సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను జిల్లా ప్రధాన రహదారులను అనుసంధానించే కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు రాష్ట్రంలో ఆరు బైపాస్ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఒకేసారి ఆరు బైపాస్‌ల నిర్మాణానికి ఆమోదించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 930 కోట్లతో మొత్తం 64.20 కి.మీ. మేర ఈ ఆరు బైపాస్ రహదారులను నిర్మించనున్నారు.
పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరు పట్టణాలను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ బైపాస్‌ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. వాటిలో రాయలసీమలోని తాడిపత్రి, వి.కోట, బైరెడ్డిపల్లి, ఆదోని, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఉన్నాయి. సరుకు రవాణా వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా ఈ ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు పంపింది. వీటిని ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించింది.
ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించనున్న ఆరు బైపాస్ రహదారుల ప్రణాళిక ఇలా..
► బెంగళూరు–చెన్నై రహదారిని అనుసంధానిస్తూ చిత్తూరు జిల్లా వి.కోట వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 120 కోట్లు కేటాయించారు.
► కర్నూలు జిల్లా బైరెడ్డిపల్లి వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని ఆరు కి.మీ. నిర్మిస్తారు. రూ. 70 కోట్లతో నిర్మాణానికి ఆమోదించారు.
► తాడిపత్రిలో పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారిని రూ. 95 కోట్లతో నిర్మించడానికి ఆమోదం తెలిపారు.
► ఆదోనిలో పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 7 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 80 కోట్లు కేటాయించారు.
► నరసాపురం వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు లేన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు. 23.20 కి.మీ. ఈ రహదారిని రూ. 490 కోట్లతో నిర్మించడానికి ఆమోదించారు.
► అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు వద్ద పేవ్డ్ షోల్డర్స్‌గా బైపాస్ రహదారి నిర్మిస్తారు. 8 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 75 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment