కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం
త్వరలోనే ట్రిపుల్ ఆర్‌కు ఎక్స్‌ప్రెస్ వే నంబరు కేటాయింపు
అలైన్‌మెంటులో మార్పులకు ఇక అవకాశం లేనట్టేనా..!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భా గానికి సంబంధించిన అలైన్‌మెంటును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. గతంలోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదించగా, ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఇక ట్రిపుల్ ఆర్‌కు ఎక్స్‌ప్రెస్ వే నంబరు కూడా త్వరలో రానుంది. అలైన్‌మెంటు ఓకే అయిన నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో ఉత్తర భాగానికి టెండర్లు పిలవనున్నారు.
అలైన్‌మెంటు మార్పు వినతుల సంగతేంటి?
ఉత్తర భాగం అలైన్‌మెంటులో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల కొందరు ప్రజా ప్రతినిధులు సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలిసి వినతులు అందించారు. సంగారెడ్డి సమీపంలో, యాదాద్రి సమీపంలోని రాయగిరి, చౌటుప్పల్ ఇంటర్‌ఛేంజ్ కూడలి.. ఇలా పలుచోట్ల అలైన్‌మెంటును కొంతమేర సవరించాలని కోరారు. ఇందులో ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మంత్రి ఒకరు ఉన్నారు.
ఆయా ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి కొన్ని భూముల వివరాలు 3డీ గెజిట్‌లో నమోదు కాలేదు. ఆ గెజిట్ విడుదలైతేనే భూసేకరణ జరుగుతుంది. ఎలాగూ గెజిట్‌లో వివరాలు నమోదు కానందున, అలైన్‌మెంటు మార్పు పెద్ద కష్టం కాదనేది నేతల అభిప్రాయం. అయితే కేవలం సాంకేతిక కారణాలతోనే ఆయా భూముల వివరాలు 3డీ గెజిట్‌లోకి రాలేదని, అలాంటి భూములు మొత్తం భూముల్లో కేవలం 0.4 శాతం లోపేనని ఎన్‌హెచ్‌ఏఐ వారికి చెప్పినట్టు తెలిసింది.
ఈ సమయంలో అలైన్‌మెంటులో మార్పులు చేస్తే, కొత్త ప్రాంతాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఆ వినతులను పూర్తిగా కొట్టిపడేయలేదు. దీంతో అలైన్‌మెంటులో మార్పులు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ అలైన్‌మెంటుకు ఆమోదముద్ర వేయటంతో మార్పుల అంశంపై ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గతంలో జాతీయ రహదారులకు సంబంధించిన అలైన్‌మెంట్లకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదంతో సరిపోయేది. అయితే మూడేళ్ల క్రితం కేంద్ర మంత్రిత్వశాఖ కచ్చితంగా ఆమోదముద్ర వేయాలనే నిబంధన వచ్చింది. ఆ మేరకు మంత్రిత్వ శాఖలో కొత్తగా అలైన్‌మెంటు అప్రూవల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ భేటీలోనే ఉత్తర భాగం అలైన్‌మెంటుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
నంబర్ వస్తేనే పర్యావరణ అనుమతులు
త్వరలో టెండర్లు పిలిచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పా ట్లు చేస్తున్న క్రమంలో ఆ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబరు కేటాయింపు కీలకంగా మారింది. ఆ నంబరు కేటాయిస్తేనే పర్యావరణ అనుమతులు లభిస్తాయి. అవి ఉంటేనే టెండర్లను తెరిచేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ప్రెస్ వే నంబరును వీలైనంత త్వరలో కేటాయించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment