
ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతీకార చర్యలకు దిగడంతో అమెరికా మార్కెట్లు అల్లకల్లోలానికి గురయ్యాయి. 2020 తర్వాత భారీ పతనాన్ని చవిచూశాయి. ఎస్&పీ 500 సూచీ ఏకంగా 6 శాతం పడిపోయింది. ఇది మాంద్యం భయాలకు ఆజ్యం పోసింది. ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఆందోళనను తీవ్రతరం చేసింది.
కోవిడ్-19 సంక్షోభం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటి పరిస్థితి తర్వాత వాల్ స్ట్రీట్ శుక్రవారం తీవ్ర తిరోగమనాన్ని ఎదుర్కొంది. ట్రంప్ టారిఫ్ పెంపునకు ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతులపై ప్రతీకార సుంకాలను ప్రకటించిడంతో ఎస్&పీ 500 సూచీ 6% పడిపోయింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన 2020 మార్చి తర్వాత ఎస్&పీ 500 సూచీ పనితీరుకు సంబంధించి అత్యంత చెత్త వారం ఇదే. ఇక డౌజోన్స్ 2,231 పాయింట్లు (5.5%) క్షీణించగా, నాస్‌డాక్ కూడా 5.8 శాతం పడిపోయింది.
యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలు శుక్రవారం రికార్డు స్థాయిలో 26.79 బిలియన్ షేర్లను ట్రేడ్ చేశాయి. ఇది 2021 జనవరి 27 నాటి గరిష్ట స్థాయి 24.48 బిలియన్లను అధిగమించింది. నాస్‌డాక్ 962.82 పాయింట్లు క్షీణించి 15,587.79 వద్ద ముగిసింది. దాని డిసెంబర్ 16 నాటి రికార్డు ముగింపు గరిష్టం 20,173.89 నుండి 20 శాతానికి పైగా పడిపోయింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2,231.07 పాయింట్లు క్షీణించి 38,314.86 వద్దకు దిగజారింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఎస్&పీ 500 సూచీ 322.44 పాయింట్లు క్షీణించి 5,074.08 వద్దకు పడిపోయింది. 11 నెలల్లో ఇదే అత్యల్ప ముగింపు.
అన్ని షేర్లకూ నష్టాలే..
ఎస్&పీ 500 సూచీలో ఉన్న 500 కంపెనీల్లో 12 మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. ముడి చమురు ధర 2021 తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందనే ఆందోళనలతో ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలైన రాగి వంటి లోహాల ధరలు కూడా పడిపోయాయి.