‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు! | Good news for people living near the Regional Ring Road | Sakshi
Sakshi News home page

‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!

Apr 7 2025 4:53 AM | Updated on Apr 8 2025 10:00 PM

Good news for people living near the Regional Ring Road

ఔటర్‌ తరహాలో నిర్మించేలా ట్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్టుకు సవరణలు

పీఎం గతిశక్తిలోని ఎన్‌పీజీ ఆదేశంతో డిజైన్‌ మార్చిన ఎన్‌హెచ్‌ఏఐ  

స్థానిక వాహనదారులకు ఉపయోగపడేలా రెండు వరుసల్లో నిర్మాణానికి సూత్రప్రాయ నిర్ణయం 

ట్రాఫిక్‌ అధ్యయన నివేదిక వచ్చాక తుది ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు సమీప ప్రాంతాల ప్రజలకు ఇది శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డును సర్వీసు రోడ్లతో కలిపి నిర్మించారు. ఇవి వాహనదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. తాజాగా ట్రిపుల్‌ ఆర్‌ పొడవునా, ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు రూపొందించిన ప్రాజెక్టు డిజైన్‌లో సర్వీసు రోడ్డు ప్రస్తావన లేదు. దీనిని సాధారణ జాతీయ రహదారిలా కాకుండా యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్లు అవసరం లేదని తొలుత నిర్ణయించారు. 

కానీ సర్వీసు రోడ్లు లేకుంటే స్థానిక జనావాసాల్లోని వాహనదారులకు ఇది ఉపయోగంగా ఉండదని, కచి్చతంగా సర్వీసు రోడ్లు కావాలని స్థానికులు ప్రజాభిప్రాయ సేకరణ సభల్లో చెప్పారు. కానీ ఎన్‌హెచ్‌ఏఐ తోసిపుచ్చింది. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్‌హెచ్‌ఏఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు రోడ్డు డిజైన్‌ను మార్చి సర్వీసు రోడ్డు ఆప్షన్‌ను చేర్చింది.  

పీఎం గతి శక్తిలోని ఎన్‌పీజీ ఆదేశంతో.. 
కీలక ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించేందుకు వాటిని పీఎం గతి శక్తి పర్యవేక్షణలో ఉంచుతున్న సంగతి తెలిసిందే. పీఎం గతి శక్తిలో భాగంగా ఉన్న నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ (ఎన్‌పీజీ) ఇటీవల భేటీ అయినప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టుపై చర్చించింది. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల అభివృద్ధి వేగంగా ఉంటుందని, కొత్త ఎస్‌ఈజడ్‌లు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు వస్తాయని, అప్పుడు స్థానిక జనావాసాల్లోని వాహనదారుల కోసం ఈ రోడ్డుకు అనుబంధంగా సర్వీసు రోడ్లు అవసరమవుతాయని అభిప్రాయపడింది. 

ఈ రోడ్డు నిర్మించే అలైన్‌మెంటుతో పాటే స్థానిక రోడ్లపై ప్రస్తుతం వాహనాల రద్దీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ట్రాఫిక్‌ సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. కాగా 2021–22లో నిర్వహించిన ట్రాఫిక్‌ స్టడీతో పోలిస్తే కొత్త అధ్యయనంలో వాహనాల సంఖ్య అంచనాను మించి పెరిగితే, వచ్చే ఐదారేళ్లలో రెట్టింపవుతుందని అంచనా వేసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రధాన క్యారేజ్‌వే మీదుగా కాకుండా, దిగువగా వెళ్లి ఇతర రోడ్లతో అనుసంధానమయ్యే వాహనాల సంఖ్య కూడా భారీగా ఉంటుందని, సర్వీసు రోడ్లు లేకుంటే ఆ వాహనాలకు ఈ రోడ్డు ఉపయోగపడదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

ప్రస్తుతం నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ స్టడీలో వాహనాల సంఖ్య బాగా పెరిగినట్టు తేలితే కచ్చితంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐకి సిఫారసు చేసింది. అయితే వాహనాల సంఖ్య బాగా పెరిగిందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన నేపథ్యంలో, సర్వీసు రోడ్లు నిర్మాణానికి వీలుగా ట్రిపుల్‌ ఆర్‌ డిజైన్లు సిద్ధం చేస్తున్నారు.  

తొలుత 5.5 మీటర్లు..ఒకే వరుస 
ట్రిపుల్‌ ఆర్‌కు రెండు వరుసల సర్వీసు రోడ్డును డిజైన్‌ చేస్తున్నారు. తొలుత 5.5 మీటర్లతో కూడిన ఒకే వరుస సర్వీసు రోడ్డును నిర్మించాలని, వాహనాల రద్దీ పెరిగిన తర్వాత దాన్ని 7.5 మీటర్లకు, రెండు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే సర్వీసు రోడ్లు ఫ్లైఓవర్లు ఉన్న చోట ఉండవు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఉన్న చోట.. వాటి దిగువగా నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసే చానళ్ల ద్వారా యూ టర్న్‌ తరహాలో ఉండి మళ్లీ ప్రధాన క్యారేజ్‌ వేను ఆనుకుని దిగువగా ముందుకు కొనసాగుతాయి. 

ఈ మేరకు ప్రధాన క్యారేజ్‌ వే, దిగువ ప్రాంతాలకు కేటాయించిన అలైన్‌మెంటులో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు. ట్రాఫిక్‌ స్టడీ వివరాలను కేంద్రానికి సమర్పించిన తర్వాత, ఢిల్లీ స్థాయిలో అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుని స్థానిక ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement