కృష్ణానదిపై మరో వంతెనకు ప్రణాళిక  | Plan for another bridge over Krishna River | Sakshi
Sakshi News home page

కృష్ణానదిపై మరో వంతెనకు ప్రణాళిక 

Published Tue, Dec 7 2021 3:45 AM | Last Updated on Tue, Dec 7 2021 10:08 AM

Plan for another bridge over Krishna River - Sakshi

సాక్షి, అమరావతి: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16)పై ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నగరంపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనపై ఎన్‌హెచ్‌ఏఐ సానుకూలంగా స్పందించింది. కృష్ణానదిపై కొత్త వంతెనతో కలిపి 40 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి నిర్మాణానికి రూ.1,675 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జీఎస్టీ, భూసేకరణ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకున్న అనంతరం దీనిపై కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది.

ఎన్‌హెచ్‌–16 మీద గన్నవరం ముందు నుంచే గుంటూరుకు నేరుగా చేరేందుకు విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు నిర్మించనున్నారు. ప్రస్తుతం కోల్‌కతా– చెన్నై మార్గంలో వాహనాలన్నీ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ బాగా ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారంగా తూర్పు బైపాస్‌ రహదారిని ప్రతిపాదించారు. తద్వారా ఎన్‌హెచ్‌–16 మీద వాహనాలు మరింత తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ ఐదు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో డిజైన్లు రూపొందించి పరిశీలించింది. వాటిలోఒకదాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. దీని ప్రకారం గన్నవరం విమానాశ్రయానికన్నా ముందునుంచే విజయవాడకు తూర్పు దిశగా కంకిపాడు మీదుగా గుంటూరు జిల్లాలోని కాజ వరకు నాలుగు లేన్ల బైపాస్‌ రోడ్డు వేస్తారు. దీన్లో భాగంగా కృష్ణానది మీద వంతెన నిర్మిస్తారు.

445 ఎకరాల సేకరణకు రూ.515 కోట్లు అవసరం
విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి కోసం మొత్తం రూ.1,675 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల మేరకు.. 40 కి.మీ. పొడవున 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.728 కోట్లు, కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి రూ.432 కోట్లు, 445 ఎకరాల భూసేకరణకు రూ.515 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జీఎస్టీ, మైనింగ్‌ సెస్‌ కింద వచ్చే రూ.95 కోట్ల రాబడిని వదలుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. భూసేకరణ వ్యయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ భరించాలని చెప్పింది. ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోందని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement