
భారతీయుల వద్ద 25,000 టన్నుల గోల్డ్
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్‌బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది.
భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.
ప్రత్యామ్నాయంగా పుత్తడి..
యూఎస్‌ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు.
ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది.
సెంట్రల్ బ్యాంక్స్ సైతం..
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి.
ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్‌బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్‌ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి.