
సాక్షి, అమరావతి: గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి ఐదు రాష్ట్రాల్లో స్థానం సంపాదించుకుంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణలో మూడో స్థానం, వారు ఉపాధి పొందడం (ప్లేస్‌మెంట్స్)లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద దేశంలోని 27 రాస్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 14.51 లక్షల మంది గ్రామీణ యువత శిక్షణ పొందగా ఇందులో 8.70 లక్షల మంది ఉపాధి పొందినట్లు తెలిపింది.
గ్రామీణ యువతకు వృత్తిపరమైన లేదా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. శిక్షణ పొందిన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
15 నుంచి 35 ఏళ్ల లోపు పేద కుటుంబాలకు చెందిన గ్రామీణ యువతకు ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనారిటీలకు 15 శాతం, మహిళలకు 33 శాతం మందికి శిక్షణలో ప్రాధాన్యత ఇస్తారు. అలాగే దివ్యాంగులు, కుటుంబ నిర్వహణలో ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో 37 రంగాల్లో 877 ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు 2,369 కేంద్రాల్లో ఈ శిక్షణ ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment