లాభాల్లో నుంచి నష్టాల్లోకి
ట్రేడింగ్ చివరి గంటలో బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో అప్పటిదాకా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఫెడ్ నిర్ణయం సానుకూలంగా ఉండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ మధ్యాహ్నం వరకూ 350 పాయింట్లు లాభ పడింది. చివర్లో లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, వాహన, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. చివరకు సెన్సెక్స్ 152 పాయింట్ల నష్టంతో 28,470 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల నష్టం(0.59%)తో 8,635 వద్ద ముగిసింది.
21 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు
నొప్పి నివారణ జనరిక్ ఔషధం(సెలెబ్రెక్స్)కి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించడంతో ల్యుపిన్ షేర్ 2.5 శాతం లాభపడి రూ.1,922 వద్ద ముగిసింది. నొముర బ్రోకరేజ్ సంస్థ కొనచ్చన్న రేటింగ్ ఇవ్వడంతో జస్ట్ డయల్ షేర్ 10 శాతం వృద్ధితో రూ.1,403కు పెరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు నష్టాల్లో, 9 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,730 షేరు నష్టాల్లో, 1,104 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,835 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.18,596 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,85,459 కోట్లుగా నమోదైంది. ఒక్క జపాన్ మార్కెట్ మినహా మిగిలిన ఆసియా దేశాల మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.
ఎన్‌ఎస్‌ఈ క్వాలిటీ 30 ఇండెక్స్
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) గురువారం క్వాలిటీ 30 ఇండెక్స్‌ను ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈ గ్రూప్ సంస్థ అయిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్‌పీ) ఈ క్వాలిటీ 30 ఇండెక్స్‌ను రూపొందించింది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టైన భారీ పెట్టుబడులున్న, లావాదేవీలు అధికంగా జరిగే వంద కంపెనీల నుంచి 30 కంపెనీలను ఎంచుకున్నామని ఐఐఎస్‌పీ పేర్కొంది. ఈక్విటీపై వచ్చిన అధిక రాబడి, ఈక్విటీకి, రుణానికి నిష్పత్తి తక్కువగా ఉండడం, మూడేళ్లలో నికర లాభంలో వృద్ధి.. వంటి అంశాల ఆధారంగా వచ్చిన క్వాలిటీ స్కోర్‌ను బట్టి ఈ వంద కంపెనీల నుంచి 30 క్వాలిటీ కంపెనీలను ఎంపిక చేశామని వివరించింది. పెట్టుబడులు పెట్టడానికి ఒక బెంచ్‌మార్క్‌గా ఈ క్వాలిటీ ఇండెక్స్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడుతుందని పేర్కొంది.