రికార్డ్‌ల 'వర్షం' ..!
♦ కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు
♦ మెరుగైన వర్షపాత అంచనాలతో కొనుగోళ్ల సునామీ
♦ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ స్టాక్ సూచీల రికార్డ్‌లు
♦ తొలిసారి 9,400 పాయింట్లపైకి నిఫ్టీ..90 పాయింట్ల లాభం
♦ 315 పాయింట్ల లాభంతో 30,248కి సెన్సెక్స్
వర్షపాత అంచనాలు మెరుగుపడి, ఎల్‌నినో భయాలు తొలగడంతో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల సునామీ చోటు చేసుకుంది. దీంతో స్టాక్ సూచీలు కొత్త శిఖరాలకు ఎగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. నిఫ్టీ తొలిసారిగా 9,400 పాయింట్లపైకి ఎగబాకింది. 90 పాయింట్ల లాభంతో 9,407 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 315 పాయింట్ల లాభంతో 30,248 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో ఈ రెండు స్టాక్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను– సెన్సెక్స్ 30,272 పాయింట్లను, నిఫ్టీ 9,415 పాయింట్లను తాకాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
ఈ జోరు కొనసాగుతుంది...
ఎల్ నినో ప్రభావం తగ్గుతుందని, వర్షాలు గతంలో వేసిన అంచనాల కంటే అధికంగానే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్ల డించడం మార్కెట్‌ను కొత్త శిఖరాలకు చేర్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. వర్షాలు బాగా కురిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఎఫ్‌ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాలు జోరుగా వృద్ధి సాధిస్తాయని తెలియజేశారు. ఈ జోరు కొనసాగుతుందని. నిఫ్టీ 9,500 పాయింట్లకు చేరుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో విశ్లేషకులు, పరేఖ్ అంచనా వేశారు. అంచనాల కంటే ముందుగానే నిఫ్టీ 9,600 పాయింట్లకు చేరవచ్చని ఏంజెల్‌బ్రోకింగ్‌కు చెందిన సమీత్ చవాన్ చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా నిఫ్టీ 10,000 పాయింట్లకు చేరుతుందని గోల్ట్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది.
షేర్ల సమ్‌గతులు...
♦ వర్షపాత అంచనాలు మెరుగుపడడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జోరుగా ఉండనున్నదన్న ఇన్వెస్టర్లు భావించారు. దీంతో ఎరువుల, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కళకళలాడాయి. రాష్ట్రీయ కెమికల్స్, ఫ్యాక్ట్, మద్రాస్ ఫెర్టిలైజర్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 7 శాతం వరకూ లాభపడ్డాయి.
♦ ఈ ఏడాది ఇప్పటిదాకా బీఎస్‌ఈ సెన్సెక్స్ 14% వరకూ లాభపడింది.
♦ ప్రధాన సూచీలతో పాటు ఎన్‌ఎస్‌ఈలో 129 షేర్లు, బీఎస్‌ఈ 500, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లోని 40 షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.
♦ మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో, 8 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
♦ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం 72 శాతం తగ్గినప్పటికీ, భారతీ ఎయిర్‌టెల్ 8 శాతం లాభపడి రూ.373 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే.
♦ హిందుస్తాన్ యూనిలివర్4.6 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.1 శాతం, బజాజ్ ఆటో 1.7 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.6 శాతం, మారుతీ సుజుకీ 1.5 శాతం, సిప్లా 1.4 శాతం, టాటా మోటార్స్ 1.2 శాతం చొప్పున పెరిగాయి.
♦ ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే... విప్రో 1.6 శాతం క్షీణించింది. ఏషియన్ పెయింట్స్ 1.1 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.9 శాతం, టీసీఎస్ 0.8 శాతం, గెయిల్ 0.8 శాతం చొప్పున నష్టపోయాయి.
ఎందుకు పెరిగాయంటే..
మెరుగుపడిన వర్షపాత అంచనాలు: గతంలో వెలువరించిన అంచనాల కంటే అధికంగానే ఈ ఏడాది వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విబాగం(ఐఎండీ) మంగళవారం వెల్ల డించింది. 96 శాతం వర్షపాతం ఉండగలదన్న గతంలోని అంచనాలను తాజాగా వంద శాతానికి పెంచింది. దీంతో ఎల్‌నినో భయాలు తగ్గి కొనుగోళ్ల జోరు పెరిగింది.
విదేశీ కొనుగోళ్ల జోరు: గత రెండు వారాలుగా అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర కొనుగోళ్లు జరపడం సెంటిమెంట్‌ను మరింత పెంచింది. మంగళవారం రూ.333 కోట్లు, బుధవారం రూ.893 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
హెవీ వెయిట్స్ ర్యాలీ: సెన్సెక్స్, నిఫ్టీల్లో అధిక వెయిటేజీ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, ఐటీసీ షేర్లు మంచి లాభాలను సాధించాయి.
జోరుగా దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు: ఈ నెలలో గత వారం వరకూ విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతుండగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర కొనుగోళ్లు జరపడం సానుకూల ప్రభావం చూపింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్‌లు గత నెలలో రూ.9,400 కోట్లు నికరంగా వెచ్చించాయి.
విదేశీ మార్కెట్ల కిక్: ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. మంగళవారం అమెరికా మార్కెట్ లాభాల్లో ముగియడం కలసివచ్చింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమేను ట్రంప్ ప్రభుత్వం ఆకస్మికంగా తొలగించంతో యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
2 లక్షల కోట్ల డాలర్లకు 2% చేరువలో..
స్టాక్ సూచీల రికార్డ్ స్థాయి జోరుతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్ల డాలర్లకు 2% దూరంలోనే ఉంది. ఇన్వెస్టర్ల సంపద రూ. 1,26,61,536 కోట్లకు (1.95 లక్షల కోట్ల డాలర్లకు) ఎగసింది.