
ముంబై: భారత్‌తో సహా 75 దేశాలపై ట్రంప్ సుంకాలను మూడు నెలలు వాయిదా వేయడంతో దేశీయ స్టాక్ సూచీలు రెండు శాతం మేర ర్యాలీ చేశాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు పరిమితం చేస్తూ క్రూడాయిల్ ధరలు దిగిరావడం, అమెరికా కరెన్సీ డాలర్ క్షీణత అంశాలు ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,310 పాయింట్లు పెరిగి 75వేల స్థాయిపైన 75,157 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 429 పాయింట్లు బలపడి 22,829 వద్ద నిలిచింది. సూచీల లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే రూ.7.85 లక్షల కోట్లు పెరిగి రూ.401.67 లక్షల కోట్లు(4.66 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.
రోజంతా లాభాలు
సెన్సెక్స్ 988 పాయింట్ల లాభంతో 74,835 వద్ద, నిఫ్టీ 296 పాయింట్లు పెరిగి 22,695 వద్ద మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా భారీ లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,620 పాయింట్లు ఎగసి 75,467 వద్ద, నిఫ్టీ 525 పాయింట్లు బలపడి 22,924 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి.
రంగాల వారీగా ఇండెక్సులు
డాలర్ బలహీనతతో ఎగుమతులపై లాభాలు ఆర్జించే మెటల్, ఫార్మా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 4.29%, కమోడిటీస్ 3.50%, కన్జూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్ సూచీలు 3% ర్యాలీ చేశాయి. విద్యుత్, ఇంధన, ఇండ్రస్టియల్స్, కన్జూమర్ డి్రస్కేషనరీ, హెల్త్‌కేర్ సూచీలు రెండుశాతం పెరిగాయి. వొలటాలిటి ఇండెక్స్(వీఐఎక్స్) 6% క్షీణించి 20.11 స్థాయికి దిగివచి్చంది. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3%, మిడ్ క్యాప్ సూచీ రెండు శాతం లాభపడ్డాయి.
రెండు షేర్లకే నష్టాలు
సెన్సెక్స్‌లో 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్ (0.64%), టీసీఎస్(0.43%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు 5% వరకు ర్యాలీ చేశాయి. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ 2.33%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3%, ఐసీఐసీఐ బ్యాంకు 1%, ఎయిర్‌టెల్ 2.50%, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ 3% రాణించి ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 807 పాయింట్లు కావడం
విశేషం.
నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు డీలాపడింది. బీఎస్‌ఈలో అరశాతం పతనమై రూ.3232 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1% పైగా నష్టపోయి రూ.3205 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఇదీ చదవండి: పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
రూపాయి వరుస నష్టాలకు చెక్
అమెరికా డాలర్ అనూహ్య క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ బలమైన ర్యాలీతో డాలర్ మారకంలో రూపాయి విలువ 58 పైసలు బలపడి 86.10 వద్ద స్థిరపడింది. దీంతో దేశీయ కరెన్సీ నాలుగు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడినట్లైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 86 వద్ద మొదలైంది. రోజంతా లాభాల్లో ట్రేడై ఇంట్రాడే గరిష్టం వద్ద స్థిరపడింది. ‘‘ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 4 ఏళ్లలో తొలిసారి 100 స్థాయికి దిగిరావడంతో పాటు క్రూడాయిల్ ధర తగ్గడం కూడా కలిసొచ్చాయి. వచ్చే వారంలో దేశీయ కరెన్సీ 85.75–86.25 శ్రేణిలో ట్రేడవ్వొచ్చు’’ అని ఫిన్రెక్స్ ట్రైజరీ అడ్వైజర్స్ ఎండీ అనిల్ కుమార్ బన్సాలీ తెలిపారు.