యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పనకు తోడ్పడండి
కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ పిలుపు
ఇకపై వర్సిటీ బాధ్యత ఆనంద్ మహీంద్రా చూస్తారని వెల్లడి
సచివాలయంలో పారిశ్రామికవేత్తలు, వర్సిటీ బోర్డు సభ్యులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలతో పాటు పారిశ్రామికవేత్తలు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు, కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
ఆయన స్కిల్స్ యూనివర్సిటీకి బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి, 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణ అందిస్తుందని చెప్పారు.
పట్టాలు ముఖ్యం కాదు.. నైపుణ్యం కావాలి
డిగ్రీ, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, అందరూ ఉద్యోగాలు సాధించలేక పోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించమని తన వద్దకు వస్తున్నారంటూ తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు. ఇదే సమయంలో పరిశ్రమలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పాలని, తద్వారా యువత ఉపాధికి ఢోకా ఉండదని భావించినట్లు తెలిపారు.
ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్: శ్రీధర్‌బాబు
స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతోందని, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభమవటం ఆనందంగా ఉందన్నారు.
సీఎం ఆలోచనలో దార్శినికత ఉంది ఆనంద్ మహీంద్రా
తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయమైన పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించడంలో దార్శనికత ఉందని అన్నారు. అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ తెలంగాణలో ఉందని, ఇక్కడి నుంచే అమెరికాకు ఎక్కువ మంది వెళుతున్నారని తెలిపారు.
కాగా యూనివర్సిటీలో వచ్చే నెల దసరా పండుగ తర్వాత కోర్సులు ప్రారంభించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ సమావేశంలో బోర్డు కో చైర్మన్ శ్రీని రాజు, సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోర్డు సభ్యులు మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్చందానీ, ఎంఎం మురుగప్పన్, డాక్టర్ కేపీ కృష్ణన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment