ఉపాధ్యాయుల శిక్షణలో మరో అపశృతి
విజయనగరం జిల్లా శిక్షణ కేంద్రంలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు దుర్మరణం
ఇదే నెలలో ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో హెచ్‌ఎం రత్నకుమార్ కూడా..
రెసిడెన్షియల్ శిక్షణ రద్దు చేయాలని టీచర్ల డిమాండ్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు అందిస్తున్న నాయకత్వ, నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం (స్కూల్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్–ఎస్‌ఎల్‌డీపీ)లో మరో అపశృతి చోటుచేసుకుంది. మూడోదశ శిక్షణలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఉపా«ద్యాయులకు శిక్షణ జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నేరడి ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరిపురపు శ్రీనివాసరావు (52) గత సోమవారం నుంచి పాల్గొంటున్నారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆయనను తోటి ఉపాధ్యాయులు వెంటనే సమీపంలోని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొండకు చెందిన శ్రీనివాసరావుకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఈనెల 6న ఏలూరుజిల్లా ఆగిరిపల్లిలో శిక్షణకు హాజరైన ప్రధానోపాధ్యాయుడు వెంకట రత్నకుమార్ ఇదే తరహాలో మరణించగా.. చీరాలలో మరో ప్రధానోపాధ్యాయడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యా రు. ఇలా వరుస ఘటనలపై ఉపాధాయ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.శ్రీనివాసరావు మృతికి నిరసనగా పలు జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయులు గురువారం తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. శిక్షణ కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు విశాఖపట్నం జోన్–1 ఆర్‌జేడీ బి.విజయభాస్కర్ మరుపల్లి శిక్షణ కేంద్రానికి వచ్చి చెప్పడంతో అక్కడ ఉపాధ్యాయులు శాంతించారు.
బలవంతపు శిక్షణతో వేధింపులు: వైఎస్సార్‌టీఏ
శిక్షణలో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం బాధాకరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్కుమార్‌రెడ్డి, సుధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ శిక్షణను రద్దుచేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధి కారుల్లో చలనం లేదన్నారు. బలవంతపు శిక్షణతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. మృతుల కు టుంబంలో అర్హత గలవారికి ప్రభుత్వోద్యోగం ఇ వ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఇలాంటి శిక్షణలు రద్దుచేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రావు, ఏపీ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీటీఎఫ్, ఏపీ పూలే టీచర్స్ ఫెడరేషన్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్.. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్.. ఏపీ ఉపాధ్యాయ సంఘం, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment