
క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కోసం పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్..
మొదటి దశలో భారీగా దరఖాస్తులు.. 82,077 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్లు
శిక్షణ పొందుతున్నవారు 28,141 మంది
దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం
శిక్షణకు ఎంపికైతే వన్ టైమ్ గ్రాంట్‌గా రూ.6 వేలు..
ప్రతినెలా రూ.5 వేలు స్టైపెండ్
రెండో దశ కోసం దరఖాస్తుల స్వీకరణ షురూ..
సాక్షి, ఎడ్యుకేషన్: దేశంలోని యువతకు ఉద్యోగ సాధన కోసం అవసరమయ్యే క్షేత్రస్థాయి నైపుణ్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్)కు ఆదరణ లభిస్తోంది. పదో తరగతి, ఇంటర్మిడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అవకాశం కల్పించడంతోపాటు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైపెండ్ కూడా అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఏడాది పాటు ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌ను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లోనూ పూర్తి చేసే అవకాశం ఉండటం గమనార్హం. దీనివల్ల తగిన నైపుణ్యాలు సమకూరి, మంచి ఉద్యోగంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.
28,141 మందికి శిక్షణ
కేంద్రం గతేడాది బడ్జెట్‌లో ఆమోదం లభించి, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ తొలి దశలో 28,141 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించాయి. ఈ స్కీమ్ కింద దేశంలో ఏటా 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భాగస్వామ్య సంస్థల నుంచి 1.27 లక్షల ఆఫర్లు వచ్చాయి. వాటి కోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 82,077 మందిని కంపెనీలు ఎంపిక చేసుకుని ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేశాయి. అయితే 28,141 మంది మాత్రమే ఆఫర్లను తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు.
24 రంగాల సంస్థల్లో అవకాశాలు
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో భాగంగా 24 రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, ఎఫ్‌ఎంసీజీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ రంగ సంస్థలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండటం గమనార్హం.
ట్రెయినీలకు స్టైఫండ్ కూడా..
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద ఎంపికై వివిధ సంస్థల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వం స్టైఫండ్ ఇస్తుంది. తొలి దశలో 28,141 మంది ఇంటర్న్ ట్రైనీల బ్యాంకు ఖాతాల్లో వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.4.38 కోట్లు, 2024 డిసెంబర్ వరకు రూ.1.3 కోట్ల స్టైఫండ్‌ను జమ చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
పీఎంఐఎస్‌కు అర్హతలివీ..
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. ఎలాంటి ఉద్యోగం లేని యువతకు వారి విద్యార్హతలకు తగినట్టుగా ఏడాది పాటు ఆన్ జాబ్ ఆన్ ట్రైనింగ్/ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో కోటి మంది యువతకు దేశంలోని టాప్–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారికి నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇస్తారు. ఇందులో రూ.4.5 వేలను కేంద్ర ప్రభుత్వం, మరో రూ.500ను ఆయా సంస్థలు సీఎస్‌ఆర్ కింద భరిస్తాయి.
విస్తృతం చేయాలి..
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను టాప్–500 సంస్థలకేకాకుండా ఇతర సంస్థలకు కూడా విస్తరింపజేయాలి. దీనివల్ల ఔ త్సాహికులు తమ సమీప ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం మెరుగవుతుంది. సుదూర ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం లభించినా.. నివాస ఖర్చులు, ఇతర కోణాల్లో ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు కూడా వ్యక్తిగత హద్దులు ఏర్పరచుకుని మెలగడం కూడా సరికాదని, అవకాశమున్న చోటికి వెళ్లాలని గుర్తించాలి. – టి.మురళీధరన్, టీఎంఐ నెట్‌వర్క్ చైర్మన్
ఏపీలో 4,973, తెలంగాణలో 7,913 మందికి చాన్స్
జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఈ స్కీమ్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 4,973 మందికి, తెలంగాణలో 7,913 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్లు వచ్చాయి. మొత్తంగా తమిళనాడుకు చెందినవారికి అత్యధికంగా 14,585 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్ లభించింది. మహరాష్ట్ర (13,664 ఆఫర్లు), గుజరాత్ (11,690 ఆఫర్లు), కర్ణాటక (10,022 ఆఫర్లు), ఉత్తరప్రదేశ్ (9,027) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 1,27,508 ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్న కంపెనీలు.. 82,077 మందిని ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక చేశాయి.
రెండో దశకు దరఖాస్తులు షురూ..
⇒ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో దశ దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో 1,26,557 అవకాశాలు
అందుబాటులో ఉంచారు. వీటిలో ఆంధ్రపదేశ్‌కు 4,715; తెలంగాణకు 5,357 కేటాయించారు. అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తమ అర్హతలు, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి.
⇒ఈ స్కీమ్‌లో అర్హతల వారీగా అవకాశాల సంఖ్యను సైతం పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారికి 36,901, టెన్త్ చదివిన వారికి 24,696, ఐటీఐ ఉత్తీర్ణులకు 23,269, డిప్లొమా ఉత్తీర్ణులకు 18,589; ఇంటర్మిడియెట్ / 12వ తరగతి ఉత్తీర్ణులకు 15,412 అవకాశాలను అందుబాటులో పెట్టారు. రెండో దశలో అభ్యర్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment