NHAI
-
దక్షిణ వలయం.. అయోమయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గందరగోళంగా మారింది. జాతీయ రహదారిగా నిర్మిస్తున్నందున, ఆ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ రెండు భాగాలూ ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవేస్ (ఒరిజినల్) జాబితాలో ఉత్తర భాగం ఉండగా, విజన్ 2047 పార్ట్ 2 జాబితాలో దక్షిణ భాగం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి డీపీఆర్‌ను రూపొందించే పనిలో ఉంది.గతంలో పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవటంతో దాని గడువును పెంచింది. మరోవైపు దాని అలైన్‌మెంటును ఖరారు చేసేందుకు అధికారులతో గతంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు అలైన్మెంట్లు, డీపీఆర్‌లను అదే సొంతంగా ఖరారు చేసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తుండటం అయోమయానికి కారణమవుతోంది. సీఎం సమీక్షలు, కమిటీలుఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అధికారులు ట్రాఫిక్ సర్వే నిర్వహించినప్పుడు దక్షిణ భాగం పరిధిలో వాహనాల రద్దీ అంత ఎక్కువగా ఉండదని తేలింది. టోల్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోడ్లపై భారీ వ్యయం చేయటం సబబు కాదన్న ఉద్దేశంతో కేంద్రం అంత ఆసక్తి చూపలేదు. చివరకు రాష్టప్రభుత్వ ఒత్తిడితో సరేనంది. తొలుత ఉత్తర భాగాన్ని చేపట్టి ఆ తర్వాత దక్షిణ భాగంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర భాగాన్ని భారత్‌మాల పరియోజనలో చేర్చింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాలతో జాప్యం జరిగి, భారత్‌మాల పరియోజన గడువు తీరిపోయింది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ దాన్ని చేపట్టేందుకు నిర్ణయించి నిధులు, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దక్షిణ భాగాన్ని మాత్రం భవిష్యత్తులో చేపట్టేలా విజన్–2047 రెండో జాబితాలో చేర్చింది. అయితే ఆ భాగాన్ని తానే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంతంగా అలైన్‌మెంటు రూపొందించటంతో పాటు డీపీఆర్ కూడా సిద్ధం చేయాలని భావించి సీఎం పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.ఎవరి పనిలో వారు..!దక్షిణ భాగం నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మనసు మార్చుకుని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని లిఖి తపూర్వకంగా కోరింది. కానీ ఆ భాగం ఎన్హెచ్ఏఐ అధీనంలోనే ఉన్నందున కేంద్రం తన పనితాను చేసుకుపోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం డీపీఆర్ తయారీ కసరత్తును కొనసాగిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం ఈ భాగానికి సంబంధించి ఓ డ్రాఫ్ట్ అలైన్‌మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి అందించింది.అయితే అది అనుకూలంగా లేదని కేంద్రం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ వేరే అలైన్‌మెంటును తయారు చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. అది ఖరారైతే ఆ కన్సల్టెన్సీ డీపీఆర్‌ను రూపొందిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డీపీఆర్ తయారీకి టెండర్లు కొనసాగిస్తుండటం ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం, అటు కేంద్రం అధీనంలోని ఎన్హెచ్ఏఐ అధికారుల్లో అయోమయానికి కారణమవుతోంది.మేమే కసరత్తు చేస్తాం: ఎన్హెచ్ఏఐ‘దక్షిణ భాగం ముందునుంచీ మా అధీనంలోనే ఉంది. దా నిపై మేమే కసరత్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చే స్తోందో మాకు తెలియదు. తానే సొంతంగా నిర్మిస్తానంటూ మాకు అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగాన్ని కూడా పూర్తి చేయాలన్న లేఖ మాత్రం వచ్చింది. ఇలాంటప్పుడు అలైన్‌మెంటు, డీపీఆర్ తదితరాలు మేమే పూర్తి చేయాల్సి ఉంటుంది..’ అని ఎన్హెచ్ఏఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
‘రీజినల్’లో మెరుగైన పరిహారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారంలో ఉదారంగా వ్యవహరించాలని... ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత మేర దాన్ని ఖరారు చేయాలని సూచించారు. సీఎం రేవంత్ శుక్రవారం రాత్రి రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై రహదారి నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్ఎండీఏతో అలైన్మెంట్ చేయించాలని ఆదేశించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇతర ప్రధాన రహదారులపై ఫోకస్ మంచిర్యాల– పెద్దపల్లి– భూపాలపల్లి– వరంగల్– హన్మకొండ– మహబూబాబాద్– ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్–విజయవాడ రహదారి... ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి.. జగిత్యాల–కరీంనగర్ రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్‌డబ్ల్యూఎఫ్) రోడ్ల నిర్మాణంపైనా సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతుల్లో ఆటంకాలను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ‘ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్)’డోబ్రియల్‌ను ప్రశ్నించారు. పలు అంశాల్లో నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎంకు పీసీసీఎఫ్ బదులిచ్చారు. దీనితో రాష్ట్రస్థాయిలో తేల్చగల సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వరకు వెళ్లే అంశాలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. ఆర్అండ్బీ, అటవీ శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సీఎస్ వారితో పదిరోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్సులు వచ్చేలా చూడాలని... ఇక్కడ కాకపోతే సంబంధిత మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులను కలవాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్‌ల ఏర్పాటును విస్మరిస్తుండటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దీనితో ఈ సమస్య ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై... హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్‌ల తయారీ, వేగంగా పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని... మూడేళ్లలో నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేసి.. కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి సీఎం రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ నెల నుంచే నెలకు రూ.150 కోట్ల చొప్పున ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గ్రామ రోడ్లను నిర్వహించేవారని.. ఇప్పుడు అన్నిచోట్లా కార్లు, ట్రాక్టర్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచి్చతంగా ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల నిర్మాణ నాణ్యతలో తేడాలు చూపొద్దని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సూచించారు. -
రోడ్డెక్కిన ‘ఉత్తర రింగు’
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లను ఆహా్వనించింది. 161.518 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి విడివిడిగా టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి 14వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది. ఆలోపు ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17న టెండర్లను తెరవనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ రెండేళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ డాక్యుమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ పనులు.. రీజినల్ ఉత్తర భాగాన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూ ర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత బీఓటీ (బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్), హామ్ వంటి విధానాలను పరిశీలించినా.. ఈ రోడ్డుపై వాహన ట్రాఫిక్ ప్రస్తుతానికి తక్కువగా ఉంటుందన్న అంచనాతో ఈపీసీ వైపు మొగ్గు చూపింది. మిగతా రెండు పద్ధతుల్లో నిర్మాణ సంస్థ తొలుత నిర్మాణ ఖర్చు మొత్తాన్ని భరించి, టోల్ రూపంలో వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో ప్రస్తుతం టోల్ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని, నిర్మాణ సంస్థలు ముందుకురాకపోవచ్చని భావనకు వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఈపీసీ వైపు మొగ్గు చూపింది. నిర్మాణం పూర్తయ్యాక టోల్‌ను ఎన్హెచ్ఏఐ సొంతంగా వసూలు చేసుకుంటుంది. మొత్తం వ్యయం రూ.17,080 కోట్లు నెల రోజుల క్రితం కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంటును సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. ఆ వెంటనే ఎన్హెచ్ఏఐ రీజనల్ ఉత్తర భాగం డీపీఆర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు సమర్పించింది. రీజనల్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం రూ.17,080 కోట్లుగా (రాష్ట్ర ప్రభుత్వ వాటా సహా) ప్రతిపాదించింది. ఇందులో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.8,500 కోట్లు, భూసేకరణ వ్యయంలో కేంద్రం వాటా రూ.2,580 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,580 కోట్లు, ఇతర వ్యయం రూ.3,420 కోట్లుగా పేర్కొంది. మొత్తంగా ఎనిమిది లేన్లతో ఈ రోడ్డును ప్రతిపాదించారు. అందుకు సరిపడా భూసేకరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాలుగు లేన్ల రోడ్డును నిర్మించి, భవిష్యత్తులో మిగతా నాలుగు లేన్లను నిర్మించనున్నారు. రెండింతలు అయిన వ్యయం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతిపాదించిన ఏడేళ్ల తర్వాత డీపీఆర్ సిద్ధమైంది. ప్రస్తుత ధరలు, పరిస్థితుల మేరకు అంచనా వ్యయం సుమారు రెండింతలై ఏకంగా రూ.17 వేల కోట్లు దాటింది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఐదు ప్యాకేజీలు ఇవే.. రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ప్యాకేజీ–1: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు. దీని నిర్మాణ వ్యయ అంచనా రూ.1,529.19 కోట్లు. ప్యాకేజీ–2: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1114.80 కోట్లు. ప్యాకేజీ–3: ఇస్లాంపూర్ నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,184.81 కోట్లు. ప్యాకేజీ–4: ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి మీద ఉన్న రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ.1,728.22 కోట్లు. ప్యాకేజీ–5: రాయగిరి నుంచి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు. వ్యయ అంచనా రూ.1,547.04 కోట్లు. 11 చోట్ల భారీ ఇంటర్చేంజ్ కూడళ్లు రీజనల్ ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించనున్నారు. జాతీయ/రాష్ట్ర రహదారులను ఈ రోడ్డు దాటే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మొదటి కూడలి: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్.. ఇక్కడ ఎక్సె్టండెడ్ డంబెల్ ఆకృతిలో భారీ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీని నిడివి 3 కిలోమీటర్లు ఉంటుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. రెండో కూడలి: సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 జాతీయ రహదారిని క్రాస్ చేసే శివంపేట వద్ద నిర్మిస్తారు. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్‌లో ఉంటుంది. మూడో కూడలి: నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్‌ను ఎంపిక చేశారు. నాలుగో కూడలి: హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లీవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. ఐదో కూడలి: తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్‌పల్లి వద్ద. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఖరారు చేశారు. ఆరో కూడలి: రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడ పాక్షిక క్లీవర్ లీఫ్ (మూడు లూప్‌లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. ఏడో కూడలి: జగదేవ్‌పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద నిర్మిస్తారు. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఎంపిక చేశారు. ఎనిమిదో కూడలి: తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్‌లో నిర్మిస్తారు. తొమ్మిదో కూడలి: హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద.. డబుల్ ట్రంపెట్ డిజైన్‌లో నిర్మించనున్నారు. పదో కూడలి: భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఖరారు చేశారు. 11వ కూడలి: చౌటుప్పల్ సమీపంలో నిర్మిస్తారు. ఎది ఎక్స్టెండెడ్ డంబెల్ నమూనాలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ టెండర్లకు కానరాని స్పందన మరోవైపు రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో.. ఈ భాగాన్ని సొంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. తుది అలైన్మెంట్ తయారీ కోసం అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. దాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు శనివారం తెరిచారు. అయితే ఒక్క సంస్థ కూడా బిడ్లు దాఖలు చేయలేదని తెలిసింది. మరోవైపు రోడ్డు నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించిన మేరకు ఎన్హెచ్ఏఐతోనే చేపట్టాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఆ రోడ్డు నిర్మాణంపై సందిగ్ధత చోటు చేసుకుంది. -
ఉత్తర ‘రింగు’ అలైన్మెంటుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భా గానికి సంబంధించిన అలైన్‌మెంటును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. గతంలోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదించగా, ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఇక ట్రిపుల్ ఆర్కు ఎక్స్‌ప్రెస్ వే నంబరు కూడా త్వరలో రానుంది. అలైన్‌మెంటు ఓకే అయిన నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో ఉత్తర భాగానికి టెండర్లు పిలవనున్నారు. అలైన్‌మెంటు మార్పు వినతుల సంగతేంటి? ఉత్తర భాగం అలైన్మెంటులో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల కొందరు ప్రజా ప్రతినిధులు సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలిసి వినతులు అందించారు. సంగారెడ్డి సమీపంలో, యాదాద్రి సమీపంలోని రాయగిరి, చౌటుప్పల్ ఇంటర్‌ఛేంజ్ కూడలి.. ఇలా పలుచోట్ల అలైన్‌మెంటును కొంతమేర సవరించాలని కోరారు. ఇందులో ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మంత్రి ఒకరు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి కొన్ని భూముల వివరాలు 3డీ గెజిట్‌లో నమోదు కాలేదు. ఆ గెజిట్ విడుదలైతేనే భూసేకరణ జరుగుతుంది. ఎలాగూ గెజిట్‌లో వివరాలు నమోదు కానందున, అలైన్‌మెంటు మార్పు పెద్ద కష్టం కాదనేది నేతల అభిప్రాయం. అయితే కేవలం సాంకేతిక కారణాలతోనే ఆయా భూముల వివరాలు 3డీ గెజిట్‌లోకి రాలేదని, అలాంటి భూములు మొత్తం భూముల్లో కేవలం 0.4 శాతం లోపేనని ఎన్హెచ్ఏఐ వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ సమయంలో అలైన్మెంటులో మార్పులు చేస్తే, కొత్త ప్రాంతాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఆ వినతులను పూర్తిగా కొట్టిపడేయలేదు. దీంతో అలైన్మెంటులో మార్పులు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ అలైన్మెంటుకు ఆమోదముద్ర వేయటంతో మార్పుల అంశంపై ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్హెచ్ఏఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గతంలో జాతీయ రహదారులకు సంబంధించిన అలైన్‌మెంట్లకు ఎన్హెచ్ఏఐ ఆమోదంతో సరిపోయేది. అయితే మూడేళ్ల క్రితం కేంద్ర మంత్రిత్వశాఖ కచ్చితంగా ఆమోదముద్ర వేయాలనే నిబంధన వచ్చింది. ఆ మేరకు మంత్రిత్వ శాఖలో కొత్తగా అలైన్‌మెంటు అప్రూవల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ భేటీలోనే ఉత్తర భాగం అలైన్మెంటుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నంబర్ వస్తేనే పర్యావరణ అనుమతులు త్వరలో టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పా ట్లు చేస్తున్న క్రమంలో ఆ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబరు కేటాయింపు కీలకంగా మారింది. ఆ నంబరు కేటాయిస్తేనే పర్యావరణ అనుమతులు లభిస్తాయి. అవి ఉంటేనే టెండర్లను తెరిచేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ప్రెస్ వే నంబరును వీలైనంత త్వరలో కేటాయించాలని నిర్ణయించారు. -
హైవేల పక్కనే ఈవీ స్టేషన్లు
జాతీయ రహదారులను ఆనుకుని ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్–2024’ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రెండు పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆమోదించారు. – సాక్షి, అమరావతి దేశంలో జాతీయ రహదారులను ఆనుకుని మొత్తం 7,432 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలతో కలసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు సబ్సిడీగా ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. మొదటి దశలో 5,833 ఈవీ స్టేషన్లు ఏర్పాటుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన జాతీయ రహదారులను ఆనుకుని ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వచ్చే ఏడాది జూన్ నాటికి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.దేశంలో ఏర్పాటు చేయనున్న మొత్తం ఈవీ చార్జింగ్ స్టేషన్లు 7,432మొదటి దశలోఏర్పాటు చేయనున్న ఈవీ స్టేషన్లు 5,833 మన రాష్ట్రంలో మొదటి దశలో చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసే స్టేషన్లు 230 -
విశాఖ–ఖరగ్‌పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్‌పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
అలైన్మెంట్లో టింక‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరోపక్క ఉత్తర భాగం అలైన్మెంటులో మార్పులు చేయాలనే ఒత్తిడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలకు మద్దతు ముసుగులో తమకు అనుకూలమైనవారి కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి అన్ని రకాల గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయి, భూ పరిహారానికి అవార్డులు పాస్ చేసే సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలైన్‌మెంటు ఖరారై, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నందున మార్పులు సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతుండగా, కొందరు నేతలు ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. ఎక్కడెక్కడ మార్పులు – సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద ట్రిపుల్ ఆర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ జాతీయ రహదారి మీద భారీ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో పబ్లిక్ హియరింగ్, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. ఇదే ప్రాంతంలో దక్షిణ రింగు ప్రారంభం కావాల్సి ఉంటుంది. దాన్ని ఉత్తర రింగులో భాగంగా నిర్మించే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్‌తో అనుసంధానించాల్సి ఉంది. దక్షిణ రింగును మరింత దూరంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకుని ఉత్తర రింగు కూడలిని మరోచోట నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. రైతుల వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగురోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు మార్పు కోరుతుండగా, ప్రస్తుత అలైన్‌మెంటు తమకు చెందినవారి భూముల్లోంచి ఉండటంతో వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు మార్పు కోరుతున్నారు. – యాదాద్రి జిల్లాలో రింగురోడ్డు విషయంలో స్థానికుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గతంలో జాతీయ రహదారి కోసం కొందరు, సాగునీటి ప్రాజెక్టు కాలువల కోసం కొందరు.. ఇలా పలు సందర్భాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి భూసేకరణ జరగటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల భూములు కూడా అలైన్‌మెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో వారు బడా నేతలను ఆశ్రయించారు. స్థానికుల అభ్యర్థనలను ఆసరాగా తీసుకుని అలైన్‌మెంటును మార్చాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ రాయగిరి హైవే వద్ద కాకుండా ఎగువన నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. – ఉత్తర రింగు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. ఇది పట్టణానికి మరీ చేరువగా ఉందని, దీనివల్ల విలువైన భూములును స్థానికులు కోల్పోవాల్సి వస్తుందని, పరిహారంగా వారికి న్యాయమైన మొత్తం దక్కదంటూ కొందరు నేతలు వకాల్తా పుచ్చుకుని గడ్కరీ కార్యాలయంలో ఒత్తిడి పెంచారు. పట్టణానికి దూరంగా ఉండేలా అలైన్‌మెంటు మార్చాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల రైతుల్లో ఆందోళన అలైన్‌మెంటు మారుస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ల వల్ల రింగురోడ్డును ప్రస్తుత ప్రాంతానికి దూరంగా మారుస్తున్నారంటూ స్థానికుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. తమ భూములకు ఎక్కడ ఇబ్బంది కలుతుందోనన్న భయంతో ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండటంతో ..ఏది నిజమో తెలియని అయోమయంలో ఉన్నారు. చిన్న మార్పుతో భారీ తేడా! రింగురోడ్డు అలైన్మెంటులో ఓ ప్రాంతంలో చిన్న మార్పు చేస్తే దాని ప్రభావం ఇటు రెండు కిలోమీటర్లు, అటు రెండు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్స్‌ప్రెస్ వే అయినందున ఉన్నఫళంగా రోడ్డును మలుపు తిప్పే వీలుండదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి క్రమంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇక మార్పు ఎక్కువగా ఉంటే, అలైన్మెంటులో కూడా భారీ మార్పు చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఊరికి ఒకవైపు ఉందనుకుంటే, మార్పు వల్ల మరో వైపునకు మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. -
వచ్చే నెలలో ట్రిపుల్ఆర్ టెండర్!
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగురోడ్డు) నిర్మాణానికి కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి వీలుగా ఎన్హెచ్ఐఏ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం టెండర్ డాక్యుమెంటేషన్‌పై దృష్టి సారించింది. వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. పర్యావరణ అనుమతులు రాకుండానే.. ట్రిపుల్ఆర్ విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో భవిష్యత్‌లో మరింత ఆలస్యం జరగకుండా చూడాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి వీలులేదు. కానీ, టెండర్లు పిలిచేందుకు అది అడ్డంకి కాదు. దీంతో పర్యావరణ అనుమతులు వచ్చేలోగా టెండర్లు పిలిచి, పర్యావరణ అనుమతులు వచి్చన తర్వాత టెండర్లు ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు తెరిచే నాటికి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ జాతీయ రహదారి హోదాలో కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఉత్తర భాగం విషయంలో ఆ స్పష్టత ఉంది. దక్షిణభాగాన్ని కేంద్రం కాకుండా సొంతంగానే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగాన్ని సొంత నిధులతో కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో కేవలం జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ, ఇటీవల దాన్ని ఎక్స్‌ప్రెస్‌వే జాబితాలో చేర్చింది. అప్పటి వరకు తాత్కాలికంగా దానికి 161ఏ నంబర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ కేటాయించనున్నారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్టు క్లియరెన్సు వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులకు అది కీలకం.రోడ్డు నంబర్ అలాట్ అయిన తర్వాతనే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఆ రోడ్డు నంబర్ కేటాయించే అవకాశముంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు తెరవాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయ్యే వరకు టెండర్ల కోసం ఎదురు చూడకుండా, ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భూపరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది.ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్హెచ్ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఈ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమాంతరంగా ఈ ఏర్పాట్లు చేస్తూనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి నిర్ధారిత గడువులోపు నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. -
సొంతంగానే దక్షిణ రింగు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచి్చంది. గతంలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్‌మెంట్‌ను పక్కన పెట్టనుంది. కొత్త అలైన్మెంట్ రూపొందించడానికి 12 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ట్రిపుల్ ఆర్‌ను జాతీయ రహదారిగా నిర్ధారించి కేంద్రమే చేపట్టేందుకు గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తరభాగానికి భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్న సంగతి విదితమే.అదేక్రమంలో దక్షిణభాగాన్ని కూడా కేంద్రమే చేపట్టాల్సి ఉంది. ఉత్తర–దక్షిణ భాగాల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాల్సి ఉంది. భూసేకరణలో సగం వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలంటే, అలైన్మెంట్ ప్రక్రియను కూడా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అలైన్మెంట్ రూపొందించనున్నందున.. రోడ్డు నిర్మాణ బాధ్యతను ఇక కేంద్రం తీసుకోదని దాదాపు తేలిపోయింది.అంటే రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దక్షిణ భాగానికి దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం భరించాల్సిన అవసరం లేకుండా, తానే భరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రంతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన ప్రాంతాల మీదుగా, నచి్చనట్టుగా రోడ్డు నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే అలైన్మెంట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ అలైన్మెంట్ ఖరారుకే ఏడాది సమయం ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. ఆ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..వాగులు, వంకలు, గుట్టలుమిట్టలను పరిగణనలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను రూపొందించారు. జల వనరులు, భవిష్యత్‌లో నిర్మించే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అలైన్మెంట్ రూపొందించారు. మూడు అలైన్మెంట్లు సిద్ధం చేయగా, వాటిల్లో 189,25 కి.మీ. నిడివి గల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు దఫాలుగా అధికారులు సమావేశమై ఈ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందిన అలైన్మెంట్...తాము ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి అనుకూలంగా లేదని, అందులో చాలా మార్పులు చేయాల్సి ఉందని తేల్చారు.దానిని అలాగే వదిలేసి పూర్తి కొత్త అలైన్మెంట్ ను రూపొందించటమే మేలని సూత్రప్రాయంగా తేల్చారు. ఈ మేరకు గూగుల్ మ్యాపు సహాయంతో ఓ తాత్కాలిక అలైన్‌మెంట్‌ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి సమరి్పంచారు. దాదాపు 194 కి.మీ. నిడివితో దీనిని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌గా మార్చేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కనీ్వనర్‌గా ఉండే ఆ కమిటీలో పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, రోడ్లు భవనాల శాఖ, ఎన్హెచ్ఏఐ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆధ్వర్యంలో అలైన్మెంట్ ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది. -
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం194 కి.మీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక ప్రకారం దక్షిణ భాగం రింగ్‌రోడ్డు విస్తీర్ణం 189.25 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి–తూప్రాన్–చౌటుప్పల్) 158 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్తగా కొన్ని గ్రామాలను కలపడం వల్ల విస్తీర్ణం పెరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా దక్షిణ భాగం వైపు ఎన్హెచ్ఏఐ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్‌లను సిద్ధం చేసింది. వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించాల్సిన సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ను తామే నిర్మించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాక దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పేరిట ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్లో పేర్కొన్న పలు గ్రామాలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారం రహదారి బయటకు వెళ్లగా, కొన్ని గ్రామాలు లోపలికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
టోల్ ఫీజు మినహాయింపు ఇక లేదు..
టోల్ ఫీజు మినహాయింపునకు సంబంధించిన మూడేళ్ల నాటి పాత నిబంధనలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఉపసంహరించుకుంది. టోల్ బూత్‌ల వద్ద ఫీజు వసూలు ఎక్కువ సమయం పట్టి వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాటిని టోల్ ట్యాక్స్ లేకుండానే అనుమతించాలని నిబంధన ఉండేది. దాన్ని ఎన్హెచ్ఏఐ తాజాగా తొలగించింది.ఎన్హెచ్ఏఐ 2021 మేలో జారీ చేసిన నిబంధన ప్రకారం ప్రతి టోల్ బూత్ వద్ద ఒక్కో వాహనం ముందుకు కదిలే సమయం 10 సెకన్ల కంటే తక్కువగా ఉండాలి. ఏ లేన్‌లోనైనా వాహనాల వరుస టోల్ బూత్ నుండి 100 మీటర్లకు మించకూడదు. టోల్ బూత్ నుండి 100 మీటర్ల దూరం దాటి వాహనాలు క్యూ పెరిగితే టోల్ వసూలు చేయకుండా వాటిని అనుమతించాలి. ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న టోల్ బూత్‌లు, భూసేకరణ పూర్తికాని టోల్ ప్లాజాల కోసం ఎన్హెచ్ఏఐ ఈ నిబంధనను రూపొందించింది.అయితే, ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఎన్హెచ్ఏఐ 2021 నాటి ఆ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు, ప్రజల నుండి వచ్చిన విమర్శల తర్వాత ఈ నిబంధనను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. ఎన్హెచ్ఏఐ ఇప్పుడు లాంగ్ లైన్లను నిర్వహించడానికి లైవ్ ఫీడ్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. టోల్ ప్లాజాల నిర్వహణకు సంబంధించి ఎన్హెచ్ఏఐ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయానికి వర్తించే నిబంధనలు తక్షణమే రద్దవుతాయి. ఎందుకంటే ఎన్‌హెచ్ ఫీజు రూల్స్ 2008లో అటువంటి మినహాయింపు ప్రస్తావన లేదు. -
సీఎం భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిక
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రాష్ట్రంలోని జలంధర్, లూథియానాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జలంధర్‌లో ‘ఢిల్లీ- అమృత్ సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు, ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు సంఘటనలపై భగవంత్ మాన్కు గడ్కరీ లేఖ రాశారు.ఒకవేళ పంజాబ్‌లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 293 కిలోమీటర్ల పొడవుతో రూ. 14,288 కోట్లతో నిర్మించనున్న ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని తన లేఖలో హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, సీఎం మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. -
‘సర్వీసు’ లేకుండానే ఆర్ఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను సర్వీసు రోడ్లు లేకుండా నిర్మించబోతున్నారు. తద్వారా పూర్తిగా యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో.. పక్కల నుంచి ఇతర వాహనాలు ఈ ఎక్స్‌ప్రెస్ వేపైకి రాకుండా నిరోధించనున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు 352 కి.మీ. నిడివితో రూపుదిద్దుకోనున్న ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్చేంజ్ కూడళ్లలోని స్లిప్ రోడ్ల మీదుగా మాత్రమే ఇతర వాహనాలు ట్రిపుల్ ఆర్ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, నెమ్మదిగా కదిలే భారీ వాహనాలకు దీని మీదకు అనుమతి ఉండదు. సర్వీసు రోడ్ల ప్రతిపాదనకు తిరస్కారం హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా తొలుత సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు. ఆ మేరకు ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి డిజైన్లు పంపారు. అయితే ఎన్హెచ్ఏఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతీయ రహదారులకు స్థానిక పరిస్థితుల ఆధారంగా సర్వీసు రోడ్లను నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల సర్వీసు రోడ్లను నిర్మించకుంటే స్థానికులు ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ఇందులో సర్వీసు రోడ్డు ప్రతిపాదనే లేదు. ట్రిపుల్ ఆర్‌ను కూడా ఎక్స్‌ప్రెస్‌వేగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియమావళికి విరుద్ధమంటూ సర్వీస్ రోడ్ల ప్రతిపాదనకు కమిటీ తిరస్కరించింది. సర్వీసు రోడ్లుంటే ఇబ్బందేంటి? సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై వేగ పరిమితి చాలా ఎక్కువ. వాహనాలు భారీ వేగంతో దూసుకుపోతున్న సమయంలో, సర్వీసు రోడ్ల నుంచి అకస్మాత్తుగా వాహనాలు ప్రధాన క్యారేజ్ వే మీదకు వచి్చనప్పుడు ప్రమాదాలు చోటు చేసుకునే వీలుంటుంది. ⇒ ఎక్స్‌ప్రెస్ వేపై సర్వీసు రోడ్డుతో అనుసంధానమైన ప్రతిచోటా టోల్ బూత్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇది వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వే స్థాయి వేగంలో ప్రయాణించే వెసులుబాటును అడ్డుకుంటుంది. ⇒ పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో నిర్మిస్తున్నందున అది దాదాపు 25 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇరువైపులా బారికేడింగ్ ఉంటుంది. దీంతో పశువులు కానీ, జంతువులు కానీ దాని మీదకు రాలేవు. సర్వీసు రోడ్లు ఉంటే వాటి మీదుగా అవి ఎక్స్‌ప్రెస్ వే పైకి వచ్చి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి ఉంటుంది. ⇒ ఎక్స్‌ప్రెస్ వేల మీద సాధారణ ప్రయాణ వాహనాల కంటే అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలు ఎక్కువగా దూసుకుపోతాయి. వాటికి అడ్డంకులు ఉండకూడదు. గతంలో గుజరాత్లో స్థానికులు సర్వీసు రోడ్ల మీదుగా ఎక్స్‌ప్రెస్ వే మీదకు పెద్ద సంఖ్యలో చేరుకుని వారి డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి నిరసనలు నిర్వహించారు. దీంతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఎక్స్‌ప్రెస్ వేలకు సర్వీసు రోడ్డు ఆప్షన్ తొలగించారు. గ్రీన్‌ఫీల్డ్ రహదారి అయినందున.. ఊళ్లకు దగ్గరగా ఉండే జాతీయ రహదారుల మీదకు స్థానిక వాహనాలు చేరుకునేందుకు వీలుగా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. కానీ ట్రిపుల్ ఆర్ పూర్తి గ్రీన్‌ఫీల్డ్ (పూర్తిగా కొత్త) రహదారి అయినందున దీన్ని ఊళ్లకు దూరంగా నిర్మిస్తున్నారు. కాబట్టి సర్వీసు రోడ్ల అవసరం ఉండదని ఎన్హెచ్ఏఐ చెబుతోంది. నెహ్రూ ఔటర్ రింగురోడ్డు కూడా ఎక్స్‌ప్రెస్ వే నే అయినా.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు. కాబట్టి దీనికి జాతీయ ఎక్స్‌ప్రెస్ వేల నియమావళి వర్తించదు. ఖమ్మం–దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త హైవేకి అనుసంధానంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేస్తూ పనులను ముందుకు సాగనీయటం లేదు. అది కూడా జాతీయ ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్డు ఆప్షన్ ఏర్పాటు చేయలేదు. దీంతో పనులు కొనసాగాలంటే పోలీసు భద్రత కలి్పంచాలని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరటం విశేషం. -
ఇక రోడ్డు పక్కనే రెస్ట్ హౌస్
జాతీయ రహదారులపై ప్రయాణించేవారు బడలిక తీర్చుకునేందుకు కాసేపు సేదదీరాల్సి వస్తుంది. భోజనం, టిఫిన్లు చేసేందుకు రెస్టారెంట్స్ వద్ద ఆగాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించేవారు చార్జింగ్ చేసుకునేందుకు వేచి ఉండక తప్పదు. రాత్రివేళ డ్రైవర్లకు నిద్ర ఆవహిస్తుంటే ఓ కునుకు తీసేందుకు సురక్షితమైన ప్రదేశం ఏదన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ అవసరాలు తీర్చే ప్రదేశాలు వేర్వేరు ప్రదేశాల్లో కాకుండా ఒకేచోట అందుబాటులో ఉంటే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఉంటుంది. అందుకోసమే ‘వే సైడ్ ఎమినిటీస్’ (డబ్ల్యూఎస్‌ఏ)లు నిర్మించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ‘వే సైడ్ ఎమినిటీస్’ను నిర్మించే ప్రణాళికకు ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. – సాక్షి, అమరావతిఅన్ని వసతులూ ఒకేచోట..దేశంలో హైవేల వెంబడి రెస్ట్హౌస్ల తరహాలో నిర్మించే ‘వే సైడ్ ఎమినిటీస్’లలో ప్రయాణికులు సేదతీరేందుకు అన్ని వసతులు ఒకేచోట ఉండేలా చూస్తారు. ఇప్పటివరకు హైవేల నిర్మాణంతోపాటే ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా ‘పార్కింగ్ బే’లను నిర్మిస్తున్నారు. ఆ ప్రదేశంలో లారీలు, ఇతర వాహనాలను నిలిపేందుకు మాత్రమే అవకాశం ఉంది. కానీ.. డ్రైవర్లు, ప్రయాణికులకు విశ్రాంతి, భోజనం, ఆహ్లాదం, నిద్రించేందుకు ఎటువంటి వసతులు ఉండటం లేదు. భోజనం, టిఫిన్లు చేసేందుకు ఎక్కువగా ప్రైవేటు దాబాల వద్ద వాహనాలను నిలుపుతున్నారు. కానీ.. విశ్రాంతి తీసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రతపై భరోసా ఉండటం లేదు. దాంతో అప్పటికే అలసిపోయినప్పటికీ, అర్ధరాత్రి అయినప్పటికీ వాహన ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఈ అనివార్య పరిస్థితి రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తోంది. దీనికి పరిష్కారంగానే ప్రయాణికులకు అన్ని వసతులతో కూడిన ‘వే సైడ్ ఎమినిటీస్’ నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. వాటిలో రెస్టారెంట్లు, డార్మెటరీలు, పిల్లల ఆట స్థలాలు, పెట్రోల్ బంక్‌లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, ఏటీఎంలు వంటి అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తారు.రాష్ట్రంలో తొలి దశలో 75 నిర్మాణందేశవ్యాప్తంగా హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ‘వే సైడ్ ఎమినిటీ’ నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. తొలి దశలో దేశంలో 1,000 చోట్ల వీటి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. హైవే నిర్మాణ కాంట్రాక్టులో భాగంగా కాకుండా ప్రత్యేకంగా వే సైడ్ ఎమినిటీస్ నిర్మిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఒక్కొక్కటి సగటున రూ.10 కోట్ల చొప్పున మొత్తం మీద రూ.10 వేల కోట్లతో నిర్మించాలన్నది ప్రణాళిక. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో వాటిని నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8,683 కిలోమీటర్ల మేర హైవేలు ఉన్నాయి. ఏపీలో 75 ‘వే సైడ్ ఎమినిటీస్’ నిర్మించనున్నారు. కాగా.. వాటిలో అత్యంత ప్రధానమైనది కోల్‌కతా–చెన్నై హైవే రాష్ట్రంలో 1,025 కి.మీ. పొడవున ఉంది. మొదటి దశలో కోల్‌కతా–చెన్నై హైవే వెంబడి 25 నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం ఎన్హెచ్ఏఐ త్వరలోనే నిర్ణీత ప్రదేశాలను ఎంపిక చేయడంతోపాటు టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. రానున్న మూడేళ్లలో వాటిని నిర్మించాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా నిర్ణయించింది.దేశంలో వే సైడ్ ఎమినిటీలు ఇలా..ఎక్కడ: ప్రతి 50 కి.మీ.కు 1ఎన్ని చోట్ల: 1,000ఒక్కోదానికి అయ్యే వ్యయం: రూ.10 కోట్లుమొత్తం వ్యయం: రూ.10,000 కోట్లుఆంధ్రప్రదేశ్లో మొత్తం హైవేలు: 8,683 కి.మీ ఏపీలో నిర్మించనున్న వే సైడ్ ఎమినిటీలు: 75మొదటి దశలో నిర్మించేవి: 25ఎన్నేళ్లల్లో నిర్మిస్తారు: 3 -
పోలీస్ పహారా కాస్తేనే.. ఎక్స్‌ప్రెస్‌వే పనులు
అదో ఎక్స్‌ప్రెస్ వే.. పూర్తి గ్రీన్ ఫీల్డ్ హైవే.. మరో ఆరేడునెలల్లో నాలుగు వరసల ఆ రోడ్డు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, రెండు కీలక ప్రాంతాల్లో పని మొదలు కాలేదు, ఏడాదిన్నరగా అలాగే ఉండిపోయింది.. ఇప్పుడు ఆ రోడ్డు పనులు పూర్తి కావాలంటే పోలీసు పహారా అవసరం ఏర్పడింది. స్వయంగా ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి వచ్చి మరీ ముఖ్యమంత్రిని భద్రత కోరాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 4 గంటల మేర తగ్గించే కీలక రోడ్డుకు ఇప్పుడు పోలీసు భద్రత అవసరం పడింది. మిగతాచోట్ల పనులు దాదాపు పూర్తి కాగా, రెండు కీలక ప్రాంతాల్లో స్థానికులతో పేచీ ఏర్పడింది. ఒకచోట అయితే, పలుకుబడి కలిగిన ఓ వ్యక్తే పనిని అడ్డుకున్నాడు. ఏడాదిన్నరగా ఇదే సమస్య. దీంతో ఈ పనిని ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలంటూ ఢిల్లీ ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు కోరాల్సి వచ్చింది. పోలీసు భద్రత కల్పిస్తే పనులు చేస్తామని లిఖితపూర్వకంగా రాష్ట్రప్రభుత్వానికి విన్నవించారు. ∙హైదరాబాద్–విశాఖపట్నం జాతీయ రహదారి లో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు మూ డేళ్ల క్రితం ఎన్హెచ్ఏఐ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఖమ్మం పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రతిపాదించింది. 162. 12 కి.మీ. నిడివి ఉండే ఈ నాలుగు వరసల రోడ్డు నిర్మాణాన్ని రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. రోడ్డు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వచ్చే మార్చి నాటికి ఇది అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, ఖమ్మం పట్టణం శివారులోని ధ్వంసలాపురం, చింతకాని మండలంలోని కొదుమూరు వద్ద అసలు పనులే ప్రారంభం కాలేదు. సమస్య ఏమిటంటే.. ఖమ్మం శివారులోని ధ్వంసలాపురం వద్ద ఈ రోడ్డుకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం–బోనకల్ రోడ్డు, ౖరైల్వే లైన్, మున్నేరు సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ ఓవైపు మున్నేరు మీద 100 మీట ర్ల నిడివి వంతెన, మరోవైపు 150 మీటర్ల పొడవైన రైల్ ఓవర్‌బ్రిడ్డి నిర్మించాల్సి ఉంది. ఈ 2 వంతెనల నిర్మాణం నేపథ్యంలో, ధ్వంసలాపురం వద్ద ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌వే ఎత్తు ఏకంగా 14 మీటర్లుగా ఉంటుంది. అక్కడ పట్టణంలోకి వెళ్లేందుకు, పట్ట ణంలోని వాహనాలు ఈ రోడ్డు మీదకు వచ్చేందు కు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అంత ఎత్తుండే రోడ్డు నుంచి ఈ అనుసంధానం కావాలంటే కిలోమీటరున్నర స్థలం అవసరం. కానీ అక్కడ కేవలం 350 మీటర్ల నిడివి మాత్రమే ఉ న్నందున అది సాధ్యం కాదని ఎన్హెచ్ఐఏ తేల్చే సింది. దీంతో స్థానికులు ఆ రెండు వంతెనల నిర్మా ణాన్ని ప్రారంభం కాకుండా అడ్డుకుంటూ వస్తున్నా రు. ఇక.. చింతకాని మండలం కొదుమూరు వద్ద సర్వీసు రోడ్డు నిర్మించాలని కొందరు అడ్డుకుంటున్నారు. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సర్వీసు రోడ్డు నిర్మించరు.అండర్‌పాస్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, సర్వీసు రోడ్డు నిర్మిస్తే తమ భూము ల ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఒకరిద్దరు స్థానికులను రెచ్చగొడుతున్నారు. సర్వీసు రోడ్డు నిర్మిస్తే దాని వెంబడి నిర్మాణాలు, వాణిజ్య కట్టడాలు వెలిసి ఎక్స్‌ప్రెస్‌వే ప్రయోజనం నెరవేరద న్నది అధికారుల మాట. ఇలా ఏడాదిన్నరగా ఈ రెండు ప్రాంతల్లో అసలు పనులే మొదలు కాలేదు. ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ పరిశీలన పోలీసు బలగాలను కేటాయిస్తే ఆ రెండు చోట్ల పనులు నిర్వహిస్తామని ఎన్హెచ్ఏఐ పేర్కొంటోంది. ఈ రెండు అడ్డంకుల వల్ల హైదరాబాద్– విశాఖపట్నం మధ్య ప్రయా ణ సమయాన్ని తగ్గించాలన్న ప్రయత్నానికే విఘాతం కలిగిందని తాజాగా ఎన్హెచ్ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన ఎన్హెచ్ఐఏ ఢిల్లీ అధికారులు ఈ మేరకు సహకరించాలని కోరారు. ఈ రోడ్డు పనులకు పోలీసు భద్రత క ల్పించటమా, స్థానికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని మధ్యే మార్గంగా మార్పులు చేయటమా అన్న విషయాన్ని ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోంది.. -
పెరిగిన టోల్ చార్జీలు.. ఈ రోజు నుంచే షురూ
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోమవారం నుంచి 5 శాతం టోల్ పెంపును ప్రకటించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త టోల్ చార్జీలు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.కొత్త టోల్ చార్జీలు ఈ రోజు నుంచే (జూన్ 3) అమల్లోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కొత్త ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.భారతదేశంలో మొత్తం సుమారు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 675 పబ్లిక్ ఫండెడ్ కాగా, మిగిలిన 180 రాయితీదారుల నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పే రూల్ 2008 ప్రకారం.. టోల్ ఫీజుల పెంపు జరిగిందని సంబంధింత అధికారులు చెబుతున్నారు.NHAI డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు రూ. 50,000 కోట్లను దాటింది (నవంబర్ 2023 వరకు). టోల్ గేట్లు పెరగటం, ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ కావడంతో భారీ టోల్ వసూలు జరిగింది. ఇప్పుడు టోల్ చార్జీలు 5 శాతం పెరగడంతో టోల్ వసూలు మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. -
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి ‘టోల్’ బాదుడు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు నేటి అర్ధరాత్రి(జూన్ 3) నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఐఏ) వెల్లడించింది. టోల్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరగనున్నాయి.టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఎన్హెచ్ఐఏ తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది.ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది. -
‘రింగు’ పరిహారానికి రుణం
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో సగం వాటా భరించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుంది. భూసేకరణలో సగం ఖర్చు కూడా కేంద్రమే భరిస్తుంది. మిగతా సగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని ప్రస్తుత తరుణంలో భూసేకరణ వ్యయంలో సగం భరించడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది. సొంత ఆదాయవనరుల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో రుణం తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణం వైపే మొగ్గుచూపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళ్తోంది. హడ్కో వైపు చూపు: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఒకేసారి చెల్లించాలంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఒత్తిడి చేసింది. దీన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడింది. ఆ డబ్బు చెల్లించకుంటే ప్రాజెక్టే నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ ఎన్హెచ్ఏఐ నుంచి పరోక్ష హెచ్చరికలూ వెలువడ్డాయి. చివరకు విడతలవారీగా చెల్లించేందుకు అంగీకారం కుదరింది. తొలుత రూ. వెయ్యి కోట్లు.. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు నాటి ప్రభుత్వం సమ్మతించింది. అయితే అలైన్మెంట్ మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాల లాంటి వాటి తరలింపునకు అవసరమయ్యే రూ. 364 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్హెచ్ఏఐ కోరడంతో ప్రస్తుత ప్రభుత్వం తొలుత తటపటాయించినా తర్వాత సమ్మతించింది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించాక ఆ మొత్తాన్ని కేంద్రమే భరించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో భూపరిహారం వాటా నిధుల కోసం రుణం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించింది. అప్పట్లో ఇదే విషయాన్ని అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కానీ ఎక్కడి నుంచి రుణం పొందాలనే విషయంలో డోలాయమానం నెలకొంది. వారం క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో దీనిపై స్పష్టత వచి్చంది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రాజెక్టు నిర్మాణ సన్నాహాలు వేగం పుంజుకోనున్నాయి. అంచనా వ్యయం పెరిగే అవకాశం.. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలు, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు.. ఇలా దాదాపు రెండేళ్ల సమయం గడిచిపోయింది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 2022 చివర్లో రీజనల్ రింగురోడ్డుకు బడ్జెట్ ఖరారు చేసిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి రూ. 13,200 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ మొత్తం రూ. 16 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఇక జాప్యం చేయకుండా వెంటనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా భూపరిహారం వ్యవహారాన్ని కొలిక్కి తేవాల్సి ఉంది. ఇది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీలైనంత త్వరలో లోన్ మొత్తాన్ని పొందాల్సి ఉంది. -
కొత్తగా దక్షిణ ‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం, విస్తరణ వంటివేమీ లేకుండా.. మొత్తంగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకోనుంది. దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి.. 189.4 కిలోమీటర్ల నిడివికి చేరనుంది. సంగారెడ్డి నుంచి ఆమన్‌గల్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మితం కానుంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు సమర్పించిన ఈ అలైన్మెంటుకు.. జూన్‌లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది. త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది. తొలుత కొన్ని పాతరోడ్లతో కలపాలనుకున్నా.. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ నుంచి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలుత భావించారు. ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించి.. దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది. కానీ రింగు రోడ్డుగా పూర్తి రూపం రావాలంటే.. దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో.. చివరికి కేంద్రం సరేనంది. ఆలోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను రూపొందించింది. అందులో రెండు అలైన్మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా.. ఒకదాన్ని పూర్తి కొత్త రోడ్డుగా ప్రతిపాదించారు. ఈ మూడో అలైన్‌మెంట్‌నే ఖరారు చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ఒక్క రోడ్డును కలుపుదామనుకున్నా.. షాద్‌నగర్ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా కంది వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును.. దక్షిణ ‘రింగ్’ అలైన్మెంట్లో భాగం చేయాలని తొలుత భావించారు. కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి. కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది. దాంతో ఈ రోడ్డును కలపకుండా.. దానికి దూరంగా రూపొందించిన అలైన్మెంట్ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనితో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది. భారీగా పెరుగుతున్న అంచనా వ్యయం.. రీజనల్ రింగురోడ్డును తొలుత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా రూ.19 వేల కోట్లతో పూర్తి చేయవచ్చనే అంచనా వేశారు. కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ.. ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, భూముల ధరలు విపరీతంగా పెరగటంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్‌ను ఖరారు చేసింది. ఈ భాగం 158.65 కిలోమీటర్ల నిడివికి రూ.13,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత గానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. అప్పటికి ఉత్తర భాగం వ్యయ అంచనా రూ.16 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా అలైన్మెంట్ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లుగా అంచనా వేశారు. జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రీజనల్ రింగురోడ్డు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లను దాటుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు లెక్క ఇదీ.. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లు (ఖరారైనది) దక్షిణ భాగం 189.43 కిలోమీటర్లు (అంచనా) మొత్తం పొడవు 348.08 కిలోమీటర్లు (అంచనా) సేకరించే భూమి సుమారు 4,500 హెక్టార్లు భూసేకరణ వ్యయం అంచనా రూ.14,500 కోట్లు (భూముల ధరలు పెరిగేకొద్దీ మారుతుంది) నిర్మాణ పనులకు అయ్యే వ్యయ అంచనా రూ.19,500 కోట్లు (జాప్యం జరిగినకొద్దీ పెరిగే అవకాశం ఉంది) -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్‌సైట్‌లోని ఎఫ్ఏక్యూ సెక్షన్‌ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్‌ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్‌మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్‌ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్‌లపై కీలక అప్డేట్!
టోల్గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో పీపీబీఎల్‌లో ఫాస్టాగ్‌లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్‌లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్‌లను పొందవచ్చు. ఫాస్టాగ్ ఛార్జీలు? హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫాస్టాగ్ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 1.ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్ యూజర్‌గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్‌ను వినియోగించేలా యాక్టీవేట్ చేసేందుకు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది. 2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్ అకౌంట్ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్‌ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు 3.ఫాస్టాగ్ యాక్టివేషన్ టైం : ఫాస్టాగ్ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్‌లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాహనదారుల నుంచి ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్‌లు, వ్యాన్లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్‌లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్, వ్యాన్లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్ని ఆన్లైన్లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. ఐడీబీఐ ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. కొటక్ మహీంద్రా వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్‌కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్‌గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 200, కస్టమర్ వాలెట్లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది. పీఎన్బీ కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా), వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150. -
హైవేల నిర్వహణ పదేళ్లు కాంట్రాక్టర్లదే
సాక్షి, అమరావతి: దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్ల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ లయబిలిటీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. ఈమేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలను నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ఓ ప్రధాన కారణమని నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది. 2022లో దేశంలో సంభవించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైన జరిగినవే. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24 శాతం మంది అంటే 41 వేల మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. మృతుల సంఖ్య 9శాతం పెరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ రహదారులను నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థలు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ చేపడుతున్నాయి. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, ఇతరత్రా మరమ్మతులు చేస్తాయి. ఆ తర్వాత ఆ బాధ్యతను ఎన్హెచ్ఏఐకి అప్పగిస్తున్నాయి. కానీ పలు కాంట్రాక్టు సంస్థలు కేవలం ఐదేళ్లే నాణ్యతతో ఉండేలా హైవేలను నిర్మిస్తున్నాయని ఎన్హెచ్ఏఐ ఆడిటింగ్ నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత ఆ రోడ్లు దెబ్బతింటున్నాయి. వాటి నిర్వహణ భారం ఎన్హెచ్ఏఐపై పడుతోంది. దీనికి పరిష్కారంగానే నిర్వహణ బాధ్యతను పదేళ్లకు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈపీసీ, యాన్యుటీ, బీవోటీ పద్దతుల్లో నిర్మించే జాతీయ రహదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది. తక్షణం అమలులోకి ఎన్హెచ్ఏఐ నూతన విధానాన్ని తక్షణం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆమోదించిన జాతీయ రహదారుల నిర్మాణాలకు కొత్త విధానాన్ని వర్తింపజేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టినవాటికి, త్వరలో చేపట్టబోయే వాటికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రూ.7.81 లక్షల కోట్లతో 25,713 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. వాటిలో ఈపీసీ విధానంలో 56 శాతం, 42శాతం యాన్యుటీ విధానంలో, 2 శాతం బీవోటీ విధానంలో నిర్మించనుంది. వీటి నిర్మాణాన్ని చేపట్టే కాంట్రాక్టు సంస్థలు పదేళ్లపాటు వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను చేపట్టాలి. తాజా నిర్ణయం వల్ల జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని, నిర్వహణ కూడా సక్రమంగా ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. -
పేటీఎం, ఫాస్టాగ్‌పై ఆందోళనలు.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వచ్చే వారం ఎన్హెచ్ఏఐ, ఎన్సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు. -
FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగింపు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్హెచ్ఏఐ మరోసారి పొడిగించింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ పనిచేయకుండాపోవచ్చు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్‌తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం.