ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల కదలికలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ వీలినం, గిఫ్ట్‌నిఫ్టీ ఇండెక్స్ కార్యకలాపాల ప్రారంభం(సోమవారం) అంశాలు కీలకం కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.
గతవారంలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు, నిఫ్టీ 524 చొప్పున లాభపడ్డాయి. దేశవ్యాప్తంగా వర్షపాత నమోదు, ప్రోత్సాహకర ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, హెచ్‌డీఫ్‌సీ–హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్ విలీనం నుంచి సానుకూల అప్‌డేట్ అంశాల నేపథ్యంలో గతవారం సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ‘‘ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుత నెలకొని ఉన్న సానుకూల పరిమాణాల దృష్ట్యా సూచీలు స్వల్పకాలం పాటు ముందుకే కదిలే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 19250–19500 స్థాయిని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడే వీలుంది. దిగువ స్థాయిలో 19000 వద్ద బలమైన తక్షణ మద్దతును కలిగి ఉంది.
స్థూల ఆర్థిక గణాంకాలు
ముందుగా మార్కెట్ శనివారం విడుదలైన ఆటో కంపెనీల జూన్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇవాళ భారత, అమెరికా దేశాల జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. దేశీయ సేవారంగ పీఎంఐ, అమెరికా మే ఫ్యాక్టరీ ఆర్డర్లు డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. యూరోజోన్, యూకే దేశాలూ ఇదే వారంలో తయారీ, సేవారంగ డేటాలను విడుదల చేయనున్నాయి. శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు.
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జూన్‌లో మొత్తం రూ. 47,148 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రికార్డు స్థాయిని చేరుకోగలిగాయి. ‘‘భారత ఈక్విటీ మార్కెట్‌పై ఎఫ్‌ఐఐలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కోవిడ్ అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం నేపథ్యంలో ఈ ఏడాది తొలి రెండు నెలలు భారత్‌లో విక్రయించి, చైనాలో కొనుగోలు చేశారు. అయితే ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందనేందుకు సూచికగా వెలువడి ఆర్థిక డేటాతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని వీకే విజయ్ కుమార్ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment