న్యూఢిల్లీ: నిర్వహణ లాభం కంటే నికర లాభంపై పేటీఎం దృష్టి సారించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈసాప్ (ఉద్యోగులకు స్టాక్స్) వ్యయాలకు ముందు ఎబిట్డా పాజిటివ్ సాధిస్తామని పేటీఎం గతంలో ప్రకటించడం గమనార్హం. ‘‘ఈసాప్‌కు ముందు ఎబిట్డా కంటే నికర లాభం గురించే చెప్పాలంటూ కంపెనీ బోర్డు సభ్యుడు ఒకరు నాకు సూచించారు. ఇప్పుడు ఈసాప్ వ్యయాలకు ముందు ఎబిట్డా ఒక్కటే కాకుండా, నికర లాభాన్ని నమోదు చేయాలని అనుకుంటున్నాం. ఇదే మా కొత్త సంకల్పం’’అని శర్మ తెలిపారు.
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా వాటాదారులకు ఈ వివరాలు వెల్లడించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం రూ.840 కోట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.358 కోట్లుగా ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేయడం తదనంతర పరిణామాలతో కంపెనీల నష్టాలు పెరిగాయి.
ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
కృత్రిమ మేథ ప్రభావాన్ని ఈ సందర్భంగా శర్మ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ఏఐ ఎన్నో మార్పులకు కారణమవుతోందంటూ.. వచ్చే ఐదేళ్లలో ఆటోమేటెడ్ కార్లు పెరిగిపోవచ్చన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఎదిగిన భారత్, ఏఐ టెక్నాజీలోనూ ఇదే విధంగా అవకాశాలను సొంతం చేసుకోవాలన్నారు. రిస్క్ నిర్వహణలో ఏఐ సాంకేతికతకు పేటీఎం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు శర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment