపూర్‌ చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లారు.

జస్టిస్‌ సరసి వెంకటనారాయణ భట్టి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈయన 1987లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. విభజనలో భాగంగా ఏపీ హైకోర్టుకు వెళ్లారు. 2019లో కేరళకు బదిలీపై వెళ్లి 2023 జూన్‌లో చీఫ్‌గా పదోన్నతి పొందారు. 2023, జూలైలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

నేరుగా బార్‌ నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి పొందిన వారు..
జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రి (1971లో– 9.1 ఏళ్లు), జస్టిస్‌ ఎస్‌సీ రాయ్‌ (1971లో–3 నెలలు), జస్టిస్‌ కుల్‌దీప్‌సింగ్‌ (1988లో–8.1 ఏళ్లు), జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే (1999లో–6.4 ఏళ్లు), జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ (2014లో–7.1ఏళ్లు), జస్టిస్‌ యూయూ లలిత్‌ (2014లో–8.2 ఏళ్లు), జస్టిస్‌ నాగేశ్వర్‌రావు (2016లో–6.1ఏళ్లు), జస్టిస్‌ ఇందు మల్హోత్రా (2018లో –2.8 ఏళ్లు), జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ (2023లో–8 ఏళ్లు), జస్టిస్‌ పీఎస్‌ నరసింహ (2021లో–6.6 ఏళ్లు) (జస్టిస్‌ విశ్వనాథన్, జస్టిస్‌ నరసింహ ప్రస్తుతం న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు)

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక తీర్పులు కొన్ని..
1993 ఉన్నికృష్ణన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌
ప్రాథమిక హక్కుల్లో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని.. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. లాభాపేక్ష లేకుండా, సమాజానికి ఉప యోగకరంగా విద్యాసంస్థల నిర్వహణ ఉండాలి. ఆర్టికల్‌ 19(1) ప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థలను నెలకొల్పే హక్కు ఉన్నా..19(6) ప్రకారం నియంత్రించే హక్కు సర్కార్‌కు ఉంది.

1997 సమతా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌
దేశంలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో నివసించే గిరిజన, ఆదివాసీల జీవనో పాధి హక్కులను రక్షిస్తూనే స్థిరమైన అభివృద్ధికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అటవీ భూములకు భంగం కలగకుండా, పర్యావరణం దెబ్బతిన కుండా గిరిజనులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఖనిజాలను వెలికితీయొచ్చని పేర్కొంది. గిరిజనేతరులకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది. సమతా అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసి పోరాటం చేయడంతో ఆ పేరుతో ఈ కేసు ప్రసిద్ధికెక్కింది.

ఆ రెండు సందర్భాల్లో
అమలవుతున్న సంప్రదాయం ప్రకారం..  పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన న్యాయ మూర్తే తదుపరి ప్రధాన న్యాయ మూర్తి అవుతారు. దాదాపుగా సుప్రీం కోర్టులో రెండవ స్థానంలో ఉండే అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి పదవికి సూచిస్తారు. అయితే ఈ సంప్రదాయం రెండు సందర్భాల్లో అమలు కాలేదు. 1973లో జస్టిస్‌ ఎ.ఎన్‌.రే ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులను అధిగమిస్తూ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అలాగే 1977లో జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా కాకుండా ఆయనకు జూనియర్‌ అయిన జస్టిస్‌ మీర్జా హమీదుల్లా బేగ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

హైదరాబాద్‌లో బెంచ్‌ ఎప్పుడో..
సుప్రీంకోర్టు ప్రారంభించినప్పుడు దేశ జనాభా 36 కోట్లు మాత్రమే. ఇప్పుడది 140 కోట్లు దాటింది. ఇన్ని కోట్ల మందికి న్యాయం జరగాలంటే పలు రాష్ట్రాల్లో సుప్రీంబెంచ్‌ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. సుప్రీంకోర్టును కాలాను గుణంగా విస్తరించవచ్చని అధికరణం 130లో బీఆర్‌ అంబేడ్కర్‌ క్లుప్తంగా పేర్కొ న్నారు. దక్షిణాన హైదరాబాద్, తూర్పున కోల్‌కతా, పశ్చిమాన ముంబైలో ప్రాంతీయ బెంచ్‌ల ఆవశ్యకత ఉందని 18వ లా కమిషన్‌ 2009లోనే కేంద్రానికి తెలిపింది. దీనిపై పార్లమెంట్‌లో 2023లో నాటి ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రైవేట్‌ బిల్లు పెట్టారు. ప్రాంతీయ బెంచ్‌ల ఏర్పాటుకు పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోతుంది. సుప్రీంకోర్టు సీజే ప్రతిపా దిస్తే.. రాష్ట్రపతి ఆమోదించినా ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ సరిహద్దుగా ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు న్నాయి. ఏపీ సరిహద్దుగా తమిళనాడు, ఒడిశా ఉన్నాయి. హైదరాబాద్‌ బెంచ్‌ తో ఈ రాష్ట్రాలకు ‘న్యాయం’ అందుతుందనే అభిప్రాయం ఉంది.

ధిక్కారాన్ని శిక్షించే అధికారం..
ఏ న్యాయస్థానాన్నైనా ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం రాజ్యాంగంలోని 129, 142 అధికరణల ద్వారా సుప్రీంకోర్టుకు ఉంది. మహారాష్ట్ర మాజీ మంత్రి స్వరూప్‌ సింగ్‌ నాయక్‌పై సుప్రీంకోర్టు ఈ అధికారంతో ఒక అసాధారణ చర్య తీసుకుంది. 2006, మే 12న కోర్టు ధిక్కార నేరంపై ఆయనకు నెలరోజులపాటు జైలు శిక్ష విధించింది. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని జైలుకు పంపడం దేశంలో ఇదే తొలిసారి.

స్వతంత్ర పటిష్టతతోనే విశ్వాసం..
⇒  శాసన, కార్యనిర్వాహక విభాగాలకు సుప్రీంకోర్టు అంతరం పాటించాలి. ఈ వైఖరిని కొనసాగించపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. దేశం పురోగతి సాధించదు. ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటైంది. రాజ్యాంగాన్ని దృఢమైన శరీరంగా కాకుండా.. స్వపరిపాలన, శక్తి కలిగిన జీవిగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేద్దాం. అత్యున్నత న్యాయస్థానానికి విస్తృతాధికారాలు కల్పించడంలో రాజ్యాంగం కీలకప్రాత పోషించింది. హైకోర్టులు బలంగా ఉంటేనే సుప్రీంకోర్టు భారం తగ్గుతుంది. మెరిట్‌పై మాత్రమే న్యాయమూర్తుల నియామకాలు జరగాలి. రాజకీయాలు దీన్ని ప్రభావితం చేయలేవని భావిస్తున్నా. స్వతంత్ర పటిష్టతే న్యాయవ్యవస్థకు ప్రజల్లో విశ్వాసాన్ని పొందేలా చేస్తుంది. న్యాయస్థానాలు ఎవరి సొత్తూ కాదు. సద్భావన, సానుభూతిని ఆచరిస్తాయి. – జస్టిస్‌ హరిలాల్‌ జె. కానియా (సుప్రీంకోర్టు ఏర్పాటు సందర్భంగా..)

లిల్లీ థామస్‌ గీ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2013)
పిటిషన్‌: రెండేళ్లు.. అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ, సిట్టింగ్‌ చట్టసభల సభ్యులకు వర్తించదని పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు.
బెంచ్‌: జస్టిస్‌ ఆర్‌పీ సేథి, జస్టిస్‌ ఎస్‌.సగీర్‌ అహ్మ
 తీర్పు: ‘సిట్టింగ్‌ చట్టసభల సభ్యులకు ఇస్తున్న మినహాయింపు చెల్లదు’

ఎస్‌ఆర్‌ బొమ్మై గీ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1994)
పిటిషన్‌: కర్ణాటక (1988–89)లో తన మద్దతుకు సంబంధించి జనతాదళ్‌ శాసనసభాపక్షం ఆమోదించిన తీర్మాన కాపీని నాటి సీఎం బొమ్మై అప్పటి గవర్నర్‌ పి.వెంకటసుబ్బయ్యకు సమర్పించినా అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వలేదు. తీర్మాన కాపీని తిరస్కరిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలన్న గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బొమ్మై పిటిషన్‌ వేశారు. బెంచ్‌: జస్టిస్‌ కుల్‌దీప్‌ సింగ్, జస్టిస్‌ పీబీ సావంత్, జస్టిస్‌ కే రామస్వామి, జస్టిస్‌ ఎస్‌సీ అగర్వాల్, జస్టిస్‌ యోగేశ్వర్‌ దయాల్, జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌ఆర్‌ పాండియన్, జస్టిస్‌ ఏఎం అహ్మదీ

తీర్పు: ‘సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్‌ అవకాశం కల్పించాలి. రాజ్యాంగంలోని 356 అధికరణం కింద గవర్నర్‌ సర్కార్‌ను డిస్మిస్‌ చేయడం నిరంకుశత్వం. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు అసలైన వేదిక శాసనసభే. గవర్నర్‌ సొంత అభిప్రాయానికి తావు లేదు’

దేశవ్యాప్త సంచలన తీర్పులు..
శంకరీ ప్రసాద్‌ సింగ్‌ గీ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా గీ బిహార్‌ (1951)
పిటిషన్‌: పార్లమెంట్‌ రాజ్యాంగ సవరణ చేయడాన్ని సవాల్‌ చేస్తూ శంకరీ ప్రసాద్‌ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బెంచ్‌: జస్టిస్‌ హీరాలాల్‌ జె. కనియా, జస్టిస్‌ బీకే ముఖర్జీ, జస్టిస్‌ చంద్రశేఖర అయ్యర్‌ తీర్పు: ‘ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంది’. తొలిసారిగా న్యాయ సమీక్షాధికారం వినియోగం.

స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ గీ బేలా బెనర్జీ (1953)
పిటిషన్‌: భూ సేకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది. 
బెంచ్‌: జస్టిస్‌ పతంజలి శాస్త్రి, జస్టిస్‌ మెహర్‌ చంద్‌ మహా జన్, జస్టిస్‌ గులాం హసన్, జస్టిస్‌ బి.జగన్నాథ దాస్‌
తీర్పు: ‘ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్‌ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే’

గోలక్‌నాథ్‌ గీ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (1967)
పిటిషన్‌: పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణలను సవాల్‌ చేస్తూ గోలక్‌నాథ్‌ పిటిషన్‌ వేశారు.
బెంచ్‌: జస్టిస్‌ కె.సుబ్బారావు, జస్టిస్‌ కెఎన్‌ వాంచూ, జస్టిస్‌ ఎం. హిదాయతుల్లా, జస్టిస్‌ జేసీ షా, జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రి, జస్టిస్‌ ఆర్‌ ఎస్‌ బచావత్, జస్టిస్‌ వి.రామస్వామి, జస్టిస్‌ జేఎం షెలత్, జస్టి స్‌ విశిష్ఠ భార్గవ, జస్టిస్‌ జీకే మిట్టర్, జస్టిస్‌ సీఏ వైద్యలింగం. 
తీర్పు: ‘‘ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదు. రాజ్యాంగ సవరణలపైనా ఆర్టికల్‌ 13 ప్రకారం న్యాయసమీక్ష జరుగుతుంది. ఈ తీర్పు గత తీర్పులకు వర్తించదు. రాబోయే వాటికి వర్తిస్తుంది (దీన్ని ‘ప్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌’ అంటారు). రాజ్యాంగంలోని 1వ, 4వ, 17వ సవరణలు చెల్లుబాటు అవుతాయి. ప్రాథమిక హక్కులను పార్లమెంట్‌ సవరించాలంటే ‘ప్రత్యేక రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాలి’’.

కేశవానంద భారతి గీ స్టేట్‌ ఆఫ్‌ కేరళ (1973)
పిటిషన్‌: ఐదు దశాబ్దాల క్రితం మఠం ఆస్తుల విషయంలో కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో ఎడనీర్‌ మఠాధిపతి కేశవానంద స్వామి పిటిషన్‌ వేశారు. 
బెంచ్‌: జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రి అధ్యక్షతన జస్టిస్‌ ఏఎన్‌ గ్రోవర్, జస్టిస్‌ ఏఎన్‌ రే, జస్టిస్‌ డీజీ పాలేకర్, జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా, జస్టిస్‌ జేఎం షెలత్, జస్టిస్‌ కేకే మాథ్యూ, జస్టిస్‌ కేఎస్‌ హెగ్డే, జస్టిస్‌ ఎంహెచ్‌ బేగ్, జస్టిస్‌ పి.జగన్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌ఎన్‌ ద్వివేది, జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ 
తీర్పు: ‘రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, మౌలిక స్వరూ పాన్ని మార్చలేం. సుప్రీంకోర్టు వాటి రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందిగానీ, మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు. రాజ్యాంగ 
ఆత్మను మార్చడం సాధ్యంకాదు.’

మేనకాగాంధీ గీ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1978) 
పిటిషన్‌: తన పాస్‌పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బెంచ్‌: జస్టిస్‌ ఎం.హమీదుల్లా బేగ్, జస్టిస్‌ వైవీ చంద్రచూడ్, జస్టిస్‌ పీఎన్‌ భగవతి, జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ ఎన్‌ఎల్‌ ఉంత్వాలియా, జస్టిస్‌ సయ్యద్‌ ముర్తజా ఫజలాలి, జస్టిస్‌ పీఎస్‌ కైలాసం
తీర్పు: ‘ప్రజాప్రయోజనం అనేది బహుళ విస్తృతమైనది. పాస్‌పోర్టు చట్టం 1967 పేరుతో అధికారులు 14, 19, 21 అధికరణాలను ఉల్లంఘించారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులను భంగపర్చలేరు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను చట్టబద్ధమైన ప్రక్రియతో ఆటంకపర్చలేరు’

మినర్వా మిల్స్‌ గీ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1980)
పిటిషన్‌: ఇందిరాగాంధీ సర్కార్‌ చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినర్వా మిల్స్‌ లిమిటెడ్‌ సవాల్‌ చేసింది.
బెంచ్‌: జస్టిస్‌ వైవీ చంద్రచూడ్, జస్టిస్‌ పీఎన్‌ భగవతి, జస్టిస్‌ ఏసీ గుప్తా, జస్టిస్‌ ఎన్‌ఎల్‌ ఉంట్వాలియా, జస్టిస్‌ పీఎస్‌ కైలాసం
తీర్పు: రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్‌ చేయకూడదంటూ అధికరణం 368(4), రాజ్యాంగ సవరణ అధికారంపై పార్లమెంట్‌కు ఎలాంటి పరిమితులు ఉండొద్దంటూ అధికరణం 368(5)కు చేసిన సవరణ రద్దు చేస్తున్నాం. ఈ క్లాజ్‌లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం.

మహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ గీ షా బానో బేగం (1985)
పిటిషన్‌: మహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ నుంచి భరణం కోరుతూ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించిన 65 ఏళ్ల షాబానో బేగం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, 1973లోని సెక్షన్‌ 123 ప్రకారం తనకు, తన ఐదుగురు పిల్లలకు భరణం ఇవ్వాలని కోరారు. అహ్మద్‌ ఖాన్‌ అప్పీల్‌పై విచారణ. 
బెంచ్‌: జస్టిస్‌ వైవీ చంద్రచూడ్, జస్టిస్‌ మిశ్రా రంగానాథ్, జస్టిస్‌ డీఏ దేశాయ్, జస్టిస్‌ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్‌ ఈఎస్‌ వెంకటరామయ్య
తీర్పు: ‘ముస్లిం మహిళలకు కూడా భరణం చెల్లించాల్సిందే. ఇద్దత్‌ గడువు (విడాకుల తర్వాత 3 నెలలు) ముగిసిన తర్వాత కూడా ముస్లిం భర్త.. భరణం చెల్లించాల్సిందే. భరణం చారిటీ కాదు.. హక్కు’

ఇందిరా సహాని గీ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1992)
పిటిషన్‌: మండల కమిషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేశారు.
బెంచ్‌: జస్టిస్‌ ఎంహెచ్‌ కనియా, జస్టిస్‌ ఎంఎన్‌ వెంకటాచలయ్య, జస్టిస్‌ ఎస్‌.రణవేల్‌ పాండియన్, జస్టిస్‌ టీకే తొమ్మెన్, జస్టిస్‌ ఏఎం అహ్మదీ, జస్టిస్‌ కుల్‌దీప్‌ సింగ్, జస్టిస్‌ పీబీ సావంత్, జస్టిస్‌ ఆర్‌ఎం సహాయ్, జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి
తీర్పు: ‘ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు సమర్థనీయం’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement