training centre
-
శిక్షణలో హెడ్మాస్టర్ హఠాన్మరణం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు అందిస్తున్న నాయకత్వ, నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం (స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–ఎస్ఎల్డీపీ)లో మరో అపశృతి చోటుచేసుకుంది. మూడోదశ శిక్షణలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఉపా«ద్యాయులకు శిక్షణ జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నేరడి ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరిపురపు శ్రీనివాసరావు (52) గత సోమవారం నుంచి పాల్గొంటున్నారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయనను తోటి ఉపాధ్యాయులు వెంటనే సమీపంలోని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొండకు చెందిన శ్రీనివాసరావుకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఈనెల 6న ఏలూరుజిల్లా ఆగిరిపల్లిలో శిక్షణకు హాజరైన ప్రధానోపాధ్యాయుడు వెంకట రత్నకుమార్ ఇదే తరహాలో మరణించగా.. చీరాలలో మరో ప్రధానోపాధ్యాయడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యా రు. ఇలా వరుస ఘటనలపై ఉపాధాయ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.శ్రీనివాసరావు మృతికి నిరసనగా పలు జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయులు గురువారం తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. శిక్షణ కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు విశాఖపట్నం జోన్–1 ఆర్జేడీ బి.విజయభాస్కర్ మరుపల్లి శిక్షణ కేంద్రానికి వచ్చి చెప్పడంతో అక్కడ ఉపాధ్యాయులు శాంతించారు. బలవంతపు శిక్షణతో వేధింపులు: వైఎస్సార్టీఏశిక్షణలో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం బాధాకరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, సుధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ శిక్షణను రద్దుచేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధి కారుల్లో చలనం లేదన్నారు. బలవంతపు శిక్షణతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. మృతుల కు టుంబంలో అర్హత గలవారికి ప్రభుత్వోద్యోగం ఇ వ్వాలని వారు డిమాండ్ చేశారు.ఇలాంటి శిక్షణలు రద్దుచేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రావు, ఏపీ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీటీఎఫ్, ఏపీ పూలే టీచర్స్ ఫెడరేషన్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్.. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్.. ఏపీ ఉపాధ్యాయ సంఘం, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. -
విపత్తులు ఎదుర్కొనే యంత్రాంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థాగత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర విపత్తుల నిర్వహణ బలగాల (ఎస్డీఆర్ఎఫ్) ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటుచేసే ఈ ప్రధాన కేంద్రంలోనే శిక్షణా కేంద్రాన్ని కూడా నెలకొల్పనుంది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 50 ఎకరాల్లో ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రం, శిక్షణ కేంద్రం నిర్మాణానికి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (రివైజ్డ్ డీపీఆర్)ను ఖరారు చేసింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రూ.99.73 కోట్లతో ప్రధాన కేంద్రం దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన సముద్రతీరం (దాదాపు 972 కి.మీ) ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. దీంతో ఏటా తుపాన్లు, వరదల ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోంది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను యుద్ధప్రాతిపదికన ఆదుకునేందుకు.. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండే వ్యవస్థను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం)లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రాలను కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలు, ఎన్ఐడీఎంకు 10 ఎకరాలు, ఎస్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఎస్డీఆర్ఎఫ్కు కేటాయించిన 50 ఎకరాల్లో ప్రధాన కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్ ప్రణాళికకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రధాన కేంద్రంలో 154 మంది.. ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 154 మంది అధికారులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వీరిలో పర్యవేక్షణ స్థాయి ఉన్నతాధికారులు నలుగురు ఉంటారు. అలాగే, రెండు రెస్క్యూ టీమ్‌లలో అత్యవసర సేవలు అందించే అధికారులు, సిబ్బంది 94 మంది ఉండనున్నారు. అదేవిధంగా క్వార్టర్ మాస్టర్ గ్రూప్ సభ్యులు 15 మంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది 8 మంది, రవాణా విభాగం అధికారులు, సిబ్బంది 15 మంది, ప్రధాన కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు ఇద్దరు, ఫార్మసిస్టులు నలుగురు, మినిస్టీరియల్ సిబ్బంది 12 మంది ఉంటారు. ఆధునిక మౌలిక వసతులతో.. తుపాన్లు, వరదలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు సమర్థంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆధునిక మౌలిక వసతులను ఎస్డీఆర్ఎఫ్కు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.65 కోట్లతో ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 309 అధునాతన పరికరాలను రూ.21.74 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. అలాగే, రూ.39 కోట్ల వ్యయంతో వాహనాలను కూడా కొంటారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం రూ.77 లక్షలతో కంప్యూటర్లు, జీపీఎస్ ట్రాకర్లు, ఇతర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారాన్ని అనుసంధానించేందుకు అధునాతన సాంకేతిక, సమాచార పరికరాలను రూ.1.50 కోట్లతో కొంటారు. అదేవిధంగా శిక్షణ కేంద్రంలో 10 రకాల శిక్షణ అందించేందుకు రూ.2 కోట్లతో పరికరాలను కొనుగోలు చేస్తారు. -
బీడీఎంఏ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) టెక్నాలజీ, ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ జీడిమెట్ల ఫార్మా క్లస్టర్లో 2023 ఏప్రిల్ నుంచి ఈ కేంద్రం కార్యరూపం దాల్చనుంది. టీఎస్ఐఐసీ ఒక ఎకరం స్థలాన్ని దీర్ఘకాలిక లీజు పద్ధతిన సమకూర్చింది. ఈ ఫెసిలిటీ కోసం హెటిరో గ్రూప్ రూ. కోటి ఆర్థిక సాయం అందించింది. ఇతర సంస్థలు సైతం ఆర్థిక సాయానికి ముందుకు వస్తాయని అసోసియేషన్ భావిస్తోంది. ఔషధ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులకు నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్లో శిక్షణ ఇస్తారు. అలాగే బీడీఎంఏ సభ్య కంపెనీలు నూతనంగా నియమించుకున్న ఉద్యోగులకు ఇక్కడ ట్రైనింగ్ కల్పిస్తారు. ఆధునిక పరిశోధన, పరీక్షలకు కేంద్ర స్థానంగా ఇది నిలుస్తుందని బీడీఎంఏ తెలిపింది. పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం ఈ విధంగా సాంకేతిక, శిక్షణ కేంద్రం నెలకొల్పడం దేశంలో తొలిసారి అని పేర్కొంది. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో వస్తున్న నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యం పెంచుకోవడానికి నాలెడ్జ్ సెంటర్‌గా కూడా పని చేస్తుందని అభిప్రాయపడింది. -
నైపుణ్యాల శిక్షణపై పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: కార్మికుల్లో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. నైపుణ్యాలు, విద్యను ప్రోత్సహించడానికి విధాన కర్తలు, విద్యా వంతులు, పరిశ్రమ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. ఫిక్కీ నిర్వహించిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రధాన్ మాట్లాడారు. రెండు చేతులతోనే చప్పట్లు సాధ్యపడుతుందని చెబుతూ.. నైపుణ్యాభివృద్ధికి అందరు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పనివారిలో నైపుణ్యాల పెంపునకు పరిశ్రమ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ‘‘శిక్షణ ఇచ్చేవారు, లబ్ధిదారులే కనిపిస్తున్నారు. కానీ, పరిశ్రమల భాగస్వామ్యం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని గుర్తు చేస్తూ.. నిపుణులైన మానవవనరులు ఉన్నప్పుడే ఈ లక్ష్యం సాకరమవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరిశ్రమలకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందని చెప్పారు. నైపుణ్యాల శిక్షణకు కూడా నిధులు ఖర్చు చేస్తోందని చెబుతూ.. పరిశ్రమలు కూడా ముందుకు రావాలని కోరారు. -
విశాఖలో గ్రే హౌండ్స్..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరింత భరోసా కల్పించేలా... భద్రతను కట్టుదిట్టం చేసేలా... నిరంతరం ప్రణాళికలు, వ్యూహాలతో సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించేలా...మెరికల్లాంటి యువ కమాండోలకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థకు విశాఖ వేదిక కాబోతున్నది. కార్యనిర్వాహక రాజధానిగా మారనున్న తరుణంలో విశాఖ గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థకు కేంద్రం కానుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్ గండిపేటలో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ తరహాలో రాష్ట్రంలో విశాఖలో ఏర్పాటు కానుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖకు వచ్చి ఈ సంస్థ కోసం జగన్నాథపురం గ్రామ సమీపంలో కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. గ్రేహౌండ్స్ శిక్షణకు ఆ స్థలం అనుకూలంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఇప్పటికే విశాఖలో ఆపరేషన్ బేస్డ్ గ్రేహౌండ్స్ కార్యాలయం ఉంది. పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ గ్రేహౌండ్స్‌కి ఈ స్థలం అన్ని విధాలా సరిపోతుందని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి, కలెక్టర్ వినయ్‌చంద్‌లు కూడా ఈ స్థలం పరిశీలించారు. గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ ఏర్పాటుకు ఆనందపురం మండలంలో జగన్నా«థపురం గ్రామ పరిధిలో 385 ఎకరాలు కేటాయించారు. ఇందులో 265 ఎకరాల భూమి సాగు లేకుండా ఖాళీగా ఉంది. మిగతా 120 ఎకరాలు డి–పట్టా భూములున్నాయి. ఈ భూమిని సాగుచేసుకుంటూ జీవనం పొందుతున్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం పరిహారంగా ఇప్పటికే రూ.10.55 కోట్లను కేటాయించింది. గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ ఎందుకంటే...? దేశ అంతర్గత భద్రత, వ్యూహాత్మక ప్రణాళికలపై పట్టు సాధించడానికి శిక్షణ ఇచ్చే సంస్థే గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పటిష్టమైన భద్రతా సంస్థల్లో ఇది ఒకటి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నుంచి గ్రేహౌండ్స్ యువ పోలీసులకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. సుమారు 2500 నుంచి 3000 మంది ఏడాదికి ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇందులో ఏడాదికి నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్‌కి 500 నుంచి 600 మందికి సిబ్బంది శిక్షణ ఇస్తారు. రూ.220 కోట్లు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విభజించిన తర్వాత ..విభజన చట్టంలో పోలీసుశాఖకు పొందుపరిచిన అంశాల్లో భాగంగా గ్రేహౌండ్స్‌కి అప్పట్లో రూ.220 కోట్లు ఇస్తున్నట్టు జీవో కూడా విడుదల చేశారు. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి గ్రేహౌండ్స్ గండిపేట, షాద్‌నగర్‌లో ఉండేది. విభజనానంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనికి స్థలం కేటాయించకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే ఆనందపురంలో సర్వే నంబర్ 1/1లో భూమి కేటాయించింది. గ్రేహౌండ్స్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి, మొదటి విడతగా రూ.220 కోట్లు విడుదల చేసింది. 70 శాతం కేంద్ర ప్రభుత్వం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తారు. ఆపరేషన్ శిక్షణకు అనుకూలం ఇటీవల రెండు వారాల క్రితం డీజీపీ గౌతమ్ సవాంగ్ వచ్చి సంస్థకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. గ్రేహౌండ్స్ శిక్షణలో ప్రధానమైన ఆపరేషన్ తరహా శిక్షణకు అనుకూలమైన ప్రాంతం కూడా ఆ గ్రామ సమీపంలో ఉందని చెప్పారు. ఈ శిక్షణ సంస్థ రెండేళ్లలో ఏర్పాటు కానుందని మీడియాకు చెప్పారు. -
తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్ ఆసియా రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్–సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్(పర్స్) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్ ఫెస్టివల్లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దంపడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్తాన్ ఆల్వర్ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలు అందుబాటులోకి తేనున్నారు. వివరాలకు.. 99859 47003, 98496 15634. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. -
స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ప్రారంభం
మైలవరం: స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం సేవలు యువత సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ భారతదేశ ప్రభుత్వేతర సేవా సంస్థ జాతీయ అధ్యక్షురాలు సాదినేని యామిని తెలిపారు. మైలవరం డౌన్సెంటర్ జెండా చెట్టు వద్ద గల దక్షిణ భారతదేశ ప్రభుత్వేతర సేవా సంస్థ, మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఐటీ, ఐటీఈఎస్, టూరిజం, మార్కెటింగ్ తదితర 10 రంగాలలో నిపుణులైన శిక్షకుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పారు. తొలిగా కాపు కార్పొరేషన్, ఓ 2 స్కిల్స్ వారి సౌజన్యంతో అర్హులైన కాపు సామాజిక అభ్యర్థులకు బ్యూటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తామన్నారు. మైలవరంలో అతి తక్కువ సమయంలో నాణ్యమైన వసతులు కల్పించిన ట్రస్టు రీజియన్ కోఆర్డినేటర్ కోయ సుధను అభినందించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఓ2 స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధి రత్నప్రసాద్, గంటా యేసుబాబు, రమేష్, ఎం. వెంకటసత్యనారాయణ, వి. బాలాజీప్రసాద్, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, చిన్నారి స్నేహం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, విజయా డెయిరీ సూపర్వైజర్ శివశంకర్, వీఆర్ఓ దేవప్రియుడు పాల్గొన్నారు. -
వడోదరలో హైస్పీడ్ రైల్ ట్రైనింగ్ సెంటర్
సాక్షి, వడోదర : గుజరాత్‌లోని వడోదరలో 600 కోట్ల రూపాయలతో మొదటి హైస్పీడ్ రైల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) బుధవారం ప్రకటించింది. ఈ సెంటర్ మొత్తం 5 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అస్కాత్ ఖరే చెప్పరు. ట్రైనింగ్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రైనింగ్ సెంటర్లో ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఏర్పాటు వంటివాటిపై ప్రాథమిక శిక్షణ ఉంటుందని చెప్పారు.