రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు | Sakshi
Sakshi News home page

రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు

Published Mon, May 27 2024 6:16 AM

Expert predictions on the market this week,

తుది దశకు చేరిన ఎన్నికలు, ఆర్థిక ఫలితాల నేపథ్యం 

ప్రపంచ పరిణామాలు, ఎఫ్‌ఐఐల సరళిపై దృష్టి 

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు 

ముంబై: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేట్‌ మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో స్టాక్‌ మార్కెట్లో లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల సరళి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మే డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులకు అవకాశం ఉంది.

 ప్రాథమిక మార్కెట్లో అవఫిస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ సోమవారం ముగిస్తుంది. ఎక్సే్చంజీల్లో షేర్లు గురువారం లిస్టవుతాయి.  ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్‌ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ ఇన్వెస్టర్ల సిర్థమైన కొనుగోళ్లు, ఆర్‌బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్‌ ప్రకటన, ఆయా కంపెనీల మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర పరిణామాలు కలిసొచ్చాయి.  

చివరి దశకు కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు 
దలాల్‌ స్ట్రీట్‌ ముందుగా దివీస్‌ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలతో పాటు గతవారాంతపు రోజుల్లో విడుదలైన ఇతర కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల సీజన్‌ చివరి దశ(ఎనిమిదో వారం)కు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఈ వారంలో దాదాపు  2,100 కి పైగా కంపెనీలు తమ మార్చి క్వార్టర్‌ ఫలితాలు ప్రకటించనున్నాయి. టాటా స్టీల్, ఎల్‌ఐసీ, ఐఆర్‌టీసీ, ఆ్రస్టాజెనికా, నాట్కో ఫార్మా, ఎన్‌ఎండీసీ, జీఐసీలు కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. 

ఎన్నికల ఓటింగ్‌ శాతంపై దృష్టి  
దేశంలో లోక్‌ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఓటింగ్‌ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్‌ జూన్‌ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్‌ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించవచ్చు.  

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం  
జపాన్‌ మే కన్జూమర్‌ కన్ఫిడెన్స్‌ డేటా బుధవారం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి, ఉద్యోగ గణాంకాల గురువారం వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోజోన్‌ ఏప్రిల్‌ నిరుద్యోగ రేటు, పారిశ్రామిక సరీ్వసుల సెంటిమెంట్, మే వినియోగదారుల విశ్వాస గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం(మే 31న) చైనా ఏప్రిల్‌ నిరుద్యోగ రేటు, రిటైల్‌ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్ల డేటా, యూరోజోన్‌ మే ద్రవ్యల్బోణ గణాంకాలతో భారత నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి.  

కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల అమ్మకాలు  
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, సమీక్షా కాలంలో ఎఫ్‌పీఐలు రూ.178 కోట్లను డెట్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్‌లో రూ.2,009  కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ నెల ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం.

గురువారం డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు
ఈ గురువారం(మే 30న) నిఫ్టీకి చెందిన మే సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్‌ ఆఫ్‌ లేదా రోలోవర్‌ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్‌ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 22,800 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే  23,250–23,350 శ్రేణిని పరీక్షిస్తుంది’’ అని ఆప్షన్‌ డేటా సూచిస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement