మళ్లీ 28 వేలు దాటిన సెన్సెక్స్
వరుసగా మూడో వారమూ లాభాల్లో స్టాక్ మార్కెట్
- 147 పాయింట్ల లాభంతో 28,093 పాయింట్లకు సెన్సెక్స్
- 40 పాయింట్ల లాభంతో 8,485 పాయింట్లకు నిఫ్టీ
బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాట పట్టింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ మళ్లీ 28,000 పాయింట్ల పైన ముగిసింది. భారీగా నిధులు ఖర్చయ్యే స్కీమ్‌లను ప్రభుత్వం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆశావహ వ్యాఖ్యలు సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 28,093 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 లాభపడి 8,485 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయిమారకం బలపడడం కూడా ప్రభావం చూపింది. గ్రీస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలతో ట్రేడింగ్ చివరి వరకూ కొనుగోళ్లు జరిగాయి. అయితే చైనా మార్కెట్ పతనం కారణంగా లోహ, మైనింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఆద్యంతం ఒడిదుడుకులు...
సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ, ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం వంటి కారణాల వల్ల తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఇంట్రాడేలో 28,135 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 147 పాయింట్ల లాభంతో 28,093 పాయింట్ల వద్ద ముగిసింది. 8,424-8,498 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు 40 పాయింట్ల లాభంతో 8,485 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 281 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ సూచీలు చెరో 1 శాతం లాభపడ్డాయి. వరుసగా మూడో వారమూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది.
లాభ నష్టాల్లో...
30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ 2.5%లాభపడింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ఇదే బాటలో హీరోమోటొకార్ప్ 1.7%, లుపిన్ 1.6%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.6%, భెల్ 1%, టీసీఎస్ 0.9%, ఎన్‌టీపీసీ 0.8%, బజాజ్ ఆటో 0.7%, సిప్లా 0.7%, యాక్సిస్ బ్యాంక్ 0.6%, ఎల్ అండ్ టీ 0.6%, ఎస్‌బీఐ 0.5 % చొప్పున పెరిగాయి. వేదాంత 1.9 శాతం, కోల్ ఇండియా 1.6 శాతం, టాటా స్టీల్ 1.1 శాతం, విప్రో0.9 శాతం, టాటా మోటార్స్ 0.7 శాతం, హిందాల్కో 0.5 శాతం, గెయిల్ 0.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.3 శాతం చొప్పున తగ్గాయి. 1,526 షేర్లు లాభాల్లో, 1,454 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,363 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.12,976 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,47,281 కోట్లుగా నమోదైంది.
బజాజ్ ఫైనాన్స్.. నెలలో 30 శాతం అప్...
బజాజ్ ఫైనాన్స్ బీఎస్‌ఈలో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని(రూ.5,596) తాకిం ది. నెలలో ఈ షేర్ 30% ఎగసింది. గత నెల 3న రూ.4,317 వద్ద ఉన్న ఈ షేర్ ఈ నెల 3న రూ. 5,557 వద్ద ముగిసింది. గత నెలలో ఈ కంపెనీ క్విప్ విధానంలో 32.7 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.1,400 కోట్లు సమీకరించింది.