
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్ ఆసియా రూరల్ రీకన్‌స్ట్రక్షన్ అసోసియేషన్(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్–సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్(పర్స్) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్ ఫెస్టివల్‌లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దంపడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్తాన్ ఆల్వర్ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలు అందుబాటులోకి తేనున్నారు. వివరాలకు.. 99859 47003, 98496 15634. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే.