Regional Ring Road
-
ఉత్తర ‘రింగు’ ఇంకాస్త ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగానికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో మాత్రం స్పష్టత రావటం లేదు. టెండర్లు పిలిచే నాటికే పరిహారం అందిస్తారని ఆశించినా, అందుకు కనీసం మరో రెండుమూడు నెలల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.పరిహారం అందించిన తర్వాతే భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి స్పష్టంగా ఆదేశించారు. కానీ, ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన ట్రిపుల్ ఆర్ పరిహారం విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. జాప్యమెందుకు? ట్రిపుల్ఆర్ ఉత్తర భాగాన్ని ఎన్హెచ్ఏఐ చేపడు తున్న విషయం తెలిసిందే. ఈ భాగానికి టెండర్లు పిలిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. డిసెంబరు చివరికల్లా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు చివరి నాటికి లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలుస్తారని ఓ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఉత్తర భాగానికి అటవీ అనుమతులు కూడా వచ్చాయని ఆయన అధికారికంగా వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు మాత్రం రాలేదు. అవి రాకుండా అవార్డులు పాస్ చేసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు రావాలంటే, ఆ రోడ్డుకు నంబరు కేటాయించాల్సి ఉంటుంది. ట్రిపుల్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కేటగిరీలో నిర్మిస్తున్నందున దానికి ఎక్స్‌ప్రెస్ వే నంబరు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నంబరు కేటాయించలేదు. ఉన్నతస్థాయి కమిటీ భేటీ అయితేనే... దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలకు నంబర్లు కేటాయించాలంటే నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అనుమతివ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆ కమిటీ ఇంకా భేటీ కాలేదు. దాదాపు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న రోడ్లన్నింటికి సంబంధించి ఒకేసారి నంబర్లు కేటాయించే కసరత్తు చేస్తున్నందున, అన్నింటికి కలిపి ఒకేసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ నంబరు కేటాయింపులో జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు పరిహారం చెల్లింపులో ఆలస్యానికి కారణమైంది. ప్రస్తుతం అటవీ శాఖకు సంబంధించి ప్రాథమిక అనుమతి లభించింది. సేకరించే అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు ఇది అనుమతిస్తుంది. దీని కాలపరిమితి ఏడాది మాత్రమే. ఈలోపు అటవీశాఖకు పరిహారం, ప్రత్యామ్నాయ భూకేటాయింపు, అక్కడ చెట్ల పెంపకానికి అయ్యే వ్యయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కసరత్తు జరిగితేనే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి. అటవీశాఖ పూర్తి అనుమతులు, పర్యావరణ అనుమతులు రాకుండా కూడా టెండర్లు పిలిచుకునే వీలుంటుంది. కానీ, టెండర్లు తెరవాలంటే మాత్రం ఆ అనుమతులు వచ్చి ఉండాలి. ఇక పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటే మాత్రం విధిగా పర్యావరణ అనుమతులు వచ్చి ఉండాలి. దాని విషయంలో జాప్యం పరిహారం అందకుండా చేస్తోంది. ఇప్పటికిప్పుడు రోడ్డు నంబరు కేటాయించినా, ఆ తర్వాత పర్యావరణ అనుమతుల జారీ కసరత్తు పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వెరసి మరో రెండుమూడు నెలల సమయం పట్టే వీలుందని వారు చెబుతున్నారు. -
ఉత్తర ‘రింగు’కు అటవీ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జనవరి మొదటి వారంలో గాని ఈ రోడ్డుకు టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతున్న సమయంలో అటవీ అనుమతులకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. ఇక పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే ఈ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయింపు సులభవుతుంది. ఆ నంబర్ వస్తేనే టెండర్లు తెరిచేందుకు వీలుంటుంది. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు .. వెరసి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని ఉత్తర రింగు అలైన్మెంటులో భాగంగా సేకరించనున్నారు. ఇందుకు ప్రతిగా అటవీ శాఖకు వేరే ప్రాంతంలో అంతే మొత్తం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సేకరించే అటవీ భూమిలో కోల్పోయే చెట్లకు పరిహారంతో పాటు, కొత్తగా పొందే భూమిలో అటవీ శాఖ చెట్ల పెంపకానికి అయ్యే ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ భాగానికి కావాల్సిన భూమిలో 90 శాతం సేకరణ ప్రక్రియ పూర్తయింది. త్వరలో అవార్డులు పాస్ చేయటం ద్వారా భూ యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.అనుమతి లేఖ అందింది: మంత్రి కోమటిరెడ్డిట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 72.3536 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనానికి అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్రావ్ భవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర భాగం రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భారతమాల పరియోజన కింద అనుమతి ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొనట్టు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి భూసేకరణ చేస్తామని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలిపామని పేర్కొన్నారు. -
‘ఉత్తర రింగు’ @ రూ.16,800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి దాదాపు రూ.16,800 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఈ భాగం రోడ్డు నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ప్రైవేట్ సంస్థ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్‌ను ఇటీవలే ఎన్హెచ్ఏఐకి అందజేయగా, దాని ఆధారంగా ఈ లెక్క తేల్చారు. దీని ఆధారంగా త్వరలో ఎన్హెచ్ఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. నిర్మాణ పనులు ప్రారంభం కావటానికి ఇంకా ఆరేడునెలల సమయం ఉన్నందున, అప్పటికి ఉండే మార్కెట్ ధరల ఆధారంగా ఈ అంచనాలు మరికాస్త పెరగొచ్చు. రోడ్డు నిర్మాణం ఇలా... దాదాపు 162 కి.మీ. నిడివితో ఉండే రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణ పనుల(సివిల్ కాస్ట్)కు రూ.8,100 కోట్లు ఖర్చు అవుతుందని ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా రూపొందించిన అంచనా స్పష్టం చేస్తోంది. మొదట నాలుగు వరుసలకు.. ఒక్కో కి.మీ.కు దాదాపు రూ.50 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంది. ఈ రోడ్డు 5 మీటర్ల ఎత్తుతో ఉండేలా డిజైన్ చేయడంతో నిర్మాణ వ్యయం అధికంగా ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రతి కి.మీ. నిడివికి ఒకటి చొప్పున కల్వర్టు, అండర్‌పాస్, ఫ్లైఓవర్.. ఇలా ఏదో ఓ నిర్మాణం ఉంటుంది. దీంతో ఖర్చు భారీగా అవుతుంది. కనీసం 10 అడుగుల ఎత్తు అప్రోచ్‌తో అండర్‌పాస్‌లను నిర్మిస్తారు. భూసేకరణకు.... ఈ భాగం రోడ్డుకు సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. దీనికి పరిహారంగా దాదాపు రూ.5,400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించనుంది. ప్రస్తుతానికి నాలుగు వరు సల రోడ్డే నిర్మిస్తున్నా, భవిష్యత్‌లో దానిని 8 లేన్లకు విస్తరిస్తారు. అందుకు వీలుగా ఇప్పుడే భూసేకరణ చేపట్టారు. ⇒ ఈ అలైన్మెంటులో సేకరించాల్సిన భూముల్లో దాదాపు 80 హెక్టార్ల అటవీ భూములున్నాయి. అటవీశాఖకు పరిహారంగా మరోచోట భూమిని కేటాయించటంతోపాటు, ఆ భూమిలో మొక్కల పెంపకానికి అయ్యే వ్యయం కూడా చెల్లిస్తారు. సేకరించిన భూమిలో తొలగించే చెట్లకు విలువ కట్టి చెల్లిస్తారు. ఈ అటవీ భూముల్లో దాదాపు 20 హెక్టార్ల భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వారిలో నిరుపేదలున్నందున వారిపేరిట గతంలో పట్టాలు కూడా జారీ అయ్యాయి. అలా పట్టాలు పొందిన వారికి లెక్క ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తుందని తేల్చారు. -
దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్‌మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది. ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది. మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటుభారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్హెచ్ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్తో రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది. ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేయనున్నారు. అలాగే, రీజినల్ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్ఎఫ్పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీని ఆదేశించింది. -
మూసీ నిర్వాసితుల కోసం టవర్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని.. నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిర్వాసితులు సకల సౌకర్యా లతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు. మూసీ నిర్వాసితుల పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళల కు రూ.1,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని.. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పా టు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పరీవాహక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కోసం 39 ఎస్టీపీలు మంజూరు చేశామని భట్టి చెప్పారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై త్వరలోనే ఎస్ఎల్బీసీ సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని వివరించారు. గత ప్రభుత్వం తరహాలో అనుకూలంగా ఉన్న వాళ్లను దగ్గరికి తీసుకోవడం, లేని వాళ్లను దూరం పెట్టడం వంటి ఆలోచన తమకు లేదన్నారు.అద్భుతంగా ఫ్యూచర్ సిటీ..: హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డుతోపాటు 30 వేల ఎకరాల్లో అద్భుతంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చని.. అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం వంటివెన్నో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలన్న చిత్తశు ద్ధి, సంకల్పంతో ఉందన్నారు. నాటి పాలకులు బీహెచ్ఈఎల్, సీసీఎంబీ, హెచ్ఈ ఎల్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని.. ఫలితంగా వారి నివాసం కోసం కూకట్పల్లి, వెంగళరావునగర్, బర్కత్‌పుర వంటి హౌసింగ్ బోర్డులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. పది వేల కోట్లు కేటాయించామన్నారు. ఆ నిధులతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, డ్రైనేజీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రపంచ డెవలపర్లను ఆకర్షిస్తామని చెప్పారు. -
అలైన్మెంట్లో టింక‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరోపక్క ఉత్తర భాగం అలైన్మెంటులో మార్పులు చేయాలనే ఒత్తిడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలకు మద్దతు ముసుగులో తమకు అనుకూలమైనవారి కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి అన్ని రకాల గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయి, భూ పరిహారానికి అవార్డులు పాస్ చేసే సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలైన్‌మెంటు ఖరారై, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నందున మార్పులు సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతుండగా, కొందరు నేతలు ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. ఎక్కడెక్కడ మార్పులు – సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద ట్రిపుల్ ఆర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ జాతీయ రహదారి మీద భారీ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో పబ్లిక్ హియరింగ్, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. ఇదే ప్రాంతంలో దక్షిణ రింగు ప్రారంభం కావాల్సి ఉంటుంది. దాన్ని ఉత్తర రింగులో భాగంగా నిర్మించే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్‌తో అనుసంధానించాల్సి ఉంది. దక్షిణ రింగును మరింత దూరంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకుని ఉత్తర రింగు కూడలిని మరోచోట నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. రైతుల వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగురోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు మార్పు కోరుతుండగా, ప్రస్తుత అలైన్‌మెంటు తమకు చెందినవారి భూముల్లోంచి ఉండటంతో వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు మార్పు కోరుతున్నారు. – యాదాద్రి జిల్లాలో రింగురోడ్డు విషయంలో స్థానికుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గతంలో జాతీయ రహదారి కోసం కొందరు, సాగునీటి ప్రాజెక్టు కాలువల కోసం కొందరు.. ఇలా పలు సందర్భాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి భూసేకరణ జరగటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల భూములు కూడా అలైన్‌మెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో వారు బడా నేతలను ఆశ్రయించారు. స్థానికుల అభ్యర్థనలను ఆసరాగా తీసుకుని అలైన్‌మెంటును మార్చాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ రాయగిరి హైవే వద్ద కాకుండా ఎగువన నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. – ఉత్తర రింగు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. ఇది పట్టణానికి మరీ చేరువగా ఉందని, దీనివల్ల విలువైన భూములును స్థానికులు కోల్పోవాల్సి వస్తుందని, పరిహారంగా వారికి న్యాయమైన మొత్తం దక్కదంటూ కొందరు నేతలు వకాల్తా పుచ్చుకుని గడ్కరీ కార్యాలయంలో ఒత్తిడి పెంచారు. పట్టణానికి దూరంగా ఉండేలా అలైన్‌మెంటు మార్చాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల రైతుల్లో ఆందోళన అలైన్‌మెంటు మారుస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ల వల్ల రింగురోడ్డును ప్రస్తుత ప్రాంతానికి దూరంగా మారుస్తున్నారంటూ స్థానికుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. తమ భూములకు ఎక్కడ ఇబ్బంది కలుతుందోనన్న భయంతో ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండటంతో ..ఏది నిజమో తెలియని అయోమయంలో ఉన్నారు. చిన్న మార్పుతో భారీ తేడా! రింగురోడ్డు అలైన్మెంటులో ఓ ప్రాంతంలో చిన్న మార్పు చేస్తే దాని ప్రభావం ఇటు రెండు కిలోమీటర్లు, అటు రెండు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్స్‌ప్రెస్ వే అయినందున ఉన్నఫళంగా రోడ్డును మలుపు తిప్పే వీలుండదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి క్రమంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇక మార్పు ఎక్కువగా ఉంటే, అలైన్మెంటులో కూడా భారీ మార్పు చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఊరికి ఒకవైపు ఉందనుకుంటే, మార్పు వల్ల మరో వైపునకు మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. -
అలైన్‌మెంట్‌ను మార్చండి..
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు ‘అవార్డు ఎంక్వైరీ’ని బహిష్కరించారు. మూడు రోజుల పాటు రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించతలపెట్టిన అవార్డు ఎంక్వైరీని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమన్నారు. బుధవారం మొదటి రోజు విచారణను బహిష్కరించిన నిర్వాసితులు, జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భాగంలో పాటిస్తున్న విధంగానే 40 కిలోమీటర్ల నిబంధన ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం పలుమార్లు అలైన్‌మెంట్‌ను మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేసే హక్కు పాలకులు, అధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే అలైన్‌మెంట్‌ను మార్చాలని, లేదంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక రామలింగం, చింతల ప్రభాకర్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్, సుర్కంటి రాజిరెడ్డి, బోరెం ప్రకాష్‌రెడ్డి, చింతల సుధాకర్‌రెడ్డి, దబ్బటి రాములు, ఏనుగు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో ట్రిపుల్ఆర్ టెండర్!
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగురోడ్డు) నిర్మాణానికి కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి వీలుగా ఎన్హెచ్ఐఏ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం టెండర్ డాక్యుమెంటేషన్‌పై దృష్టి సారించింది. వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. పర్యావరణ అనుమతులు రాకుండానే.. ట్రిపుల్ఆర్ విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో భవిష్యత్‌లో మరింత ఆలస్యం జరగకుండా చూడాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి వీలులేదు. కానీ, టెండర్లు పిలిచేందుకు అది అడ్డంకి కాదు. దీంతో పర్యావరణ అనుమతులు వచ్చేలోగా టెండర్లు పిలిచి, పర్యావరణ అనుమతులు వచి్చన తర్వాత టెండర్లు ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు తెరిచే నాటికి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ జాతీయ రహదారి హోదాలో కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఉత్తర భాగం విషయంలో ఆ స్పష్టత ఉంది. దక్షిణభాగాన్ని కేంద్రం కాకుండా సొంతంగానే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగాన్ని సొంత నిధులతో కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో కేవలం జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ, ఇటీవల దాన్ని ఎక్స్‌ప్రెస్‌వే జాబితాలో చేర్చింది. అప్పటి వరకు తాత్కాలికంగా దానికి 161ఏ నంబర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ కేటాయించనున్నారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్టు క్లియరెన్సు వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులకు అది కీలకం.రోడ్డు నంబర్ అలాట్ అయిన తర్వాతనే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఆ రోడ్డు నంబర్ కేటాయించే అవకాశముంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు తెరవాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయ్యే వరకు టెండర్ల కోసం ఎదురు చూడకుండా, ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భూపరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది.ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్హెచ్ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఈ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమాంతరంగా ఈ ఏర్పాట్లు చేస్తూనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి నిర్ధారిత గడువులోపు నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. -
‘రీజనల్’ చుట్టూ సెజ్‌లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనుండటంతో..ఈ రోడ్డు ఉండే చాలా ప్రాంతాలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అక్కడి భూములకు డిమాండ్ పెరుగుతుంది, రోడ్డు సదుపాయం వల్ల పరిశ్రమల స్థాపనకూ వీలవుతుంది. అలాంటి చోట్ల ‘స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)’లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం అవుతుందని.. అదే సమయంలో సెజ్‌లలో కంపెనీలకు భూములు కేటాయించటం ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇది సాకారం కావాలంటే.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారయ్యే ప్రాంతా ల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టాల్సి ఉండనుంది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ సాధ్యాసా ధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.గతంలోనే ప్రతిపాదనలున్నా..హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్).. నగర రూపురేఖలను మార్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 2006లో ఓఆర్ఆర్ నిర్మాణానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఆరేళ్ల తర్వాత దశలవారీగా అది అందుబాటులోకి వచ్చింది. ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మంచి పురోగతి మొదలైంది. డిమాండ్ పెరిగింది. కానీ ఆ రోడ్డును ఆనుకుని ప్రభుత్వానికి కొత్తగా భూవనరులేవీ సమకూరకపోవడంతో.. అదనపు ఆదాయమేదీ రాలేదు. భవిష్యత్తులో రీజనల్ రింగురోడ్డు కూడా ఔటర్ రింగు రోడ్డు తరహాలోనే ఆయా ప్రాంతాలకు కొత్త రూపును ఇవ్వడం ఖాయమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔటర్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోకపోవటం వంటి పొరపాటును ఇప్పుడు చేయవద్దని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత భూమిని సేకరించి పెట్టుకోవాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.అలైన్మెంట్ మార్పు నేపథ్యంలో..రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని సొంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌ను కాదని.. కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందిస్తోంది. భూసేకరణ వ్యయంలో 50శాతం భరించటం మినహా మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించే అవకాశాన్ని కూడా కాదనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రింగ్‌రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పడింది.అంత భూసేకరణ సాధ్యమేనా?రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి 2 వేల హెక్టార్ల భూమి అవసరమవుతోంది. దానికంటే దక్షిణ రింగ్ దాదాపు 50 కిలోమీటర్ల నిడివి ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే సుమారు 2,400 హెక్టార్లకుపైగా భూమి రోడ్డు నిర్మాణానికే కావాలి. ఈ భూముల సేకరణ ఎలాగన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే రీజనల్ ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అలాంటిది రోడ్డు కోసమే కాకుండా అదనంగా భూమిని సేకరించడం ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మల్లన్నసాగర్, ఇతర ప్రాజెక్టులకు భూములి చ్చేందుకు రైతులు ఇష్టపడక న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కాకుంటే.. రీజనల్ రోడ్డు వెంట భవిష్యత్తులో భూమిని సమీకరించడం సాధ్యమయ్యే పనికాదని.. ఇప్పుడే ముందుకెళ్తే ప్రయోజనమని అధికారవర్గాలు చెబుతు న్నాయి. -
రీజనల్ రింగ్.. మరింత లాంగ్!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను మించిపోనుంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టిన పరిశీలనను కాదని రాష్ట్ర ప్రభుత్వం విడిగా రూపొందించిన అలైన్మెంట్, దానిలో మార్పులు చేయాల్సిన పరిస్థితులే దీనికి కారణం. గతంలో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ పరిశీలన చేపట్టి మూడు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించగా.. అందులో 189.425 కిలోమీటర్ల నిడివి ఉన్న మూడో అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దాన్ని ఎన్హెచ్ఏఐ ఆమోదించేలోగా లోక్‌సభ ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడింది. తర్వాత రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకుంది. సొంతంగా దక్షిణ భాగం రింగ్‌రోడ్డును చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో అలైన్‌మెంట్‌పై చర్చలు జరిగాయి. కొన్ని కన్సల్టెన్సీ సంస్థల సాయంతో గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ప్రాథమికంగా ఓ అలైన్‌మెంట్‌ను అధికారులు సిద్ధం చేశారు. గతంలో ఢిల్లీ కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంట్లో చాలా మార్పులు చేస్తూ, కొత్త ప్రాంతాల మీదుగా రింగ్‌రోడ్డు కొనసాగేలా రూపొందించారు. దానితో దక్షిణభాగం నిడివి 194 కిలోమీటర్లకు చేరింది. అయితే అది క్షేత్రస్థాయి పరిశీలనతో రూపొందించినది కాకపోవటంతో పలు లోపాలు ఉండిపోయాయి. ఆ అలైన్‌మెంట్‌ను ఉన్నది ఉన్నట్టుగా ఖరారు చేసే పరిస్థితి లేదు. జలాశయాలు, రిజర్వాయర్లు, గుట్టలు, వాగులు, వంకల మీదుగా దాన్ని రూపొందించడమే కారణం. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ తప్పిస్తూ.. తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనితో నిడివి మరో 12 కిలోమీటర్లకుపైగా పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన రీజనల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను దాటిపోతుందని అంటున్నారు. రూ.1,200 కోట్లు అదనపు వ్యయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే పనిలో ఉంది. ఇటీవలే 12 మంది అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 194 కిలోమీటర్ల ప్రాథమిక అలైన్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని.. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక అలైన్‌మెంట్‌లోని లోపాలను సరిదిద్దితే.. రోడ్డు నిడివి పెరగనుంది. దీనితో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆమన్‌గల్ ఆవలి నుంచి.. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్ ఆమన్‌గల్ పట్టణం ఇవతలి నుంచి ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మార్చి ఆమన్‌గల్ పట్టణం అవతలి నుంచి అలైన్‌మెంట్‌ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఆ పట్టణం పూర్తిగా రీజనల్ రింగురోడ్డు లోపలికి రానుంది. ఇక చేవెళ్ల మండలం పరిధిలోని ఆలూరు –కిష్టాపూర్ గ్రామాల సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేను క్రాస్ చేసేలా ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ ఉండగా.. ఇప్పుడు మన్నెగూడ వద్ద క్రాస్ చేసేలా మార్పు చేస్తున్నట్టు సమాచారం. ఇలా మరెన్నో మార్పులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రాథమిక అలైన్మెంట్ స్థానంలో.. మరో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను కొత్తగా రూపొందించినట్టు సమాచారం. గతంలోనూ ఇలాగే.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను రూపొందించకముందు, రాష్ట్ర ప్రభుత్వం అ«దీనంలో ఎన్‌హెచ్ విభాగం ఓ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. అప్పట్లో కూడా అధికారులు గూగుల్ మ్యాపుల ఆధారంగా దాదాపు 182 కిలోమీటర్ల నిడివితో దాన్ని రూపొందించారు. మర్రిగూడ మండలం శివన్నగూడలో ఉన్న రిజర్వాయర్ మధ్యలోంచి రోడ్డును నిర్మించేలా సిద్ధం చేశారు. దీనితో ఆ రిజర్వాయర్ సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రిజర్వాయర్‌ను ఆసరా చేసుకుని సాగు భూముల్లోంచి అలైన్మెంట్ మార్కింగ్ చేసిన అంశాన్ని.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కొత్త అలైన్మెంట్ రూపొందించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురవుతోంది.ప్రస్తుతం జలాశయాల మీదుగా..ఇది దక్షిణ రింగురోడ్డు ప్రారంభ ప్రాంతం. ఉత్తర రింగ్ ప్రారంభయ్యే సంగారెడ్డి పట్టణం చేరువలోని గిర్మాపూర్ వద్ద దక్షిణ భాగం రింగురోడ్డు అనుసంధానమయ్యే చోటు ఇది. ఇక్కడ ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్మెంట్ ప్రారంభంలోనే ఓ లూప్ తరహాలో అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి (లేత నీలిరంగు గీత) మొదలవుతుంది. దీన్ని లోపంగా భావించారో, మరేమో గానీ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్లో దాన్ని (ముదురు నీలిరంగు) స్ట్రెయిట్ లైన్‌గా మార్చారు. నిజానికి అక్కడ పెద్ద చెరువు ఉంది. కొండాపూర్ మండలం తొగర్పల్లి పెద్దచెరువు పరీవాహక ప్రాంతాన్ని తప్పించేందుకు ఢిల్లీ కన్సల్టెన్సీ లూప్‌లో అలైన్మెంట్ రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని నేరుగా ఉండేలా మార్చటం వల్ల చెరువు పరీవాహక ప్రాంతం మీదుగా రోడ్డు వస్తుంది, అలాగే నిర్మించాలంటే ఎలివేటెడ్ విధానాన్ని అనుసరించాలి. అది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక మర్రిగూడ మండలం కిష్టరాయునిపల్లి వద్ద ఓ రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన ఉంది. దాన్ని తప్పించేందుకు ఢిల్లీ సంస్థ ఆ ప్రాంతంలో వంపు తిరుగుతూ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని కూడా నేరుగా మార్చటం వల్ల.. ప్రతిపాదిత రిజర్వాయర్ భూముల్లోంచి రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. అది కుదిరే పనికాదు. లేదా అతి భారీ ఫ్లైఓవర్లు కట్టాల్సి వస్తుంది. దక్షిణభాగం పొడవునా పలుచోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో.. ప్రాథమిక అలైన్‌మెంట్‌కు మార్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
రూ. ఐదు కోట్ల భూమికి పరిహారం ఐదు లక్షలేనా?.. కాంగ్రెస్‌పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్‌సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్‌లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
ట్రిపుల్ ఆర్‌పై కాంగ్రెస్ మాట తప్పింది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపు ల్ ఆర్) భూ సేకరణలో నష్టపోతున్న రైతులు, బాధితులకు న్యాయం చేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్తో నష్టపోతున్న రైతులు మంగళవారం హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షాత్తూ భువనగిరి సభలో ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంలో జంక్షన్‌ను 40 కిలోమీటర్లకు బదులు 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని రైతులు నష్టపోతున్నారు. గతంలో జంక్షన్ రింగును 78 ఎ కరాల్లో ప్రతిపాదించగా, ప్రస్తుతం 184 ఎకరా లకు పెంచడంతో నష్టం పెరుగుతుంది. గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రె డ్డి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నా చేశారు. కానీ ఇప్పు డు పోలీసు బలగాలతో నిర్బంధంగా సర్వే చేసి ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ మాట నిలుపుకునేంత వరకు బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. బాధితుల పక్షాన పోరాటం చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు. -
అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకం: మాజీ మంత్రి వేముల
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్పుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల సొంత లాభం కోసం అలైన్మెంట్ మార్చు తూ పేదల భూముల నుంచి రోడ్డును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలైన్మెంట్ మా ర్పు వెనకాల దందాలు, అరాచకాలు ఎవరి కోసం జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పాలన్నా రు.అలైన్మెంట్ మార్పుపై ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలన్నా రు. పార్టీ నేతలు శుభప్రద్ పటేల్, కిషోర్, రాకేశ్‌కుమార్ తదితరులతో కలసి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తరభాగం అలైన్మెంట్ ఇప్పటికే అమోదం పొందగా, గతంలోనే ఖరారు చేసిన దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉందన్నారు. నాలుగు చోట్ల అలైన్మెంట్ మార్పు ఫోర్త్‌సిటీ సౌలభ్యం పేరిట సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డులో 4 కిలోమీటర్లు మార్చడంతో పాత, కొత్త అలైన్మెంట్ల మధ్య 10 నుంచి 12 కిలోమీటర్లకు దూరం పెరిగిందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆమన్‌గల్ మండలం కుందారంలో పేదలు సా గు చేసుకుంటున్న 400 ఎకరాల భూమిని రాజవంశీయులతో బేరం చేసుకుని కాంగ్రెస్ నేతలు ‘బిగ్ బ్రదర్స్’అండతో లాక్కుంటున్నారని ఆరోపించారు. మాడుగులలో సీఎం బంధువుల భూ ముల్లో ఏం జరుగుతుందో చెప్పాలని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లబ్ధి జరిగేలా అలైన్మెంట్ మా రిందన్నారు. బిగ్ బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలకు మేలు చేసేలా చేవెళ్ల మా ర్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి 5 కిలోమీటర్లు జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్‌కు అలైన్మెంట్ మా ర్చారన్నారు. -
సొంతంగానే దక్షిణ రింగు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచి్చంది. గతంలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్‌మెంట్‌ను పక్కన పెట్టనుంది. కొత్త అలైన్మెంట్ రూపొందించడానికి 12 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ట్రిపుల్ ఆర్‌ను జాతీయ రహదారిగా నిర్ధారించి కేంద్రమే చేపట్టేందుకు గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తరభాగానికి భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్న సంగతి విదితమే.అదేక్రమంలో దక్షిణభాగాన్ని కూడా కేంద్రమే చేపట్టాల్సి ఉంది. ఉత్తర–దక్షిణ భాగాల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాల్సి ఉంది. భూసేకరణలో సగం వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలంటే, అలైన్మెంట్ ప్రక్రియను కూడా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అలైన్మెంట్ రూపొందించనున్నందున.. రోడ్డు నిర్మాణ బాధ్యతను ఇక కేంద్రం తీసుకోదని దాదాపు తేలిపోయింది.అంటే రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దక్షిణ భాగానికి దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం భరించాల్సిన అవసరం లేకుండా, తానే భరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రంతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన ప్రాంతాల మీదుగా, నచి్చనట్టుగా రోడ్డు నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే అలైన్మెంట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ అలైన్మెంట్ ఖరారుకే ఏడాది సమయం ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. ఆ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..వాగులు, వంకలు, గుట్టలుమిట్టలను పరిగణనలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను రూపొందించారు. జల వనరులు, భవిష్యత్‌లో నిర్మించే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అలైన్మెంట్ రూపొందించారు. మూడు అలైన్మెంట్లు సిద్ధం చేయగా, వాటిల్లో 189,25 కి.మీ. నిడివి గల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు దఫాలుగా అధికారులు సమావేశమై ఈ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందిన అలైన్మెంట్...తాము ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి అనుకూలంగా లేదని, అందులో చాలా మార్పులు చేయాల్సి ఉందని తేల్చారు.దానిని అలాగే వదిలేసి పూర్తి కొత్త అలైన్మెంట్ ను రూపొందించటమే మేలని సూత్రప్రాయంగా తేల్చారు. ఈ మేరకు గూగుల్ మ్యాపు సహాయంతో ఓ తాత్కాలిక అలైన్‌మెంట్‌ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి సమరి్పంచారు. దాదాపు 194 కి.మీ. నిడివితో దీనిని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌గా మార్చేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కనీ్వనర్‌గా ఉండే ఆ కమిటీలో పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, రోడ్లు భవనాల శాఖ, ఎన్హెచ్ఏఐ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆధ్వర్యంలో అలైన్మెంట్ ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది. -
60 రోడ్లు.. 1,712 కిలోమీటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే.. రీజనల్ రింగ్ రోడ్డులో భాగంగా 1,712 కిలోమీటర్ల పొడవునా మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి, రెండో దశలో 1,281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, మూడో దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. 200 అడుగుల వెడల్పుతో.. రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్ వంద అడుగులు కాగా.. భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్‌గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్‌లను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్ల మేర రీజనల్ రోడ్డు ఉండనుంది. లీ అసోసియేట్స్‌కు 10 రేడియల్ రోడ్లు ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవల బాధ్యతలను కెనడాకు చెందిన లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా సంస్థకు అప్పగించింది. ఉత్తర భాగంలో ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌ను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఆర్డీసీ, ఓఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. మూడు దశల్లో రేడియల్ రోడ్ల స్వరూపమిదీ: ఫేజ్–1: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 748 కి.మీ. » 5 రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ గుండా సాగుతాయి. » ఓఆర్ఆర్తో అనుసంధానమయ్యే రోడ్లలో.. యాద్గార్పల్లి నుంచి ఇటిక్యాల వరకు, కీసర నుంచి దత్తాయిపల్లి, నాగులపల్లి నుంచి మందాపూర్, నార్సింగి నుంచి చీమలదరి, రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు–17 నుంచి కంకాల్ వరకు నిర్మించనున్నారు. అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్లే మెదక్, నాగ్‌పూర్, ముంబై, వికారాబాద్, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, మందాపురం, వరంగల్ జాతీయ రహదారులను, నాగార్జునసాగర్, కరీంనగర్ రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్ సాగుతుంది.ఫేజ్–2: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 533 కి.మీ. » ఇందులో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు అవసరాల నిమిత్తం రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ఉంటుంది. ళీ ఇక ఆదిబట్ల నుంచి తుర్కాలకుంట వరకు.. కోహెడ నుంచి కోతులాపురం.. పెద్ద అంబర్‌పేట నుంచి మందోళ్లగూడెం.. కొర్రెముల నుంచి ఎర్రంబెల్లి.. పడమట సాయిగూడ నుంచి దాతర్పల్లి.. ధర్మవరం నుంచి చేబర్తి.. మునీరాబాద్ నుంచి రంగంపేట.. ఓఆర్ఆర్ ఇంద్రజీత్ మెహతా నుంచి తియల్పూర్.. ఎగ్జిట్ నంబర్–4ఏ నుంచి కాసాల.. ఎగ్జిట్ నంబర్–4 నుంచి శివంపేట.. కర్దనూరు నుంచి గోపులారం.. వెలిమల నుంచి తేలుపోల్.. జన్వాడ ఎస్‌ఆర్‌ఆర్‌సీ క్రికెట్ గ్రౌండ్ నుంచి అక్నాపూర్.. ఎగ్జిట్ నంబర్–15 నుంచి మధురాపూర్.. ఎగ్జిట్ నంబరు–15 నుంచి కేశంపేట వరకు రేడియల్ రోడ్లు ఉంటాయి.ఫేజ్–3: లింక్ రోడ్ల సంఖ్య: 28; రోడ్ల పొడవు: 431 కి.మీ. » ఫేజ్–1 లేదా ఫేజ్–2లను కలుపుతూ ట్రిపుల్ ఆర్ వరకు ఉంటాయి. » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌లను కలుపుతూ 18 లింక్ రోడ్లు. అలాగే ఓఆర్ఆర్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులను అను సంధానం చేస్తూ 10 లింక్ రోడ్లు ఉంటాయి. » రావిర్యాల నుంచి గుమ్మడవల్లి.. మాల్ నుంచి వట్టిపల్లి.. గున్గల్ నుంచి కొత్తాల.. ఇబ్రహీంపట్నం నుంచి జనగాం.. కొత్తూరు నుంచి చౌలపల్లి.. తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా తలకొండపల్లి.. నేదునూరు క్రాస్‌రోడ్ నుంచి చీపునుంతల.. కడ్తాల్ నుంచి చుక్కాపూర్.. రూప్సింగ్ తండా నుంచిపాంబండ.. ఇలా లింక్ రోడ్లు నిర్మిస్తారు. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం194 కి.మీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక ప్రకారం దక్షిణ భాగం రింగ్‌రోడ్డు విస్తీర్ణం 189.25 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి–తూప్రాన్–చౌటుప్పల్) 158 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్తగా కొన్ని గ్రామాలను కలపడం వల్ల విస్తీర్ణం పెరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా దక్షిణ భాగం వైపు ఎన్హెచ్ఏఐ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్‌లను సిద్ధం చేసింది. వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించాల్సిన సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ను తామే నిర్మించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాక దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పేరిట ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్లో పేర్కొన్న పలు గ్రామాలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారం రహదారి బయటకు వెళ్లగా, కొన్ని గ్రామాలు లోపలికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ప్రయోజనాలను పరిరక్షించేలా దక్షిణ రింగు అలైన్మెంట్
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఫోర్త్ సిటీలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఇతర వసతులు కల్పించేందుకు వీలుగా ఆ అలైన్మెంట్ ఉండాలని సూచించారు.బుధవారం రాత్రి తన నివాసంలో రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్టును సీపోర్టుతో అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రీజనల్రింగు రోడ్డుకు సంబంధించి గతవారం సూచించిన మార్పుల ఆధారంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ను సీఎం పరిశీలించారు. అందులో కొన్ని మార్పులను సూ చించారు. అలైన్మెంట్ ఖరారుకాగానే.. వెంటనే తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్–ఓఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్ల కోసం ముందుగానే భూసమీకరణ, భూసేకరణ చేపట్టాలని పేర్కొన్నారు. నిర్వాసితుల విషయంలో సానుభూతితో వ్యవహరించి సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందించేలా చూడాలని.. ప్రభుత్వపరంగా మరేదైనా అదనపు సాయం చేయగలమేమో ఆలోచించాలని సూచించారు. డ్రైపోర్టుపై పరిశీలన చేయండి డ్రైపోర్టు ఏర్పాటుకు సంబంధించి కాకినాడ, మచి లీపట్నం రేవులను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. రేవులకు ఉండే దూరంతోపాటు ఏపీ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉన్నదీ, తెలంగాణకు దేనిద్వారా ఎక్కువ ఉపయోగం కలుగుతుందనే విషయాలను గమనంలో ఉంచుకోవాలని సూచించారు. ఈ అధ్యయనం తర్వాతే గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్–ఓఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బెంగళూరులో ఉన్న జిందాల్ నేచర్‌కేర్ వంటివి మనవద్ద కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాచకొండ ప్రాంత ప్రకృతి రమణీయత సినీ పరిశ్రమను ఆకర్షించేందుకు ఉన్న అవకాశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
3 నదులపై 3 వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో మూడు నదులపై వంతెనలను ఖరారు చేశారు. దక్షిణ భాగం రోడ్డును సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉండటంతో ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించే పనిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తలమునకలై ఉంది. భూసేకరణ ప్రక్రియలో కీలక అంకమైన అవార్డులను పాస్ చేసే ప్రక్రియకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత టెండర్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఆపై మరో 5–6 నెలల్లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు డిజైన్ సహా ఇంటర్చేంజ్ వంతెలు, నదీ వంతెనలు, అండర్‌పాస్‌లు తదితర స్ట్రక్చర్ డిజైన్లు సిద్ధం చేసుకుంది. ఉత్తర భాగంలో మూడు చోట్ల రీజనల్ రింగురోడ్డు నదులను క్రాస్ చేస్తుంది. ఆ మూడు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించనుంది. మూసీ నదిపై వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ సమీపంలో, మంజీరా నదిపై పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో, హరిద్రా నది (హల్దీ నది/హల్దీ వాగు) తూప్రాన్ దగ్గర ఈ వంతెనలను నిర్మించనున్నారు. మూసీపై కిలోమీటర్ పొడవుతో.. మూడు నదులపై నిర్మించే వంతెనల్లో మూసీ నదిపై దాదాపు కిలోమీటరు పొడవుతో వంతెన నిర్మాణం కానుంది. నల్లగొండ–భువనగిరి రోడ్డులో భాగంగా ఇప్పటికే వలిగొండ వద్ద వంతెన ఉండగా ఇప్పుడు వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ శివారులో ఈ వాగును రీజనల్ రింగురోడ్డు క్రాస్ చేయనుంది. అక్కడ కిలోమీటరు పొడవుతో వంతెనకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. దీనికి దాదాపు రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. నాందేడ్ జాతీయ రహదారికి సమాంతరంగా.. మెదక్–సంగారెడ్డి రోడ్డు 161వ నంబర్ నాందే డ్–హైదరాబాద్ జాతీయ రహదారిలో కలిసిన ప్రాంతంలో మంజీరా నదిపై వంతెన నిర్మించనున్నారు. పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో మంజీరా నదిని రీజనల్ రింగు రోడ్డు క్రాస్ చేయనుంది. దీంతో అక్కడ దాదాపు 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మించనున్నారు. దీనికి దాదాపు రూ. 75 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. తూప్రాన్ సమీపంలో.. గజ్వేల్ మీదుగా ప్రవహిస్తూ మంజీరా నదిలో కలిసే హరిద్రా నదిపై తూప్రాన్ వద్ద మూడో వంతెనకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇప్పటికే అక్కడ ఓ వంతెన ఉంది. దానికి దాదాపు చేరువలో తూప్రాన్ వద్ద మరో వంతెన రానుంది. తొలుత నాలుగు వరసలకే.. రీజనల్ రింగు రోడ్డును 8 వరుసలతో నిర్మించేలా ప్రణాళిక రచించినా తొలుత నాలుగు లేన్లకే పరిమితమవుతున్నారు. మిగతా నాలుగు లేన్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగు సమయంలో నిర్మించనున్నారు. అయితే ఆ నాలుగు వరుసలకు సరిపడా భూమిని సైతం సేకరించి చదును చేసి వదిలేయనున్నారు. మిగతా నాలుగు లేన్లను మాత్రం ఇప్పుడు నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో భాగంగానే వంతెనలు ఉంటున్నందున వాటిని కూడా ఎనిమిది వరుసలకు సరిపడేలా నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన క్యారేజ్ వేను నాలుగు లేన్లకు పరిమితం చేసినందున వంతెనలను కూడా నాలుగు లేన్లకే సరిపడేలా నిర్మించనున్నారు. ఇప్పుడు నిర్మించే వంతెనల పక్కనే తదుపరి నాలుగు వరుసల వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. పక్కపక్కనే నిర్మించేప్పుడు పాత వంతెనల పిల్లర్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి ప్రమాదం లేకుండా ఫౌండేషన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం వాటికి ప్రత్యేక డిజైన్‌ను అనుసరించనున్నారు. -
సొంతంగానే ‘దక్షిణ రింగు’!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. అలైన్మెంట్ రూపొందించటంసహా భూసేకరణ, రోడ్డు నిర్మాణం అంతా సొంతంగానే చేపట్టే దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలిసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మూడు కన్సల్టెన్సీ సంస్థలను సంప్రదించి అలైన్‌మెంట్‌పై చర్చించిననట్టు విశ్వసనీయ సమాచారం. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలిసినప్పుడు మొదటిసారి ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.ట్రిపుల్ ఆర్‌లోని 162 కి.మీ. ఉత్తర భాగంలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అన్ని గెజిట్లు జారీ చేసి, భూమిని తన అధీనంలోకి తీసుకుంది. అవార్డులు పాస్ చేసి భూ నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయటమే తరువాయి. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. దీంతో ఈ భాగం రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది. ఇక దక్షిణ భాగం విషయానికొస్తే.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను గతేడాదే ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం–కేంద్రప్రభుత్వం మధ్య సఖ్యత కొరవడటంతో దక్షిణభాగంలో కసరత్తు నిలిచిపోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రాగా, అలైన్‌మెంట్‌కు కూడా ఆమోదం లభించలేదు. దీంతో దక్షిణభాగం రోడ్డు కసరత్తు ఇప్పట్లో మొదలు కాదన్న అభిప్రాయం నెలకొంది. ఈ తరుణంలో దక్షిణభాగాన్ని సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకుంటుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.ఢిల్లీ తరహాలో...ఢిల్లీ ఔటర్ రింగురోడ్డులో వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను హరియాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేను ఎన్హెచ్ఏఐ నిర్మించింది. ఇప్పుడు ఇదే తీరుగా.. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డులో ఉత్తర భాగాన్ని ఎన్హెచ్ఏఐ, దక్షిణభాగాన్ని తెలంగాణ చేపట్టాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది.ఖర్చు భరించగలదా..?దాదాపు ఐదేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన వచ్చినప్పుడు రెండు భాగాలు కలిపి రూ.17 వేల కోట్ల వ్యయంలో పూర్తవు తుందని అంచనా వేశారు. కానీ, గతేడాది జనవరిలో దక్షిణ భాగానికి సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థ రూ.12,900 కోట్ల అంచనాతో నివేదిక సమర్పించింది. ఇప్పుడు అది రూ.19 వేల కోట్లకు చేరింది. ఇంతపెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించటం అంత సులభం కాదు. అయితే ప్రస్తుతం రోడ్ల నిర్మాణంలో ప్రైవేట్ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. బీఓటీ, హెచ్ఏఎం పద్ధతులను అవలంబిస్తుండటంతో ప్రభుత్వంపై భారం తక్కువగానే ఉంటుంది. రోడ్డు నిర్మాణం, నిర్వహణ చూసే సంస్థలే ఎక్కువ మొత్తాన్ని భరిస్తాయి. ఈ పద్ధతిలో భారం ఉండకపోవచ్చన్న భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమాచారం.అలైన్మెంట్ ప్రక్రియే కీలకం..ట్రిపుల్ ఆర్ ఆలోచన మొగ్గ తొడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ ప్రాథమిక అలైన్మెంట్ చేశారు. కేవలం గూగుల్ మ్యాప్ ఆధారంగా అది జరిగింది. దక్షిణభాగం పరిధిలో ఆ అలైన్మెంట్ మరింత గందరగోళంగా ఉంది. ఆ భాగానికి సంబంధించి తర్వాత ఎన్హెచ్ఏ ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించింది. దాని ప్రతినిధులు కొన్ని నెలల పాటు క్షేత్రస్థాయిలో తిరిగి పాత అలైన్మెంట్ మొత్తం గందరగోళంగా ఉందని గుర్తించి, జలవన రులు, జనావాసాలకు దూరంగా వంకర టింకర లేని కొత్త అలైన్మెంట్ సిద్ధం చేశారు. 2023 జనవరిలో మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐకి ఆ సంస్థ సమర్పించింది.అందులో 189.205 కి.మీ. నిడివి ఉండే అలైన్‌మెంట్‌ను ఎన్హెచ్ఏఐ దాదాపు ఖరారు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే, మళ్లీ కొత్తగా అలైన్మెంట్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లను ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోని కన్సల్టెన్సీ సంస్థ పట్టించుకోకుండా శాస్త్రీయంగా అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ప్రస్తుత అలైన్మెంట్ మారే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. -
వేగంగా భూసేకరణ.. ట్రిపుల్ ఆర్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘సంగారెడ్డి–ఆమన్‌గల్–షాద్‌నగర్–చౌటుప్పల్ (189.20 కి.మీ.) మీదుగా నిర్మించే రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాలి. ఉత్తర భాగంలో ఇప్పటికే భూ సేకరణ చాలావరకు పూర్తయినందున, దక్షిణ భాగం కోసం కూడా ప్రారంభించాలి. భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ రోడ్డు విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి. పనుల్లో మాత్రం జాప్యం లేకుండా చూడాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ట్రిపుల్ ఆర్ పురోగతిపై సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ‘భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా దక్షిణ భాగం అలైన్మెంట్ ఉండాలి. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. (రోడ్డు అలైన్‌మెంటు మ్యాప్‌ను గూగుల్ మ్యాప్‌తో బేరీజు వేసుకుంటూ ముఖ్యమంత్రి పరిశీలించారు. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులను సూచించారు). నేను సూచించిన మార్పులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోజువారీ సమీక్షలు నిర్వహించాలి ‘ఆర్ఆర్ఆర్ పురోగతిపై రోజువారీ సమీక్షలు నిర్వహించాలి. భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని నాకు అందజేయాలి. ఉత్తర భాగం విషయంలో రోజువారీ పురోగతి, దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు, ఇతర అంశాల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలపాలి. సీఎస్‌తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలి. ఒక సమీక్ష సమావేశానికి, మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలి..’ అని రేవంత్ స్పష్టం చేశారు. రేడియల్ రోడ్లపై ప్లాన్ సిద్ధం చేయాలి ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ‘రేడియల్ రోడ్లు ప్రధాన రహదారులతో ఏయే ప్రాంతాల్లో అనుసంధానం చేస్తే మెరుగ్గా ఉంటుందో, సిగ్నలింగ్ సహా ఇతర సమస్యలు ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్లాన్ సిద్ధం చేయాలి. అవి ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల అనుసంధానానికి అనువుగా ఉండాలి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలి..’ అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు. 15 నాటికి ఉత్తర భాగం భూసేకరణ పూర్తి: మంత్రి కోమటిరెడ్డి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన మిగతా భూసేకరణ వచ్చేనెల 15 నాటికి పూర్తి చేసి కేంద్రానికి నివేదిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుందని అన్నారు. ట్రిపుల్ ఆర్ పై సీఎం సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్–విజయవాడ (ఎన్.హెచ్–65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని, రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే మన్నెగూడ ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభించామని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడర్ పనులు త్వరలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను గొప్పగా రూపొందిస్తామని, అవసరమైన సాయం కోసం త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్టు తెలిపారు. -
‘ట్రిపుల్ ఆర్’ సూపర్ గేమ్‌చేంజర్
సాక్షి,హైదరాబాద్: ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) హైదరాబాద్‌కు ఎలాగైతే గేమ్ చేంజర్‌గా మారిందో, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) కూడా తెలంగాణకు సూపర్ గేమ్‌చేంజర్‌గా మారుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రూ.22 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఆధ్వర్యంలో మంగళవారం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ థీమ్‌తో స్టేట్‌కాన్ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్ మాట్లాడుతూ మూసీ రివర్‌ఫ్రంట్, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, ముచ్చర్ల ఫోర్త్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ వంటి బృహత్తర కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వీటితో రాష్ట్ర అభివృద్ధి నెక్ట్స్ లెవల్‌కు దూసుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడంతోపాటు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులను తయారు చేసేందుకు స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో భూముల విలువలు పెంచడంతో పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు.. అంతర్జాతీయ నగరాలతో పోటీ పడేస్థాయికి భాగ్యనగరం ఎదిగిందని కొనియాడారు. రాష్ట్ర ప్రగతిలో డెవలపర్లు కూడా భాగస్వాములేనని, నిర్మాణ రంగ సమస్యలను లిఖిత పూర్వకంగా ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.వైఎస్సార్ దూరదృష్టితోనే : మంత్రి కోమటిరెడ్డిఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాల పరిమితి పెట్టుకొని, ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. 24 నెలల డెడ్లైన్లోనే ఔటర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు భూసేకరణ, నిర్మాణ పనులు పూర్తి చేశారని, వీటికి సమాంతరంగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారని చెప్పారు. దీంతో మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ రంగం వైఎస్సార్ దూరదృష్టితో కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించిందన్నారు.ఔటర్ చుట్టూ 16 రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని, రహదారుల డిజైన్లు డీపీఆర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఫోర్త్ సిటీలో అహ్మదాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈమేరకు బీసీసీఐ ప్రతినిధులతో సమావేశమయ్యారని చెప్పారు. అనంతరం సీబీఆర్ఈ, సీఆర్‌ఈడీఏఐ సంయుక్తంగా రూపొందిన ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ నివేదికను మంత్రులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ప్రెసిడెంట్(ఎలెక్ట్) ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రింగ్‌రోడ్ ఇంటర్చేంజ్
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ భారీ ప్రైవేటు పరిశ్రమ కోసం రీజనల్ రింగురోడ్డు ఇంటర్చేంజ్ డిజైన్ మారింది. ముందుగా ఎంచుకున్న డిజైన్‌లో రింగురోడ్ కూడలి నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. అది స్థానికంగా నిరసనకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఇంటర్చేంజ్ డిజైన్‌ను మార్చారు. నాలుగు లూప్‌లతో నిర్మించడానికి బదులు.. ఆ పరిశ్రమ వైపు లూప్ లేకుండా మూడింటితోనే ఇంటర్చేంజ్ డిజైన్‌ను ఖరారు చేశారు. - సాక్షి, హైదరాబాద్‌రోడ్డు లేఔట్ మార్చే వీలు లేక.. తూప్రాన్ నుంచి గజ్వేల్ పక్కగా వచ్చే రీజనల్ రింగురోడ్డు హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ప్రజ్ఞాపూర్‌కు కాస్త ముందుగా క్రాస్ చేస్తుంది. రాజీవ్ రహదారి మీద వాహనాల రద్దీ ఎక్కువ. ఇలా అధిక రద్దీ ఉన్న రోడ్లను రీజనల్ రింగ్‌రోడ్డు క్రాస్ చేసేచోట.. నాలుగు లూప్‌లతో ఉండే క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్చేంజ్ జంక్షన్లను నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రజ్ఞాపూర్ సమీపంలో క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్చేంజ్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇంటర్ చేంజ్‌కు ఉండే నాలుగు లూప్‌లలో ఒక లూప్ కట్టాల్సిన చోట ఓ బ్రేక్ లైనర్స్ తయారీ పరిశ్రమ ఉంది. అదే డిజైన్‌తో నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. ఇలా జరగకుండా రింగ్‌రోడ్డును కాస్త అటువైపో, ఇటువైపో జరపడానికీ వీలు లేకుండా పోయింది. ఆర్ఆర్ఆర్ను హైదరాబాద్ వైపు జరపాలనుకుంటే.. ఓవైపు కొండపోచమ్మ సాగర్ జలాశయం, మరోవైపు వందల ఎకరాల్లో విస్తరించిన సామాజిక అటవీ ప్రాంతం అడ్డు వస్తున్నాయి. అదే గజ్వేల్ వైపు జరపాలనుకుంటే.. వేల ఇళ్లతో నిర్మించిన పునరావాస కాలనీ, గజ్వేల్ రింగురోడ్డు కూడలి అడ్డు వస్తున్నాయి. ఒకవేళ పరిశ్రమను తొలగించాలనుకుంటే.. దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధినిస్తున్న పరిశ్రమను తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్చేంజ్ డిజైన్‌ను మూడు లూప్లకు మార్చారు. మరో లూప్‌కు బదులు.. పరిశ్రమ ప్రహరీని ఆనుకుని రెండు కారిడార్లను నిర్మించి, ఇటు రాజీవ్ రహదారికి, అటు ‘రీజనల్’ప్ర«దాన వేకు అనుసంధానం చేసేలా డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే మార్పుల వల్ల అదనంగా కొంత రోడ్డు, రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని.. దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా వేశారు. -
సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో భూసేకరణ
-
‘సర్వీసు’ లేకుండానే ఆర్ఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను సర్వీసు రోడ్లు లేకుండా నిర్మించబోతున్నారు. తద్వారా పూర్తిగా యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో.. పక్కల నుంచి ఇతర వాహనాలు ఈ ఎక్స్‌ప్రెస్ వేపైకి రాకుండా నిరోధించనున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు 352 కి.మీ. నిడివితో రూపుదిద్దుకోనున్న ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్చేంజ్ కూడళ్లలోని స్లిప్ రోడ్ల మీదుగా మాత్రమే ఇతర వాహనాలు ట్రిపుల్ ఆర్ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, నెమ్మదిగా కదిలే భారీ వాహనాలకు దీని మీదకు అనుమతి ఉండదు. సర్వీసు రోడ్ల ప్రతిపాదనకు తిరస్కారం హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా తొలుత సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు. ఆ మేరకు ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి డిజైన్లు పంపారు. అయితే ఎన్హెచ్ఏఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతీయ రహదారులకు స్థానిక పరిస్థితుల ఆధారంగా సర్వీసు రోడ్లను నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల సర్వీసు రోడ్లను నిర్మించకుంటే స్థానికులు ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ఇందులో సర్వీసు రోడ్డు ప్రతిపాదనే లేదు. ట్రిపుల్ ఆర్‌ను కూడా ఎక్స్‌ప్రెస్‌వేగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియమావళికి విరుద్ధమంటూ సర్వీస్ రోడ్ల ప్రతిపాదనకు కమిటీ తిరస్కరించింది. సర్వీసు రోడ్లుంటే ఇబ్బందేంటి? సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై వేగ పరిమితి చాలా ఎక్కువ. వాహనాలు భారీ వేగంతో దూసుకుపోతున్న సమయంలో, సర్వీసు రోడ్ల నుంచి అకస్మాత్తుగా వాహనాలు ప్రధాన క్యారేజ్ వే మీదకు వచి్చనప్పుడు ప్రమాదాలు చోటు చేసుకునే వీలుంటుంది. ⇒ ఎక్స్‌ప్రెస్ వేపై సర్వీసు రోడ్డుతో అనుసంధానమైన ప్రతిచోటా టోల్ బూత్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇది వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వే స్థాయి వేగంలో ప్రయాణించే వెసులుబాటును అడ్డుకుంటుంది. ⇒ పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో నిర్మిస్తున్నందున అది దాదాపు 25 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇరువైపులా బారికేడింగ్ ఉంటుంది. దీంతో పశువులు కానీ, జంతువులు కానీ దాని మీదకు రాలేవు. సర్వీసు రోడ్లు ఉంటే వాటి మీదుగా అవి ఎక్స్‌ప్రెస్ వే పైకి వచ్చి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి ఉంటుంది. ⇒ ఎక్స్‌ప్రెస్ వేల మీద సాధారణ ప్రయాణ వాహనాల కంటే అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలు ఎక్కువగా దూసుకుపోతాయి. వాటికి అడ్డంకులు ఉండకూడదు. గతంలో గుజరాత్లో స్థానికులు సర్వీసు రోడ్ల మీదుగా ఎక్స్‌ప్రెస్ వే మీదకు పెద్ద సంఖ్యలో చేరుకుని వారి డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి నిరసనలు నిర్వహించారు. దీంతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఎక్స్‌ప్రెస్ వేలకు సర్వీసు రోడ్డు ఆప్షన్ తొలగించారు. గ్రీన్‌ఫీల్డ్ రహదారి అయినందున.. ఊళ్లకు దగ్గరగా ఉండే జాతీయ రహదారుల మీదకు స్థానిక వాహనాలు చేరుకునేందుకు వీలుగా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. కానీ ట్రిపుల్ ఆర్ పూర్తి గ్రీన్‌ఫీల్డ్ (పూర్తిగా కొత్త) రహదారి అయినందున దీన్ని ఊళ్లకు దూరంగా నిర్మిస్తున్నారు. కాబట్టి సర్వీసు రోడ్ల అవసరం ఉండదని ఎన్హెచ్ఏఐ చెబుతోంది. నెహ్రూ ఔటర్ రింగురోడ్డు కూడా ఎక్స్‌ప్రెస్ వే నే అయినా.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు. కాబట్టి దీనికి జాతీయ ఎక్స్‌ప్రెస్ వేల నియమావళి వర్తించదు. ఖమ్మం–దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త హైవేకి అనుసంధానంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేస్తూ పనులను ముందుకు సాగనీయటం లేదు. అది కూడా జాతీయ ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్డు ఆప్షన్ ఏర్పాటు చేయలేదు. దీంతో పనులు కొనసాగాలంటే పోలీసు భద్రత కలి్పంచాలని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరటం విశేషం.