
ఇండియా, చైనాలపై అమెరికా టారిఫ్‌లను తప్పుబట్టిన పుతిన్
మాస్కో: భారత్, చైనాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, ఆంక్షలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుపట్టారు. ఆ రెండు దేశాలను ఆంక్షల కొరడాతో లొంగదీసుకోవాలని చూడడం సరైంది కాదని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలతో మాట్లాడే విధానమే సరిగ్గా లేదని, వలసవాద పాలన కాలం నాటి మాటలను ట్రంప్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పుతిన్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికా సర్కార్ వైఖరిపై ఘాటుగా స్పందించారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచి, దారికి తెచ్చుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారత్, చైనాలు చక్కటి భాగస్వామ్య దేశాలని పుతిన్ గుర్తుచేశారు. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను ఆ రెండు దేశాల్లో నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు.
భారత్, చైనాలు కలిసి అమెరికాను శిక్షిస్తాయని ఎవరైనా చెబితే ఆ విషయం సీరియస్‌గా ఆలోచించాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. 140 కోట్లకుపైగా జనాభా ఉన్న ఇండియాను, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను బలహీన దేశాలుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. వలసవాద ప్రభుత్వాల హయాం ఎప్పుడో ముగిసిపోయిందని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు అప్పుటి పదజాలం ఉపయోగిస్తామంటే కుదరదని, ఈ విషయం అమెరికా తెలుసుకోవాలని హితవు పలికారు. అమెరికా, భారత్, చైనాల మధ్య మళ్లీ సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న నమ్మకం తనకు ఉందని పుతిన్ స్పష్టంచేశారు.
🚨🇷🇺 'YOU CANNOT TALK TO INDIA OR CHINA LIKE THAT:' Putin on economic pressure against partners
"Attempting to weaken their leadership, built through difficult histories, is a mistake." pic.twitter.com/GsiU3K3mnZ— Sputnik India (@Sputnik_India) September 3, 2025
కారులో మోదీతో సంభాషణ రహస్యం కాదు
చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కారులోనే 45 నిమిషాలకుపైగా మాట్లాడుకున్నారు. దీనిపై వస్తున్న ఊహాగానాలపై పుతిన్ స్పందించారు. మోదీతో కారులో సంభాషించడం వెనుక రహస్యం ఏమీ లేదన్నారు. అది రహస్య సంభాషణ కాదని స్పష్టంచేశారు. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీ విశేషాలను మోదీకి వివరించానని చెప్పారు.