ఆ రైతు క్షేత్రం దట్టమైన ఆహారపు అడవి
పదేళ్లుగా పాలేకర్ పద్థతిలో గడ్డి మందు సహా, 100% రసాయనాల్లేని సాగు
20 ఎకరాల్లో లక్ష్మణ ఫలం నుంచి అవకాడో వరకు పండ్లు, కూరగాయల సాగు
పంటలతో పాటు గొర్రెలు, నాటుకోళ్లు, చేపల పెంపకంతో నిరంతరాదాయం
ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ప్రభుత్వాధికారి అంజిరెడ్డి సేద్యం
ఏదుళ్ల అంజిరెడ్డి 2013లో హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నేలతల్లికి ప్రణమిల్లి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో అన్ని సంపదల్లో కెల్లా ఆరోగ్య సంపద గొప్పదని భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద తన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దట్టమైన ఆహారపు అడవిగా మార్చారు. తొలుత కుటుంబ అవసరాల కోసం పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలు సాగు చేయనారంభించి.. వ్యవసాయాన్ని క్రమంగా 20 ఎకరాలకు విస్తరించారు.
మామిడి నుంచి అవకాడో వరకు 11 రకాల పండ్లతో పాటు 10 రకాల పంటలను సాగు చేస్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, చింత, రావి, వెదురు, సరుగుడు, మహాగని మొక్కల్ని నాటారు. బహురూపి దేశీవరిని సాగు చేస్తున్నారు. గత పదేళ్లుగా భూసారం సమృద్ధిగా వృద్ధి చెందటం ఆ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతూ పచ్చగా ఉన్న తోటలో అనేక చోట్ల పుట్టలు కనిపిస్తాయి.
పంటలతో పాటే గొర్రెలు, కోళ్లు..
ఏ చెట్టు కింద మట్టిని తీసినా వానపాములు ఉంటాయి. పండ్లు, కూరగాయల సాగే కాకుండా 500కు పైగా గొర్రెలతో అధునాతన ఫామ్‌ను అంజిరెడ్డి గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. గొర్రెల మేత కోసం ఆరోగ్యవంతమైన గడ్డిని పెంచుతున్నారు. తోటలో నాటు కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతున్నారు. సీమ కోళ్లు, బాతులు ఉన్నాయి. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో కొర్రమీను చేపలనూ పెంచుతున్నారు. డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతాన్ని చెట్లు, మొక్కలకు అందిస్తున్నారు. భూమిని దున్నకుండా అవసరం ఉన్న చోటనే పరిమితంగా దున్ని కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. క్రిమికీటకాల నివారణకు వేప నూనెను స్ప్రే చేస్తున్నారు.
నేరుగా అమ్మకాలు
తన సమీకృత వ్యవసాయ క్షేత్రం దగ్గర, నల్లగొండలోని తన నివాసం వద్ద పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు అంజిరెడ్డి. కలుపు మందు సహా ఏ రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నందున దిగుబడుల నాణ్యతను గుర్తించిన నల్గొండ నగర ప్రజలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు ఏ రకం అయినా కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కేజీ రూ.420 లెక్కన గొర్రెలను విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు రూ.15, జామ కాయలు కిలో రూ.60, సపోట కిలో రూ.40, నిమ్మ వేసవిలో కిలో రూ.100, వానాకాలంలో కిలో రూ.50, బత్తాయి కిలో రూ.80, మామిడి రూ.100 – 150, కూర అరటి డజన్ రూ.70, అరటి పండ్లు డజన్ రూ.80, నెయ్యి కిలో రూ. 1,200, ΄ాలు లీ. రూ.80 చొప్పున విక్రయిస్తూ అంజిరెడ్డి రోజూ ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా 20 ఎకరాలలో ఖాళీ స్థలం లేకుండా బహుళ పంటలను సాగు చేస్తూ.. జీవాలు, కోళ్లను పెంచుతుండటంతో అంజిరెడ్డి క్షేత్రం ఏడాది పొడవునా దిగుబడులనిచ్చే అక్షయపాత్రగా మారింది.
– కుంభం వెంకటేశ్వర్లు గౌడ్,
సాక్షి, నల్లగొండ రూరల్
ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్,
స్టాఫ్ ఫొటోగ్రాఫర్
ప్రతి రైతూ కుటుంబం కోసమైనా రసాయనాల్లేకుండా పండించాలి
భూసారాన్ని కాపాడుకుంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. క్యాన్సర్, గుండె΄ోటు, బీపీ, షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు రావడానికి రసాయనాలతో పండించిన ఆహరమే కారణం అని గ్రహించాను. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని మా కుటుంబంతో పాటు ప్రజలకూ అందించటం కోసమే రైతుగా మారాను. ప్రతి రైతూ మిశ్రమ పంటలను తన కుటుంబ అవసరాల కోసమైనా రసాయనాలు లేకుండా సాగు చేసుకోవాలి. విద్యార్థులకు ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తే వారిలో ప్రకృతి సేద్యంపై, ఆరోగ్యదాయకమైన ఆహారంపై అవగాహన పెరుగుతుంది. రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వారు భవిష్యత్తులో వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతారన్న ఆశతో క్షేత్ర పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు వ్యవసాయం గురించి వివరిస్తున్నా.
– ఏదుళ్ల అంజిరెడ్డి (99482 55544),
ప్రకృతి వ్యవసాయదారుడు, నల్గొండ
Comments
Please login to add a commentAdd a comment