లాభాల బాటలో నడిపిస్తాం
మరో నాలుగైదేళ్లలో ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీకి ఆర్టీసీ ఆర్‌ఎం గోపీనాథరెడ్డి, సీఎండీ విజయ్‌భాస్కర్, ప్రొద్దుటూరు డిపో మేనేజర్ గిరిధర్‌రెడ్డి, అర్బన్ సీఐ సత్యనారాయణ, ఎంప్లాయిస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం డిపో పరిస్థితిపై ఎండీ ఆరా తీశారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఎండీ మాట్లాడుతూ బస్‌స్టేషన్ల అభివృద్ధికి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్యలున్నా తెలుసుకుని వెంటనే స్పందించేందుకు మరో 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆర్టీసీ మీ కోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా,మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, డ్రైవింగ్ ప్రమాదకరంగా ఉన్నా, బస్సు శుభ్రంగా లేకపోయినా, ఏసీ సరిగా పనిచేయకపోయినా, బస్సు వేళకు రాకపోయినా, లగేజి మిస్సింగ్ అయినా, స్టాప్‌లో బస్సు ఆగకపోయినా ఒక ఎస్‌ఎంఎస్ ద్వారా జిల్లా, రీజియన్ స్థాయి అధికారులు స్పందించే విధంగా దీన్ని రూపొందించామన్నారు.
ఎస్‌ఎంఎస్ చేసిన వెంటనే ఫిర్యాదు నెంబర్ కూడా సంబంధిత ఫిర్యాదుదారునితోపాటు ఆ బస్సులో ఉన్న డ్రైవర్‌కు, కండక్టర్‌కు కూడా వెళుతుందన్నారు. ఆర్‌ఎం స్థాయిలో ఏ డిపోలో ఎన్ని సమస్యలు వచ్చాయి అన్న విషయంపై రివ్యూ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరేడు వందల బస్సు స్టేషన్లకు వచ్చే అన్ని సమస్యలపై ఒక నివేదిక తయారు చేస్తామన్నారు. జీఎపీఎస్ సిస్టంను ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో 1400 సర్వీసుల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రమాదాల్లో కడప జిల్లా తక్కువ నమోదు చేసి నెంబర్-1 స్థానంలో ఉందన్నారు.
మహిళల పట్ల కండక్టర్ ప్రవర్తనపై విచారణ
శనివారం విజయవాడ బస్సులో ప్రయాణించిన మహిళలు కండక్టర్ శ్రీనివాసులుపై ఇచ్చిన ఫిర్యాదు తన దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణ చేయాలని ఆదేశించానన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎన్‌ఆర్ శేఖర్ సమస్యలపై ఎండీకి వినతి పత్రం ఇచ్చారు.