profitable
-
'లాభాల్లోకి వస్తాం.. ఇదే మా సంకల్పం': పేటీఎం సీఈవో
న్యూఢిల్లీ: నిర్వహణ లాభం కంటే నికర లాభంపై పేటీఎం దృష్టి సారించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈసాప్ (ఉద్యోగులకు స్టాక్స్) వ్యయాలకు ముందు ఎబిట్డా పాజిటివ్ సాధిస్తామని పేటీఎం గతంలో ప్రకటించడం గమనార్హం. ‘‘ఈసాప్కు ముందు ఎబిట్డా కంటే నికర లాభం గురించే చెప్పాలంటూ కంపెనీ బోర్డు సభ్యుడు ఒకరు నాకు సూచించారు. ఇప్పుడు ఈసాప్ వ్యయాలకు ముందు ఎబిట్డా ఒక్కటే కాకుండా, నికర లాభాన్ని నమోదు చేయాలని అనుకుంటున్నాం. ఇదే మా కొత్త సంకల్పం’’అని శర్మ తెలిపారు.పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా వాటాదారులకు ఈ వివరాలు వెల్లడించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం రూ.840 కోట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.358 కోట్లుగా ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేయడం తదనంతర పరిణామాలతో కంపెనీల నష్టాలు పెరిగాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంకృత్రిమ మేథ ప్రభావాన్ని ఈ సందర్భంగా శర్మ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ఏఐ ఎన్నో మార్పులకు కారణమవుతోందంటూ.. వచ్చే ఐదేళ్లలో ఆటోమేటెడ్ కార్లు పెరిగిపోవచ్చన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఎదిగిన భారత్, ఏఐ టెక్నాజీలోనూ ఇదే విధంగా అవకాశాలను సొంతం చేసుకోవాలన్నారు. రిస్క్ నిర్వహణలో ఏఐ సాంకేతికతకు పేటీఎం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు శర్మ చెప్పారు. -
సేంద్రీయ వ్యవసాయం : ఏడాది పొడవునా ఆదాయం!
ఆ రైతు క్షేత్రం దట్టమైన ఆహారపు అడవిపదేళ్లుగా పాలేకర్ పద్థతిలో గడ్డి మందు సహా, 100% రసాయనాల్లేని సాగు 20 ఎకరాల్లో లక్ష్మణ ఫలం నుంచి అవకాడో వరకు పండ్లు, కూరగాయల సాగుపంటలతో పాటు గొర్రెలు, నాటుకోళ్లు, చేపల పెంపకంతో నిరంతరాదాయం ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ప్రభుత్వాధికారి అంజిరెడ్డి సేద్యంఏదుళ్ల అంజిరెడ్డి 2013లో హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నేలతల్లికి ప్రణమిల్లి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో అన్ని సంపదల్లో కెల్లా ఆరోగ్య సంపద గొప్పదని భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద తన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దట్టమైన ఆహారపు అడవిగా మార్చారు. తొలుత కుటుంబ అవసరాల కోసం పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలు సాగు చేయనారంభించి.. వ్యవసాయాన్ని క్రమంగా 20 ఎకరాలకు విస్తరించారు.మామిడి నుంచి అవకాడో వరకు 11 రకాల పండ్లతో పాటు 10 రకాల పంటలను సాగు చేస్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, చింత, రావి, వెదురు, సరుగుడు, మహాగని మొక్కల్ని నాటారు. బహురూపి దేశీవరిని సాగు చేస్తున్నారు. గత పదేళ్లుగా భూసారం సమృద్ధిగా వృద్ధి చెందటం ఆ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతూ పచ్చగా ఉన్న తోటలో అనేక చోట్ల పుట్టలు కనిపిస్తాయి. పంటలతో పాటే గొర్రెలు, కోళ్లు..ఏ చెట్టు కింద మట్టిని తీసినా వానపాములు ఉంటాయి. పండ్లు, కూరగాయల సాగే కాకుండా 500కు పైగా గొర్రెలతో అధునాతన ఫామ్‌ను అంజిరెడ్డి గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. గొర్రెల మేత కోసం ఆరోగ్యవంతమైన గడ్డిని పెంచుతున్నారు. తోటలో నాటు కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతున్నారు. సీమ కోళ్లు, బాతులు ఉన్నాయి. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో కొర్రమీను చేపలనూ పెంచుతున్నారు. డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతాన్ని చెట్లు, మొక్కలకు అందిస్తున్నారు. భూమిని దున్నకుండా అవసరం ఉన్న చోటనే పరిమితంగా దున్ని కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. క్రిమికీటకాల నివారణకు వేప నూనెను స్ప్రే చేస్తున్నారు.నేరుగా అమ్మకాలుతన సమీకృత వ్యవసాయ క్షేత్రం దగ్గర, నల్లగొండలోని తన నివాసం వద్ద పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు అంజిరెడ్డి. కలుపు మందు సహా ఏ రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నందున దిగుబడుల నాణ్యతను గుర్తించిన నల్గొండ నగర ప్రజలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు ఏ రకం అయినా కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కేజీ రూ.420 లెక్కన గొర్రెలను విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు రూ.15, జామ కాయలు కిలో రూ.60, సపోట కిలో రూ.40, నిమ్మ వేసవిలో కిలో రూ.100, వానాకాలంలో కిలో రూ.50, బత్తాయి కిలో రూ.80, మామిడి రూ.100 – 150, కూర అరటి డజన్ రూ.70, అరటి పండ్లు డజన్ రూ.80, నెయ్యి కిలో రూ. 1,200, ΄ాలు లీ. రూ.80 చొప్పున విక్రయిస్తూ అంజిరెడ్డి రోజూ ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా 20 ఎకరాలలో ఖాళీ స్థలం లేకుండా బహుళ పంటలను సాగు చేస్తూ.. జీవాలు, కోళ్లను పెంచుతుండటంతో అంజిరెడ్డి క్షేత్రం ఏడాది పొడవునా దిగుబడులనిచ్చే అక్షయపాత్రగా మారింది. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్ ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ప్రతి రైతూ కుటుంబం కోసమైనా రసాయనాల్లేకుండా పండించాలిభూసారాన్ని కాపాడుకుంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. క్యాన్సర్, గుండె΄ోటు, బీపీ, షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు రావడానికి రసాయనాలతో పండించిన ఆహరమే కారణం అని గ్రహించాను. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని మా కుటుంబంతో పాటు ప్రజలకూ అందించటం కోసమే రైతుగా మారాను. ప్రతి రైతూ మిశ్రమ పంటలను తన కుటుంబ అవసరాల కోసమైనా రసాయనాలు లేకుండా సాగు చేసుకోవాలి. విద్యార్థులకు ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తే వారిలో ప్రకృతి సేద్యంపై, ఆరోగ్యదాయకమైన ఆహారంపై అవగాహన పెరుగుతుంది. రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వారు భవిష్యత్తులో వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతారన్న ఆశతో క్షేత్ర పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు వ్యవసాయం గురించి వివరిస్తున్నా. – ఏదుళ్ల అంజిరెడ్డి (99482 55544), ప్రకృతి వ్యవసాయదారుడు, నల్గొండ -
పదేళ్లలో ఫస్ట్‌టైమ్! టీసీఎస్‌ను మించిన మరో టాటా కంపెనీ..
టాటా గ్రూప్‌లోని కంపెనీలన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఉన్న దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభంతో టాటా మోటార్స్ టీసీఎస్ నికర లాభం రూ.12,434 కోట్లను అధిగమించింది. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5,407.79 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 221.89 శాతం పెరిగింది. మరోవైపు టీసీఎస్ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.11,392 కోట్ల నుంచి 9.1 శాతం వృద్ధిని సాధించింది.టాటా మోటర్స్ చివరిసారిగా 2014 జూన్ త్రైమాసికంలో టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది. అయితే గ్రూప్‌లోని మరో పెద్ద కంపెనీ టాటా 2024 క్యూ4 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టాటా మోటార్స్ టీసీఎస్ త్రైమాసిక లాభాలను అధిగమించినప్పటికీ , వార్షిక ప్రాతిపదికన టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్ కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం లాభం రూ.45,908 కోట్లు కాగా టాటా మోటార్స్ మొత్తం లాభం రూ.31,399 కోట్లు. -
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్‌కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి. 5 శాతం పెరగొచ్చు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మోస్తరు స్థాయిలో ధరలు చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
మాకు తిరుగులేదు..ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో అదరగొట్టేస్తున్నాం!
న్యూఢిల్లీ: స్విగ్గీ ఫుడ్ వ్యాపారం లాభాల్లోకి ప్రవేశించినట్టు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి ప్రకటించారు. కంపెనీ ఏర్పాటైన తొమ్మిదేళ్ల లోపే ఈ మైలురాయిని చేరుకున్నామని, అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కేవలం కొన్ని కంపెనీల్లో స్విగ్గీ ఒకటిగా ఉన్నట్టు తెలిపారు. ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లకు వెళ్లి తినడం పట్ల తాము బుల్లిష్‌గా ఉన్నట్టు బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల కాలానికి వృద్ధి సామర్థ్యాల పట్ల స్విగ్గీ ఎంతో ఆశావహంగా ఉందని ప్రకటించారు. ఫుడ్ డెలివరీలో ఇక ముందూ వృద్ధిని కొనసాగిస్తామన్నా రు. ‘‘ఆవిష్కరణలపై మా తీక్షణ దృష్టి, బలమైన నిర్వహణ మరో మైలురాయిని చేరుకోవడానికి తోడ్పడ్డా యి. 2023 మార్చి నాటికి స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయంగా మారింది (అన్ని వ్యయాలు కలిపి చూసుకుంటే)’’అని శ్రీహర్ష వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో సాయపడిన భాగస్వాములు అందరికీ అభినందనలు తెలిపారు. కస్టమర్లతో స్విగ్గీకి బలమైన అనుబం ధం ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమలోనే మెరుగైన రిపీట్, రిటెన్షన్ (కస్టమర్ల నుంచి మళ్లీ ఆర్డర్లు పొందడం, కస్టమర్లను నిలబెట్టుకోవడంలో) రేటు ను కలిగి ఉన్నట్టు చెప్పారు. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. స్విగ్గీతో రెస్టారెంట్ భాగస్వాముల అనుభవం కూడా మెరుగ్గా ఉందంటూ, ఇది పరస్పర విజయంగా పేర్కొన్నారు. ఆరంభంలోనే ఉన్నాం: 2014లో స్విగ్గీ ఫుడ్ డెలివరీని ప్రధాన వ్యాపారంగా మొదలు పెట్టినప్పడు, చాలా మంది దీన్ని గిట్టుబాటు కాని వ్యాపార నమూనాగా భావించినట్టు శ్రీహర్ష తెలిపారు. కానీ, ఇంత కాలం తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలైందన్నారు. ‘‘ఈటింగ్ అవుట్ (రెస్టారెంట్లతో తినడం/డైన్ అవుట్), ఫుడ్ డెలివరీ వ్యాపారం భారత్‌లో ఇంకా ఆరంభ దశలోనే ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. వచ్చే రెండు దశాబ్దాల పాటు వృద్ధి పట్ల ఆశాభావంతో ఉన్నాం. ఫుడ్ డెలివరీ మరింత వృద్ధి చెందేందుకు బాధ్యతాయుత, కావాల్సిన చర్యలు చేపడతాం. దేశంలో ఇంకా సేవలు అందని ప్రాంతాలు, వినియోగ వర్గాలు చాలానే ఉన్నాయి. సరైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించడమే మా లక్ష్యం’’అని శ్రీహర్ష తెలిపారు. క్విక్‌కామర్స్ వ్యాపారం విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ప్రకటించారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నేడు క్విక్ కామర్స్‌లో ప్రముఖ సంస్థగా ఉన్నట్టు చెప్పారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముగిసినట్టేనని స్పష్టం చేశారు. ఇన్‌స్టామార్ట్‌ను లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మంచి పురోగతి సాధించామని, వచ్చే కొన్ని వారాల్లో తటస్థ స్థితికి చేరుకుంటామన్నారు. డైన్ అవుట్ విభాగంలోనూ తాము లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు. 34 పట్టణాల్లో తమకు 21,000 రెస్టారెంట్ భాగస్వాములు ఉన్నట్టు తెలిపారు. -
పెట్టుబడుల రక్షణకు మూడు సూత్రాలు...రిస్క్‌లేకుండా!
గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితిపరమైన సవాళ్లు నెలకొన్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే రాణిస్తోంది. దేశీ మార్కెట్లలో కరెక్షన్ కొంత స్థాయికే పరిమితమైంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం, కార్పొరేట్లు మొదలైన వర్గాలన్నీ పరిస్థితిని చక్కగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ఆపేవరకూ మార్కెట్లలో కుదుపులు కొన సాగుతూనే ఉంటాయి. దేశీ మార్కెట్ వేల్యుయేషన్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నందున మదుపరులు.. రిస్కులను గుర్తెరిగి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోను రిస్కుల నుండి కాపాడుకునేందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లు పాటించతగిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. డెట్ ఫండ్స్‌లో మదుపు ఏడాదిన్నర, రెండేళ్లుగా పాపులారిటీని కోల్పోయిన డెట్ సాధనాలు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నాయి. వివిధ కాలావధులకు సంబంధించి అధిక రాబడులు అందిస్తున్నాయి. అధిక ధరలు, అంతర్జాతీయ ఎకానమీకి పెను సవాళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ రెపో రేట్ పెంపు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రిస్కులు ఉండే స్వల్ప, మధ్య కాలిక ఎక్రూవల్ ఫండ్స్, అలాగే డైనమిక్ వ్యవధుల స్కీములను ఎంచుకోవచ్చు. ఫ్లోటింగ్-రేట్ బాండ్లు (ఎఫ్ఆర్బీ) అన్నింటి కన్నా మెరుగ్గా రాణించగలవని అంచనాలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంలో .. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. లక్ష్యాల ఆధారిత ఫండ్స్ .. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కి అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించడం పూర్తయ్యే వరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు .. ముఖ్యంగా భారతీయ మదుపుదారులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మూడు నుంచి అయిదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించుకుని రాబోయే ఏడాది కాలంలో సిప్మార్గంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. ఇక ఈక్విటీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా మల్టీ–అసెట్ కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించవచ్చు. అలాగే వివిధ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా సాధించేందుకు బూస్టర్ సిప్, బూస్టర్ ఎస్టీపీ లేదా ఫ్రీడమ్ ఎస్‌డబ్ల్యూపీ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు .. వివిధ సాధనాల్లో పెట్టుబడులతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పాటిస్తే.. ఒక సాధనం వల్ల నష్టాలేవైనా వచ్చినా మరొక దాని ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్న తరుణంలో బంగారం, వెండి వంటి కమోడిటీలు ఆసక్తికరమైన సాధనాలుగా ఉండగలవు. ద్రవ్యోల్బణానికి మాత్రమే కాకుండా కరెన్సీ క్షీణతకు కూడా ఇవి హెడ్జింగ్ సాధనంగా పని చేయగలవు. ఈటీఎఫ్‌ల మార్గంలో వీటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. డీమ్యాట్ ఖాతా లేని వారికి గోల్డ్ లేదా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉండగలవు. -ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ ఎండీ, నిమేష్ షా -
మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!
సాక్షి,సిరిసిల్లఅర్బన్: టిఫిన్ కావాలంటే ఇప్పుడు హోటళ్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు స్వచ్ఛమైన, రుచికరమైన వేడి, వేడి టిఫిన్ ప్రస్తుతం మోబైల్ వాహనం రూపంలో అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా జనసంచారం ఉన్న ప్రధాన కూడళ్లలో మొబైల్ టిఫిన్ సెంటర్ల ద్వారా అందిస్తున్నారు. కేవలం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ సెంటర్లో దోసా, ఇడ్లీ, వడ, బోండా, పూరి నిమిషాల్లో తయారు చేసి వేడి, వేడిగా అల్లం చట్నీతో అందిస్తున్నారు. రుచి, శుచికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వినియోగదారులు వీటి వద్ద క్యూ కడుతున్నారు. ప్రజాదరణ పెరగడంతో వీటి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రహదారులే అడ్డాలుగా.. జిల్లా కేంద్రంలో విద్యానగర్, రగుడు, కొత్త చెరువు, బస్టాండ్, పెద్దూరు తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులను అడ్డాలుగా చేసుకొని చిరువ్యాపారులు మొబైల్ టిఫిన్ సెంటర్లను నడిపిస్తున్నారు. వీటికి అద్దె చెల్లించడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో హోటళ్లలో ఉండే ధరల కంటే తక్కువ ధరలకే టిఫిన్స్ అందిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి మోబైల్ టిఫిన్ సెంటర్ల వ్యాపారం నిరుద్యోగులకు వరంలా మారింది. నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగానే ఉండడంతో వీటి ఆధారంగా రోజుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తున్నారు. వీరు జీవనోపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఐదేళ్లుగా నడుపుతున్నా మాది తంగళ్లపల్లి గ్రామం. దాదాపు ఐదేళ్లుగా మొబైల్ టిఫిన్ సెంటర్‌ని నడిపిస్తున్నా. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో విద్యానగర్ చౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపి ఉంచుతా. నాతో పాటు మరో ఇద్దరం దీని వల్ల ఉపాధి పొందుతున్నాం. – తలగోప్పుల రాజు, మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు నాణ్యతకే ప్రాధాన్యత స్వచ్ఛమైన, రుచికరమైన టిఫిన్స్ అందించడంతో ఆదరణ పెరుగుతోంది. అలాగే హోటళ్లలో కంటే తక్కువ ధరకు అందిస్తున్నాం. వాహనదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆగి మరి తిని వెళ్తుంటారు. – మనోహార్, సిరిసిల్ల, మొబైల్ సెంటర్ నిర్వాహకుడు రుచికరంగా ఉంటుంది కొత్త చెరువు వద్ద ఒక మోబైల్ టిఫిన్ సెంటర్ ఉదయం అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు రుచికరంగా అందిస్తుండడంతో వాహనదారులు, వ్యాపారులు ఇక్కడే టిఫిన్ చేసి వెళ్లారు. నిర్వాహకులు అల్పాహరాన్ని రుచితో పాటు శుచి, శుభ్రత పాటిస్తున్నారు. – సందవేణి శ్రీనివాస్, సిరిసిల్ల -
లాభసాటి బిజినెస్, మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్
జగిత్యాలటౌన్: మహిళల మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్‌లు నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ట్రెండుతో పాటు మహిళల ఆసక్తి, అభిరుచికి తగిన విధంగా అనేక రంగులు, డిజైన్లు, మెటీరియల్ ఒకేచోట లభిస్తుండటంతో బొటిక్‌లకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక షాపులో మెటీరియల్ కొనుగోలు చేసి దానికి లైనింగ్ మరోచోట, స్టిచింగ్ ఇంకో చోట ఇలా పలు దుకాణాలు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాల నిర్వహణతో బిజీగా మారిన మహిళలకు వన్‌స్టెప్ సర్వీస్ అందజేస్తున్న బొటిక్‌లు వరంగా మారాయి. మెటీరియల్, లైనింగ్, డిజైనింగ్‌తో పాటు స్టిచింగ్ కూడా ఒకేచోట లభిస్తుండటంతో మహిళలు బొటిక్‌లకు క్యూ కడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, పార్టీలు, సందర్భం ఏదైనా బొటిక్కు వెళ్లి అకేషన్ డీటేల్స్ చెప్తే చాలు మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి కంప్యూటర్ డిజైనింగ్ మగ్గం వర్క్ ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా రెడీ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడం బొటిక్‌ల ప్రత్యేకత. అభిరుచికి అనుగుణంగా.. గతంలో కస్టమర్లు మ్యాచింగ్ బ్లౌజులు మాత్రమే అడిగేవారు. ప్రస్తుతం మారుతున్న మహిళల ఆలోచన, అభిరుచికి అనుగుణంగా మగ్గం వర్క్, బోట్‌నెక్, కంప్యూటర్ బ్లౌజులకు గిరాకీ పెరిగింది. అకేషన్ డీటేల్స్ చెప్తే ఏది వేసుకుంటే బాగుంటుందో సజెస్ట్ చేయడమే కాకుండా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ సెలెక్షన్, డిజైన్, మగ్గం వర్క్‌తో ట్రెండీ బ్లౌజెస్ రెడీ చేసి ఇస్తాం. అందుబాటు ధరల్లో అనుకున్న డిజైన్లు అనుకున్న సమయానికి డెలివరీ ఇస్తున్నాం. బొటిక్ నిర్వహణతో స్వయం ఉపాధితో పాటు పదిమందికి పని కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – ప్రణీత, బొటిక్ నిర్వాహకురాలు మహిళల అభిరుచిని బట్టి బోట్‌నెక్, మగ్గం వర్క్, కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజెస్ అందుబా టులో ఉన్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ ధరలు రూ.1400 నుంచి రూ.10వేల వరకు ఉండగా, బోట్‌నెక్ బ్లౌజులకు రూ.400 నుంచి రూ. వెయ్యి చార్జ్ చేస్తున్నారు. కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజులకు రూ.500 నుంచి రూ.3వేల వరకు మెటీరియల్ డిజైన్ బట్టి ధర నిర్ణయిస్తారు. -
ఆ 27 మంది ఆప్ ఎమ్మెల్యేలు అర్హులే
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల వివాదం నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు అర్హులేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఢిల్లీలోని అధికార ఆప్‌కి ఊరట లభించినట్లయింది. లాభదాయక పదవుల్లో ఉన్న కారణంగా ఆప్‌కి చెందిన 27 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ అందిన దరఖాస్తును రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. 27 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీలోని సర్కారు దవాఖానల్లో ‘రోగి కల్యాణ్ సమితి’ చైర్మన్లుగా నియమిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం..ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటయ్యే ‘రోగి కల్యాణ్ సమితి’కి ఆప్రాంత ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉంటారు. ప్రతి సమితికి ఏడాదికి రూ.3 లక్షల వరకు గ్రాంట్‌ను ప్రభుత్వం ఇస్తుంది. -
‘హరితహారంతో’ రైస్ ఇండస్ట్రీకి లాభం
హాలియా: హరితహారం కార్యక్రమం ద్వారా రైస్ పరిశ్రమలకు లాభం చేకూరనుందని జిల్లా పౌరసరఫరాల అధికారి అమృతారెడ్డి పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం హాలియాలోని బాలాజీ రైస్ మిల్లులో మొక్కలను నాటారు. చెట్లు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుసి పంటలు పండుతాయని, దీంతో బియ్యం పరిశ్రమలు నిరంతరం నడుస్తాయన్నారు. జిల్లాలో రైస్ మిల్లులు, గ్యాస్ గోడౌన్లలో ఇప్పటి వరకు 63 వేల మెుక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ప్రేమ్‌కుమార్, డీటీసీ ఎస్‌లు రంగారావు, లక్ష్మణ్‌బాబు, సర్పంచ్ ఉడ్తూరి వెంకట్‌రెడ్డి, హాలియా ఉపసర్పంచ్ పాంపాటి శ్రీనివాస్, మిల్లర్లు చిట్టిప్రోలు యాదగిరి, గార్లపాటి మట్టపల్లి, చిట్టిప్రోలు వెంకటేశ్వర్లు, పేలపూడి బాలకృష్ణ, ప్రసాద్, శ్రీనివాస్, రమేష్, కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ 28 వేలు దాటిన సెన్సెక్స్
వరుసగా మూడో వారమూ లాభాల్లో స్టాక్ మార్కెట్ - 147 పాయింట్ల లాభంతో 28,093 పాయింట్లకు సెన్సెక్స్ - 40 పాయింట్ల లాభంతో 8,485 పాయింట్లకు నిఫ్టీ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాట పట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 28,000 పాయింట్ల పైన ముగిసింది. భారీగా నిధులు ఖర్చయ్యే స్కీమ్‌లను ప్రభుత్వం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆశావహ వ్యాఖ్యలు సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 28,093 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 లాభపడి 8,485 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయిమారకం బలపడడం కూడా ప్రభావం చూపింది. గ్రీస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలతో ట్రేడింగ్ చివరి వరకూ కొనుగోళ్లు జరిగాయి. అయితే చైనా మార్కెట్ పతనం కారణంగా లోహ, మైనింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆద్యంతం ఒడిదుడుకులు... సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ, ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం వంటి కారణాల వల్ల తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఇంట్రాడేలో 28,135 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 147 పాయింట్ల లాభంతో 28,093 పాయింట్ల వద్ద ముగిసింది. 8,424-8,498 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు 40 పాయింట్ల లాభంతో 8,485 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 281 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ సూచీలు చెరో 1 శాతం లాభపడ్డాయి. వరుసగా మూడో వారమూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. లాభ నష్టాల్లో... 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ 2.5%లాభపడింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ఇదే బాటలో హీరోమోటొకార్ప్ 1.7%, లుపిన్ 1.6%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.6%, భెల్ 1%, టీసీఎస్ 0.9%, ఎన్టీపీసీ 0.8%, బజాజ్ ఆటో 0.7%, సిప్లా 0.7%, యాక్సిస్ బ్యాంక్ 0.6%, ఎల్ అండ్ టీ 0.6%, ఎస్బీఐ 0.5 % చొప్పున పెరిగాయి. వేదాంత 1.9 శాతం, కోల్ ఇండియా 1.6 శాతం, టాటా స్టీల్ 1.1 శాతం, విప్రో0.9 శాతం, టాటా మోటార్స్ 0.7 శాతం, హిందాల్కో 0.5 శాతం, గెయిల్ 0.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.3 శాతం చొప్పున తగ్గాయి. 1,526 షేర్లు లాభాల్లో, 1,454 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,363 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.12,976 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,47,281 కోట్లుగా నమోదైంది. బజాజ్ ఫైనాన్స్.. నెలలో 30 శాతం అప్... బజాజ్ ఫైనాన్స్ బీఎస్ఈలో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని(రూ.5,596) తాకిం ది. నెలలో ఈ షేర్ 30% ఎగసింది. గత నెల 3న రూ.4,317 వద్ద ఉన్న ఈ షేర్ ఈ నెల 3న రూ. 5,557 వద్ద ముగిసింది. గత నెలలో ఈ కంపెనీ క్విప్ విధానంలో 32.7 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.1,400 కోట్లు సమీకరించింది. -
లాభాల బాటలో నడిపిస్తాం
మరో నాలుగైదేళ్లలో ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీకి ఆర్టీసీ ఆర్ఎం గోపీనాథరెడ్డి, సీఎండీ విజయ్‌భాస్కర్, ప్రొద్దుటూరు డిపో మేనేజర్ గిరిధర్‌రెడ్డి, అర్బన్ సీఐ సత్యనారాయణ, ఎంప్లాయిస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం డిపో పరిస్థితిపై ఎండీ ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎండీ మాట్లాడుతూ బస్స్టేషన్ల అభివృద్ధికి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్యలున్నా తెలుసుకుని వెంటనే స్పందించేందుకు మరో 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆర్టీసీ మీ కోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా,మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, డ్రైవింగ్ ప్రమాదకరంగా ఉన్నా, బస్సు శుభ్రంగా లేకపోయినా, ఏసీ సరిగా పనిచేయకపోయినా, బస్సు వేళకు రాకపోయినా, లగేజి మిస్సింగ్ అయినా, స్టాప్‌లో బస్సు ఆగకపోయినా ఒక ఎస్ఎంఎస్ ద్వారా జిల్లా, రీజియన్ స్థాయి అధికారులు స్పందించే విధంగా దీన్ని రూపొందించామన్నారు. ఎస్ఎంఎస్ చేసిన వెంటనే ఫిర్యాదు నెంబర్ కూడా సంబంధిత ఫిర్యాదుదారునితోపాటు ఆ బస్సులో ఉన్న డ్రైవర్‌కు, కండక్టర్‌కు కూడా వెళుతుందన్నారు. ఆర్ఎం స్థాయిలో ఏ డిపోలో ఎన్ని సమస్యలు వచ్చాయి అన్న విషయంపై రివ్యూ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరేడు వందల బస్సు స్టేషన్లకు వచ్చే అన్ని సమస్యలపై ఒక నివేదిక తయారు చేస్తామన్నారు. జీఎపీఎస్ సిస్టంను ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో 1400 సర్వీసుల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రమాదాల్లో కడప జిల్లా తక్కువ నమోదు చేసి నెంబర్-1 స్థానంలో ఉందన్నారు. మహిళల పట్ల కండక్టర్ ప్రవర్తనపై విచారణ శనివారం విజయవాడ బస్సులో ప్రయాణించిన మహిళలు కండక్టర్ శ్రీనివాసులుపై ఇచ్చిన ఫిర్యాదు తన దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణ చేయాలని ఆదేశించానన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎన్ఆర్ శేఖర్ సమస్యలపై ఎండీకి వినతి పత్రం ఇచ్చారు.