national highway
-
నాగ్‌పూర్ హైవే ‘ప్రైవేటు పరం’
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణే లక్ష్యంగా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) తెలంగాణలోని ఓ జాతీయ రహదారిని ప్రైవేటుపరం చేసింది. రోడ్డు మీద ఉన్న టోల్ బూత్‌ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయటం ద్వారా నిర్ధారిత కాలానికి టోల్ వసూలు అంచనా మేరకు లెక్కగట్టి మొత్తాన్ని ఒకేసారి వసూలు చేసుకునేందుకు ప్రారంభించిన టీఓటీ (టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్ఫర్) విధానంలో ఓ జాతీయ రహదారిని ప్రైవేటుకు అప్పగించింది. టెండర్ పద్ధతిలో ఆ రోడ్డు బాధ్యతను పొందిన సంస్థ గురువారం అర్ధరాత్రి నుంచి దానిపై టోల్ వసూలు ప్రారంభించింది. 20 ఏళ్ల కాలానికి...: హైదరాబాద్–నాగ్‌పూర్ (ఎన్‌హెచ్ 44) జాతీయ రహదారి ఎన్హెచ్ఏఐ నిర్వహణలో ఉంది. 251 కి.మీ. నిడివి గల ఈ రోడ్డును తాజాగా టీఓటీ పద్ధతిలో ప్రైవేటు సంస్థకు అప్పగించింది. గత సెపె్టంబరులో టెండరు పిలవగా, నార్త్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ వచ్చే 20 ఏళ్లపాటు ఆ రోడ్డు నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఈ రోడ్డుపై ఆరు టోల్ ప్లాజాలుండగా, ఒకటి ఇప్పటికే ప్రైవేటు ఆ«దీనంలో ఉంది. మిగతా ఐదు టోల్‌బూత్‌లను ఎన్హెచ్ఏఐ ఇప్పుడు టీఓటీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించింది. వచ్చే 20 ఏళ్ల కాలానికి సంబంధించి ఒకేసారి టీఓటీ మొత్తంగా ఆ సంస్థ రూ.6,661 కోట్లను ఎన్హెచ్ఏఐకి ఈనెల 12న జమచేసింది. ఇక టోల్ వసూలు బాధ్యత ప్రైవేటు సంస్థ చేపడుతుంది. ఈ 20 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే తరహాలో ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)ను ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ నిర్ణయం పెద్ద వివాదాస్పదమైంది.ప్రైవేటు సంస్థ చెల్లించిన మొత్తం కంటే టోల్ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని వైరి పక్షాలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాగా, ప్రైవేటు సంస్థలు కేంద్రం నిర్ధారించిన మేరకే టోల్ వసూలు చేయాల్సి ఉంటుందని, సొంతంగా టోల్ ధరలను సవరించుకునే అధికారం వాటికి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, చాలా సంస్థలు, ఆశించిన స్థాయిలో వాహన సంచారం లేనందున తమకు నష్టం వస్తోందనే సాకుతో టోల్ పెంచుకునేందుకు ప్రతిపాదిస్తుండటం గమనార్హం. -
దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు
-
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేసే ప్రయత్నం సరికాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముందుగా పరిహారం చెల్లించాకే భూములు సేకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో జరిపిన సమీక్షలో పలు సూచనలు చేశారు. మంచిర్యాల–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి ఎన్హెచ్ఏఐ వద్ద పరిహారానికి సంబంధించి డ్రాఫ్ట్ అవార్డులు 1,023 వరకు పెండింగులో ఉండటంపై ప్రశ్నించారు. 15 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని అధికారులు పేర్కొనే క్రమంలో.. భూమిని సేకరించి పరిహారం చెల్లిస్తామంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొనటాన్ని మంత్రి తప్పుపట్టారు.భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులను వచ్చేవారం ప్రారంభించాలని, తాను ఇప్పటికే పదిసార్లు ఆదేశించినా పనులు మొదలుపెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి డిసెంబర్/జనవరిలో టెండర్లు పిలవాలని సూచించారు. శ్రీశైలం దారిలో మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నందున తుక్కుగూడ నుంచి డిండి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి నిర్ణయించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.దీని ఆమోదంపై తాను సీఎంతో మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. రూ.7 వేల కోట్లు ఖర్చయ్యే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎంతో ఉపయుక్తమైందని, ఈ పనుల్లో వేగం పెరగాలని సూచించారు. భద్రాచలానికి 3 గంటల్లో వెళ్లేలా చేసే గౌరెల్లి–వలిగొండ రోడ్డు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం–దేవరపల్లి రోడ్డులో సరీ్వసు రోడ్డు ఆప్షన్ ఉండాలని సూచించారు. విపక్షాల వికృత చేష్టలు.. రైతులకు లాభదాయక పరిహారం ఇచ్చి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ కోసం యత్నిస్తుంటే విపక్షాలు కలెక్టర్లపై కూడా దాడులు చేసి చంపేందుకు కుట్రచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని విమర్శించారు. -
అఘోరీ హల్చల్
మంగళగిరి : మంగళగిరి – తాడేపల్లి జాతీయ రహదారిపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన మహిళా అఘోరీ సోమవారం హల్చల్ చేసింది. పుర్రెలు మెడలో ధరించి, దిగంబరంగా ఆటో నగర్‌లోని తన కారు సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. కారు సర్వీస్ చేస్తుండగా ఓ జర్నలిస్టు అఘోరీని ఫొటో తీశారు. దీంతో ఆగ్రహించిన అఘోరీ జర్నలిస్టుపై దాడి చేసి, గాయపరచింది. అతడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతలో మరికొంత మంది జర్నలిస్టులు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీయడంతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని అఘోరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
సిద్దిపేట మీదుగా ఫోర్వే
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట మీదుగా నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు రూ.1,100 కోట్ల వరకు వ్యయం రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. వచ్చేనెలలో కేంద్ర ఉపరితల రవాణాశాఖకు జాతీయ రహదారుల విభాగం దానిని సమర్పించనుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా, అలైన్మెంట్ కూడా ఖరారైంది. ఎన్‌హెచ్ 365 బీకి కొత్త రూపు.. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు 184 కి.మీ. మేర ఉన్న 365బీ రోడ్డును కేంద్రం విస్తరిస్తోంది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించినా, చాలా ఇరుకుగా ఉండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం విస్తరిస్తోంది.సూర్యాపేట నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న దుద్దెడ వరకు రెండు వరుసలుగా రోడ్డుగా 10 మీటర్లకు విస్తరించింది. సూర్యాపేట నుంచి జనగామ వరకు పనులు గతంలోనే పూర్తి కాగా, జనగామ నుంచి చేర్యాల మీదుగా దుద్దెడ వరకు పనులు ఇప్పుడు పూర్తి అవుతున్నాయి.ఇక రాజీవ్ రహదారి నుంచి ఈ రోడ్డుకు కొత్తరూపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని నాలుగు వరుసలుగా 20 మీటర్ల వెడల్పునకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ భాగం 365బీలో అంతర్భాగమే అయినా, ఇందులో సింహభాగం గ్రీన్‌ఫీల్డ్ హైవేగా పూర్తి కొత్త రోడ్డుగా ఏర్పడబోతోంది. రాజీవ్ రహదారి మీదుగా కాకుండా.. ప్రస్తుతం 365బీ జాతీయ రహదారి చేర్యాల మీదుగా వచ్చి దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిలో కలుస్తుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డులోనే భాగంగా కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా విడదీసి కొత్తరోడ్డుగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిని క్రాస్ చేసి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వెనక ఉన్న సామాజిక అటవీ భాగం వెనుక నుంచి కోమటి చెరువు పక్క నుంచి సిద్దిపేటకు చేరుతుంది. పట్టణ వెనుక భాగం నుంచి కోటిలింగేశ్వర దేవాలయ సమీపం మీదుగా ముందుకు సాగి రామంచ గ్రామం వద్ద ప్రస్తుతం ఉన్న 365బీ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. అక్కడి వరకు కొత్త అలైన్‌మెంటుతో రహదారిగా నిర్మిస్తారు. ఆ తర్వాత జక్కాపురం, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, తంగళ్లపల్లి గ్రామాల వద్ద బైపాస్‌లతో రోడ్డుగా రూపొందనుంది. అనంతరం సిరిసిల్ల పట్టణం వద్ద మానేరు నదిని దాటుతుంది. అక్కడ దీనికోసం వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం నేరుగా సిరిసిల్లలోకి చేరే పాత హైవేను కాదని, సిరిసిల్ల బైపాస్ రోడ్డుతో పట్టణం దాటిన తర్వాత బైపాస్ కూడలి వద్ద ఇతర రోడ్లతో అనుసంధానమవుతుంది. 100 మీటర్లు – 150 మీటర్ల వెడల్పు.. ఇలా రెండు ప్రణాళికలను డీపీఆర్‌లో చేర్చనున్నారు. వీటిల్లో కేంద్రం దేనికి మొగ్గుచూపితే అంత వెడల్పుతో రోడ్డుకు భూమిని సేకరిస్తారు. డీపీఆర్ ఆమోదం తర్వాతే వివరాలు వెల్లడవుతాయి. రాజీవ్ రహదారిని క్రాస్ చేసే చోట, సిరిసిల్ల వద్ద మానేరు మీద ఫ్లైఓవర్లు ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్న వంతెనలు కూడా నిర్మిస్తారు. డీపీఆర్‌కు ఆమోదం తర్వాతనే వీటిల్లో వేటికి కేంద్రం ఆమోదం తెలిపిందో స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
హైవే.. ఇక హైస్పీడ్వే
ఎన్‌హెచ్–44.. దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి. కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 3,745 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారి 11 రాష్రాల్లోని 30 ప్రధాన నగరాలను అనుసంధానిస్తోంది. జాతీయ రవాణా వ్యవస్థలో ఎన్‌హెచ్–44 అత్యంత కీలకమైంది. ఈ రహదారిలో బెంగళూరు–హైదరాబాద్ నగరాల మధ్య వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఇప్పుడున్న ‘ఫోర్ వే’ సౌలభ్యంగా ఉన్నా.. ఐదేళ్లలో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది.ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు సరిపోని పరిస్థితి. కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్గేట్ నుంచి బెంగళూరు–హైదరాబాద్ మధ్య నిత్యం 16 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే అమకతాడు టోల్గేట్ పరిధిలో 11 వేల వాహనాలు వెళ్లొస్తున్నాయి. దేశంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న నగరాల్లో బెంగళూరు–హైదరాబాద్ ప్రధానమైనవి. ఐటీతో పాటు పారిశ్రామికంగా రెండు నగరాలు అభివృద్ధి చెందాయి. రెండు నగరాల మధ్య 583 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేసేవారి సంఖ్య కూడాఎక్కువే. కొందరు రైళ్లు, విమానాల్లో వెళుతున్నా అధిక శాతం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో వాహనాల రద్దీ పెరిగింది. ముఖ్యంగా కార్ల వినియోగం అధికమైంది. ట్రాఫిక్ పెరగడాన్ని గుర్తించిన కేందప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయాలని అనంతపురం నేషనల్ హైవే అధికారులకు సూచించింది. పూర్తయిన భూసేకరణ.. నిర్మాణ ఖర్చులతోనే డీపీఆర్ ఎన్‌హెచ్–44ను డబుల్ లైన్ నుంచి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించే సమయంలోనే ఆరు లేన్లకు సంబంధించి భూసేకరణ జరిగింది. అప్పట్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6 లేన్ల కోసం భూసేకరణ చేశారు. 4 లేన్ల రహదారిని నిర్మించి తక్కిన భూమిని రిజర్వ్‌గా ఉంచారు. ఇప్పుడు కేవలం రహదారిని 6 లేన్లకు విస్తరించేందుకు అవసరమైన ఖర్చును మాత్రమే అంచనా వేసి డీపీఆర్ రూపొందిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలు ఇతరత్రా ఖర్చులు లెక్కిస్తున్నారు. భూసేకరణలో సమస్యలు, కోర్టు వివాదాలు కూడా లేవు. దీంతో డీపీఆర్‌ను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తే ఆమోదముద్ర వేసి టెండర్లు పిలుస్తారు.‘సీమ’ వాసులకు ప్రయాణం మరింత సులభంఎన్హెచ్–44 విస్తరణతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు వైఎస్సార్ జిల్లా వాసులకు ప్రయాణం సులభం కానుంది. కర్నూలు–హైదరాబాద్ 217.7 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం 4గంటల సమయం పడుతోంది. అలాగే కర్నూలు–బెంగళూరు మధ్య 359.4 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రయాణానికి 7 గంటలు పడుతోంది. ఎన్‌హెచ్–44 విస్తరిస్తే సమయం తగ్గే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా వాసులకూ హైదరాబాద్, బెంగళూరుకు ప్రయాణ సమయం తగ్గనుంది. కడప, చిత్తూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకునే వారికి కర్నూలు నుంచి, బెంగళూరుకు ప్రయాణించే వైఎస్సార్ జిల్లా వాసులకు కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని కొండూరు నుంచి ప్రయాణం వేగవంతం కానుంది. హైదరాబాద్–బెంగళూరు ఇండ్రస్టియల్ కారిడార్‌లో నోడ్ పాయింట్‌గా కేంద్రం ఓర్వకల్లు మెగా ఇండ్రస్టియల్ హబ్‌ను గుర్తించింది. ఎన్‌హెచ్–44 విస్తరణ పారిశ్రామికంగానూ ఉపయోగపడనుంది.డీపీఆర్ సిద్ధమవుతోందిబెంగళూరు–హైదరాబాద్ నేషనల్ హైవేను 12 లేన్లుగా విస్తరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. 4 నుంచి 6 లేన్లకు విస్తరిస్తున్నాం. ఇందుకు సంబంధించి డీపీఆర్ రూపొందిస్తున్నాం. భూసేకరణ సమస్య లేదు. దీంతో 2, 3 నెలల్లో డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. దీని ఆధారంగా కేంద్రం విస్తరణపై నిర్ణయం తీసుకోనుంది. – రఘు, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్ అథారిటీ, అనంతపురం -
వరుసగా సెలవులు.. ఊర్లకు పరుగులు
-
అతివేగానికి ఐదు ప్రాణాలు బలి
పళ్లిపట్టు: చెన్నై– తిరుపతి జాతీయ రహదారిలోని తిరుత్తణికి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు ఏపీ విద్యార్థులు ఉండగా...తమిళనాడుకు చెందిన మరో విద్యార్థి ఉన్నాడు. కనకమ్మ సత్రం సీఐ రాజగోపాల్ తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంజేరి వద్ద చెన్నై–తిరుపతి జాతీయ రహదారిపై రాత్రి 7 గంటల సమయంలో చెన్నై వైపుగా అతివేగంగా దూసుకెళ్లిన వెర్టిగో కారు మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న సరుకుల లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఏడుగురు యువకులు ఉండగా ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు శిథిలాలలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ ఇద్దరిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు తిరువళ్లూరు ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారులో లభించిన ఓ గుర్తింపు కార్డు ఆధారంగా మరణించిన వారు చెన్నై శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో తిరువణ్ణామలై, కాణిపాకం ఆలయాల దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. మృతి చెందిన వారిలో చేతన్ (21), యుగేష్ (21) తిరుపతికి చెందిన వారుగా భావిస్తున్నారు. మిగిలిన వారిలో నితీష్ (21), నితీ‹Ùవర్మ(21), రామ్గోపాలన్ (21)గా గుర్తించారు. వీరిలో రామగోపాలన్ తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన యువకుడు అని తేలింది. గాయపడ్డ ఇద్దరిని తిరుపతి జిల్లా గూడూరు న్యూ బాలాజీ నగర్‌కు చెందిన శ్రీనివాసన్ కుమారుడు విష్ణువర్దన్ (21), ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన కొల్లూరి చైతన్య కుమార్ (21)గా గుర్తించారు. వీరు ప్రస్తుతం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంజేరి వద్ద చెన్నై–తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వీరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవా లని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఎట్టకేలకు స్పందించారు
‘ఎన్నాళ్లీ నరకం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. వరంగల్ జాతీయ రహదారిపై అసంపూర్తి దశలో నిలిచిపోయిన ఉప్పల్– నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అక్కడికక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం? -
Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం?
ప్రత్యక్ష నరకం మీరెప్పుడైనా చవిచూశారా? అయితే.. ఉప్పల్– నారపల్లి రహదారిలో ప్రయాణించండి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆరేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్– నారపల్లి మధ్య 6.2 కిలో మీటర్ల మేర చేపట్టిన కారిడార్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం నరకాన్ని అనుభవించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుమ్మూ ధూళి.. బురద.. కంకర తేలి గుంతలు ఏర్పడి.. వానొస్తే రోడ్డుపై కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుర్గతి పట్టింది. ఆరేళ్లుగా ఈ దురావస్థతోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతుండటం శాపంలా పరిణమించింది. ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ బాధితులు. ఇప్పటికైనా ఏళ్లుగా పడుతున్న నరకం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకొంటున్నారు. ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలో మీటర్ల మేర 148 పిల్లర్లతో ఫ్లై ఓవర్ పనులకు అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.625 కోట్లు. 2018 జులైలో ప్రారంభమైన పనులు 2020 జూన్‌లో పూర్తి కావాలి. కానీ.. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 6.2 కి.మీ మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రహదారిలో నిమిషానికి దాదాపు 960 నుంచి 1000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ కూడా ఒకటి. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. అభివృద్ధి శరవేగం.. ఇటు అధ్వానం..ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వర్తక, వాణిజ్య దుకాణాలు రోడ్డు వెడల్పు పనులతో తీవ్రంగా నష్టపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 450 షాపులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో రోడ్డు సరిగా లేని కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల జాబితాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మెట్రో రైలు.. మినీ శిల్పారామం, స్కైవాక్ వంతెన, ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఇలా ఎటు చూసినా అన్నివిధాలా ఉప్పల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో జాప్యంతో ఇక్కడి ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు ఆరేళ్లుగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి అనేక అడ్డంకులు రావడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎదురు చూపులే మిగిలాయి. కాంట్రాక్టు రద్దు చేశారా? ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కాంట్రాక్టును గాయత్రీ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకున్న విషయం విదితమే. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా సదరు సంస్థ గడువులోగా పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. మరో సంస్థకు మిగిలిన పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.బిజినెస్ నిల్.. వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ మార్గంలో స్టేషనరీ, వస్త్ర, వాణిజ్య షాపులు, పూజా సామగ్రి, కిరాణా, ఆటోమొబైల్, ఫర్నిచర్, స్వీట్ దుకాణాలు, హోటళ్లు తదితర అనేక వ్యాపారాలు మనుగడ పొందుతున్నాయి. కాగా.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా దుమ్మూ ధూళితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. రోడ్లు వేయక పోవడం, విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచక పోవడంతో వందలాది మంది వ్యాపారులు అవస్థలు పడుతున్నట్లు వర్తక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరేళ్లుగా వ్యాపారాలు నిల్.. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లు లేక దుమ్ము కొట్టుకుపోవడంతో గిరాకీ లేక అవస్థలు పడుతున్నాం. 90 శాతం గిరాకులు దెబ్బతిన్నాయి. వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోయాం. – శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రతినిధి రోడ్డుపైకి రావాలంటే సాహసం చేయాల్సిందే.. ఉప్పల్ రోడ్డు మీదకు రావాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ఏళ్లుగా పాడైపోయిన రోడ్ల మీద వాహనం నడిపి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీనివాస్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్గత ప్రభుత్వ అశ్రద్ధతోనే.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే రోడ్డు ఎటూ కాకుండా పోయింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాని పారీ్టలను దృష్టిలో పెట్టుకుని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి. – మేకల శివారెడ్డి, ఉప్పల్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ -
డ్రైపోర్టుకు మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: సముద్ర తీరం లేని తెలంగాణలో ఏర్పాటు చేసే డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఉన్నతాధికారులను కోరారు. తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అడ్డంకిగా ఉన్న చిక్కుముడులను తొలగించే అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. బుధవారం ఆ బృందంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, తనను మంగళవారం కలిసిన అధికారులతో కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన చర్చించారు.తెలంగాణలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించిన సమస్యలను తమ స్థాయిలో పరిష్కరించదగ్గవాటిని పరిష్కరిస్తామని, భూసేకరణ అంశాలను కొలిక్కి తెస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రైపోర్టుకు బందరు పోర్టుతో కనెక్టివిటీ ప్రతిపాదనపై చర్చించారు. అలాగే హైదరాబాద్–విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును భారత్‌మాల పరియోజనలో భాగంగా చేపట్టాలని ఇటీవల తాను ప్రధానికి సూచించిన విషయాన్ని వారి ముందు ప్రస్తావించారు. ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య 12 రేడియల్ రోడ్లు వస్తాయని, వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్íÙప్స్ నిర్మిస్తామని వెల్లడించారు.వెంటనే రీజినల్ రింగ్ రోడ్డు పనులను, మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్–కల్వకుర్తి పనులను పూర్తిచేస్తే తిరుపతికి 70 కి.మీ. దూరం తగ్గుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల–వరంగల్– ఖమ్మం–విజయవాడ రోడ్డుకు సంబంధించిన భూమి అప్పగింత, ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు, వరంగల్–కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లైయాష్ సేకరణ, కాళ్లకల్–గుండ్లపోచంపల్లి రహదారి ఆరు వరసల విస్తరణకు భూ సేకరణ, జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం, ఖమ్మం–దేవరపల్లి, ఖమ్మం–కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసు భద్రత ఏర్పాటు.. తదితర అంశాలను ఎన్హెచ్ఐఏ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలపై బుధవారం సమగ్రంగా సమీక్షించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. పలు సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంది. -
ప్రాణం తీసిన అతివేగం..
చేగుంట (తూప్రాన్)/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నాగ్‌పూర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. నాగ్‌పూర్ వైపు నుంచి మేకల లోడుతో హైదరాబాద్‌కు వస్తున్న లారీ.. రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా చేగుంట శివార్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులేనని గుర్తించారు. గాయపడ్డవారికి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌కు మేకలు తీసుకొస్తూ.. 44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ దాణా లారీ శుక్రవారం తెల్లవారుజామున టైర్ పంక్చరై, రోడ్డుపై ఆగిపోయింది. అదే దారిలో నాగ్‌పూర్ వైపు నుంచి మేకల లోడ్ లారీ వస్తోంది. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్న మేకల మండీకి ఉదయమే మేకలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ ఆత్రుతతోనే డ్రైవర్ వేగంగా లారీని నడిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ధాటికి మేకల లోడ్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో కూర్చుని ఉన్న ఇద్దరు, వెనుకాల ట్రాలీలో మేకలతోపాటు ఉన్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం.. నిద్రమత్తుతో! ప్రమాదం జరిగినప్పుడు మేకల లారీ గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమా దం జరిగిన ప్రదేశంలో మూల మలుపు ఉంది. దానికితోడు తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డుపై ఆగిఉన్న దాణా లారీని సరిగా గమనించకపోవడం వల్లే ప్రమాదానికి దారితీసి ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదంలో లారీలోని 80 వరకు మేకలు కూడా మృతి చెందాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని గుర్తించారు. క్యాబిన్లో ప్రయాణిస్తున్న మేకల వ్యాపారులు చిక్వారాజు(57), చిక్వా మనీశ్‌కుమార్ (30), వెనకాల ట్రాలీలో మేకలతోపాటు కూర్చున్న కారి్మకులు ఎండీ ఇబ్రహీం (21), ఎండీ షబ్బీర్ (48), ఎండీ జిసాన్ (21) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ బుట్టాసింగ్, మేకల వ్యాపారి లాల్మణి, రమేశ్‌లాల్, మహేశ్‌లాల్, శుక్లాల్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు
వినుకొండ (నూజెండ్ల): పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై కేవలం గంటల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. చెట్టును ఢీకొన్న వాహనం రూరల్ పరిధిలోని కొత్తపాలెం సమీపంలో టయోటా వాహనం అదుపు తప్పిచెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన టీటీడీలో పనిచేసి పదవీ విరమణ చేసిన బ్రహ్మశ్రీ సోమాసి బాలగంగాధర్ శర్మ (69), ఆయన భార్య యశోద (67), డ్రైవర్ కట్టా నిర్మలరావు (45) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు హెచ్.వై.శర్మ, అతని భార్య సంధ్య తీవ్రంగా గాయపడగా, ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరందరూ కర్ణాటకలోని బళ్లారి నుంచి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని గుంటూరు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.స్వగ్రామానికి వెళ్తూ.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మీరావలి (25) స్వగ్రామం వెళుతుండగా మినీలారీ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మీరావలి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. తండ్రీ కొడుకులు మృతి అదే రహదారిలో వినుకొండ రూరల్ మండలం వద్ద.. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన మాలెపాటి పెదరామ కోటేశ్వరరావు(45) తన కుమారుడు అంజిబాబుతో (25) కలిసి వినుకొండ రూరల్ మండలం కొతపాలెం వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. అంజిబాబును మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ గుంటూరులో మృతిచెందాడు. -
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్)ని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) వార్షిక ప్రణాళికలో ట్రిపుల్ ఆర్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఢిల్లీలో గడ్కరీతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, పలు ఎన్‌హెచ్‌ల పనుల ప్రారంభం తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – జగదేవ్‌పూర్ – భువనగిరి – చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకయ్యే వ్యయంలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని రేవంత్ చెప్పారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామన్నారు. చౌటుప్పల్ నుంచి అమన్‌గల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని రేవంత్ కోరారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ – తొర్రూర్ – నెల్లికుదురు – మహబూబాబాద్ – ఇల్లెందు – కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్–930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి వివరించారు.హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్ రోడ్‌గా వరంగల్ సభలో గడ్కరీ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ మార్గంలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. గంటన్నరకుపైగా జరిగిన ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య..హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్ 65) జాతీయ రహదారిని గత ఏప్రిల్‌లోగా ఆరు లేన్లుగా విస్తరించాల్సి ఉందని గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనతో వాహన రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు వరుసల పనులు చేపట్టడం లేదన్నారు. ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా ఆరు లేన్లుగా విస్తరించాలని కోరారు.ఐకానిక్ బ్రిడ్జి.. ఎలివేటెడ్ కారిడార్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ – సోమశిల – కరివెన – నంద్యాల (ఎన్‌హెచ్–167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి రేవంత్‌రెడ్డి తెలిపారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి 70 కి.మీ. దూరం తగ్గుతుందని వివరించారు. కల్వకుర్తి–నంద్యాల రహదారి (ఎన్‌హెచ్–167కే) హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్ 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్ – కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్ 765కే) రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి–కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యేలోపు హైదరాబాద్ – కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ – శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) మార్గంలో 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని రేవంత్ కోరారు. మంథనికి చోటివ్వండిమంథని నుంచి సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మాజీ సభాపతి శ్రీపాదరావు గతంలో ప్రాతినిధ్యం వహించారని గడ్కరీకి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటివరకు జాతీయ రహదారుల చిత్రంలో మంథనికి చోటు దక్కలేదన్నారు. జగిత్యాల–పెద్దపల్లి–మంథని–కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే ఎన్‌హెచ్–565, ఎన్‌హెచ్–353సీ అనుసంధానమ వుతాయని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపుపొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని సీఎం వివరించారు.గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలుతెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్–మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్–163) ప్రకటించడంతో భూ సేకరణ పూర్తి చేశాం. టెండర్లు పిలవడం పూర్తయిన ఎన్జీటీలో కేసు వలన పనులు ప్రారంభం కాలేదు. సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం పనులు వెంటనే ప్రారంభించాలి. సేతు బంధన్ స్కీం కింద 2023–24లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలి. జగిత్యాల–కాటారం (130 కి.మీ.), దిండి – నల్లగొండ (100 కి.మీ.), భువనగిరి – చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్ – సంగారెడ్డి (182 కి.మీ), మరికల్–రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి – మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ – బీదర్ (134 కి.మీ.), కరీంనగర్–పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్ – రాయచూర్ (67 కి.మీ.), కొత్తపల్లి–దుద్దెడ (75 కి.మీ.), సారపాక – ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ – రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జగ్గయ్యపేట – కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల – కోరట్ల (65 కి.మీ.), భూత్పూర్ – సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్ – రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ. జాతీయ రహదారులను అప్‌గ్రేడ్ చేయాలి. రూ. 4 వేల కోట్లతో ఆరు లేన్ల పనులు: కోమటిరెడ్డితెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్–అమరావతి మధ్య ఆరు లేన్ల పనులను ఒకట్రెండు నెలల్లో ప్రారంభిస్తామని, అలాగే ఎక్స్‌ప్రెస్ వే కూడా నిర్మిస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు లేన్ల మార్గాన్ని రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మిస్తామని వెల్లడించారు. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. 2016లో ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయంలో కదలిక వచ్చిందని తెలిపారు. యుటిలిటీ చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రమంత్రికి వివరించగా.. అందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ.. తామే భరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడమే తమ లక్ష్యమని, జవాబుదారీతనంగా పనిచేయడం తెలుసు కాబట్టే ఇంతమంది మంత్రులం ఢిల్లీకి వచ్చామని కోమటిరెడ్డి చెప్పారు.వారంలోపు అన్ని శాఖలతో సమావేశం: భట్టిరాష్ట్ర రహదారులకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల నుంచి ఒకే సారి క్లియరెన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గడ్కరీతో రాష్ట్రానికి సబంధించిన రోడ్ల విస్తరణ గురించి మాట్లా డామన్నారు. ట్రిపుల్ఆర్, హైదరాబాద్ – అమరావతి ఆరు లేన్లుగా మార్చడం, హైదరాబాద్–కల్వకుర్తి రోడ్డు తదితర అంశాలపై గడ్కరీతో సుదీర్ఘంగా చర్చించామని భట్టి చెప్పారు. -
పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రెడీమిక్స్ వాహనం మరమ్మతులకు గురవడంతో పెదకాకాని క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట జాతీయ రహదారిపై మార్జిన్లో డ్రైవర్ నిలిపారు. విజయవాడ నుంచి గుంటూరుకి అతి వేగంగా వస్తున్న కారు రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది.దీని వెనుక ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహనం అతివేగంగా కారును, రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, టాటా ఏస్ వాహనంలో ఉన్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేసరికే ఇద్దరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వాహనాలతో కిక్కిరిసిన రహదారి
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజాతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాలతో కిక్కిరిసిపోయింది.యాదాద్రితో పాటు స్వర్ణగిరికి భక్తులు భారీగా తరలిరాగా, శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండడంతో 40వేల వరకు వాహనాలు గూడూరు టోల్‌ప్లాజా గుండా రాకపోకలు సాగించాయి. టోల్‌ప్లాజా వద్ద గూడూరు నుంచి పగిడిపల్లి వరకు వాహనాలు బారులుదీరాయి. -
విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
సాక్షి, హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడ వద్ద డీసీఎం వ్యాను బైక్‌ని ఢీ కొట్టింది. రెండు సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందాడు.తండ్రి మృతదేహం పక్కనే కుమారుడు ఏడుస్తూ కూర్చోవడం స్థానికులను కలిచివేసింది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చిన్నారికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. -
రహదారే.. రన్‌వే.. జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, బాపట్ల/అద్దంకి/మేదరమెట్ల: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది. ఆ వెంటనే సరిగ్గా 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా దూసుకువచ్చాయి. స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా.. రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా.. మరో రెండు అతి సమీపంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు, సిబ్బంది, పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు. అత్యవసర ల్యాండింగ్ కోసం.. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి–16పై రేణింగివరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో పి.గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున, 33 మీటర్ల వెడల్పుతో ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు. గతంలో ఒకసారి దీనిపై ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా సోమవారం మరోసారి ఈ స్ట్రిప్‌పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు రన్‌వే స్ట్రిప్‌పై ఎగురుతూ వెళ్లాయి. 11.05 గంటల నుంచి 11.06, 11.07 గంటల సమయంలో రెండు విమానాలు ఐదు అడుగుల ఎత్తులో రన్‌వేపై వెళ్లాయి. ఆ తర్వాత 11.19 గంటలకు ఒకటి, 11.24 గంటలకు మరొకటి ఎయిర్ స్ట్రిప్‌ను తాకుతూ(డెడ్‌లైన్)లో వెళ్లాయి. 11.28 గంటలకు సుఖోయ్–30, హాక్ విమానాలు రెండు అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏఎన్–32 ట్రాన్స్‌పోర్టు విమానం ల్యాండ్ అయ్యింది. ఇదే విమానం ఎయిర్ స్ట్రిప్‌పై కొంతదూరం నెమ్మదిగా వెళ్లి.. 12.08కి టేకాఫ్ తీసుకుంది. డారి్నయర్ ట్రాన్స్‌పోర్టు విమానం 12.30 గంటలకు ల్యాండ్ అయ్యి.. 12.39 నిమిషాలకు విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. దీంతో వైమానిక దళ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు.. యుద్ధ విమానాల ల్యాండింగ్ నేపథ్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీస్ బలగాలు, సాయుధ మిలటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన ప్రత్యేక ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేశారు. అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టేషన్ నుంచి వైమానిక దళ అధికారులు విమానాలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ‘వరదలు, భూకంపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ చేయడానికి అనువుగా జాతీయ రహదారి–16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్లో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా ట్రయల్‌రన్ విజయవంతమైంది’ అని చెప్పారు. కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు ఏవీఎం కుకరేజ్, జేపీ యాదవ్, విజయ్, ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, జేసీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరు–కడప–విజయవాడ.. ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రూ.14వేల కోట్లతో చేపట్టే బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా రూ.లక్ష కోట్లతో నిర్మించే 112 జాతీయ రహదారులకు కూడా ప్రధాని ఈ సందర్భంగా హర్యానాలోని గురుగామ్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 35 జాతీయ రహదారులను కూడా ఆయన ప్రారంభించారు. మొత్తం రూ.29,395 కోట్లతో 1,134 కి.మీ.మేర ఈ జాతీయ రహదారులను రాష్ట్రంలో నిర్మించారు. ఇక బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనులను 14 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయతో పాటు, ఉద్యోగావకాశాలను పెంపొందించడంలో, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ఇవి దోహదం చేయనున్నాయి. యూపీ తర్వాత ఏపీకే ఎక్కువ ప్రాజెక్టులు : మోదీ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అద్భుతమైన సహకారం అందిస్తోందని ప్రశంసల వర్షం కురిపించారు. అందుకే దేశంలో ఉత్తరప్రదేశ్ తరువాత ఏపీలోనే అత్యధికంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. విజయవాడ–బెంగళూరు ఎకనామిక్ కారిడార్‌తోపాటు అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పారిశ్రామికాభివృద్ధి కూడా సాధ్యపడుతుందన్నారు. విజయవాడ ఈస్ట్ బైపాస్, భోగాపురం ప్రాజెక్టులను త్వరగా చేపట్టండి.. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన విజయవాడ ఈస్ట్ బైపాస్, విశాఖపట్నం–భోగాపురం ఆరులేన్ల రహదారుల నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానిని కోరింది. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: వివాదాలు.. ఉద్యమాలు.. వ్యతిరేకతలతో ఒక్క అడుగు కూడా ముందుకు పడ కుండా పోయిన ఓ జాతీయ రహదారి కథ కొలిక్కి వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇది రాష్ట్రంలో మరో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకోబోతోంది. 131.8 కి.మీ. మేర నిర్మించే నాలుగు వరసల రహదారిలో 46 వంతెనలతో పాటు ఆర్ఓబీలు, అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతుండటంతో.. నిజామాబాద్– ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ ఎన్‌హెచ్ 63పై ట్రక్కులు ఎక్కువగా తిరుగుతుంటాయి. రెండు లేన్లతో ఇరుగ్గా ఉన్న రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారటంతో 4 వరసలకు విస్తరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో నిజామాబాద్ నుంచి ఆర్మూరు శివారులోని హైవే 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే హైవే 363 నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చెన్నూరు వరకు.. రాష్ట్రప్రభుత్వ ఆదీనంలోని హైవేల విభాగం విస్తరిస్తుంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించారు. రాష్ట్ర విభాగం ఇప్పటికే ఆ రోడ్డును అవసరమైన ప్రాంతాల్లో 4 వరసలుగా మార్చడం, మిగతా చోట్ల మెరుగుపరచటం చేస్తోంది. అయితే ఎన్హెచ్ఏఐకి అప్పగించిన ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా సాగుతున్నందున దాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మార్చాలని భావించారు. కానీ అందుకు భారీ మొత్తంలో సాగు భూములు సేకరించాల్సి రావటంతో రైతులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఉన్న రోడ్డునే విస్తరించాలని భావించారు. కానీ, పట్టణాలు, గ్రామాల్లో భారీగా నిర్మాణాలను తొలగించాల్సి రావటంతో ఈసారి పట్టణ, గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. చివరకు పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. గత నెల్లో టెండర్లు పిలవగా, ఇప్పుడు వాటిని ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డు నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు డిజైన్, ఎలివేటెడ్ కారిడార్ నమూనాలు, రహదారులను క్రాస్ చేసేందుకు వీలుగు చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై చర్చించారు. నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని త్వరలో పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. నో డైరెక్ట్ క్రాసింగ్: ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేటల మీదు గా సాగుతుంది. ఈ మార్గంలో 100 కి.మీ.ల మేర బైపాస్‌లే ఉండనున్నందున ఈ రోడ్డు దాదాపు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే తరహాలోనే ఉండనుంది. ఆయా పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇది పూర్తి యాక్సె స్ కంట్రోల్డ్ రహదారి (ఇతర రోడ్లు దీన్ని నేరుగా క్రాస్ చేయడానికి అవకాశం ఉండదు) కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. బైపాస్‌ల కోసం 500 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికే రూ.900 కోట్లుఖర్చవుతోంది. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. -
ఆ మర్రి వృక్షాలను కాపాడేందుకు రంగంలోకి నిపుణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46 కి.మీ. నిడివిలో ఉన్న 890 మర్రి చెట్ల (ఈ సంఖ్య విషయంలో భిన్న లెక్కలున్నాయి) భవితవ్యం తేల్చేందుకు కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ వచ్చే త్వరలో పర్యావరణ ప్రభావ అంచనా (ఎని్వరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) అధ్యయనం నిర్వహించబోతోంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ దక్షిణాది బెంచ్ ఈమేరకు ఇటీవల ఆదేశించటంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఇటీవల నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధికారులతో ఓ సమావేశం నిర్వహించి ఈమేరకు చర్యలు ప్రారంభించింది. పక్షం రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, ఆ మర్రి చెట్ల పరిరక్షణకు సూచనలు చేయనుంది. గరిష్ట సంఖ్యలో వృక్షాలను కాపాడుతూ, రోడ్డు నిర్మాణంతో వాటికి అతి తక్కువ నష్టం వాటిల్లేలా ప్రత్యామ్నాయ చర్యలను ఈ అధ్యయనంలో నిర్ధారిస్తారు. ఎందుకీ అధ్యయనం.. కొత్తగా ఓ రోడ్డు నిర్మించేటప్పుడు అక్కడ చెట్లు తొలగించాల్సి ఉంటే ముందస్తు సమాచారంతో గ్రామసభలు నిర్వహిస్తారు. ఇందులో పర్యావరణ వేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని.. ఆ చెట్ల తొలగింపుతో ఎదురయ్యే పరిణామాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. చెట్లను తొలగంచటం వల్ల ఎదురయ్యే దు్రష్పభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలేంటో అధికారులు వివరిస్తారు. వృక్షాలకే కాకుండా అక్కడి జంతుజాలానికి కూడా నష్టం కాకుండా తీసుకునే చర్యలను వివరిస్తారు. కొత్తగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేల్లో ఈ తరహా సమావేశాలు నిర్వహించటం తప్పనిసరి. కానీ, అప్పటికే ఉన్న రోడ్డును విస్తరించే సందర్భంలో వంద కి.మీ.లోపు నిడివి ఉంటే ఈ తరహా సమావేశాలు కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా విస్తరణ పనులను ఆ విభాగం ఇప్పటికే చేపట్టింది. కానీ, నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ రోడ్డు మీద ఉన్న మన్నెగూడ వరకు విస్తరణ పనులను ఎన్హెచ్ఏఐ చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్డు మీద దాదాపు వందేళ్ల క్రితం నాటికి మర్రి వృక్షాలున్నాయి. గతంలో హైదరాబాద్ చుట్టూ అన్ని రోడ్ల మీద మర్రి వృక్షాలుండేవి. వాటి వయసు 80 ఏళ్ల నుంచి 120 ఏళ్ల వరకు ఉండేవి. కానీ రోడ్ల విస్తరణతో ఆ వృక్షాలు మటుమాయమయ్యాయి. నాటి వృక్షాలు ఉన్న ఏకైక రోడ్డు చేవెళ్ల హైవే మాత్రమే. ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో ఆ వృక్షాలు కూడా మాయమయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.ఏడాదిన్నర నుంచి వాదోపవాదాలు జరగ్గా, ఇటీవల ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ రోడ్డు విస్తరణలో కూడా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ అధ్యయనం అనివార్యం కావటంతో కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏం జరుగుతుంది.. గతంలో నగరంలో గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ఇలాంటి భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యావరణం పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డుమీద వేయికి చేరువలో మర్రి వృక్షాలున్నందున, వాటిని తొలగిస్తే పర్యావరణంతోపాటు పక్షిజాతిపై పెనుప్రభావం ఉంటుందన్న అంచనా ఉంది. కచ్చితంగా ఆ వృక్షాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వృక్షాలు ఎక్కువగా ఉన్న చోట పాత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా కొత్త అలైన్మెంట్ చేయటం, మిగిలిన వాటిల్లో వీలైనంత సంఖ్యలో చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసి తిరిగి చిగురింపచేయటం, కొన్నింటిని కొట్టేయక తప్పని స్థితి నెలకొంటే వాటికి నాలుగైదు రెట్ల సంఖ్యలో కొత్తగా మర్రి మొక్కలు నాటి పెంచాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలను ఆ అధ్యయనం ద్వారా సూచిస్తారు. పనుల్లో మరింత జాప్యం.. ఈ రోడ్డు విస్తరణకు 2019లో కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లు మంజూరు చేసింది. 60 మీటర్ల మేర విస్తరించి ఎక్స్‌ప్రెస్ వేగా మారుస్తారు. మొయినాబాద్, చేవెళ్ల పట్టణాలున్న చోట విస్తరణ సాధ్యం కానందున, ఆ రెండు చోట్ల ప్రత్యామ్నాయంగా బైపాస్‌లు నిర్మించనున్న విషయం తెలిసిందే. అన్ని సర్వేలు, టెండర్ల ప్రక్రియ పూర్తయి రోడ్డు నిర్మాణానికి సిద్ధమైన తరుణంలో ఈ కేసు అడ్డుపడింది. దీంతో అప్పటి నుంచి పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కొత్త అధ్యయనం నేపథ్యంలో మరింత జాప్యం జరగనుంది. కొన్నేళ్లుగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోడ్డు మీద ఉండాల్సిన ట్రాఫిక్ కంటే 48 శాతం వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఏడాదికి 250 వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, దాదాపు 45 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. వీలైనంత తొందరగా ఆ రహదారిని విస్తరించాల్సి ఉండగా, రకరకాల సమస్యలతో జాప్యం జరుగుతోంది. దాన్ని అలాగే ఉంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మించాలంటే ఖర్చు భారీగా పెరుగుతోందని యంత్రాంగం ఆందోళన చెందుతోంది. దీంతోపాటు అంత నిడివిలో కొత్త రోడ్డుకు కావాల్సిన భూసేకరణ కూడా కష్టంగా మారుతుందని పేర్కొంటోంది. -
నాలుగేళ్లలో 2300 కిమీ - అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్..
భారతదేశంలో రోడ్డు, రవాణా వ్యవస్థ రోజు రోజుకి విస్తరిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల అభివృద్ధికి కావలసిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి దేశంలోని రాష్ట్రాలు కూడా సహకరిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశాల జాబితాలో భారత్.. చైనాను అధిగమించిందని 'ది వరల్డ్ ర్యాంకింగ్' నివేదిక ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతీయ రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019 నుంచి 2023 వరకు రాష్ట్రంలో 2300 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 2014 నుంచి 2018 వరకు జరిగిన జాతీయ రహదారుల నిర్మాణంతో (1713 కిమీ) పోలిస్తే 2019-23 వరకు జరిగిన రోడ్డు నిర్మాణం 587 కిమీ ఎక్కువగా ఉంది. ఆర్అండ్బీ ద్వారా నిర్మాణాల్లోనూ.. కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రహదారుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమర్థతను నిరూపించుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా గతేడాది కూడా కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను సాధించింది. 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు రాబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం విశేషం. ఇదీ చదవండి: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్ 2014-18తో పోలిస్తే.. జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా - మండల కేంద్రాలను అనుసంధానించే రహదారులను వేగంగా అభివృద్ధి చేసే దిశగా సీఎం జగన్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. -
మహబూబ్‌నగర్ ప్రమాదం.. ఆరుగురు మృతి, ఉద్రిక్తత
సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లా: వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. చౌరస్తాలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉద్రిక్తత.. డీసీఎంకు నిప్పు.. బాలానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగురు మరణానికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పుపెట్టారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 5 కిల్లోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఏజెన్సీలో హైవే
సాక్షి, ఏలూరు ప్రతినిధి: ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నూతన జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించి ఏజెన్సీ మీదుగా ప్రధాన రహదారుల మధ్య కనెక్టివిటీ పెంచే జాతీయ రహదారికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రా మధ్య దూరాన్ని తగ్గించేలా హైవే ప్రణాళిక ఖరారు చేశారు. మొదటిసారిగా పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో అత్యధిక భాగం నాలుగు వరుసల రహదారి నిర్మాణం కానుండటం విశేషం. ఎన్‌హెచ్ 365 బీబీ రెండో ప్యాకేజీ పనులకు రూ.367.97 కోట్లు మంజూరు కావడం, భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలాఖరు నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సూర్యాపేట నుంచి పట్టిసీమను కలిపేలా.. సూర్యాపేట నుంచి ఖమ్మం, చింతలపూడి నియోజకవర్గం మీదుగా దేవరపల్లి జాతీయ రహదారికి ఇప్పటికే కనెక్టివిటీ పెంచేలా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమ కలిపేలా రహదారిని డిజైన్ చేశారు. జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకు మొత్తం 86.5 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసల రహదారిగా నిరి్మంచడానికి వీలుగా టెండర్ ఖరారు చేశారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు 365 బీబీ నిర్మాణ పనులు మొదటి ప్యాకేజీలో భాగంగా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం నుంచి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, కేఆర్ పురం, ఎల్ఎన్డీ పేట మీదుగా పట్టిసీమ వరకు 40.4 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.367.97 కోట్లు మంజూరు చేశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో 52.89 హెక్టార్ల భూమి అవసరమవుతుందని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ కూడా నిర్వహించారు. వచ్చే నెల రెండో వారానికి టెండర్లు పూర్తి చేసి నెలాఖరు నాటికి పనులు ప్రారంభించే అవకాశముంది. -
వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌ను కలిపే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టి కుప్పగా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మంటల్లో చిక్కుకున్న వాహనాలు, ఉవ్వెత్తున ఎగసిన పొగతో కూడిన ఫొటోలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనలో 16 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
ఆరు లేన్లు అయ్యేనా?
చౌటుప్పల్: త్వరలో హైవే విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయరహదారి ఆరు లేన్ల విస్తరణకు మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. మంత్రి ప్రకటనతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఓటీ పద్ధతిన నాలుగు లేన్లుగా విస్తరణ హైదరాబాద్ – విజయవాడ మధ్య 275 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వరకు, ఏపీలోని విజయవాడ నుంచి నందిగామ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విస్తరించారు. మిగిలిన 180 కిలోమీటర్లు మాత్రం బీఓటీ పద్ధతిన నాలుగులేన్లుగా నిర్మించారు. ఈ పనులను జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఈ పనులకు అప్పటి సీఎం రోశయ్య 2010 మార్చిలో నార్కట్‌పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి మూడు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుము వసూలు చేస్తోంది. కోర్టును ఆశ్రయించిన జీఎంఆర్ సంస్థ ఈ హైవేను ఆరులేన్లుగా విస్తరించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ ముందస్తుగా కోర్టును ఆశ్రయించింది. తాము బీఓటీ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పనులు చేశామని, టోల్ వసూలు చేసుకునేందుకు తమకు ఇంకా గడువు ఉందని, పెట్టుబడి కింద టోల్ వసూళ్లు అనుకున్న మేరకు రానందున మరికొంత కాలం అనుమతి ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. దీంతో విస్తరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు హైదరాబాద్– విజయవాడ హైవే దేశంలోనే అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు పొందింది. టోల్‌ప్లాజాల లెక్కల ప్రకారం రోజూ సగటున 40వేల నుంచి 50వేల వాహనాలు ఈ మార్గంలో వెళుతున్నాయి. దీనిపై ఏ చిన్నపాటి ప్రమాదం జరిగినా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అన్ని విధాలుగా ప్రయోజనం హైవేను ఆరు వరుసలుగా విస్తరిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వాహనదారులు, ప్రయాణికులకు సమయం కూడా కలిసివస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. – చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సర్విస్ రోడ్లు ఏర్పాటు చేయాలి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న హైవేపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించడానికి ఆరు వరుస లు అవసరం. విస్తరణతోపాటు హైవే వెంట ఉన్న అన్ని గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు నిర్మించాలి. – బాతరాజు సత్యం, పంతంగి సర్పంచ్ -
నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు
గాం«దీనగర్: పూర్వం రహదారిపై దారి దోపిడీలు జరిగేవి. ఇప్పుడు దొంగలు ఏకంగా జాతీయరహదారిపై టోల్‌ప్లాజా ఒకటి తెరిచేసి దర్జాగా టోల్ వసూళ్లు మొదలెట్టేశారు. ఈ దోపిడీ ఘటనకు గుజరాత్ రాష్ట్రంలోని జాతీయరహదారి వేదికైంది. నకిలీ టోల్‌ప్లాజా ద్వారా మోసగాళ్ల ముఠా ఏకంగా రూ.75 కోట్లకుపైగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏడాదికాలంగా ఇది జరుగుతున్నా పోలీసులకు ఇంతకాలం సమాచారం లేకపోవడం విడ్డూరం. నకిలీ టోల్‌ప్లాజా గుట్టుమట్లు తాజాగా స్థానికంగా వెలుగులోకి వచ్చాక చిట్టచివరన పోలీసులకు తెలిశాయి. ప్రస్తుతం కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టి ఐదుగురిని అరెస్ట్‌చేశారు. సంబంధిత వివరాలను పోలీసులు వెల్లడించారు. తక్కువ రేటు కావడంతో అంతా గప్‌చుప్ మోర్బీ జిల్లా, కఛ్ జిల్లాలను కలిపే 8ఏ నంబర్ జాతీయరహదారిపై వాఘసియా టోల్‌ప్లాజా ఉంది. దీని గుండా వెళ్లకుండా సమీప ప్రాంతం గుండా వెళ్లొచ్చని వాహనదారులు కనిపెట్టారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతం గుండా వెళ్లడం మొదలెట్టారు. ఈ విషయం తెల్సుకున్న ఒక ముఠా ఒక కొత్త పథకంతో రంగంలోకి దిగింది. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ‘వైట్‌హౌజ్’ అనే సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు కొత్త రోడ్లు వేశారు. ఫ్యాక్టరీలో టోల్ ప్లాజా కౌంటర్ నిర్మించి వసూళ్ల పర్వానికి తెరలేపారు. సాధారణంగా జాతీయరహదారిపై ఒక్కో వాహనాన్ని బట్టి రూ. 110 నుంచి రూ.595 వసూలుచేస్తారు. కానీ ఈ ‘దొంగ’ మార్గంలో వెళ్లే వాహనదారుల నుంచి ఈ ముఠా కేవలం రూ.20 నుంచి రూ.200 వసూలుచేసేవారు. ఇంత తక్కువకే టోల్‌గేట్‌ను దాటేస్తుండటంతో తెల్సినవారంతా ఈ మార్గంలోనే రాకపోకలు సాగించేవారు. కొత్త వాహనదారులకు, స్థానికులకు ఇది బోగస్ టోల్‌ప్లాజా అని తెల్సికూడా.. తక్కువ ధరలో పని అయిపోతుందని మిన్నకుండిపోయారు. దాంతో ముఠా వ్యాపారం ఒక ఏడాదిపాటు యథేచ్చగా సాగింది. గత 18 నెలల్లో ఈ ముఠా దాదాపు రూ.75 కోట్లు కొట్టేసిందని మాజీ ఐపీఎస్ రమేశ్ ఆరోపించారు. నిందితుల్లో పటేల్ నేత కుమారుడు స్థానిక మీడియాలో కథనాలు, విమర్శలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఐదుగురిని అరెస్ట్‌చేశారు. సిరమిక్ ఫ్యా క్టరీ యజమాని అమర్షీ పటేల్‌తోపాటు అతని నలుగురు అనుచరులు, మరో వ్య క్తినీ అరెస్ట్‌చేశారు. అమర్షీ సౌరాష్ట్ర ప్రాంతంలో కీలకమైన పటిదార్ సామాజిక వర్గానికి చెందిన నేత కుమారుడు కావడం గమనార్హం. -
టపాసుల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
హోసూరు (తమిళనాడు): హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై తమిళనాడు సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలతో సహా పలు వాహనాలు బూడిదయ్యాయి. 12 మంది కార్మికులు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాక్‌ను 20 మందికి పైగా సిబ్బంది అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్క పక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచాతో పాటుగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండులారీలతో పాలు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
గుడ్‌న్యూస్.. నేషనల్ హైవేపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు 2023 చివరిలో లేదా 2024 జనవరి నాటికి ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీంతో, రెండు మెట్రోపాలిటన్ నగరాల మధ్య ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుందని స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అశోక్ లేలాండ్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. చెన్నైలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాను. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించబడుతుంది. ఈ ప్రాంతాల్లో లగ్జరీ బస్సులు, స్లీపర్ కోచ్‌లను ప్రారంభించుకోవచ్చు. ఎన్డీయే హయాంలో ఢిల్లీ నుంచి చెన్నై నుంచి సూరత్, నాసిక్, అహ్మద్ నగర్, కర్నూలు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, యాక్సెస్ – నియంత్రిత హైవే ప్రాజెక్టు ద్వారా కలుపుతున్నామని అన్నారు. కేవలం రెండు గంటలే సమయం.. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది. 2022 మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. దీని పొడవు 262 కిలో మీటర్లు ఉంటుంది. రూ. 14,870 కోట్లకుపైగా వ్యయంతో దీని నిర్మాణం కొనసాగుతుంది. ఈ హైవే పూర్తి అయితే కేవలం రెండు గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకు చెన్నై నుంచి బెంగళూరుకు రాకపోకలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించాలంటే ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. 🚨 Bengaluru-Chennai expressway to take just 2 hrs when inaugurated on Jan, 2024. It takes 4 hrs for Vande Bharat train and 1 hr for flight - Nitin Gadkari pic.twitter.com/5y8MQcMLWY — Indian Tech & Infra (@IndianTechGuide) September 7, 2023 ఇది కూడా చదవండి: ‘ఇండియా దటీజ్ భారత్’.. వెనుక ఇంత జరిగిందా? -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టోల్గేట్ల నుంచి రోజుకు రూ.కోటి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జాతీయ రహదారులపై వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి ఎక్కువ భాగం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉంది. ఈ రహదారి గుండా రోజూ వేలాది వాహనాలు గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి. ఏటా సగటున 15 శాతం వాహనాల రాకపోకలు పెరుగుతున్నట్టు ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారుల పరిశీలనలో వెల్లడైంది. నిమిషానికి 55 వాహనాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని జాతీయ రహదారులపై మొత్తం 10 టోల్గేట్లు ఉన్నాయి. వీటిగుండా రోజుకు 80 వేల వాహనాల వరకు ప్రయాణిస్తున్నట్టు అంచనా. దీన్నిబట్టి చూస్తే అన్నిచోట్లా కలిపి నిమిషానికి సగటున 55 వాహనాలు టోల్గేట్లు దాటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 13 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం కార్లు ఉన్నట్టు తేలింది. ప్యాసింజర్ వాహనాలే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. టోల్గేట్ల ద్వారా రోజూ రూ.కోటి వసూలు ఉమ్మడి జిల్లాలో టోల్గేట్ల ద్వారా రోజుకు రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలవుతోంది. ప్రత్యేక సెలవు రోజులు, పర్వదినాల సందర్భంలో మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 60 శాతం వసూళ్లు రాప్తాడు మండలం మరూర్, పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్గేట్ల ద్వారానే వస్తున్నాయి. ఇక్కడ ఒక్కో టోల్గేట్లో రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలవుతోంది. మిగతా టోల్గేట్ల నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వస్తున్నట్టు అంచనా. రానున్న ఏడాదిలో మరో రెండు టోల్గేట్లు అదనంగా వస్తున్నట్టు తెలుస్తోంది. వాహనాలు పెరిగాయి కరోనా తర్వాత నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు భారీగా పెరిగాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కంటే ప్రైవేటు టాన్స్‌పోర్టేషన్‌కు ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండడం ద్వారా కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. గతంలో ఒక అంబాసిడర్ కారు, సెల్‌ఫోన్ ఉంటే గొప్పగా చూసేవాళ్లం. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోను, చాలామంది వద్ద కార్లు కనిపిస్తున్నాయి. సొసైటీలో గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సొంతంగా ద్విచక్రవాహనం, కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. – వీర్రాజు, ఉప రవాణా కమిషనర్, అనంతపురం కార్ల విక్రయాల్లో దూకుడు ఉమ్మడి జిల్లాలో కార్ల విక్రయాలు గతంతో పోల్చితే భారీగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా నుంచి అనంతపురంలోని మెజార్టీ ప్రజలు కార్ల ప్రయాణాన్నే ఇష్టపడుతున్నారు. ఐదారేళ్ల కిందట నెలకు 150 కొత్త కార్లు కొనుగోలు అయితే మహా గొప్ప. కానీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్ల షోరూముల్లో కొనుగోలు చేసినవి 400కుపైగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సంవత్సరానికి 5వేల కార్ల విక్రయాలు జరుగుతున్నాయంటే వాటి దూకుడును అంచనా వేయొచ్చు. వీటి వల్ల కూడా ఉమ్మడి జిల్లాలో రోడ్లు బిజీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. -
ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతి
-
కేంద్రం నిధులతోనే ఉప్పల్–వరంగల్ ‘కారిడార్’ నిర్మాణం
ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నిర్మాణ పనులు పనులు 28 నుంచి పునఃప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. ఉప్పల్ స్కై ఓవర్ నిర్మాణ పనులలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లే జాప్యం జరుగుతుండటాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తాను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యుద్ధ ప్రాతిపదిక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలని కోరామన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జులై 24న అవసరమైన నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశానారన్నారు. ఈ నెల 28 నుంచి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి అదేశించారని ప్రభాకర్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ద్వారా రోడ్డుకు ఇరువైపులా బీటీ రోడ్డు వేస్తామని ప్రకటన చేయించారని ఎద్దేవాచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని రోడ్డు వేయిస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ కోరారు. దాన్ని మేమే వేస్తున్నామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకానికి తెర తీసిందని ఆయన విమర్శించారు. -
అక్కడ కోడిగుడ్లు..ఇక్కడ టమాటాలు
వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 363వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది. పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు ఓ వ్యాన్ కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్‌లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎండీ ఆసిఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు. కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. -
ఉప్పొంగిన బియాస్.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బియాస్ నదిలో ప్రవాహం ప్రమాద స్థాయిని మించి పారుతోంది. దీని కారణంగా బియాస్ నది పక్కనే ఉన్న జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రోడ్డుపైనే ప్రవాహం ఉద్ధృతంగా పారుతోంది. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో మండీ, కులు మధ్య రహదారిపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. #WATCH | Portion of National Highway 3 washed away by overflowing Beas river in Kullu, Himachal Pradesh pic.twitter.com/c8gRsvSkt5 — ANI (@ANI) July 9, 2023 వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అటు బియాస్ నది ప్రవాహం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలబడ్డాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సిమ్లా, సిర్మౌర్, లాహుల్, స్పితి, ఛంబా, సోల్ జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. #WATCH | River Beas flows furiously in Himachal Pradesh's Mandi as the state continues to receive heavy rainfall pic.twitter.com/Wau6ZwLLue — ANI (@ANI) July 9, 2023 రాష్ట్రంలో బియాస్ నదితో పాటు పలు నదుల్లో వరద నీరు ప్రమాద స్థాయిల్లో ప్రవహిస్తోంది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 133 మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. జులై 11 వరకు శ్రీఖండ్ మహాదేవ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కులు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.322 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
జరుగుమల్లి (సింగరాయకొండ): అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ కిందికి దిగేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మోజో ట్రావెల్స్ బస్సు(స్లీపర్) 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతోంది. బస్సు వెనుక భాగంలో ఉన్న సిగ్నల్ లైట్స్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు, ఏసీ కేబుల్స్ కలిసి ఉండటంతో షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ లక్ష్మణ్.. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్లో ఆపివేశాడు. ప్రయాణికులను కిందకు దించి మంటలపై బకెట్‌తో నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశా డు. అయినప్పటికీ మంటలు తగ్గకపోగా, కాసేపట్లోనే బస్సు మొత్తం వ్యాí³ంచాయి. అప్పటికే ప్రయాణికులంతా కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌తో అక్కడకు చేరుకుని మంటలనార్పారు. అయితే బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికుల లగేజీ మొత్తం కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ రంగనాథ్ తెలిపారు. -
ఎంగేజ్మెంట్ తెల్లారే యువకుడు దుర్మరణం
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుదామనుకున్న ఆ యువకుడు ఎంగేజ్మెంట్ జరిగిన తెల్లవారే కానరాని లోకానికి వెళ్లిపోయాడు. కుమారుడి ఎదుగుదలను కళ్లారా చూద్దామనుకున్న ఆ తండ్రి కుమారుడి మరణవార్త విని తట్టుకోలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వాంకిడి మండలంలోని సామేల గ్రామానికి చెందిన వసాకె తులసీరాం(21) ఆసిఫాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం అదే గ్రామానికి చెందిన యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. కార్యక్రమానికి వచ్చిన బంధువుల్లో ఒకరిని దింపేందుకు గురువారం ఉదయం స్కూటీపై ఎల్లారం బయలుదేరాడు. తిరుగుప్రయాణంలో బుదల్‌ఘాట్ వాగు దాటాక జైత్పూర్ రోడ్డు వద్ద గల కంకర క్రషర్ సమీపంలో జాతీయ రహదారి–363పై ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో తులసీరాంకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పురుగుల మందుతాగి తండ్రి ఆత్మహత్య సామెల గ్రామానికి చెందిన వసాకే భీంరావు (45)ది వ్యవసాయ కుటుంబం. గ్రామ ఉప సర్పంచ్‌గా కూడా సేవలందిస్తున్నాడు. అతనికి కూతురు కళావతి, కుమారుడు తులసీరాం సంతానం. కుమారుడి మరణవార్త తెలుసుకున్న భీంరావు మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. జాతీయ రహదారిపై ఉద్రిక్తత తండ్రీకొడుకుల మృతికి కారణమైన డీబీఎల్ కంపెనీ యాజమాన్యం తీరుకు నిరసనగా సంఘటన స్థలం వద్ద గ్రామస్తులు, బంధువులు, యువజన సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ రహీముద్దీన్, వాంకిడి సీఐ శ్రీనివాస్, ఆసిఫాబాద్ సీఐ రాణాప్రతాప్, ఎస్సైలు రమేశ్, సాగర్, గంగన్న కంపెనీ యాజమాన్యం, బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. రూ.19 లక్షలకు ఒప్పందం జరగడంతో ఆందోళన విరమించారు. అలుముకున్న విషాదఛాయలు ఎంగేజ్మెంట్ జరిగిన తెల్లారే యువకుడు మృతి చెందడం, కుమారుడి మరణవార్త విన్న తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోవడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రయ్.. రయ్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది భూసేకరణతో కలిపి రూ.4,609 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను ఖరారు చేయగా.. ఏలూరు జిల్లా పరిధిలో రూ.1,281.31 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. భారతీమాల ప్రాజెక్టులో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణతో కాకినాడ పోర్ట్ అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టు కీలకమైనదని కేంద్రానికి నివేదించి ఈ ప్రాజెక్ట్ మంజూరు చేయించింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు రూ.711.94 కోట్లను కేంద్రం కేటాయించింది. 53 కిలోమీటర్లు తగ్గనున్న దూరం ప్రస్తుతం ఖమ్మం–రాజమండ్రి నగరాల మధ్య దూరం 220 కిలోమీటర్లు. దీనిని 167 కిలోమీటర్లకు తగ్గించడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ఖమ్మం–రాజమండ్రి మధ్య దూరం 53 కిలోమీటర్లు తగ్గుతుంది. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి కల్లూరు మీదుగా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి ఆంధ్రాలో జీలుగుమిల్లిలోకి ప్రవేశించి జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం గోపాలపురం, కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంటుంది. నూతనంగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ రహదారి ఖమ్మం, సత్తుపల్లికి దూరంగా రేచర్ల నుంచి నేరుగా ఆంధ్రాలోని చింతలపూడి మండలంలో ఎండపల్లి నుంచి రా«ఘవాపురం, రేచర్ల మీదుగా టి.నరసాపరం, గుర్వాయిగూడెం మీదుగా దేవరపల్లి రహదారిలో కలుస్తుంది. భూసేకరణ పూర్తి ఈ రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతోంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. 1,297 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ రహదారిని వర్గీకరించారు. గ్రీన్‌ఫీల్డ్‌తో జిల్లాకు ఉపయోగం గ్రీన్‌ఫీల్డ్ రహదారితో మెట్ట ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. ఆంధ్రా–తెలంగాణ మ«ధ్య నూతన రహదారి వల్ల దూరం తగ్గడమే కాకుండా తెలంగాణ, కాకినాడ పోర్టు అనుసంధానానికి ఉపయోగపడుతుంది. –కోటగిరి శ్రీధర్, ఏలూరు ఎంపీ -
ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్ X రెవెన్యూ
ములుగు: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆరెపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు రావడంతో సంబంధిత శాఖ టెండర్ పిలిచి పనులు చేపట్టింది. ములుగు మండల పరిధిలోని మహ్మద్‌గౌస్ పల్లి నుంచి మల్లంపల్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాకారం ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 598, 599, 680 పరిధిలోని కెనాల్ నుంచి జాకారం సాంఘీక సంక్షేమ గురుకులం పక్కన ఉన్న నాగిరెడ్డికుంట వరకు, గట్టమ్మ ఆలయం నుంచి పానేస కాల్వ వరకు పనులు నిలిచిపోయాయి. ఈ భూమి మాదంటే మాది అంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది. వేరే దగ్గర భూమి ఇవ్వాలని.. వాస్తవానికి కెనాల్ నుంచి ఇరువైపులా ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ సంరక్షించుకుంటూ వస్తోంది. ఎన్‌హెచ్ రోడ్డు పక్కన విలువైన టేకు, కొడిశ, నల్లమద్ది, ఏరుమద్ది, బిలుగు, సండ్ర, గుల్మోహర్, సిస్సు, నెమలినార, నారేప, చిందుగ వంటి చెట్లను ఇతరులు కొట్టకుండా ఈ ప్రదేశం చుట్టూ ట్రెంచ్ వేసింది. అయితే ఇప్పుడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 53/2, 53/19 భూమి రెవెన్యూకు సంబంధించిన ఆస్తి అని పంచాయతీని మొదటికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారులు తమతమ దగ్గర ఉన్న ఆధారాలతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా విషయం కొలిక్కి రాలేదు. జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి మా దేనని, ఒక వేళ విస్తరణకు భూమిని తీసుకుంటే ఇరువైపులా 12.5 మీటర్ల చొప్పున 11.34 ఎకరాల భూమిని మరోచోట అప్పగించాలని అటవీ శాఖ ప్రపోజల్ పెట్టింది. అయితే దీనికి రెవెన్యూ శాఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న చెట్లను కొట్టేసే క్రమంలో కాంపన్స్ట్రేషనరీ ఎఫారెస్ట్రేషన్ కింద రూ.16 లక్షలు చెల్లించాలని పెట్టిన ప్రపోజల్స్‌కు సైతం ససేమీరా ఒప్పుకోకపోవడంతో అప్పటి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ పలుమార్లు పనులకు అడ్డుతగిలినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో డీఎఫ్‌ఓపై ఫిర్యాదులు అందాయని, ఆయన బదిలీకి ఇది ఒక కారణమని తెలుస్తుంది. గతంలోనూ అంతే.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో భాగంగా స్థల సేకరణ సమయంలో రెవెన్యూ–అటవీ అధికారులకు భూమి హద్దుల విషయంలో ఇదే విధంగా జరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టడం అటవీ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. దీంతో అటవీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై ఎఫ్‌సీ–1980 చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఎన్‌హెచ్ అధికారులకు నోటీసులు ఎన్‌హెచ్ విస్తరణ విషయం లోలోపల చిలికిచిలికి గాలివానగా మారుతుందని ఇరుశాఖల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో ఇటు పీసీసీఎఫ్, అటు సీఎస్‌కు ఫైల్స్ అందాయని సమాచారం. దీంతో స్పందించిన పీసీసీఎఫ్ నేషనల్ హైవే వరంగల్ డివిజన్ అధికారులకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్(ఎఫ్‌సీ)–1980 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నేషనల్ హైవే ఇరువైపులా చెట్లకు సంబంధించిన సర్వే చేపట్టకూడదని సిరికల్చర్, హార్టికల్చర్ అధికారులకు ఎఫ్‌సీ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు చెట్లకు నంబరింగ్ ఇస్తున్నట్లుగా అటవీ అధికారవర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అటవీ అధికారులు పట్టుపట్టి కూర్చున్నారు. ఈ విషయంలో ఇరుశాఖల రాష్ట్రస్థాయి అధికారులు రాజీకి వస్తే తప్పా కెనాల్ నుంచి నాగిరెడ్డి కుంట వరకు, డీబీఎం–38 కెనాల్(పానేసా కాల్వ) నుంచి గట్టమ్మ మధ్యలో విస్తరణ పనులు జరిగేలా కనిపించడం లేదు. -
కమ్మేసిన పొగమంచు
కోదాడ, మునగాల: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పరిసర ప్రాంతాలు, మునగాల మండల కేంద్రాన్ని గురువారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. 65వ నంబర్ (హైదరాబాద్ –విజయవాడ) జాతీయ రహదారిపై దీపాలు వెలిగించి వాహనాలను నడపాల్సి వచ్చింది. -
400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయరహదారి
రాజమహేంద్రవరం– విజయనగరం వరకు మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 400 కిలోమీటర్ల పొడవునా చేపట్టే ఈ నిర్మాణానికి రూ.568 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. సాక్షి, అల్లూరి సీతారామరాజు(రంపచోడవరం): మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన రాజమహేంద్రవరం– విజయనగరం హైవే రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 400 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.568 కోట్లు వెచ్చించింది. దశల వారీగా నేషనల్ హైవే ఆథారిటీ అధికారులు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే గోకవరం నుంచి ఐ.పోలవరం జంక్షన్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. నాలుగు మండలాల పరిధిలో.. రంపచోడవరం మండలం ఐ.పోలవరం నుంచి కాకరపాడు వరకు జాతీయ రహదారి 516 రోడ్డు పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి నాలుగు మండలాలను కలుపుతూ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పది కిలోమీటర్లు మేర రోడ్డును విస్తరిస్తున్నాయి. ఈ నాలుగు మండలాల్లో హైవే రోడ్డు నిర్మాణానికి 725 ఎకరాలు అవసరం. 585 ఎకరాలు అప్పగింత ఇప్పటివరకు 585 ఎకరాల ప్రభుత్వ భూమిని రోడ్డు నిర్మాణ పనులకు ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు. మరో 140 ఎకరాలు ప్రైవేట్ భూమి ఉంది. ఈ భూమిని అప్పగించేందుకు అవార్డు ఎంక్వైయిరీ ప్రకటించిన తరువాత, భూ యాజమానులకు నష్టపరిహారం చెల్లించి భూమిని అప్పగిస్తారు. అయితే అప్పటి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారవర్గాలు తెలిపాయి. సుమారు 70 కిలోమీటర్లు మేర నిర్మిస్తున్న రోడ్డు మార్గంలో 120 చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మాణం చేపడతారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు.. హైవే రోడ్డు నిర్మాణం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నుంచి గోకవరం, పోక్సుపేట, ఐ. పోలవరం జంక్షన్, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కాకరపాడు జంక్షన్, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మినిస్ట్రీస్ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు అండ్ నేషనల్ హైవే ఆథారిటీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చురుగ్గా పనులు సుమారు 70 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాత రోడ్డును వెడల్పు చేసే పనులు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం పనులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైవేట్ భూములను అప్పగించే ప్రక్రియ పూర్తయితే రోడ్డు నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. – చక్రవర్తి, జేఈ, ఆర్అండ్బీ, కాకినాడ -
జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
-
హైవేపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
మేదరమెట్ల(బాపట్ల జిల్లా): కొరిశపాడులోని పి.గుడిపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. జె.పంగులూరు మండలంలోని రేణింగివరం నుంచి కొరిశపాడు వరకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కారణంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దంకి వైపునకు.. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రేణింగివరం వద్ద నుంచి అద్దంకి వైపునకు మళ్లించారు. ట్రయల్ రన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఐ రోశయ్య, భారత వైమానికి దళం గ్రూప్ కెప్టెన్ ఆర్.ఎస్. చౌదరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్ఐలు శివకుమార్, వెంకటేశ్వరరావు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు? -
16 జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ స్ట్రిప్
-
హైవేపై విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్
జే.పంగులూరు: విజయవాడ–ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై గురువారం విమానాల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా.. ఇప్పటికే జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో రన్వేలు నిర్మించారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం క్షేమంగా నేలపైకి దిగడానికి వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ–కలికివాయి, బాపట్ల జిల్లా రేణింగవరం–కొరిశపాడు మధ్య హైవే మీద రన్వేలు సిద్ధం చేస్తున్నారు. రేణింగవరం–కొరిశపాడు మధ్య 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన రన్‌వేపై గురువారం ఉదయం 11 గంటలకు కార్గో, ఫైటర్ జెట్ విమానాలు దిగనున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైమానిక దళ సిబ్బంది విమానాలు దిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రన్‌వే కోసం తారు రోడ్డును నాలుగు కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి.. నాలుగు లేయర్లుగా సిమెంట్ రోడ్డు వేశారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్ తీగలను తొలగించారు. -
AP: శరవేగంగా ‘గొల్లపూడి-చినఅవుటపల్లి’ బైపాస్ నిర్మాణ పనులు
గన్నవరం(కృష్ణా జిల్లా): విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు చేపట్టిన 16వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతమాల ప్రాజెక్ట్‌లో భాగంగా చిన అవుటపల్లి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు 48 కిలోమీటర్ల పొడవునా రెండు ప్యాకేజీలుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. ప్యాకేజీ–3లో భాగంగా చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేపట్టిన మెగా ఇంజినీరింగ్ సంస్థ ఇప్పటికే 80 శాతం పనులను పూర్తిచేసింది. మరో మూడు నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేసే దిశగా పనుల్లో వేగం పెంచింది. ప్యాకేజీ–4లో చేపట్టిన గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 18 కిలోమీటర్ల బైపాస్ పనులు కూడా పూర్తయితే విజయవాడపై పూర్తిగా ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఏలూరు వైపు నుంచి హైదరాబాద్, గుంటూరు వైపు రాకపోకలు సాగించే వాహనాలు గొల్లపూడి మీదుగా బైపాస్ రోడ్డులో వెళ్లనున్నాయి. మర్లపాలెం రైల్వేట్రాక్ వద్ద నిర్మిస్తున్న వంతెన రూ.1,148 కోట్లతో నిర్మాణం ప్యాకేజీ–3లో భాగంగా రూ.1,148 కోట్లతో చేపట్టిన బైపాస్ నిర్మాణ పనులు చినఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సమీపంలో జీరో పాయింట్ నుంచి ప్రారంభమై గొల్లపూడిలో 30వ కిలోమీటర్ వద్ద ముగుస్తుంది. ఈ మార్గంలో రెండు రైల్వే ఫ్లై ఓవర్లు మినహా 36 మైనర్ వంతెనలు, 17 వెహికల్ అండర్ పాస్‌లు, రెండు బాక్స్ కల్వర్ట్లు, మరో 44 పైపు కల్వర్టులు, గ్రామాల వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. మర్లపాలెం, గొల్లపూడి వద్ద రైల్వేట్రాక్‌లకు ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఫ్లైఓవర్ కోసం గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చినఅవుటపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి మర్లపాలెం నుంచి అంబాపురం వరకు ఆరులైన్ల రహదారి నిర్మాణం పూర్తికాగా, చినఅవుటపల్లి, మర్లపాలెం, బీబీ గూడెం వద్ద వంతెనలు, అండర్ పాస్‌లకు రహదారిని అనుసంధానించే పనులు వేగంగా జరుగుతున్నాయి. సూరంపల్లి–నున్న మధ్యలో టోల్‌ప్లాజా నిర్మాణం కూడా జరుగుతోంది. వాహనదారుల సౌకర్యార్ధం పలుచోట్ల బైపాస్ రోడ్లకు ఇరువైపులా టాయిలెట్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. నున్న వద్ద హైటెన్షన్ వైర్లు ఎత్తు పెంచకపోవడంతో నిర్మాణ పనులకు కొంత ఆటంకంగా మారింది. ఈ అవరోధాలను అధిగమించేందుకు ఎన్హెచ్ఏ అధికారులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన నిర్మాణ పనులను కూడా మార్చిలోపు పూర్తిచేసే దిశగా మెగా ఇంజినీరింగ్ సంస్థ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. చదవండి: పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు. రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కాగా, రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ కూడా తాజాగా చేపట్టింది. రహదారి నిర్మాణం ఇలా... తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే 255 కి.మీ. రహదారి(ఎన్‌హెచ్167కె)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కి.మీ. రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్‌ను తాజాగా ఖరారు చేశారు. మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రగతి పథానికి మరో జాతీయ రహదారి దోహదపడనుంది. కడప–రేణిగుంట మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్–716)ని నిరి్మంచాలని కేంద్ర రవాణా–జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దేశంలోని పశ్చిమ–తూర్పు ప్రాంతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న షోలాపూర్–చెన్నై ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా–జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ గురువారం ట్వీట్ ద్వారా వెల్లడించారు. 120 కి.మీ.. రహదారి దేశంలో మౌలిక సదుపాయాల అనుసంధానానికి కేంద్రం ప్రారంభించిన గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా కడప నుంచి తిరుపతి సమీపంలోని రేణిగుంట కూడలి మధ్య నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తారు. రూ. 1,500.11 కోట్లతో 120 కి.మీ. రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ హైవే నిర్మాణానికి అవసరమైన 1,066 ఎకరాల సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసింది. రెండు ప్యాకేజీల కింద టెండర్ల ప్రక్రియ నిర్వహించి 2024 నాటికి హైవేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. చదవండి: (వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా: చంద్రబాబు) పోర్టుల అనుసంధానం.. ఈ నాలుగు లేన్ల రహదారి ప్రధానంగా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలను రేణిగుంట విమానాశ్రయంతో అనుసంధానిస్తుంది. ఈ రహదారి నిర్మాణంతో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టుల నుంచి షోలాపూర్ పారిశ్రామిక ప్రాంతానికి సరుకు రవాణా సులభతరం కానుంది. దీంతో ఈ మధ్య ప్రాంతంలో ఉండే రాయలసీమలో అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం రోజూ సగటున 18 వేల వాహనాలు ప్రయాణిస్తున్న ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నాలుగు లేన్ల జాతీయ రహదారితో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆధ్యాత్మిక టూరిజం కూడా అభివృద్ధి చెందనుంది. -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుండి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. ప్రమాద ఘటనలో క్యాబిన్లో మంటలు వ్యాపించాయి. క్యాబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అవ్వగా, ఆసుప్రతికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి! -
ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
-
3 నేషనల్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 12న రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈ రోడ్ల పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేయటం ఇదే మొదటిసారి. గతంలో మనోహరా బాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు గజ్వేల్ కేంద్రంగా మోదీ శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులకు ఆ శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పుడు మొదటిసారి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. మెదక్– సిద్దిపేట–ఎల్కతుర్తి మధ్య 134 కి.మీ. నిడివితో విస్తరించే ఎన్‌హెచ్–265 డీజీ పనులు ప్రారంభిస్తారు. రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో విస్తరించే ఈ పనులకు రూ.1461 కోట్లు వ్యయం అంచనా. రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో విస్తరించే బోధన్–బాసర–భైంసా రోడ్డు పనులు ప్రారంభిస్తారు. 56 కి.మీ. నిడివితో ఉండే ఈ రోడ్డు విస్తరణకు రూ.644 కోట్లు ఖర్చు కానున్నాయి. 17 కి.మీ. నిడివితో ఉండే సిరోంచ–మహదేవ్పూర్ సెక్షన్ పరిధిలో ఆత్మకూరు వరకు జరిగే రోడ్డు పనులను కూడా ప్రారంభిస్తారు. పేవ్డ్ షోల్డర్స్‌తో కూడిన ఈ రెండు వరసల రోడ్డు విస్తరణకు రూ.163 కోట్లు వ్యయం కానుంది. -
‘తుని–సబ్బవరం’ను జాతీయ రహదారిగా మార్చండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని తుని–సబ్బవరం రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. 133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.2,200 కోట్లు ఖర్చవుతుందన్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ కూడా పూర్తయిందని చెప్పారు. రహదారి పనులు వేగంగా చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశానన్నారు. ఈ రహదారి పూర్తయితే ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. -
రేకులుగా మార్చి.. లోదుస్తుల్లో దాచి..
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మూడున్నర కేజీల బంగారం పట్టుబడింది. రూ.1.90కోట్ల విలువైన బంగారాన్ని ఆది వారం తెల్లవారుజామున ఎస్ఎస్టీ(స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీం) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హర్షద్, షరీఫ్, జావేద్, సుల్తానా దుబాయ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మూడున్నర కిలోల బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి సన్నని రేకులుగా ప్యాక్ చేసి అండర్వేర్లలో ఉంచుకొని విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎర్టిగా కారులో హైదరాబాద్‌కు వస్తుండగా, పంతంగి టోల్గేట్ చెక్‌పో స్టు వద్ద పోలీసులకు తనిఖీలో పట్టుబడ్డారు. వారి నుంచి బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు నిమిత్తం డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. కాగా, పోలీసులు వీరిని బంగారం స్మగ్లింగ్ ముఠా గా అనుమానిస్తున్నారు. వీరు దుబాయ్ ఎలా వెళ్లా రు, బంగారం ఎవరిచ్చారు, ఎయిర్ పోర్టులను దా టుకుంటూ ఇక్కడి వరకు ఎలా వచ్చారు, లేదంటే గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎవరైనా బంగారం ఇచ్చారా అనేది ఆరా తీస్తున్నారు. -
ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇరువురి పరిస్థితి విషమం
సాక్షి, ఎర్రవల్లి చౌరస్తా/ బాన్సువాడ టౌన్ (బాన్సువాడ): దైవదర్శనానికి కారులో వెళ్తున్న ఓ కుటుంబం జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటిక్యాల మండలంలోని ధర్మవరం స్టేజీ సమీపంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కోదండాపురం ఎస్ఐ వెంకటస్వామి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ప్రకాష్, భార్య లక్ష్మి(50), కూతుళ్లు శిరీష(21), మానసతో కలిసి తిరుపతి దర్శనం కోసం శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఇటిక్యాల మండలంలోని ధర్మవరం స్టేజీ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను వెనక నుంచి కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి, శ్రీలత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రకాష్, మానసలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దైవ దర్శనానికి వెళ్తుండగా తల్లి, సోదరి మృతిచెందడంతో మానస కన్నీరుమున్నీరైంది. ప్రకాష్ మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రకాష్‌కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివా హం కాగా శిరీష, మానస చదువుకుంటున్నారు. -
వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!
సాక్షి, హైదరాబాద్: వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే గద్వాల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు వనపర్తిని గద్వాలతో అనుసంధానిస్తూ.. అక్కడి నుంచి మంత్రాలయానికి నాగులదిన్నె మీదుగా జాతీయ రహదారి నిర్మించే ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ జాతీయ రహదారుల విభాగం నుంచి అందిన ప్రతిపాదనలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ పరిశీలిస్తోందని.. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి ఏపీలోని మంత్రాలయానికి వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నారు. అదే కొత్త హైవే ఏర్పాటై గద్వాల నుంచి ఐజా మీదుగా వెళ్తే దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే రెండేళ్లలో తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంవత్సరమే పనులు ప్రారంభం కానున్నాయి. మెదక్–ఎల్లారెడ్డి మధ్య 43.9 కిలోమీటర్ల రోడ్డును రూ.399.01 కోట్లతో రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో.. ఎల్లారెడ్డి–రుద్రూరు మధ్య 37.28 కిలోమీటర్ల మార్గాన్ని రూ.499.88 కోట్లతో రెండు వరసల రోడ్డుగా విస్తరించనున్నారు. ఇక ఖమ్మం–కురవి మధ్య 37.43 కిలోమీటర్ల రోడ్డును రూ.455.76 కోట్లతో, ఆదిలాబాద్–బేల మధ్య 32.97 కిలోమీటర్ల రోడ్డును రూ.490.92 కోట్లతో విస్తరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
వాహనదారులకు బిగ్ రిలీఫ్.. టోల్ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం!
హైవేలపై టోల్ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో, వాహనదారులకు కొంత మేరకు ఉపశమనం కలుగనుంది. వివరాల ప్రకారం.. ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. వాహనం సైజు, రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆధారంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే కొత్త టోల్ విధానానికి అనుగుణంగా వాహనం హైవేలపై ఎంత సమయం, ఎంత దూరం ప్రయాణించిందనే దాని ఆధారంగా టోల్ వసూలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. టోల్‌ప్లాజా వసళ్ల విషయంలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతీ 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే కలెక్షన్ పాయింట్స్ వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేయబోరని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా, 60 కిలోమీటర్ల మధ్యలో ఉండే టోల్‌బూత్‌లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తామని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా స్పష్టం చేశారు. Pay as you go: Centre plans toll collection revamp based on vehicle’s size, distance travelled#vehicles #government #infrastructure https://t.co/vayGcK6Tu0 — ET NOW (@ETNOWlive) October 4, 2022 -
మృత్యుహైవే..37 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
మార్కాపురం టౌన్/మద్దిపాడు(ప్రకాశం జిల్లా): హైవే రోడ్లు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ మలికా గర్గ్ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రతి శనివారం నేషనల్, స్టేట్ హైవేలపై నో యాక్సిడెంట్ డేగా నిర్ణయించి తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఒక వైపు ప్రజలకు ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరో వైపు నిబంధనలు ఉల్లంఘంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు–చెన్నై, ఒంగోలు–విజయవాడ ఎన్‌హెచ్ 16, ఒంగోలు–చీమకుర్తి పరిధిలోని స్టేట్ హైవే నంబర్ 39, గిద్దలూరు–విజయవాడ పరిధిలోని ఎన్‌హెచ్ 544డి, మార్కాపురం టౌన్‌లోని బోడపాడు క్రాస్ రోడ్‌లోని ఎన్‌హెచ్ 565 పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ స్పాట్స్‌లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. వీటి వద్ద బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు స్పీడ్ బ్రేకర్లను, బ్లింకింగ్ లైట్స్ సిస్టంను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లను తొలగిస్తున్నారు. గ్రామాలు పాఠశాలలు, మలుపుల వద్ద వాహనదారులను అలర్టు చేసేందుకు మార్కింగ్ చేశారు. గత నెల 24వ తేదీన డీఐజి త్రివిక్రమ వర్మ మద్దిపాడు మండలంలోని బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఎస్పీ మలికాగర్గ్‌కు పలు సూచనలు చేశారు. కారణాలు ఇవే „ నేషనల్ హైవే నిబంధనల ప్రకారం హైవే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉండవు „ 100 నుంచి 140 కిలో మీటర్ల మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. „ మద్యం తాగి వాహనం నడపటం „ గ్రామాల వద్ద, మలుపుల వద్ద వాహనం నిదానంగా కాకుండా వేగంగా వెళ్లడం, ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించక ప్రమాదాలు జరుగుతున్నాయి. „ హెల్మెట్ వాడకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. „ హైవేపై ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత నెలలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని అమరావతి–అనంతపురం హైవేపై కంభం రైల్వేస్టేషన్ వద్ద ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. 12న కొనకనమిట్ల మండలంలో జాతీయ రహదారిపై బైక్ ఢీకొని వృద్దుడు మృతి. 16న బేస్తవారిపేట పరిధిలో బస్సును బైక్ ఢీకొని యువకుడు మృతి. దర్శిలో బైక్‌పై వెళ్తూ బస్సును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి. 20వ తేదీన తాళ్లూరు మండలం గంగవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు మృతి. 23న జే పంగులూరు మండలం కొండమంజులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 28వ తేదీ కొమరోలు మండలంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ, బైక్‌పై ఉన్న ఇద్దరు మృత్యువాత. 2019వ సంవత్సరంలో బ్లాక్ స్పాట్ల వద్ద 24 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2020లో 18 మంది ప్రమాదాల్లో చనిపోగా 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నలుగురికి గాయాలయ్యాయి. 2021లో 22 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2022లో ఆగస్టు వరకూ 11 మంది మృతిచెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నివారణ చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. నివారణకు మా సిబ్బంది వాహనదారులకు అవగాహన కలి్పస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. స్పీడ్ గన్లు ఏర్పాటు చేశాం. దీంతో హై స్పీడ్‌తో వెళ్తున్న వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నాం. ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్ డేను అమలు చేస్తున్నాం. పోలీస్ అధికారులు తమ సిబ్బందితో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. – మలికాగర్గ్, జిల్లా ఎస్పీ బ్లాక్ స్పాట్లు మార్కాపురం పరిధిలోని బోడపాడు క్రాస్‌రోడ్డు, కొనకనమిట్ల జంక్షన్, రాయవరం పలకల గనులు, పెద్దారవీడు సమీపంలోని హనుమాన్ జంక్షన్, నేషనల్ హైవేపై ఉన్న గొబ్బూరు, తోకపల్లి, దేవరాజుగట్టు, కంభం సమీపంలో హైవేపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద, గిద్దలూరు సమీపంలోని త్రిపురాపురం క్రాస్‌రోడ్, బేస్తవారిపేట సమీపంలోని పెంచికలపాడు, యర్రగొండపాలెం పరిధిలోని గురిజేపల్లి, బోయలపల్లి, దోర్నాల సమీపంలోని చింతల, చిన్నారుట్ల మలుపు, పుల్లలచెరువు సమీపంలోని మల్లపాలెం క్రాస్‌రోడ్డు, త్రిపురాంతకం సమీపంలోని నేషనల్ హైవేపై ఉన్న గొల్లపల్లి, డీబీఎన్ కాలనీ క్రాస్ రోడ్ల వద్ద తరచుగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ జంక్షన్, సంఘమిత్ర హాస్పిటల్ రోడ్డు, వెంగముక్కలపాలెం జంక్షన్, త్రోవగుంట, ఏడుగుండ్లపాడు, కొప్పోలు ఫ్లైఓవర్ జంక్షన్, మద్దిపాడు పరిధిలోని గ్రోత్ సెంటర్, చీమకుర్తి పరిధిలోని మర్రిచెట్లపాలెం జంక్షన్, ఈస్ట్ బైపాస్ రోడ్డు, రెడ్డి నగర్, సంతనూతలపాడు పరిధిలోని ఒంగోలు రోడ్డు, సింగరాయ కొండ పరిధిలోని కనుమళ్ల క్రాస్‌రోడ్డు, టంగుటూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజి, వల్లూరమ్మ గుడి మధ్య, సూరారెడ్డిపాలెం ఐవోసీ ప్రాంతం, కొండపి ఫైవోవర్ బ్రిడ్జి దగ్గర తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. -
జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం
చిట్యాల: నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని వనస్థలిపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి రాగానే బస్సు టైర్ పేలిపోయి మంటలు లేచాయి. ప్రమాద సమయంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి, బస్సులోని ప్రయాణికులను లేపటంతో వారంతా లగేజీలతో బస్సులోంచి కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. బస్సు దగ్ధమైన సంఘటనపై ఫిర్యాదు అందలేదని చిట్యాల పోలీసులు తెలిపారు. -
విజయవాడకు తూర్పు మణిహారం
సాక్షి, అమరావతి: విజయవాడకు తూర్పు మణిహారంగా జాతీయ రహదారికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. భూసేకరణ వ్యయానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను కూడా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సూత్రప్రాయంగా ఆమోదించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాదాపు రూ.2 వేల కోట్లతో 40 కిలోమీటర్ల మేర విజయవాడ తూర్పు బైపాస్ మార్గం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ తుదిదశకు చేరుకుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. హైవేపై ట్రాఫిక్ కష్టాలకు తక్షణ పరిష్కారం చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) విజయవాడ నగరంలో నుంచి వెళుతుండటంతో దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలు జఠిలమవుతూ వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం గురించి యోచించకుండా గ్రాఫిక్కులతో కనికట్టు చేసిన అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రతిపాదించింది. 30 ఏళ్ల తరువాత ఆ ప్రాంతంలో పెరిగే ట్రాఫిక్ కోసమని ఇప్పుడు పశ్చిమ బైపాస్ నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు తక్షణ పరిష్కారం గురించి యోచించింది. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే పోర్టు నుంచి రాకపోకలు సాగించే భారీ వాహనాలతో విజయవాడ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమవుతాయని గుర్తించింది. ఈ సమస్యకు పరిష్కారంగా విజయవాడకు తూర్పు వైపున బైపాస్ రహదారి నిర్మించాలని ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడంతో తూర్పు బైపాస్ నిర్మాణం దిశగా ఎన్హెచ్ఏఐ కార్యాచరణ చేపట్టింది. కాజ నుంచి చిన అవుటపల్లి వరకు.. జాతీయ రహదారిపై గుంటూరు జిల్లాలోని కాజ నుంచి కృష్ణాజిల్లాలోని కంకిపాడు మీదుగా చిన అవుటపల్లి వరకు నాలుగు లేన్ల బైపాస్ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 40 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ బైపాస్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవున వంతెన నిర్మిస్తారు. దాదాపు రూ.2 వేలకోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈ బైపాస్ నిర్మాణంతో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా ప్రయాణిస్తాయి. బందరు పోర్టుకు వెళ్లే, వచ్చే వాహనాలు కూడా విజయవాడ నగరంలోకి రాకుండానే జాతీయ రహదారిపై బైపాస్ మీదుగా అటు చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ల వైపు వెళ్లవచ్చు. మల్టీమోడల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి 100 ఎకరాలు బైపాస్ రహదారి నిర్మాణానికి అయ్యే రూ.2 వేలకోట్లలో దాదాపు రూ.525 కోట్లు భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రహదారి, వంతెన నిర్మాణాలకు ఎన్హెచ్ఏఐ నిధులు సమకూరుస్తుంది. భూసేకరణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు ప్రతిపాదనలు సమర్పించింది. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మినహాయించుకుంటామని ప్రతిపాదించింది. అందుకు సమ్మతించిన కేంద్రం భూసేకరణ వ్యయంలో 50 శాతం భరించాలని చెప్పింది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అదే సమయంలో ఎన్హెచ్ఏఐ రాష్ట్రంలో జాతీయ రహదారుల పక్కన మల్టీమోడల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం 100 ఎకరాలను కేటాయిస్తామని ప్రతిపాదించింది. దీనికి బదులుగా విజయవాడ తూర్పు బైపాస్ కోసం భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరిం చాలని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టుబట్టడంతో కేంద్రం ఆమోదించింది. భూసేకరణ వ్యయంతోసహా విజయవాడ తూర్పు బైసాస్ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా భ రించేందుకు సూత్రప్రాయంగా సమ్మతించింది. -
భయానక రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుముకూరు జిల్లాలోని బాలినహళ్లిలో ఓ లారీ జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతుచెందిన వారిని రాయచూర్ జిల్లావాసులుగా గుర్తించారు. అయితే, 48వ నెంబర్ జాతీయ రహదారిపై రాయచూర్ నుంచి బెంగళూరు వస్తున్న జీపును ఓవర్టేక్ క్రమంలో లారీ ఢీకొట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
గోదావరిపై కొత్త వంతెనలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు జాతీయ రహదారులపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతకుముందు రెండు వరుస సంవత్సరాలు భారీవర్షాలు, పోటెత్తిన వరదలను తట్టుకున్నా, తాజా వరదల తాకిడికి మాత్రం తాళలేకపోయాయి. ఇప్పటికిప్పుడు వాటి పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.38 కోట్లు కావాలంటూ జాతీయ రహదారుల విభాగం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల విభాగానికి ప్రతిపాదించింది. అవి వచ్చే వరకు అధికారులు మట్టికట్టతో రోడ్లను పునరుద్ధరించారు. పెండింగ్‌లో ఉన్న కొత్త వంతెనల నిర్మాణం, పాత వంతెనల స్థాయి పెంపు ప్రతిపాదనలకు ఈసారైనా మోక్షం లభించవచ్చని భావిస్తున్నారు. ఇక్కడే కొత్త వంతెనకు ప్రతిపాదన..: రోడ్డును గోదావరి అడ్డంగా చీల్చి ముందుకు పోటెత్తిన నేపథ్యంలో ఇక్కడ వంద మీటర్ల పొడవుతో కొత్త వంతెనను జాతీయ రహదారుల విభాగం తాజాగా ప్రతిపాదించింది. ఇక్కడ దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన తాజా వరదకు తట్టుకోలేకపోయింది. వంతెనకు ఓ వైపు మట్టి కొట్టుకుపోయి ఇలా రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఇప్పుడు పాత వంతెన కంటే కనీసం మూడు, నాలుగు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల పొడవుతో కొత్త వంతెనను దాని పక్కనే నిర్మించాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. ఇదే రోడ్డు మీద తుపాకులగూడెం సమీపంలోని టేకులగూడెం వద్ద 125 మీటర్ల నుంచి 150 మీటర్ల పొడవుతో మరో వంతెనను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా గోదావరి ఎగిసి రోడ్డు మీదుగా వరద ప్రవహించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోనప్పటికీ, పక్కల భారీగా కోసుకుపోయింది. ఇక్కడ కూడా వెంటనే మట్టికట్ట వేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రసుతం ఆ తాత్కాలిక రోడ్డు మీదుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పస్రా– తాడ్వాయి ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మెటల్, మట్టి, ఇసుక బస్తాలతో ఇదిగో ఇలా తాత్కాలికంగా పునరుద్ధరించారు. ఆ తర్వాత భారీవర్షం, వరద వచ్చినా ఇది నిలబడింది. ఇంకోసారి వరద వస్తే మాత్రం ఇది తట్టుకునే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఈలోపు దీన్ని మరింత పటిష్టంగా పునరుద్ధరించాల్సి ఉంది. ఇది నిర్మల్–ఖానాపూర్ మధ్య ఉన్న దిమ్మతుర్తి గ్రామం వద్ద జాతీయ రహదారి. ఇక్కడ అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం వల్ల రోడ్డు విస్తరణ పనుల్లో దాదాపు రెండేళ్ల ఆలస్యం జరిగింది. అందు వల్లే ఇక్కడ ఆరు చిన్న వంతెనల నిర్మాణమూ జాప్యమైంది. అలా పూర్తికాని దిమ్మతుర్తి సమీపంలోని వంతెన వద్ద రోడ్డు ఇలా కొట్టుకుపోయి ట్రాఫిక్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీంతో తాత్కాలికంగా ఆ మళ్లింపు రోడ్డును పునరుద్ధరించి వాహనాలు నడిపారు. -
తీరనున్న కల.. హైవే.. లైన్ క్లియర్
కందుకూరు వాసులను ఐదు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న 167–బి జాతీయ రహదారి నిర్మాణం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇప్పటికే భూసేకరణను పూర్తి చేసిన అధికారులు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కందుకూరు ప్రజల జాతీయ రహదారి కల తీరనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): కేంద్ర ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో రాష్ట్రంలో మూడు రోడ్లను జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. వాటిలో 167–బి ఒకటి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి (చెన్నై టు కోల్‌కతా – ఎన్‌హెచ్ 16) కడప జిల్లా మైదుకూరు వరకు (ఎన్‌హెచ్ 67) ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి 195 కి.మీల మేర పదిమీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు సింగరాయకొండ, కందుకూరు, పోకూరు, వలేటివారిపాళెం, మాలకొండ, పామూరు, సీఎస్‌పురం, డీజీపేట, అంబవరం, టేకూరుపేట, రాజాసాహెబ్‌పేట, వనిపెంట మీదుగా మైదుకూరు వరకు సాగనుంది. దీనికి 2018 కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ కారణాలతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పనులను మొదలు పెట్టేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్యాకేజీ కింద వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు వేస్తున్నారు. మొదటి ప్యాకేజీ పనులిలా.. మొదటి ప్యాకేజీ కింద ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని మాలకొండ వరకు 45 కి.మీ. మేర రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.263 కోట్లను ఇప్పటికే కేటాయించారు. సింగరాయకొండ, కందుకూరు, వలేటివారిపాళెం మండలాల్లోని పలు గ్రామాల్లో భూసేకరణను పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాలను సేకరించి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని కూడా జమ చేశారు. గతేడాది ఆగస్టులోనే టెండర్లు పిలిచారు. 32 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తర్వాత పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో దానిని రద్దు చేసిన ఎన్‌హెచ్ అధికారులు కొత్తగా టెండర్లు పిలిచారు. అది త్వరలో ఫైనల్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే మొదటి ప్యాకేజీ పనులు ప్రారంభించనున్నారు. అలాగే మాలకొండ నుంచి సీఎస్ పురం వరకు రెండో ప్యాకేజీగా, సీఎస్ పురం నుంచి నెల్లూరు, కడప అడ్డరోడ్డు వరకు మూడో ప్యాకేజీగా, కడప అడ్డరోడ్డు నుంచి మైదుకూరు వరకు నాలుగో ప్యాకేజీగా టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తీరనున్న కల నిన్నటి వరకు అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన కందుకూరు పట్టణానికి భారీ స్థాయిలో రహదారి సౌకర్యం ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం 167–బి నిర్మాణంతో కందుకూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి కొరత తీరనుంది. మొదటి దశలో 45 కి.మీ. రహదారి నిర్మాణంలో నాలుగైదు కిలోమీటర్లు మినహా మిగిలింది మొత్తం కందుకూరు నియోజకవర్గంలోనే జరుగుతుంది. ప్రధానంగా పట్టణానికి దక్షిణం వైపు భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే పోకూరు, వలేటివారిపాళెం వంటి ప్రాంతాల్లోనూ ఊరిబయటి నుంచి హైవే వెళ్తుందని భావిస్తున్నారు. ప్రవిత్ర పుణ్యక్షేత్రం మాలకొండకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడనుంది. -
రహదారిపై భారీ ట్యాంకు
దొరవారిసత్రం: దొరవారిసత్రం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం అతిపెద్ద ట్యాంకు ఓ లారీపై వెళ్లడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ లారీ చెన్నై హార్బర్ నుంచి వారం కిందట వంద అడుగుల పొడవున్న ట్యాంకుతో బయలుదేరింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. మార్గమధ్యంలో దారికడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు తప్పిస్తూ సిబ్బంది నెమ్మదిగా ముందుకు కదలడం కనిపించింది. -
తిరుపతి–పీలేరు రహదారికి మహర్దశ.. వెయ్యి కోట్లతో..
చంద్రగిరి: జాతీయ రహదారికి మహర్దశ పట్టనుంది. నిత్యం ప్రమాదాలతో నెత్తరోడుతున్న రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భాకరాపేట కనుమలో ఇక సాఫీగా ప్రయాణం చేసే అవకాశం దక్కబోతోంది. తిరుపతి–పీలేరు జాతీయ రహదారిని నాలుగులేన్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తిరుపతి–పీలేరు జాతీయ రహదారి రెండులేన్ల రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల భాకరాపేట కనుమలో చోటుచేసుకున్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మార్చి 30న రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజేల ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. చదవండి: ('నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే') సుమారు రూ.వెయ్యికోట్లు మంజూరు భాకరాపేట బస్సు రోడ్డు ప్రమాద అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి–పీలేరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి పచ్చజెండా ఊపింది. సుమారు రూ.వెయ్యికోట్ల వ్యయంతో పనులను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే టోపో సర్వేను పూర్తి చేసింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని వెంకట పద్మావతి ఇన్స్టిట్యూట్ సమీపంలో నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏ) డిజైన్ కన్సల్టెంట్ అధికారులు ట్రాఫిక్ సర్వేను నిర్వహిస్తున్నారు. రోజుకు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో హెవీ వెహికల్స్ ఎన్ని, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇతరత్రా వాహనాల రాకపోకలపై సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు ఈ సర్వే ఉంటుందన్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత నాలుగు లేన్ల రోడ్డు వెడల్పు, డిజైన్ రూపొందించనున్నట్లు వివరించారు. మరో మూడు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. జాతీయ రహదారి పనులు పూర్తయితే భాకరాపేట కనుమ ప్రమాదాలకు చెక్ పడుతుంది. -
ఒకే చోట వరుస ప్రమాదాలు.. ప్రాణాలు తీస్తున్న బ్లాక్‌స్పాట్
ఒకేచోట 20 మీటర్ల దూరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు అంటారు. బరంపురం నగరం నుంచి దిగపండి మీదుగా కొందమాల్, రాయగడ వెళ్లే 326 నంబర్ జాతీయ రహదారిలో తప్తపాణి–కళింగా మధ్య ఘాట్ రోడ్ బ్లాక్ స్పాట్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఇక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఏడాదిలో కాలంలో ఇక్కడ జరిగిన దుర్ఘటనల్లో సుమారు 20 మందికి పైగా మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలు పాలై అస్పత్రిలో చికిత్స పొందగా, వారిలో పదుల సంఖ్యలో వికలాంగులుగా మారారు. అందువలన ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఏ పిక్నిక్కు వెళ్లి వస్తుండగా... జనవరి 15వ తేదీన రాయగడా జిల్లా చంద్రగిరికి పిక్నిక్కు వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో తిరిగి వస్తున్న బస్సు తప్పపాణి ఘాటి దగ్గర ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాద సమయంలో డ్రైవర్ కంగారు పడడంతో అదుపు తప్పిన పిక్నిక్ బస్సు లోయలోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో పిక్నిక్ వెళ్లిన వారిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అంబగడా గ్రామానికి చెందిన బైక్ నడిపిన వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. 8 మంది దుర్మరణం ఏప్రిల్ 29వ తేదీన రాయగడా నుంచి బరంపురంనకు 60 మందితో వస్తున్న బస్సు ఉదయం 3 గంటల సమయంలో అదుపు తప్పడంతో 8 మంది దుర్మరణం చెందారు. అలాగే 40 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. స్వయంగా గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులంగా, ఎస్పీ బ్రాజేష్ కుమార్‌రాయ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఓడ్రాప్ బృందం సాయంతో క్షతగాత్రులను ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. 60 మంది విద్యార్థులకు ప్రమాదం ఇదే రోడ్డులో జనవరి చివరి వారంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని రవిన్స్శా విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు సుమారు 60 మంది బస్సులో గజపతి జిల్లా గండాహతి వాటర్ ఫాల్స్ వద్దకు పిక్నిక్కు వెళ్లారు. వీరు ఆనందంగా గడిపి తిరిగి రాత్రి 10 గంటల సమయంలో వస్తుండగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దీంతో 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర విషాదం ఇటీవల కొందమాల్ జిల్లా దరింగబడి నుంచి బరంపురం మీదుగా పశ్చిమబంగా వెళ్తున్న పర్యాటకుల ఏసీ బస్సు వేకువజామున 3 గంటల సమయంలో గంజాం జిల్లా జగన్నాథ్ ప్రసాద్ బ్లాక్ కళింగా ఘాట్ రోడ్డులో అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. దుర్ఘటనలో 6గురు పర్యాటకులే మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోయలో పడిన ట్రక్కు అలాగే అక్కడికి కొద్ది రోజుల తర్వాత రాయగడ నుంచి బరంపురం లోడుతో వస్తున్న ట్రాక్‌కు లోయలోకి పడిపోవడంతో డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదేవిధంగా పత్తపాణి ఘాటి లోయలో పడిన టాటా సఫారి దుర్ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చెట్టుని ఢీకొని... ఇటీవల గంజాం జిల్లా సురడా బ్లాక్ పరిధి తప్తపాణీ–గజలబడి దగ్గర కళింగా ఘాట్ రోడ్డులో పెళ్లి బృందం వ్యాన్ చెట్టుని ఢీకొనడంతో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బంజనగర్ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Orissa Crime News: నా భార్యను చంపేశాను.. డయల్ 100కు ఫోన్ చేసి.. -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కల్వర్టును స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మృతులను కడప జిల్లా మైదుకూరుకు చెందిన వారిగా గుర్తించారు. బేతంచెర్ల మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..! -
AP: 11 రాష్ట్ర రహదారులకు ‘జాతీయ’ హోదా
సాక్షి, అమరావతి: ముఖ్యమైన రహదారుల అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కీలక ‘రాష్ట్ర రహదారుల’కు జాతీయ రహదారుల హోదా సాధించడంలో మరోసారి విజయం సాధించింది. తాజాగా.. రాష్ట్రంలోని 11 రాష్ట్ర రహదారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల హోదా ప్రకటించింది. దీంతో మొత్తం 872.52 కి.మీ. మేర జాతీయ రహదారులుగా గుర్తించారు. మరో 31 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే 11 రాష్ట్ర రహదారులను కేంద్రం జాతీయ రహదారుల హోదా ఇచ్చింది. దేశంలోనే అత్యధికంగా జాతీయ రహదారులను ఏపీకే ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రహదారుల అభివృద్ధిలో ముందడుగు కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం ద్వారా వాటిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అత్యంత రద్దీ ఉన్న రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా కూడా చర్చించారు. ఫలితంగా గత రెండేళ్లలో రెండు దశల్లో మొత్తం 1,173.65 కి.మీ. మేర 18 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించింది. ఇక తాజాగా మరో 872.52 కి.మీ.మేర మరో 11 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. ఈ మేరకు ఆ రహదారులకు గుర్తింపు సంఖ్యలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే, 2,586.52 కి.మీ. మేర మరో 31 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించేందుకు సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రధానంగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులను ఇతర ప్రధాన నగరాలు, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానించే ముఖ్యమైన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించనున్నారు. దీంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకోనుంది. -
తెలంగాణాలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ ఆందోళనలు
-
ఆరు లేన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే ఆరు లేన్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు లేన్లున్న ఈ ఎన్‌హెచ్–65ను వీలైనంత త్వరగా 6 లేన్ల రహదారిగా విస్తరించాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఉత్తమ్ కలసి వినతిపత్రం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చడంలో ఆలస్యం కారణంగా ట్రాఫిక్ సమస్య లు ఎదురవుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టిన జీఎంఆర్ సంస్థ.. 247 కి.మీ. పొడవైన 4 లేన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 2012 అక్టోబర్ లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఉత్తమ్ చెప్పారు. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తిచేస్తాం.. ‘జీఎంఆర్‌తో ఒప్పందం ప్రకారం.. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటైన ఈ రహదారిని ఆరు లేన్ల రహదారిగా మార్చే ప్రక్రియను 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి. అయితే అనేక కారణాలతో ట్రాఫిక్ తగ్గి ఆదాయమూ తగ్గిందని పరిహారం కోసం జీఎంఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఆరు లేన్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నేను, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గడ్కరీ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లాం. ఈ కారణంగా ఇటీవల జీఎంఆర్ సంస్థతో కేంద్రమంత్రి చర్చలు జరిపారు. దీంతో కోర్టు వ్యాజ్యాన్ని ముగించి త్వరలో పనులు ప్రారంభించేందుకు జీఎంఆర్ అంగీకరించిందని గడ్కరీ తెలిపారు. మంత్రిత్వ శాఖలో అవసరమైన ప్రక్రియలను 2 వారాల్లో పూర్తి చేసి విస్తరణ పనులను త్వరగా ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు’అని వివరించారు. 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్–విజయవాడ హైవే 4 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా మంజూరైందని, ప్రస్తుతం ఎంపీగా 6 లేన్లుగా విస్తరించడంలో తనవంతు పాత్ర పోషించడం ఎంతో సంతృప్తినిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. రూ.1,470 కోట్ల అంచనాతో పనులు.. తెలంగాణ, ఏపీలను కలిపే ఈ రహదారిపై రద్దీ కారణంగా 2007లో ఎక్స్‌ప్రెస్‌వేకు మంజూరు లభించింది. 25 ఏళ్లకు బిడ్‌ను పొందిన జీఎంఆర్ సంస్థ 2009లో 4 లేన్ల పనులను ప్రారంభించింది. రూ. 1,470 కోట్ల అంచనా వ్యయంతో 2010, మార్చి 22న ప్రారంభమైన పనులు 2012లో పూర్తయ్యాయి. -
ఎల్బీనగర్–మల్కాపూర్.. ఆరు లేన్లు
సాక్షి, హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిలో తీవ్ర ట్రాఫిక్ రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎల్బీనగర్–దండుమల్కాపూర్ సెక్షన్‌ను ఆరు వరసలుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. రూ.600 కోట్లతో సుమారు 25 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. రహదారి వెంట సర్వీస్ రోడ్లతోపాటు ఎనిమిది చోట్ల ఫైఓవర్లను నిర్మించనున్నారు. నిజానికి ఎల్బీనగర్–దండుమల్కాపూర్ మధ్య రోడ్డు విస్తరణ ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. గత ఏడాదే కేంద్రం దీనికి ఆమోదం తెలిపి, డీపీఆర్ తయారీకి ఆదేశించినా.. పనులు కదల్లేదు. నిర్మాణ సంస్థ అలసత్వం వల్ల ఆలస్యమవుతోందని ఇటీవలి భేటీ సందర్భంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. వేరే సంస్థకు అప్పగించి అయినా త్వరగా పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా.. విపరీతంగా రద్దీ ఉండే ఈ రహదారిలో ట్రాఫిక్ ఇబ్బంది తప్పేలా ఎనిమిది చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పనామా గోడౌన్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, కోహెడ క్రాస్‌రోడ్డు, పెద్ద అంబర్‌పేట, అనాజ్పూర్రోడ్డు, ఇనాంగూడ, బాటసింగారం ప్రాంతాల్లో వీటిని చేపడతారు. వనస్థలిపురంతోపాటు మరోచోట రెండు ఫుట్ఓవర్ వంతెనలను కూడా నిర్మిస్తారు. ఈ దారి వెంట సర్వీసురోడ్లు కూడా నిర్మించనున్నారు. ఫలించిన కోమటిరెడ్డి ఒత్తిడి.. హైదరాబాద్–విజయవాడ రహదారిని విస్తరించాలని చాలాకాలంగా కేంద్రమంత్రి నితిన్గడ్కరీపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఓవైపు ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు నగరంలో రోడ్డు విస్తరణ, తర్వాత అక్కడి నుంచి విజయవాడ వరకు విస్తరణ జరగాల్సి ఉంది. దీనిపై కోమటిరెడ్డి ఒత్తిడి మేరకు నగరం పరిధిలో రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని గడ్కరీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మేలోనే పనులు మొదలై.. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సానుకూలంగా స్పందించారు: కోమటిరెడ్డి ‘‘విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించేవారి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరణ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను కూడా రెండుమూడు సార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నాను. ఈ క్రమంలోనే రహదారి విస్తరణ చేపట్టాలని గడ్కరీని పలుమార్లు కలిసి కోరగా.. సానుకూలంగా స్పందించారు’’అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దీనితోపాటు హైదరాబాద్ గౌరెల్లి ఔటర్ నుంచి పోచంపల్లి, వలిగొండ, భద్రాచలం మీదుగా ఒడిశా వరకు మరో జాతీయ రహదారిని నిర్మించాలని కోరగా.. గడ్కరీ సాసుకూలంగా స్పందించారని చెప్పారు. -
మట్టి పనికిపోతే.. బస్సు మృత్యువై వచ్చింది
సాక్షి, యాదాద్రి: వారంతా కూలీలు.. జాతీయ రహదారి మధ్యలోని మీడియన్పై మట్టిపని చేస్తు న్నారు.. వాహనాలకు సూచికగా రోడ్డుపై బారికేడ్లు పెట్టారు.. ఓ మహిళాకూలీ హెచ్చరికగా ఎర్రజెండా పట్టుకుని కూడా నిలబడింది.. అంతా మరో గంట లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరే వారే. అంతలోనే వారిని ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీపనికని వచ్చి.. ఆలేరు వద్ద జాతీయ రహదారిపై మీడియన్‌లో మొక్కలు నాటేందుకు వీలుగా మట్టిని తొలగించే పని ఇటీవల ప్రారంభమైంది. ఆదివారం ఉదయం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన ఎనిమిది మంది కూలీలు అదే ప్రాంతానికి చెందిన ఊరెళ్లి శ్యామ్ ఆటోలో పనికి వచ్చారు. శ్యామ్ భార్య లావణ్య కూడా కూలిపనికి వచ్చింది. సాయంత్రం వీరందరినీ తిరిగి రాయగిరికి తీసుకెళ్లేందుకు శ్యామ్ అక్కడికి వచ్చాడు. సుమారు 4 గంటల సమయంలో వరంగల్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు (ఏపీ 36 జెడ్ 0275) కూలీలపైకి దూసుకొచ్చింది. ఎర్ర జెండా హెచ్చరికను దాటి.. రోడ్డు పక్కన పని జరిగే ప్రాంతంలో ఎర్రజెండా ఊపుతూ నిలబడిన అంకర్ల లక్ష్మిని తొలుత బస్సు ఢీకొట్టింది. తర్వాత కవిత, లావణ్య, శ్యామ్‌లపైకి దూసుకెళ్లింది. లక్ష్మి (37) అక్కడికక్కడే చనిపోగా.. కవిత, లావణ్య తీవ్రగాయాలతో ఎగిరిపడ్డారు. శ్యామ్(32) బస్సు కింద ఇరుక్కోగా 200 మీటర్ల దూరం లాక్కెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. లావణ్య(27), కవిత(32) ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఘటనాస్థలంలో రోదిస్తున్న మృతుల బంధువులు ట్రాక్టర్‌ను, జేసీబీని ఢీకొని.. మితిమీరిన వేగంతో కూలీలపై నుంచి దూసుకుపోయిన బస్సు.. రోడ్డుపక్క మట్టి నింపుకొంటున్న ట్రాక్టర్‌ను, దాని తర్వాత ఉన్న జేసీబీని ఢీకొట్టి ఆగిపోయింది. ఆ ధాటికి ట్రాక్టర్ తిరగబడింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నా రు. వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, చనిపోయిన కూలీలకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువులు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసులు సైమన్‌పై కేసు నమోదు చేశారు. దంపతులు.. తోడి కోడళ్లు.. రోడ్డుప్రమాదంలో మృతిచెందిన నలుగురిలో ఆటోడ్రైవర్ ఊరెళ్లి శ్యామ్, లావణ్య దంపతులు. మరో ఇద్దరు అంకర్ల లక్ష్మి, అంకర్ల కవిత ఇద్దరూ తోడి కోడళ్లు. 3 కుటుంబాల్లోనూ చిన్న పిల్లలున్నారు. దంపతులైన లావణ్య, ఊరెళ్ల శ్యాం మృతిచెందడం తో వీరిద్దరి పిల్లలు అనాథలుగా మిగిలారు. వీరికి సొంత ఇళ్లు లేదు. పిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు. మంత్రి దిగ్భ్రాంతి.. ఎమ్మెల్యేల పరామర్శ ప్రమాద ఘటనపై రవాణామంత్రి పువ్వాడ అజయ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదే శించారు. బాధితులను ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే లు సునీతామహేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పరామర్శించారు. బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది వరంగల్ వైపు నుంచి బస్సు వేగంగా వచ్చి నలుగురిని ఢీకొట్టింది. నేను ట్రాక్టర్ నడుపుతున్నా. బ స్సు ముందు ఎర్రజెండా చూపుతున్న మహిళను.. ఆపై మరో ఇద్దరిని ఢీకొట్టింది. అదే వేగంతో శ్యాంను ఢీకొట్టింది. 15 రోజులుగా ఎర్రజెండా పాతి పని చేస్తున్నాం. కానీ, ఈ రోజిలా జరిగింది. –స్వామి, ట్రాక్టర్ డ్రైవర్ ప్రత్యక్ష సాక్షి -
హైవేపై ఆగని ‘జీరో’ దందా
కర్నూలు: కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై ‘జీరో’ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా సంచులకొద్దీ డబ్బు, బంగారు, వెండి నగలు ఈ రహదారి గుండా బస్సుల్లో గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. గుమాస్తాల ముసుగులో బడా రియల్ఎస్టేట్ వ్యాపారులు యువకులను కొరియర్లుగా వినియోగిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడుతున్నా వ్యాపారుల తీరులో మార్పు కనిపించడంలేదు. కర్నూలు శివారులోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పట్టుబడుతున్న డబ్బు, నగలమూటలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఐదు రాష్ట్రాలకు అక్రమ రవాణా నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్ ఉండాలి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆభరణాలను తరలించేటప్పుడు జీఎస్టీ ట్యాగ్‌తో పాటు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదాయ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటివేమీ లేకుండా వ్యాపారులు బంగారు, వెండిపై ‘జీరో’ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు, చెన్నై, ఛత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు ఆదాయపన్ను చెల్లించకుండానే గుట్టు చప్పుడు కాకుండా ప్రయాణీకుల మాటున బస్సుల్లో బంగారు వెండి ఆభరణాలతో పాటు డబ్బును తరలిస్తున్నారు. గతేడాది జూన్ నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఇలాంటి తరహా కేసులు దాదాపు 175కుపైగా నమోదు చేశారు. సుమారు రూ. 3.50 కోట్లు నగదు, 26 కిలోల బంగారు, 295 కిలోల వెండి, 83 సెల్ఫోన్లను తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఐదు రాష్ట్రాలకు జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతుందని స్పష్టమవుతోంది. జీఎస్టీ లేకుండా.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అక్కడి నుంచి తమిళనాడులోని సేలంకు నెలలో కనీసం రెండుసార్లు భారీ మొత్తంలో బంగారు, వెండి నగలు జీఎస్టీ లేకుండానే తరలిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. తమిళనాడుకు చెందిన విజయశర్మ, సురేష్ మునిస్వామి రూ. 2.30 కోట్ల విలువ చేసే 3.79 కిలోల బంగారు నగలు, 435 క్యారెట్ల వజ్రాలను కారులో తరలిస్తూ గత ఏడాది ఇదే చెక్‌పోస్టులోనే పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. అలాగే బెంగళూరుకు చెందిన చేతన్‌కుమార్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌లో రెండు ట్రాలీ బ్యాగుల్లో రూ.3.05 కోట్లు నగదు తీసుకెళ్తూ గతేడాది ఏప్రిల్ నెలలో చెక్‌పోస్టు సిబ్బందికి చిక్కారు. భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయపన్ను చెల్లించుకోవాల్సి వచ్చింది. గుమస్తాల ముసుగులో.. గుమస్తాల ముసుగులో కొందరు యువకులు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కమీషన్ రూపంలో పనికి తగ్గట్టు వ్యాపారులు డబ్బు చెల్లిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, తిరుపతి, రాయఘడ్ వంటి ముఖ్య నగరాలకు బస్సుల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ఉండో లేక విధి నిర్వహణలో భాగంగా చెక్‌పోస్టు విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీలు చేస్తే పట్టుబడేది కొంతే. నిత్యం చెక్‌పోస్ట్ దాటిపోయేది ఎక్కువ. వరుసగా గత మూడు రోజుల్లో ఈ చెక్‌పోస్టులో రూ. 1.20 కోట్ల విలువ చేసే 167.425 కిలోల వెండి నగలు పట్టుబడటంతో తనిఖీ అధికారులే అవాక్కయ్యారు. పన్నులు చెల్లించకుండా నగలు, నగదును తరలిస్తున్న వ్యాపారుల ధైర్యం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆలోచనలోకి నెట్టింది. పన్ను చెల్లించాల్సిందే ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తరువాతనే పట్టుబడిన నగలు, నగదు తిరిగి వారి యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చెక్‌పోస్టులో మూడు షిఫ్టుల్లో నిరంతరం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్ ఉండాలి. లేకపోతే వాటిని సీజ్ చేసి రవాణాదారులపైæ కేసు నమోదు చేస్తున్నాం. – తుహీన్ సిన్హా, సెబ్ జేడీ -
Hyderabad to Bengaluru: ఎన్‌హెచ్ 44 ఇక ‘సూపర్’ హైవే
సాక్షి, అనంతపురం: హైదరాబాద్ (తెలంగాణ) నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు (కర్ణాటక)కు వెళ్లే జాతీయ రహదారి–44 సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ సమయంతో పాటు ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారం డిజిటల్ బోర్డులపై ప్రదర్శించేలా ఈ రహదారిని అత్యాధునికంగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు రానుంది. ఇప్పటికే సర్వే మొదలైంది. ప్రస్తుతమున్న నాలుగు వరుసలను ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు. రహదారికి ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 251 కిలో మీటర్లు ఉంది. ఢిల్లీ –ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలోనే హైదరాబాద్ – బెంగళూరు రహదారిని పూర్తి స్థాయిలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఓ విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. చదవండి: (Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి..) సర్వే పనులు ప్రారంభించాం హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి–44ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల రోడ్డుగా మారుస్తున్నాం. ఈ జాతీయ రహదారి తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఆంధ్రప్రదేశ్‌లో 251 కిలో మీటర్లు ఉంది. ఇప్పటికే రహదారి విస్తరణకు సర్వే చేస్తున్నారు. త్వరలోనే రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానంతో సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. త్వరలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సమస్య తీరనుంది. – జేఎల్ మీనా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వారధి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే..
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్త జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. ఇందుకోసం కృష్ణా నదిపై వంతెన కూడా నిర్మాణం కానుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇదీ ప్రణాళిక.. ► ఏపీ, తెలంగాణలను అనుసంధానిస్తూ 174 కి.మీ. మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్–167కె)ను రూ.600 కోట్లతో నిర్మిస్తారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్ నుంచి ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల వరకు నిర్మించాలని నిర్ణయించారు. ► ఏపీ పరిధిలో కర్నూలు జిల్లాలోని ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. ► తెలంగాణ పరిధిలో కల్వకుర్తి, తాడూరు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్‌లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ► అలాగే, ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై రూ.600 కోట్లతో ఓ వంతెననూ నిర్మిస్తారు. ► కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కి.మీ. మేర ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది. ► కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నామని ఎన్హెచ్ఏఐ అధికార వర్గాలు తెలిపాయి. 80కి.మీ. మేర తగ్గనున్న దూరం ఈ వంతెన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి దోహదపడుతుంది. కర్నూలు జిల్లాలోని వరద ముంపు గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, పడిగ్యాల, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 35 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆ గ్రామాల ప్రజలు వరదల సమయంలో నదిలో ప్రయాణించాల్సిన అవసరం లేకుండా రోడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ► మొత్తం మీద ఏపీ, తెలంగాణ మధ్య 80కి.మీ. మేర దూరం తగ్గుతుంది. ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కర్నూలు, పెబ్బేరు, కొత్తకోట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ► ఈ వంతెన నిర్మిస్తే నంద్యాల నుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. ► తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. తండ్రి ఆశయం.. తనయుడి సాకారం 2007లో నాటు పడవలో కృష్ణా నదిని దాటుతూ ప్రమాదానికి గురై 61మంది మరణించారు. దీంతో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల మధ్య నూతనంగా ఓ వంతెన నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించి 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన హఠాన్మరణంతో ఆ వంతెన నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం 2018లో ఒకట్రెండుసార్లు దానిపై చర్చించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) కల్వకుర్తి–నంద్యాల రహదారిని ఎన్‌హెచ్–167కెగా ప్రకటించి కృష్ణా నదిపై వంతెనతో సహా ఆరులేన్లుగా రహదారి నిర్మాణానికి నిర్ణయించింది. -
కొత్తగా మరో జాతీయ రహదారి.. హైదరాబాద్–తిరుపతి.. మరింత దగ్గర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా మరో జాతీయ రహదారి ఏర్పాటుకానుంది. దీనివల్ల హైదరాబాద్, తిరుపతి మధ్యదూరం దాదాపు 70 కిలోమీటర్ల మేర తగ్గనుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి (కొల్లాపూర్ ఎన్‌హెచ్ –167కే) నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఈ రహదారిలో భాగంగా కృష్ణా నదిపై సోమశిలవద్ద వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు ఎన్‌హెచ్–167ఎన్ విస్తరణకు కూడా గ్రహణం వీడింది. దీని అలైన్మైంట్ ఖరారు కావడంతో పాటు నిర్మాణానికి రూ.703.68 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారుల నిర్మాణంతో వివిధ ప్రాంతాలకు దూరం తగ్గనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొల్లాపూర్ ఎన్‌హెచ్‌కు టెండర్లే తరువాయి.. కొల్లాపూర్ జాతీయ రహదారి–167కే నిర్మాణానికి కేంద్రం గతేడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న ఈ రహదారి పనులకు రూ.600 కోట్లు, మార్గ మధ్యలో కొల్లాపూర్ వద్ద సోమశిల సమీపంలోని కృష్ణానదిపై 2 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో రూ.600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ రహదారి డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడమే తరువాయని తెలుస్తోంది. తెలంగాణలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, రాంపూర్.. ఆంధ్రప్రదేశ్‌లోని మందుగుల, శివాపురం, కరివెన మీదుగా నంద్యాల వరకు నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దాదాపు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ మార్గంలో పది ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. కల్వకుర్తి కొట్రా జంక్షన్ టు నంద్యాల బైపాస్ తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని కొట్రా జంక్షన్ నుంచి కొల్లాపూర్ ఎన్‌హెచ్–167కే ప్రారంభమవుతుండగా.. కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీపంలో కృష్ణా నదిపై రీ–అలైన్మెంట్ బ్రిడ్జి, ఆ తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్ రోడ్డు వరకు రహదారి నిర్మిస్తారు. చివరగా అక్కడ జాతీయ రహదారి–40 జంక్షన్‌కు అనుసంధానించనున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నంద్యాలనుంచి హైదరాబాద్ రావాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం పూర్తయితే నంద్యాలనుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. అలైన్మెంట్ ఖరారు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ ఫ్లైఓవర్, పాలకొండ, పాలమూరు యూనివర్సిటీ మీదుగా ఎన్‌హెచ్–167ఎన్ అలైన్మెంట్ ఖరారైంది. ఆ తర్వాత వీరన్నపేట, డంప్ యార్డు మీదుగా చిన్న దర్పల్లి, హన్వాడ.. నారాయణపేట జిల్లాలోని కోస్గి, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం చుట్టూ 8 కి.మీ.లు, కొడంగల్‌లో 5 కి.మీ.లు, తాండూర్‌లో 6 కి.మీ.ల మేర బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఎన్‌హెచ్–167ఎన్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లే వారికి దూరం తగ్గనుంది ఎన్‌హెచ్–167ఎన్.. రూ.703 కోట్లు మంజూరు మహబూబ్‌నగర్–చించోలి అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది ప్రకటించారు. ఈ మేరకు సర్వే పూర్తి కాగా.. అలైన్‌మెంట్‌పై కూడా స్పష్టత వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌హెచ్–44పై ఉన్న భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు జాతీయ రహదారి–167ఎన్ను విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. దీంతో ఇటీవల రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గడ్కరీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ రహదారి మొత్తం 190 కిలోమీటర్ల నిడివి ఉండగా.. మహబూబ్‌నగర్ నుంచి వికారాబాద్‌లోని కర్ణాటక సరిహద్దు వరకు 126కి.మీ.లు, కర్ణాటక రాష్ట్రం పరిధిలో 64కి.మీ.లు విస్తరించనున్నారు. పట్టణాలు, గ్రామాలు కలిసే చోట 120 అడుగులు, మిగతా చోట్ల 100 అడుగుల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. -
తెలంగాణలో మరో నాలుగు జాతీయ రహదారులు
Central Govt Has Sanctioned Four National Highways: కేంద్రం తెలంగాణకు మరో నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేసింది. అందులో ఒకదానిని నాలుగేళ్ల క్రితం, మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. వీటికి టెండర్లు పిలిచేందు కు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఇరుగ్గా ఉన్న ఈ రోడ్లు జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా.. అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా, మిగతా ప్రాంతా ల్లో 10 మీటర్లు వెడల్పుగా మారనున్నాయి. అన్నీ కీలక రోడ్లే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రం రాష్ట్రానికి విరివిగా జాతీయ రహదారులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సగటు ప్రతి వంద కిలోమీటర్లకు 3.02 కిలోమీటర్లుకాగా.. ప్రస్తుతం తెలంగాణ లో జాతీయ రహదారుల సగటు 3.44 కిలోమీటర్లుగా ఉంది. కొత్త రోడ్లతో ఈ సగటు మరికొంత పెరగనుంది. కొత్తగా అభివృద్ధి చేయనున్న నాలుగూ కీలకమైనవే. ఇందులో జనగామ–దుద్దెడ మధ్య ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం నాలుగేళ్ల క్రితమే జాతీయ రహదారిగా గుర్తించింది. కానీ నిధులు మంజూరుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసి పంప గా తాజాగా పనులకు అనుమతి మంజూరు చేసింది. 45.5 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.423 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇక గతేడాది జాతీయ రహదారుల హోదా దక్కించుకున్న మెదక్–సిద్దిపేట, సిద్దిపేట–ఎల్కతుర్తి, వలిగొండ–తొర్రూరు రోడ్లకు కూడా అనుమతులు వచ్చాయి. వీటి డీపీఆర్‌లను పరిశీలించిన కేంద్రం పనులకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఈ నాలుగు రోడ్ల పనులు మొదలై.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోడ్లు ఏడు మీటర్ల వెడల్పే ఉన్నాయి. కొన్నిచోట్ల అయితే సింగిల్ రోడ్లుగానే ఉన్నాయి. కానీ ట్రాఫిక్ ఎక్కువగానే ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులుగా మారాక ఇబ్బందులు తప్పనున్నాయి. మొత్తంగా ఈ నాలుగు రోడ్లకు రూ.2,432 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను కేంద్రమే ఇవ్వనుంది. -
భారీగా పెరిగిన టోల్ వసూళ్లు.. రోజుకు రూ. 4 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తప్పనిసరి కావడం, ఇంటి దొంగల ఆట కట్టు కావటంతో జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదాయం వచ్చిపడుతోంది. ఇంతకాలం జవాబుదారీ విధానం లేకపోవటంతో ఎన్ని వాహనాలు టోల్‌ప్లాజాలను దాటుతున్నాయి, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తోంది.. సరైన లెక్కాపత్రం లేకుండా పోయింది. సిబ్బంది హస్తలాఘవం బాగా ఉండటంతో దాదాపు సగానికి సగం మొత్తం గాయబ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వారి ప్రమేయం లేకుండా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము ఆటోమేటిక్‌గా వసూలవుతుండటంతో భారీ మొత్తం జమవుతోంది. ఇంతకాలం ఫాస్టాగ్ లేని వాహనాల సంఖ్య కూడా గణనీయంగా కనిపిస్తూండేది. కానీ గత రెండు మూడు నెలల్లో ఫాస్టాగ్ పొందిన వాహనాల సంఖ్య గరిష్టస్థాయికి చేరింది. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని జాతీయ రహదారుల మీద పరుగుపెడుతున్న వాహనాల్లో 98 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. దీంతో నిత్యం రాష్ట్రంలోని 27 టోల్ కేంద్రాల ద్వారా రూ.మూడున్నర కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు ఆదాయం నమోదవుతుండటం విశేషం. ఫాస్టాగ్ తప్పనిసరితో.. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ గతేడాది ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనం వస్తే అప్పటికప్పుడు ట్యాగ్ కొని అతికించుకోవటమో, లేదా రెట్టింపు రుసుమును పెనాల్టీగా చెల్లించి ముందుకు వెళ్లటమో, లేదా వెనుదిరిగి వెళ్లిపోవటమో చేయాల్సిన పరిస్థితిని గత ఫిబ్రవరి నుంచి అమలులోకి తెచ్చారు. దీంతో వాహనదారులందరూ ఫాస్టాగ్ కొనుగోలు చేయటం ప్రారంభించారు. తాజాగా.. సంక్రాంతి ప్రయాణాల కోసం ఎక్కువ మంది ఫాస్టాగ్ కొనేశారు. ప్రస్తుతం 98 శాతం వాహనాలకు ట్యాగ్ కనిపిస్తోంది. -
చౌటుప్పల్‌లో హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెళ్లిన కార్లు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి క్యూ కట్టాయి. హైవేపై నిత్యం 30వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, గురువారం మరో 10వేల వాహనాలు అదనంగా వెళ్లినట్టు టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి టోల్‌ప్లాజాను గురువారం మధ్యాహ్నం సందర్శించి, వాహనాల రద్దీని పరిశీలించారు. గూడూరు టోల్‌ప్లాజా దగ్గరా... బీబీనగర్: హైదరాబాద్–వరంగల్ హైవేపై బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద కూడా గురువారం పండుగ రద్దీ కనిపించింది. నగరం నుంచి భారీగా ప్రజలు పండుగకు గ్రామాలకు వెళ్తుండడంతో టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. -
ఏపీ రాష్ట్రం గుండా 6 నూతన ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం
సాక్షి, అమరావతి: దేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంలో ఏపీ రాష్ట్రానికి కేంద్రం పెద్దపీట వేసింది. రాష్ట్రానికి నూతన ఎక్స్‌ప్రెస్ హైవేలను కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రం గుండా మరో 6 నూతన ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ప్రధానంగా పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు ఉన్న మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తూ ఎక్ర్‌ప్రెస్ హైవేలు నిర్మించనున్నారు. రాష్ట్రంలో 378 కిలోమీటర్లు పారిశ్రామిక ప్రోత్సాహం, సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దేశంలో 22 గ్రీన్ ఫీల్డ్/ఎక్ర్‌ప్రెస్ హైవేలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో ఆరు రాష్ట్రం గుండా వెళ్తాయి. దేశం మొత్తం మీద 2,157 కి.మీ. మేర కేంద్ర ప్రభుత్వం ఎక్ర్‌ప్రెస్ హైవేలు నిర్మించనుంది. వాటిలో రాష్ట్ర పరిధిలో 378 కి.మీ.నిర్మిస్తారు. ఈ రహదారులకు రూ.15,876 కోట్లతో ప్రణాళికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. ఆరు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఇవీ.. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 272 కి.మీ. మేర నిర్మిస్తారు. అందులో 92 కి.మీ. రాష్ట్రంలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల గుండా వెళ్తుంది. రూ.3,864 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. చిత్తూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 125 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇది రాష్ట్రంలో 75 కి.మీ. నిడివి ఉంటుంది. రూ.3,150 కోట్లతో నిర్మించే ఈ హైవేను 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. రాయ్‌పూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే 464 కి.మీ. ఉంటుంది. రెండు పోర్టులు, రెండు స్టీల్ ప్లాంట్లు, నాల్కో వంటి ప్రముఖ భారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలను అనుసంధానించే ఈ హైవే దేశంలోనే లాజిస్టిక్స్ రంగంలో కీలకం కానుంది. రాష్ట్రంలో 100 కి.మీ.మేర దీనిని నిర్మిస్తారు. మొత్తం రూ.4,200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. విజయవాడ –నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 457 కి.మీ.మేర నిర్మిస్తారు. రాష్ట్రంలో 29 కి.మీ. మేర దీని నిడివి ఉంటుంది. రూ.1,218 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు. కర్నూలు – షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 318 కి.మీ. మేర నిర్మిస్తారు. అందులో రాష్ట్రం గుండా 10 కి.మీ. ఉంటుంది. రూ.420 కోట్ల ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు. హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేను 521 కి.మీ. మేర నిర్మిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల గుండా సాగే ఈ రోడ్డు రాష్ట్రంలో 72 కి.మీ. ఉంటుంది. రూ.3,024 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు. -
కలకలం: రోడ్డుపై కరెన్సీ నోట్ల ముక్కల సంచులు..
సాక్షి, బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కత్తిరిచ్చిన కరెన్సీ నోట్ల ముక్కల సంచులు పడి ఉండటం కలకలం రేపింది. ఇందులో కొత్త 500, 2000 నోట్లను ముక్కలుగా చేసి సంచుల్లో నింపారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో వీటిని పడేశారు. నోట్ల ముక్కల సంచులపై నుంచి వాహనాలు వెళ్లడంతో చెల్లా చెదురుగా రోడ్డుపై ఎగిరి పడ్డాయి. రవాణా చేస్తుండగా వాహనంలో నుంచి పడి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: HYD: ఇక్కడ అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు? సమాచారం అందడంతో ఏఎస్సై మురళీధర్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. శాంపిళ్లను సేకరించి, ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆరేళ్ల కిందట కూడా ఇలాంటి నోట్ల ముక్కలే పడేశారు. ఒకే గ్రామంలో రెండు సార్లు కరెన్సీ నోట్ల ముక్కలు పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కరెన్సీ ముక్కలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: న్యూ ఇయర్ వేడుకలకు గ్రీన్ సిగ్నల్.. అరకొరే...అయినా హుషారే... -
1,732 కిలోల గంజాయి పట్టివేత
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలోని జాతీయ రహదారిపై రెండు వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.70 కోట్ల విలువ చేసే సుమారు 1,732 కేజీల గంజాయిని కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, ఇద్దరు పరారైనట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఎన్‌హెచ్ 16పై బూరుగుపూడి శివారు పోలవరం కాలువ వంతెన వద్ద జగ్గంపేట సీఐ వి.సురేష్‌బాబు, కిర్లంపూడి ఎస్సై జి.అప్పలరాజులు వాహనాలు తనిఖీ చేయగా గంజాయి గుట్టు రట్టయ్యింది. అన్నవరం వైపు నుంచి కోళ్ల మేత, ట్రేల లోడుతో వస్తున్న అశోకా లేలాండ్ వ్యాన్‌లో 10 బస్తాల గంజాయి, తాళ్లరేవుకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్‌లో 30 బస్తాల్లో ఉన్న గంజాయి వెరసి 40 బస్తాల్లో ఉన్న 1731.80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన కాశీ మాయన్ కుమార్, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ డ్రైవర్ సున్నపు రాజు, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం బొడ్డువానిలంకకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ క్లీనరు వాసంశెట్టి వీరబాబు, విశాఖ జిల్లా చింతపల్లి మండలం పనసలపాడు గ్రామానికి చెందిన కొర్ర ప్రసాద్, విశాఖ జిల్లా జి.కొత్త వీధి మండలం ఎబులం గ్రామానికి చెందిన గొల్లోరి హరిబాబులను అరెస్టు చేశారు. రెండు వ్యాన్లతో పాటు నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన ఒకరు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి పరారయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. -
కుటుంబం కనుమరుగు.. మృత్యుంజయురాలికి మెరుగైన చికిత్స
తిరుపతి తుడా: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన ఏడుగురి మృతదేహాలను సోమవారం వారి బంధువులకు అప్పగించారు. మృత్యువును జయించిన జిషితకు తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. చిన్నారి రెండు కాళ్లకు తొడ భాగంలో ఎముకలు విరిగినట్టు గుర్తించారు. బాలికకు ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు. చిన్నారి షాక్ నుంచి తేరుకోకపోవడంతో తరచూ ఉలిక్కి పడుతోంది. కడుపు ఉబ్బడం, ఆ భాగంలో కొంతమేర నలుపెక్కడంతో వివిధ రకాల పరీక్షలు చేశారు. కడుపుపై బలమైన దెబ్బ తగలడం వల్ల లోపల ఏదైనా ఒక పార్ట్ నలగడం లేదా రక్తం గడ్డకట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. చిన్నారికి ప్రాణాపాయం లేదని డాక్టర్ మనోహర్ చెప్పారు. అమ్మానాన్నలు, అవ్వాతాతలను కోల్పోయి చికిత్స పొందుతున్న జిషిత ఆలనా పాలన మహిళా కానిస్టేబుల్ శాంతి చూస్తున్నారు. మృతదేహాల అప్పగింత మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు కారులో బయల్దేరిన మెరైన్ ఇంజనీర్ సురేష్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో ఏడుగురు మృతి చెందగా, రెండేళ్ల పాప జిషిత ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో ఫోరెన్సిక్ విభాగాధిపతి మమత ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు పర్యవేక్షణలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్డీవో కనకన రసారెడ్డి, డీఎస్పీ నరసప్ప మృతుల బంధువులతో తరచూ మాట్లాడుతూ సూచనలు ఇచ్చారు. ఏడుగురి మృతదేహాలు, నగదు, వస్తు సామగ్రిని డీఎస్పీ నరసప్ప, సీఐ శ్రీనివాసులు సమక్షంలో బంధువులకు అప్పగించారు. రెండు అంబులెన్స్‌లలో మృతదేహాలను శ్రీకాకుళం, విజయనగరంలోని వారి స్వస్థలాలకు తరలించారు. మేం కూడా వచ్చి ఉంటే బతికివారేమో.. తిరుపతికి వారితో కలిసి తాము కూడా రావాల్సి ఉందని, తక్కువ సమయం ఉండటంతో రాలేకపోయామని సురేష్‌కుమార్ తోడల్లుడు మధు చెప్పారు. వాళ్లతో కలిసి తాము కూడా వచ్చి ఉంటే అంతా బతికే వారేమోనన్నారు. అంతా కలిసి బయలుదేరి ఉంటే ప్రైవేట్ వాహనంలోనో, రైలులోనో బయల్దేరేవాళ్లమని, అలా చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. మృత్యుంజయురాలు జిషితను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. -
కృష్ణానదిపై మరో వంతెనకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నగరంపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనపై ఎన్హెచ్ఏఐ సానుకూలంగా స్పందించింది. కృష్ణానదిపై కొత్త వంతెనతో కలిపి 40 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.1,675 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జీఎస్టీ, భూసేకరణ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకున్న అనంతరం దీనిపై కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది. ఎన్‌హెచ్–16 మీద గన్నవరం ముందు నుంచే గుంటూరుకు నేరుగా చేరేందుకు విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. ప్రస్తుతం కోల్‌కతా– చెన్నై మార్గంలో వాహనాలన్నీ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారంగా తూర్పు బైపాస్ రహదారిని ప్రతిపాదించారు. తద్వారా ఎన్‌హెచ్–16 మీద వాహనాలు మరింత తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్హెచ్ఏఐ ఐదు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో డిజైన్లు రూపొందించి పరిశీలించింది. వాటిలోఒకదాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. దీని ప్రకారం గన్నవరం విమానాశ్రయానికన్నా ముందునుంచే విజయవాడకు తూర్పు దిశగా కంకిపాడు మీదుగా గుంటూరు జిల్లాలోని కాజ వరకు నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు వేస్తారు. దీన్లో భాగంగా కృష్ణానది మీద వంతెన నిర్మిస్తారు. 445 ఎకరాల సేకరణకు రూ.515 కోట్లు అవసరం విజయవాడ తూర్పు బైపాస్ రహదారి కోసం మొత్తం రూ.1,675 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల మేరకు.. 40 కి.మీ. పొడవున 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.728 కోట్లు, కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి రూ.432 కోట్లు, 445 ఎకరాల భూసేకరణకు రూ.515 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జీఎస్టీ, మైనింగ్ సెస్ కింద వచ్చే రూ.95 కోట్ల రాబడిని వదలుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. భూసేకరణ వ్యయాన్ని ఎన్హెచ్ఏఐ భరించాలని చెప్పింది. ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోందని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు తెలిపారు. -
మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ మృత్యు ఒడికి..
గంటకు 130 కిలోమీటర్ల వేగం.. సుదూర ప్రయాణంతో అలసట.. ఆపై మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న కునుకు.. అదే సమయంలో చిన్నపాటి మలుపు.. ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయిన కారు అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కొంచెం ముందుకెళ్లి కల్వర్టును ఢీకొట్టి మంటల్లో చిక్కుకుపోయింది. అప్పటికే మాటేసిన మృత్యువు ముగ్గుర్ని సజీవ దహనం చేసింది. మరో నలుగుర్ని విగత జీవులుగా మార్చింది. మొత్తంగా రెండు కుటుంబాలకు చెందిన ఏడుగుర్ని కబళించింది. తిరుపతి రూరల్/రాజాం: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తి, విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ముందు వెళ్తున్న ఆటోను కారు ఓవర్టేక్ చేయబోగా అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని వంద మీటర్ల మేర ముందుకు దూసుకెళ్లి మూడు పల్టీలు కొట్టి కల్వర్టును ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొన్న సమయంలోనే పెట్రోల్ ట్యాంక్ పగిలిపోగా.. కల్వర్టును ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మెరైన్ ఇంజనీర్ కంచా రపు సురేష్‌కుమార్ (40), అతని భార్య మీనా (33), వీరి చిన్న కుమార్తె జోష్మిక నందిత (6 నెలలు), సురేష్‌కుమార్ తండ్రి శ్రీరామమూర్తి (65), తల్లి సత్యవతి (55), మామ పైడి గోవిందరావు, అత్త హైమావతి మృత్యువాత పడ్డారు. సురేష్, మీనా దంపతుల పెద్దకుమార్తె జోషిత (2) గాయాల పాలై మృత్యువును జయించినా.. తన వాళ్లందరినీ పోగొట్టుకుని అనాథగా మిగిలింది. ఈ ఘటనలో సురేష్, తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సత్యవతి కారులోనే సజీవ దహనమయ్యారు. సురేష్ చిన్నకుమార్తె జోష్మిక నందిత, భార్య మీనా, అత్త హైమావతి, మామ గోవిందరావు గాయాల పాలై ప్రాణాలొదిలారు. ప్రమాదం జరిగిందిలా.. శ్రీకాకుళం జిల్లా మేడమర్తికి చెందిన కంచారపు శ్రీరామమూర్తి, విజయనగరం జిల్లాకు చెందిన పైడి గోవిందరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత కారులో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. సోమవారం వారికి దర్శనం స్లాట్ కేటాయించారు. ఆదివారం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాణిపాకం నుంచి తిరుమల బయలుదేరారు. అతివేగంగా వస్తున్న కారు పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరికి సమీపంలో ఐతేపల్లి వద్ద టర్నింగ్లో అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఓ వైపు కారు నుంచి వచ్చిన అగ్నికీలలకు తోడు కారు తునాతునకలై ఇనుప ముక్కలు శరీరాల్లోకి దూసుకుపోవడంతో లోపల ఉన్నవారు పెద్దపెట్టున ఆర్తనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
హరిత ‘హాయి’ వే
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయ రహదారిలో భాగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో కొంతభాగం గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌గా రూపొందనుంది. అంటే.. ఉన్న రహదారిని విస్తరించడం కాకుండా పూర్తిగా కొత్త రోడ్డును నిర్మిస్తారన్న మాట. ఇది దాదాపు 12 కి.మీ.మేర ఉండనుంది. బైపాస్‌లలో భాగంగా ఈ కొత్త రోడ్డు నిర్మాణం జరగనుంది. సాధారణంగా బైపాస్‌లు తక్కువ నిడివి తో ఉంటాయి, కానీ ఇక్కడ రెండు భారీ బైపాస్‌ల ను కిలోమీటర్ల మేర నిర్మిస్తుండటంతో, అంత మేర గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌గా మారనుంది. ఈ ఆలోచన మొయినాబాద్, చేవెళ్లలను నగర శివారు టౌన్‌షిప్‌లుగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిర్మాణాలు తొలగించాల్సిన పని లేకుండా.. నగరం నుంచి మొయినాబాద్, చేవెళ్ల మీదుగా సాగే బీజాపూర్ రోడ్డును భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందు లో 46 కి.మీ. మేర అంటే.. అప్పా కూడలి నుంచి వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ వరకు ఎన్హెచ్ఏఐ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో నాలుగు వరసలుగా విస్తరించనుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. నవంబరు 30న వాటిని తెరవాల్సి ఉంది. కానీ మరిన్ని బిడ్లు దాఖలుకు వీలుగా టెండర్ల గడువును మరో నెల పెంచారు. అయితే నగరం నుంచి అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత 25 మీటర్లు, కొన్నిచోట్ల 30 మీటర్లు వెడల్పుతో ఉంది. దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ప్రధాన రోడ్డు 45 మీటర్లు కాగా, రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరా ల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. దీన్ని రూ.897 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్నారు. ఇక్కడే రెండు భారీ బైపాస్‌లకు ప్లాన్ చేశారు. ఇప్పటికే మొయినాబాద్ ప్రాంతం బాగా విస్తరించింది. దీంతో ఉన్న రోడ్డును వెడల్పు చేయాలంటే భారీగా నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. పక్కనుంచే బైపాస్ నిర్మిద్దామంటే కావాల్సినంత స్థలం లేదు. దీంతో నాలుగు కి.మీ. దూరంగా దాదాపు నాలుగున్నర కి.మీ. మేర నాలుగు లైన్ల ప్రధాన క్యారేజ్‌వేను కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలని నిర్ణయించారు. చేవెళ్ల పట్ట ణం వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పట్టణానికి దూరంగా దాదాపు ఆరున్నర కి.మీ. మేర మరో భారీ బైపాస్‌ను గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్ తరహాలో నిర్మించబోతున్నారు. అలాగే మరోచోట చిన్న బైపాస్ రానుంది. ఇలా 46 కి.మీ ఎక్స్‌ప్రెస్ వేలో 12 కి.మీ. మేర పూర్తిగా కొత్త రోడ్డు రాబోతోంది. రెండు పట్టణాలకు మహర్దశ! నగర శివారు ప్రాంతాల్లో కొంతకాలంగా ఆధునిక కాలనీలు వెలుస్తున్నాయి. నగరానికి చేరువగా ఉన్న మొయినాబాద్, చేవెళ్లల్లో ఇప్పటికే ఫామ్‌హౌస్‌ల ఏర్పాటుతో నగరవాసుల మకాం మారుతోంది. ఈ కొత్త రోడ్డుతో ఈ దిశగా పురోగతి మరింత వేగంగా సాగుతుందని భావిస్తున్నారు. పాత రోడ్డు, కొత్త రోడ్డు మధ్య కాలనీల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది. -
లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం: సముద్ర జలాల్లో తిరగాల్సిన పడవ లారీ ఎక్కింది. ఇదేంటా... అని అంతా ఆశ్చర్యంగా చూశారు. సీన్ కట్ చేస్తే ఓ పడవను లారీపై జాతీయ రహదారి మీదుగా బిహార్ నుంచి కోల్‌కతా తరలిస్తున్నారు. ఈ లారీ నాతవలస జాతీయ రహదారిపై గురువారం ప్రయాణం చేయడంతో అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకించారు. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి -
‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట
సాక్షి, అమరావతి: రాయలసీమను శాసన రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ రాచబాట రూపొందనుంది. అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 417.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనల మేరకు ‘ఎన్‌హెచ్ 544డి’ నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదం తెలిపింది. ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయం అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్ హైవే కోసం ఎన్హెచ్ఏఐ గతంలో ప్రతిపాదించింది. అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సి ఉంది. అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములను అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇచ్చేందుకు 2018లోనే నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రాయలసీమ నుంచి శాసన రాజధాని అమరావతికి సరైన రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమను అమరావతితో అనుసంధానించే రహదారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం – అమరావతి అనుసంధానానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను రూపొందించింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహిస్తోంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనంతపురం – గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆ శాఖ ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 544డి నిర్మాణానికి ఆమోదించింది. 4 ప్యాకేజీల కింద నిర్మాణం 417.91 కిలోమీటర్ల ఈ రహదారిని రూ.9 వేల కోట్లతో నాలుగు ప్యాకేజీల కింద నిర్మించాలని నిర్ణయించారు. 1. అనంతపురం నుంచి బుగ్గ వరకు 69 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఇప్పటికే అనంతపురం నుంచి తాడిపత్రి వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. తాడిపత్రి నుంచి బుగ్గ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. అందుకోసం రూ.2,130 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను ఆమోదించారు. 2. బుగ్గ నుంచి కర్నూలు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తున్నారు. 154.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.4,550 కోట్లతో నిర్మిస్తారు. 3. గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు పేవర్డ్ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే వేగంగా కొనసాగిస్తున్నారు. 112 కిలోమీటర్ల మేర ఈ రహదారి కోసం రూ.845 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. అందులో 108.37 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గత డిసెంబరు 25నే పీసీసీ జారీచేశారు. 4. వినుకొండ నుంచి గుంటూరు వరకు 82 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం రూ.1,475 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించారు. దీనిపై డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. రాయలసీమ నుంచి అమరావతికి మెరుగైన కనెక్టివిటీ అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంతో రాయలసీమతో అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. తక్కువ వ్యయ, ప్రయాసలతో మెరుగైన ప్రయాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదించింది. డీపీఆర్ పూర్తయిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మిస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవనాలశాఖ -
జాతీయ రహదారి.. మళ్లీ అదే చోట..
మందస: జాతీయ రహదారి మరోసారి రక్తమోడింది. గత ఏడాది ఓ కారు కల్వర్టులో పడిపోయి ఐదుగురు మృతి చెందిన చోటుకు సమీపంలోనే మరో ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమల కిరణ్(35), మద్ది జాస్మిని(8) అనే ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన యలమల కిరణ్ (35), ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ గ్రామానికి చెందిన మద్ది విష్ణుప్రియ, ఆమె కుమార్తె జాస్మిని పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు స్కూటీపై వెళ్తున్నారు. కొత్తపల్లి జాతీయ రహదారి మీదుగా వీరు వెళ్తుండగా.. సింహాచలం నుంచి ఒడిశాలోని అస్కా రోడ్డు వైపు వెళ్తున్న ఓడీ02బిఎన్ 8282 అనే నంబరు గల కారు ఈ స్కూటీని బలంగా ఢీకొంది.దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. వీరిలో కిరణ్‌కు తలపై బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. విష్ణుప్రియ, జాస్మినికి తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చిన్నారి జాస్మిని మృతి చెందింది. విష్ణుప్రియ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. మందస ఎస్ఐ కోట వెంకటేష్ సంఘటనా స్థలానికి వెళ్లి, కేసు నమోదు చేశారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది ఇదే స్థలంలో ఒడిశాకు చెందిన కారు కల్వర్టులో పడిపో యి ఐదుగురు ఒడిశా వాసులు మరణించారు. తర చూ ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఈ ప్రాంతా న్ని డేంజర్ జోన్‌గా గుర్తించి, హెచ్చరికలను ఏర్పా టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలం మన్నుర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ను ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టరు బోల్తా పడింది. ట్రాక్టర్లో ఉన్నా డ్రైవర్‌తో సహ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
చెన్నై–బెంగళూరు: తగ్గనున్న 82 కి.మీ. దూరం!
పలమనేరు (చిత్తూరు జిల్లా): చెన్నై నుంచి బెంగళూరుకు మూడు గంటల్లో వెళ్లొచ్చు. బెంగళూరు నుంచి చెన్నైకి అంతే సమయంలో తిరిగి రావచ్చు. ప్రస్తుతం ఈ రెండు మహా నగరాల మధ్య ప్రయాణ సమయం 6 గంటలు ఉంటోంది. ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం మూడు గంటలకు తగ్గనుంది. కర్ణాటకలోని హోస్కోట నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వరకు 262 కిలోమీటర్ల మేర 8 లేన్ల గ్రీన్ ఫీల్ట్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.17,900 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను నాలుగు దశల్లో చేపట్టనున్నారు. ఫేజ్–1లో హోస్కోట నుంచి కర్ణాటక బోర్డర్ వరకు, ఫేజ్–2లో వి.కోట నుంచి గుడిపాల వరకు, ఫేజ్–3లో గుడిపాల నుంచి కాంచీపురం వరకు, ఫేజ్–4లో కాంచీపురం నుంచి శ్రీపెరంబదూర్ వరకు రహదారి విస్తరణ పనులు చేపడతారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట నుంచి గుడిపాల మండలం వరకు చేపట్టే ఫేజ్–2 పనులకు కేంద్రం తాజాగా రూ.4,129 కోట్లను కేటాయించింది. ప్రస్తుత ప్రయాణమిలా.. బెంగళూరు నుంచి చెన్నై మధ్య ప్రయాణించాలంటే రెండు మార్గాలున్నాయి. ఓ మార్గం బెంగళూరు నుంచి హసూరు, క్రిష్ణగిరి, వేలూరు మీదుగా (ఎన్‌హెచ్ 75) 350 కిలోమీటర్ల మేర ఉంది. రెండో మార్గం కోలారు, చిత్తూరు, వేలూరు మీదుగా 330 కిలోమీటర్లు (పాత ఎన్‌హెచ్–4). ఈ రెండు మార్గాల్లో వాహనాలు సగటున గంటకు 60 కి.మీ. వేగంతో వెళ్లినా ప్రయాణ సమయం 6 గంటలు పడుతుంది. ప్రమాద రహితంగా నిర్మాణం దీనిని 8 ట్రాక్‌ల రహదారిగా ఐదు మీటర్ల ఎత్తున నిర్మిస్తారు. రోడ్డుకు ఇరువైపులా ఏడు మీటర్ల ఫెన్సింగ్ ఉంటుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఉన్న రెండు హైవేల్లోని క్రిష్ణగిరి, హోసూర్, వేలూరు, కోలార్, నంగిళి, మొగిలిఘాట్, బంగారుపాళెం రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా ఉన్నాయి. గ్రామీణ రహదారులకు దీన్ని అనుసంధానం చేస్తారు కాబట్టి బహుళ ప్రయోజనకారిగా ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు. మామూలు రోడ్ల మాదిరి కాకుండా పాయింట్ టు పాయింట్ కర్వ్లెస్ రోడ్డుగా దీని నిర్మాణం ఉంటుంది. ఫలితంగా భారీ వాహనాలు వెళ్లినా రోడ్డు ప్రమాదాలకు పెద్దగా ఆస్కారం ఉండదు. 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే ఇలా.. బెంగళూరు సమీపంలోని హోస్కోట నుంచి వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, మెల్పాడి, రాణిపేట్, శ్రీపెరంబదూర్ వరకు 262 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఇది 8 లేన్లుగా ఉండే గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్ ప్రాజెక్టు. ఈ రహదారి కర్ణాటకలో 75.64 కి.మీ., ఏపీలో 88.30 కి.మీ., తమిళనాడులో 98.32 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందుకు సంబంధించి 2016లో ప్రాథమిక సర్వే, రూట్‌మ్యాప్ నిర్వహించారు. ఇప్పటికే 2,650 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. ప్రీ కన్స్ట్రక్షన్ పనుల కోసం రూ.1,370 కోట్లను ప్రభుత్వం గతంలో కేటాయించింది. ఫేజ్–1 పనులు కర్ణాటకలో ఇప్పటికే మొదలయ్యాయి. ఫేజ్–2 రాష్ట్రంలో చేపట్టే పనులకు కేంద్రం రూ.4,129 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మొత్తం దూరం: 262 కి.మీ. 8 లేన్ల రహదారి: 240 కి.మీ. 6 లేన్ల రహదారి: 22 కి.మీ. (ఎలివేటెడ్ రోడ్లు) మొత్తం ఇంటర్ ఎక్స్చేంజ్లు: 25 భారీ జంక్షన్: బైరెడ్డిపల్లి వద్ద 300 ఎకరాల్లో రోడ్డు మధ్యన నాటే మొక్కలు: 20 వేలు చెన్నయ్–బెంగళూరు మధ్య నిత్యం వెళ్లే గూడ్స్ వాహనాలు: 22 వేలు పాసింజర్ వాహనాలు (రోజుకు): 9,500 -
రోడ్లపై ‘రైల్వే’ బ్రేకులకు సెలవు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై ఎక్కడా ‘రైల్వే’ బ్రేకులు పడకుండా ప్రయాణం సాఫీగా సాగడానికి మార్గం సుగమమయ్యింది. రోడ్డు ప్రయాణంలో రైల్వే గేట్ల వద్ద నిరీక్షణకు ఇక ముగింపు పడనుంది. రాష్ట్రంలో వాహనాల రద్దీ అధికంగా ఉండే నాలుగు జాతీయ రహదారులపై కొత్తగా ఎనిమిది ‘రోడ్ ఓవర్ బ్రిడ్జ్’(ఆర్వోబీ)లు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో రూ. 616 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఈ ఆర్వోబీల నిర్మాణం కోసం కొన్ని చోట్ల భూ సేకరణ ప్రక్రియ పూర్తవగా, మరికొన్ని చోట్ల వేగంగా కొనసాగుతోంది. ఆర్ అండ్ బీ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేస్తున్నారు. మరికొన్నిటికి డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీలను నియమించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటన్నిటినీ నిర్మించేందుకు ఆర్ అండ్ బీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. కొత్తగా నిర్మించనున్న ఆర్వోబీల వివరాలు... అనంతపురం– కృష్ణగిరి (తమిళనాడు) మధ్య 42వ నంబర్ జాతీయ రహదారిపై ముదిగుబ్బ (అనంతపురం జిల్లా) లెవల్ క్రాసింగ్ వద్ద రూ. 70 కోట్లతో ఆర్వోబీని నిర్మిస్తారు. ఇదే జాతీయ రహదారిపైనే కదిరి పట్టణంలో లెవల్ క్రాసింగ్ వద్ద మరో ఆర్వోబీని రూ. 70 కోట్లతో నిర్మిస్తారు. వీటికోసం భూ సేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. చిత్తూరు– కడప మధ్య 40వ నంబర్ జాతీయ రహదారిపై పీలేరు లెవల్ క్రాసింగ్ వద్ద రూ. 70 కోట్లతో నిర్మించనున్న ఆర్వోబీ కోసం ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. మదనపల్లి–నాయుడుపేట మధ్య 71వ నంబర్ జాతీయ రహదారిపై చిన్న తిప్ప సముద్రం వద్ద రూ. 70 కోట్లతో, పీలేరు సమీపంలో రూ. 90 కోట్లతో, నాయుడుపేట సమీపంలోని పండ్లూరు వద్ద రూ. 50 కోట్లతో ఆర్వోబీలను నిర్మించనున్నారు. వీటి కోసం భూసేకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. గుడివాడ– మచిలీపట్నం మధ్య 165వ నంబర్ జాతీయ రహదారిపై గుడివాడ సమీపంలో పాత వంతెన స్థానంలో రూ. 73 కోట్లతో కొత్త ఆర్వోబీ నిర్మిస్తారు. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. డీపీఆర్ తయారీ కోసం ఓ కన్సల్టెన్సీని నియమించారు. విజయవాడ– భీమవరం మధ్య 165వ నంబర్ జాతీయ రహదారిపై మొంతూరు సమీపంలో పాత వంతెన స్థానంలో రూ. 123 కోట్లతో కొత్త ఆర్వోబీని నిర్మిస్తారు. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డీపీఆర్ తయారీ బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. -
నేనెవర్ని మోసం చేయలేదు.. విచారణకు సహకరిస్తా: నామా
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించాను.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్న. చైనా బార్డర్ లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోంది.. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. ఈ సంస్థను మా ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారు. ఎన్హెచ్ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చింది. కంపెనీల్లో నేను ఎండీగా లేను. నాకు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంది. 25 న ఈడీ పిలిచింది కచ్చితంగా వెళ్తాను.. నేను అన్నింటికీ సహకరిస్తాను. నేనెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో అదే విదంగా ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్న. నన్ను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారు. నా బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు. ''అంటూ పేర్కొన్నారు. ఇక కేసు విషయంలోకి వెళితే.. 2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. -
వైరల్ వీడియో: అందరు చూస్తుండగా కుప్పకూలిన హైవే రోడ్!
-
వైరల్: అందరు చూస్తుండగా కుప్పకూలిన హైవే రోడ్!
ఇటానగర్ : గతకొన్నిరోజులుగా నిప్పులు చెరిగిన భానుడు శాంతించాడు. ఇదే సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవిస్తుందేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఓ హైవే అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాల ధాటికి రాజధాని ఇటానగర్‌లో భారీ వర్షపాతానికి అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇటానగర్ గాంధీ పార్క్ జాతీయ రహదారి 415లో ఓ రోడ్డు కూలిపోయింది. అదేదో ఏళ్ల నాటి పాతరోడ్లు కూడా కాదు. ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. వర్షం దాటికి రోడ్డు కుంగిపోయి ప్రమాదం జరిగినట్లు హైవే అధికారులు తెలిపారు. మరో వైపు రోడ్డు కుప్పకూలిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మరికొంత మంది వాహనదారులు అలెర్ట్ గా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, వర్షం దాటికి జాతీయ రహదారి రోడ్డు కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై సదరు సదరు రహదారి నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిర్మించిన రోడ్డు ఇలా కుప్పకూలిపోతే ఎలా అంటూ మండిపుతున్నారు. -
చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని 415 జాతీయ రహదారి అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇటానగర్‌లోని గాంధీ పార్క్ డీ సెక్టార్ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే రహదారిపై వన్‌వేలో వాహనాలు అనుమతించడంతో ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాగా ఈ జాతీయ రహదారి ఇటానగర్-నహర్‌లాగున్‌లను కలుపుతుంది.తాజాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: మాకొద్దీ కరోనా ట్రీట్మెంట్, ప్రాణాలు పోతే పోనీ #WATCH | Arunachal Pradesh: A portion of the National Highway-415, collapses after heavy rainfall, near Indira Gandhi Park in Itanagar pic.twitter.com/CoEUOIKB7N — ANI (@ANI) May 31, 2021 -
పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ...
పిఠాపురం: రద్దీగా ఉండే 216 జాతీయ రహదారి పక్కన ఎండలో రెండేళ్ల చిన్నారి ఒంటరిగా ఏడుస్తూ ఉండటం కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారిని స్టేషన్‌కు తరలించారు. ఎవరైనా వదిలేశారా లాంటి విషయాలు తెలుసుకునేందుకు విఫలయత్నం చేశారు. దీంతో పాపను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. వారు కాకినాడ ఐసీడీఎస్ సంరక్షణకు తరలించారు. పాప వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా దూరప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఎస్సై శంకరరావు విజ్ఞప్తి చేశారు. చదవండి: అక్రమ సంబంధమే ప్రాణం తీసింది.. కష్టాల కడలి: రాత మార్చిన ‘గీత’ -
రోడ్డుపై గుంత: చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు
చందానగర్: రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నెముకకు గాయమైందని ఓ వ్యక్తి చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్‌కు చెందిన వంగల వినయ్ గత ఏడాది డిసెంబర్ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా తవ్వి వదిలేసిన గుంతలో బైక్ పడటంతో వినయ్ వెన్నెముకకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం..రహదారి పర్యవేక్షణ లేకపోవడంతో తనకు గాయమైందని దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 6న ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. ఫిర్యాదును చందానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా వినయ్ మళ్లీ ఫిర్యాదు చేశారు. 15 రోజులైనా ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 2న హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో శనివారం చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 21న హెచ్ఆర్సీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ( చదవండి: నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం ) -
యూపీలో మరో దారుణం.. నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని
షాజహాన్‌పూర్: ఒక విద్యార్థిని దాదాపు 60% కాలిన గాయాలతో, నగ్నంగా రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో ఆమె బీఏ రెండో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్చామని, ప్రస్తుతం ఆమె ఏ వివరాలు వెల్లడించే స్థితిలో లేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతు న్నామని ఎస్పీ ఆనంద్ వెల్లడించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విద్యార్థిని దుస్తులు కనిపించలేదన్నారు. ముఖం, మెడ, ఛాతి తదితర భాగాల్లో కాలిన గాయాలున్నాయని, మెడ భాగంలో వాపు ఉందని వైద్యులు వెల్లడించారు. తండ్రితో పాటు సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన యువతి మళ్లీ తిరిగి రాలేదు. మూడు గంటలకు కాలేజీ సమయం ముగిసిన తరువాత తన కోసం కాలేజ్ గేట్ వద్ద ఎదురు చూశానని, అయితే, తను రాలేదని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. సాయంత్రం ఆరు తరువాత లక్నో– బరేలీ జాతీయరహదారి పక్కన పడిపోయి ఉన్న విషయం, పోలీసులు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందన్నారు. స్వామి చిన్మయా నందకు చెందిన ముముక్షు ఆశ్రమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి సుఖ్‌దేవానంద పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఆ విద్యార్థిని చదువుతోంది. -
రూ. 820 కోట్లతో ఎన్‌హెచ్–167కె నిర్మాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కరివెను వరకు ఉన్న 122 కి.మీ. రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, మన రాష్ట్రంలోని నంద్యాల, ఆత్మకూరులను కలిపే ఈ మార్గాన్ని ‘ఎన్‌హెచ్–167 కె’ గా ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా రూ.820 కోట్లతో చేపట్టే ఈరోడ్డు నిర్మాణంలో భాగంగా సోమశిల వద్ద కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తారు. ఈ రహదారి 96 కి.మీ. తెలంగాణలో, 26 కి.మీ. ఏపీలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–తిరుపతి మధ్య 80 కి.మీ. దూరం తగ్గుతుంది. రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రం భారత్‌మాల ఫేజ్–1లో చేర్చింది. తద్వారా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు మార్గం సుగమమైంది. మారుమూల గ్రామాలకు నగరాలతో కనెక్టివిటీ పెరగనుంది. బ్రిడ్జి కమ్ బ్యారేజీగా మార్చాలని వినతి ► రూ.820 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కృష్ణానదిపై బ్రిడ్జి కమ్ రోడ్ కాకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని కర్నూలు జిల్లా వాసులు కోరుతున్నారు. ► బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణంతో రెండు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో తాగు, సాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని సాగునీటిసంఘాల అధ్యక్షులు పేర్కొంటున్నారు. ► ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక పేరుకోకుండా ఉంటుందని చెబుతున్నారు. ► 2007లో కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగి 61 మంది మరణించారు. ఆ సమయంలో ఇక్కడ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ► 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడ రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మరణం తర్వాత ఎవరూ ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. -
జనాన్ని హడలెత్తిస్తున్న బైక్ వీరుడి జులాయి వేషాలు
సాక్షి, చిత్తూరు: జాతీయ రహదారిపై ఓ యువకుడు వారం రోజులుగా బైక్‌తో సర్కస్ ఫీట్లు చేస్తూ రోడ్డుపై వెళ్లే వాళ్లని హడలెత్తిస్తున్నాడు. శాంతిపురం– రాజుపేటరోడ్డు మార్గంలో పాత యమహా బైకుతో చెలరేగిపోతున్నాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ యువకుడు తన నైపుణ్య ప్రదర్శనకు దిగుతున్నాడు. వేగంగా బైకు నడుపుతూ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి వంద మీటర్ల వరకూ దూసుకెళుతున్నాడు. (అన్నాతమ్ముళ్ల గొడవ.. కింద పడేసి) వాహనాల రద్దీ సమయంలో వాటి మధ్య నుంచి అడ్డదిడ్డంగా బైకును చాకచక్యంగా నడుపుతున్నాడు. దీంతో చూసే వారు భయంతో హడలి చస్తున్నారు. అరిచి గోల చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతే వేగంతో క్షణాల్లో మాయం అవుతున్నాడు. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు రోడ్డుపై నిఘా పెట్టి బైకు వీరున్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. -
కీలక రోడ్డు నిర్మాణాలు చేపట్టిన మేఘా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ మౌళిక సదుపాయాల సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ’ పాలుపంచుకుంటోంది. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులు పూర్తిచేసిన ఆ సంస్థ ఏపీలోని అత్యంత కీలకమైన ప్రాజెక్టులు చేపట్టింది. ఉత్తర భారతానికి, దక్షిణ భారత్ కు కీలకమైన ఏపీలోని రహదారులను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలకమైన ఈ రహదారులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించనుంది. వీటిని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వహించారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు రోడ్ల నిర్మాణంతో రవాణా వాహనాలకు సమయం, ఇంధనం ఆదా కానున్నాయి. 16వ నెంబర్ జాతీయ రహదారిలో భాగంగా చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం ఎంఈఐఎల్ చేపట్టింది. ఇది 30 కిలోమీటర్ల పొడవున్న ఆరు లేన్ల రహదారి. ఈ రోడ్ నిర్మాణం పూర్తి అయితే వాహన దారులు, ముఖ్యంగా రవాణా వాహనాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోల్ కతా నుంచి వచ్చే వాహనాలు విధిగా విజయవాడ నగరం గుండా చెన్నై వెళ్లాలి. ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్, కోల్ కతా నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు ఇక నేరుగా వెళ్లవచ్చు. అలాగే నాయుడుపేట-రేణిగుంట 71వ నెంబర్ జాతీయ రహదారి ని మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ రహదారి రెండు లేన్లలో మాత్రమే ఉంది. వాహనాల రద్దీ వల్ల నిత్యం ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌తో అటు వాహన దారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన పుణ్యక్షేతం తిరుమలకు వెళ్లే రహదారుల్లో ఇది కీలక మైంది. ఈ 57 కిలోమీటర్ల ఆరు లేన్ల రోడ్ నిర్మాణం పూర్తి అయితే అటు తిరుమలకు, ఇటు చెన్నై, అటు బెంగళూరు, రేణిగుంట విమానాశ్రయం, శ్రీకాళహస్తి దేవాలయంపై వెళ్లేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. నాయుడుపేట, రేణిగుంత జాతీయ రహదారిలోని నాయుడుపేట, రేణిగుంట, శ్రీకాళహస్తి, ఏర్పేడు పట్టణాలకు బైపాస్ రోడ్డును ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. జాతీయ రహదారి ప్రోజెక్టుల శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం తన వంతు సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఏపీ రహదారుల సమస్యలపై త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతామని, హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నెట్వర్క్ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే పలు ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఆమోదించటంతో పాటు, తాము ప్రతిపాదించే మరికొన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
హైదరాబాద్ రాకపోకలకు ‘హైవే’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కురిసిన భారీ వర్షం హైవే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగించింది. వివిధ జాతీయ రహదారులపై నగరానికి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ హైవేలపై పలుచోట్ల వరద ప్రవహిస్తుండటంతో హైదరాబాద్ చేరుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కొన్ని చోట్ల వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగరంలోకి వచ్చేలా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉంటూ వెళ్లిన పరిస్థితి కనబడింది. ఎక్కడెక్కడ ఎలా అంటే... ►జాతీయ రహదారి 44 (బెంగళూరు హైవే) అరాంఘర్–శంషాబాద్ మార్గం గగన్ పహాడ్‌లోని అప్పా చెరువు కట్ట తెగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలైతే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గగన్ పహాడ్ అండర్‌పాస్ రహదారి సగం వరకు కొట్టుకుపోయిందన్న సమాచారంతో.. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ►వరంగల్ హైవేలోని ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాచకొండ పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను ఘట్కేసర్ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్‌వైపు మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను నాగోల్, బండ్లగూడ మీదుగా ఓఆర్ఆర్ ద్వారా ఘట్‌కేసర్‌వైపు మళ్లించారు. ►నాగపూర్ హైవే మార్గంలోనూ వాహన రాకపోకలకు తిప్పలు తప్పలేదు. భారీ వర్షంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద పనులు జరుగుతున్న అండర్‌పాస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనాలను తూప్రాన్, నాచారం, గజ్వేల్, ములుగు, కిష్టాపూర్ మీదుగా మేడ్చల్ చెక్‌పోస్టుకు మళ్లించారు. తిరుగు ప్రయాణంలోనే అదే మార్గంలో వాహనాలను అనుమతించారు. ►అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెడ్డికుంట చెరువు తెగి.. విజయవాడ హైవే మార్గంలోని ఇమామ్‌గూడ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడ మరమ్మతులు చేసి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూశారు. ►శ్రీశైలం హైవేలోనూ రహదారులపై వరద నీరు ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నింపాదిగా కలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిగిలిన జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ వరద వల్ల వెతలు తప్పలేవు. రాజధానిలోనూ తిప్పలు... భారీ వర్షం వల్ల హైదరాబాద్ రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ఫ్లైఓవర్ ఎక్కకుండా సెవెన్ టూంబ్స్ రోడ్డు మీదుగా వెళ్లాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలు షేక్‌పేట, సెన్సార్ వల్లీ, ఫిల్మ్‌నగర్, బీవీబీ జంక్షన్ , బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 మీదుగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు, మలక్‌పేట ఆర్యూబీ పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలను అనుమతించకపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
మూన్నాళ్ల ముచ్చటే!
పెద్దదోర్నాల: జాతీయ రహదారులు దేశంలోని వేల కిలోమీటర్ల దూరంలోని ప్రధాన నగరాలను కలిపే రాచబాటలు. కాలాన్ని, ఇంధనాన్ని ఆదా చేసే మార్గాలు. రోజూ వందలాది వాహనాలు ఈ మార్గాల గుండా ప్రయాణికులను, సరుకులను తరలిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన జాతీయ రహదారులను నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్మించడం అధికారుల అలసత్వానికి పడుతోంది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. మండల పరిధిలోని రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో అడుగుడుగునా అధికారులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఈ మార్గంలో ఇటీవల వేసిన రోడ్డు కొద్ది రోజులకే జారి పోయింది. రాయలసీమ, కోస్తా జిల్లాలను కలిపే ప్రధానమైన రహదారిని అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకంగా నిర్మించడంపై వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు గాలికి.. మండల పరిధిలోని కర్నూలు రహదారిలో ఉన్న రోళ్లపెంట నుంచి శ్రీశైలం రోడ్డులోని శిఖరం మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు ఆయా రోడ్లు విజయవాడ పరిధిలో ఉండేవి. అయితే ఇటీవల ఆ రోడ్లను అనంతపురం పరిధిలోకి చేర్చటంతో అధికారుల పర్యవేక్షణ నామమాత్రమైంది. రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు రెండు భాగాలుగా సుమారు 34 కోట్ల రూపాయలతో ని«ర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయి. సాధారణంగా కొత్త రోడ్డు వేసే క్రమంలో పాత రోడ్డును డోజరుతో పెకిలించి ఆపై కొత్త రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల కొత్త రోడ్డుకు గ్రిప్ ఉంటుంది. కాంట్రాక్టర్లు పాత రోడ్డును పెద్దగా కదిలించకుండా ఆపైన కొత్త రోడ్డు వేశారు. దీంతో రోడ్డు వేసిన కొద్ది రోజులకే అడుగుడుగునా జారిపోయి పాత రోడ్డు దర్శనం ఇస్తుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. దీంతో హుటా హుటిన మండల పరిధిలోని యడవల్లి వరకు పలు ప్రాంతాలలో నాసిరకంగా ఉన్న రోడ్డును తొలగించి కొత్త రోడ్డును వేసేందుకు రంగం సిద్ధం చేశారు. తొలగించిన రోడ్డు కాకుండా మరి కొన్ని ప్రాంతాలలో రోడ్డు జారి పోవడంతో పాత రోడ్డే దర్శనం ఇస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల నిర్మాణ పనులను మరింత నాణ్యతా ప్రమాణాలు జోడించి చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. -
ఇక సేఫ్ జర్నీ!
డోన్: హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారి ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోగా మరెందరో క్షతగాత్రులయ్యారు. ఈ మార్గంలో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి ఉంది. డోన్ శివారులోని ప్రధాన కూడళ్లు మరింత డేంజర్‌గా మారాయి. రహదారిపై వేలాది వాహనాలతో పాటు చుటుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలతో ఆ సర్కిళ్ల వద్ద రద్దీ ఉంటుంది. ఇక్కడ ఎటు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో తెలియని పరిస్థితి. ఇలాంటి ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు అండర్ పాస్ బ్రిడ్జీలు, ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి సంబంధించినప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.107.37 కోట్ల ప్రాజెక్టుకు అనుమతి మంజూరు ప్రమాదాల నివారణకు పట్టణ శివారులోని కంబాలపాడు, కొత్తపల్లె సర్కిళ్లలో అండర్ పాస్ బ్రిడ్జీలు, కొత్తపల్లెనుంచి ఉడుములపాడు వరకు గల జాతీయ రహదారికి ఇరువైపులా 6 కి.మీ పొడవునా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వందృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విన్నవించారు కూడా. దీంతో కేంద్రం ఆయా పనులకు రూ.107.37 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చింది. పనులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)కు అప్పగించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పనులు జరిగితే ప్రమాదాల నివారణతో పాటు పట్టణం మరింత విస్తరించడానికి అవకాశముంటుందని డోన్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పొదిలి–టంగుటూరు రోడ్డుకు మహర్దశ
కొండపి: జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పున ఉన్న చెన్త్నె నేషనల్ హైవేని అనుసంధానిస్తూ పొదిలి– టంగుటూరు ఆర్అండ్బీ రహదారికి ప్రభుత్వం సుమారు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో టంగుటూరు–పొదిలి ఆర్అండ్బీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు మరో నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన దొనకొండను ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించింది. దొనకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు పొదిలి వయా కొండపి మీదుగా టంగుటూరు వద్ద కలిసే చెన్త్నె హైవేకు దొనకొండ నుంచి దూరం తగ్గనుండటంతో ప్రభుత్వం ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. దొనకొండ నుంచి ఈ రహదారి గుండా క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు దగ్గర రహదారి కావటంతో ప్రభుత్వం సింగిల్ రోడ్డుగా ఉన్న మర్రిపూడి మండలంలోని 49 కిలో మీటరు కూచిపూడి నుంచి 66 కిలో మీటరు పొదిలి వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డును 3.66 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరణ చేయనుంది. అదే విధంగా పెట్లూరులో 3 కిలోమీటర్ల మేర 5.50 మీటర్ల రోడ్డును 7 మీటర్లుగా, టంగుటూరు వద్ద ఒక కిలో మీటరు రోడ్డును విస్తరించనుంది. దీంతో పాటు మర్రిపూడి, గంగపాలెం, జాళ్లవాగువద్ద సుమారు రూ.2 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలను సైతం నిర్మించనుంది. దీంతో పొదిలి నుంచి టంగుటూరు వరకు 66 కిలో మీటర్ల ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు పూర్తయి రవాణాకు అనుకూలంగా మారుతుంది. ఈ రహదారి నిర్మాణంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కొండపి నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల ప్రజలకు ఈ రహదారి నిర్మాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టంగుటూరు – పొదిలి మధ్య మొత్తం 66 కిలో మీటర్ల దూరం ఉండగా గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొండపి నుంచి మర్రిపూడి మండలం వరకు రహదారి విస్తరణ పనులు జరిగాయి. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొనకొండ, రామాయపట్నం పోర్టును దృష్టిలో పెట్టుకుని ఈ రహదారికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో పొదిలి నుంచి నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల దూరం తగ్గటమే కాకుండా టోల్గేట్ సైతం లేకుండా రవాణాకు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు ఆనందిస్తున్నారు. ఏదేమైనా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కావటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై కొండపి ఇన్చార్జి ఏఈని వివరణ కోరగా రూ.40 కోట్లు ఎన్డీబీ నిధులు మంజూరయ్యాయని, టెండర్ దశలో ఉందని టెండర్ ప్రక్రియ అనంతరం పనులు మొదలు పెడతామన్నారు. -
రహదారిపై పెద్దపులి కలకలం
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల పరిధిలోని శాంతాపూర్ గండి పరిసరాల్లో పెద్ద పులి సంచరించింది. నేషనల్ హైవే పై పెట్రోలింగ్ కోసం వెళ్లిన జుక్కల్ పోలీసులకు పెద్దపులి కనిపించడంతో 15 నిమిషాల పాటు వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. పెద్దపులి రోడ్డు దాటేంత వరకు పోలీసులు వాహనంలోనే ఉన్నారు. జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ మండలాల్లోని అడవుల్లో రాత్రి వేళ ప్రయాణించే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని జుక్కల్ ఎస్సై ఎండీ. రఫీయోద్దిన్ సూచించారు. జాతీయ రహదారిపై పెద్దపులి సంచరించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. -
హైవేలపై సంక్రాంతి రద్దీ
చౌటుప్పల్ /కేతేపల్లి/మహబూబ్‌నగర్ నెట్వర్క్: సంక్రాంతి పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం లోని పలు జిల్లాల నుంచి అత్యధికంగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ ప్రారంభమైంది. నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్ టోల్గేట్ల వద్ద విజయవాడ మార్గంలో శనివారం కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా 16 మార్గాలు ఉండగా విజయవాడ వైపు పది ద్వారాలను తెరిచారు. యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద పాస్టాగ్ గేట్ల పనితీరు సరిగ్గా లేకపోవడంతో వాహనాదా రులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యలతో ఫాస్టాగ్ ఉన్న వాహనదారులకు టోల్ గేట్ల వద్ద రద్దీ తిప్పలు తప్పలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ -
ములుగు జాతీయ రహదారిపై సీతక్క రాస్తారోకో
-
అమల్లోకి ఫాస్టాగ్: టోల్గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్
-
హైవేల విస్తరణకు నిధులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల విస్తరణకు వార్షిక ప్రణాళికలో భాగంగా రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నేషనల్ హైవే–25లో భాగమైన నాతవలస–విజయనగరం–రాయ్‌పూర్ రోడ్డును 42 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇందుకు రూ.125 కోట్లు వెచ్చించనుంది. విజయనగరం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డు (5.8 కి.మీ.) నిర్మాణానికి రూ.48 కోట్లు కేటాయించింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డును 20 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఇందుకు రూ.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. జీలుగుమిల్లి–కొవ్వూరు మధ్య 26 కిలోమీటర్లను రూ.15 కోట్లతో విస్తరించనున్నారు. రాజమండ్రి–మధురపూడి (విమానాశ్రయం) ఎన్‌హెచ్–516 రోడ్డును రూ.35 కోట్లతో 34 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. విజయనగరం జిల్లా మానాపురం రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) అప్రోచ్ రోడ్డుకు రూ.42 కోట్లు వెచ్చి స్తారు. ప్రకాశం జిల్లా వాడరేవు–నారాయణపురం–పిడుగురాళ్ల రోడ్డును 43 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీనికి రూ.34 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే కృష్ణా జిల్లా పామర్రు–దిగమర్రు రహదారి (ఎన్‌హెచ్–165)ని రూ.12 కోట్లతో 17 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు–అమరావతి రోడ్డును 9 కిలోమీటర్లమేర రూ.18 కోట్లతో బలోపేతం చేస్తారు. వార్షిక ప్రణాళికలో రూపొందించిన వీటికి పరిపాలనా ఆమోదం కోసం పంపించామని జాతీయ రహదారుల విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ రాఘవేంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జాతీయ రహదారులకు ప్యాచ్ వర్కులు చేస్తున్నామని తెలిపారు. -
హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్
సాక్షి, కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని.. దోచుకునే కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా గుట్టును కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను గురువారం పోలీసులు వలపన్ని హైవేపై సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. దోపిడీ దొంగల ముఠాను మధ్యప్రదేశ్‌కు చెందిన కంజారా ముఠాగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి 85 మొబైల్ ఫోన్లు, పట్టుచీరలు, 2 లారీలు, మరణాయుధాలతో పాటు ఔషధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైవేపై కొరియర్ వాహనాలనే లక్ష్యంగా చేసుకుని.. దాడి చేసి కొల్లగొట్టే కంజారా ముఠా ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మార్గం..సుగమం
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కోతకు గురై దెబ్బతిన్న రహదారులను బాగు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రోడ్ల వివరాలను ఆయాశాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. శాశ్వత మరమ్మతులకు అయ్యే ఖర్చు వివరాలను సైతం ప్రతిపాదించారు. నిధుల మంజూరుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనుంది. దీంతో జిల్లాలో దెబ్బతిన్న రహదారులు బాగుపడనున్నాయి. సాక్షి ప్రతినిధి కడప : వర్షాలకు జిల్లాలోని పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ పరిధిలోని 279 కిలోమీటర్ల మేర రహదారులు కోతకు గురయ్యాయి. పనికి రాకుండా పోయాయి. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 40 కిలోమీటర్లు, రోడ్లు భవనాల శాఖ పరిధిలో 239 కిలోమీటర్లు చొప్పున రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం ప్రాంతాల్లో అధికంగా పాడయ్యాయి.వీటిని బాగు చేసేందుకు ఫ్రభుత్వం రోడ్లు భవనాలశాఖ పరిధిలో రూ. 191.57 కోట్లతో, పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో రూ. 2.95 కోట్లతో శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పంచాయతీరాజ్ పరిధిలో కడప డివిజన్లో ఐదు, రాజంపేట డివిజన్లో 23, జమ్మలమడుగు డివిజన్లో 13 రోడ్లు చొప్పున మొత్తం 41 రహదారులు వర్షాలకు దెబ్బతిన్నాయి.కడప డివిజన్లో 3.80 కిలోమీటర్లు, రాజంపేట డివిజన్లో 34.40 కిలోమీటర్లు, జమ్మలమడుగు డివిజన్లో 1.65 కిలోమీటర్లు దెబ్బతినగా వీటిని తాత్కాలికంగా బాగు చేసేందుకు కడప డివిజన్ పరిధిలో రూ. 52 లక్షలు, రాజంపేట డివిజన్ పరిధిలో రూ. 1.60 కోట్లు, జమ్మలమడుగు డివిజన్లో రూ. 43.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటిని శాశ్వత నిర్మాణం కోసం కడప డివిజన్లో రూ. 2.25 కోట్లు, రాజంపేట డివిజన్లో రూ. 30 లక్షలు, జమ్మలమడుగు డివిజన్‌లోరూ. 40 లక్షలు చొప్పున మొత్తం రూ. 2.95 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు పంచాయతీరాజ్ పరిధిలో పలు తారు రోడ్లు సైతం వర్షానికి దెబ్బతిన్నాయి. ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో చాపాడు, వెదురూరు నుంచి పెద్ద గురవలూరు వయా రామసముద్రం కొట్టాలు రహదారి 2.80 కిలోమీటర్లు కాగా, 40 మీటర్ల మేర దెబ్బతింది. ఇదే మండలంలో కుచ్చుపాప టు వెదురూరు రోడ్డు 2.70 కిలోమీటర్లు కాగా, 30 మీటర్లు పాడైంది.. ఇదే మండలంలోని కుచ్చుపాప–వెదురూరు నుంచి నరహరిపురం వరకు 2.50 కిలోమీటర్లు కాగా, 1.20 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింది. మొత్తం 1.90 కిలోమీటర్లు మేర దెబ్బతినగా, మరమ్మతులకు రూ. 15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో పై నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర రహదారులు 60.5 కిలోమీటర్ల మేర దెబ్బతినగా, మేజర్, డిస్ట్రిక్ట్ రహదారులు వివిధ విభాగాల పరిధిలో 179 కిలోమీటర్లు కలిపి మొత్తం 239 కిలోమీటర్లు పాడయ్యాయి. వీటిని తాత్కాలికంగా బాగు చేసేందుకు రూ. 38 కోట్లు అవసరమని అధికారులు అంచనాకు రాగా, శాశ్వత మరమ్మతులకు రూ. 153.57 కోట్లు అవసరమని అంచనా వేశారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు రూ. 40.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేసేందుకు రూ. 194.52 కోట్లు అవసరమని తేల్చారు. ఎక్కువగా భారీ వర్షాలు కురిసిన జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల తదితర ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణా, పెన్నా, కుందూ పరివాహక ప్రాంతాల్లోనే అధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. -
రాజమహేంద్రవరం – విజయనగరం వయా ఏజెన్సీ
సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 516 –ఇ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధమయ్యాయి. 2017లోనే ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీపీఆర్‌లు పూర్తి చేయాలని కేంద్రం గతంలో సూచించినా.. అప్పటి ప్రభుత్వం పెడచెవినే పెట్టింది. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం తాజాగా సంప్రదించగా, డీపీఆర్‌లు వెంటనే తయారు చేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. కేంద్రానికి పంపి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత రహదారికి మొత్తం ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్‌లు తయారు చేశారు. రాజమండ్రి–రంపచోడవరం, రంపచోడవరం–కొయ్యూరు, కొయ్యూరు–లంబసింగి, లంబసింగి–పాడేరు, పాడేరు–అరకు, అరకు నుంచి గౌడార్ మీదుగా శృంగవరపుకోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్‌లు తయారు చేశారు. మొత్తం 406 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. అధిక శాతం ఘాట్ రోడ్... ఈ మార్గంలో అధిక భాగం కొండ దారి నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న ఆర్అండ్బీ రహదారి అధ్వాన్నంగా ఉంది. రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా) వయా తుని, అన్నవరం, అనకాపల్లి మీదుగా 227 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించే కొత్త జాతీయ రహదారి 516– ఇ పొడవు 406 కిలోమీటర్లకు పైనే. దూరం ఎక్కువైనా పర్యాటకంగా, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కేంద్రం ఈ జాతీయ రహదారి చేపట్టినట్లు ఎన్హెచ్ఏఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా వచ్చే వారికీ ఇది వెసులుబాటుగా ఉంటుంది. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు... 516 జాతీయ రహదారి నిర్మాణానికి రూ.4 వేల కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. రెండు వరుసల రహదారి కావడంతో కిలోమీటరుకు రూ.10 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. డీపీఆర్‌లు ఆమోదం పొందితే వచ్చే ఏడాదిలో ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు మొదలవుతాయి. -
వామ్మో.. పులి
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ బెజ్జూర్ ప్రధాన రహదారిలో కొండపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పులి రోడ్డు మీదకు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. బెజ్జూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు పులి అడ్డురావడంతో అందులో ఉన్న విద్యార్థులు సెల్ఫోన్లో ఫొటోలను తీశారు. పులి సంచరిస్తుండటంతో పెంచికల్పేట్ నుంచి సలుగుపల్లి, బెజ్జూర్వెళ్లే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. – పెంచికల్పేట్ (సిర్పూర్) -
హైవే దొంగలు అరెస్ట్
నేరేడ్మెట్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ముసుగులో గుట్కా వ్యాపారులే లక్ష్యంగా జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కు పోలీసులు చెక్ పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా రాచకొండ ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా దోపిడీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.51 లక్షల నగదు, 42.62 తులాల బంగారు ఆభరణాలు, 1800 యూఎస్ డాలర్లు, రెండు కార్లు, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్.. అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఐటీ సెల్ ఎస్ఐ సురేష్, ఘట్కేసర్ డీఐ కిరణ్‌కుమార్, సిబ్బందితో కలిసి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం చెంగిచెర్ల గ్రామానికి చెందిన డ్రైవర్ అనంతుల వీరన్న(38) నాచారంలోని రాఘవేంద్రనగర్(విజయశ్రీ టవర్స్)లో నివాసముంటున్నాడు. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన మొగుళ్ల నరేష్ అలియాస్ నారి((31) మల్లాపూర్‌లోని భవానీనగర్‌లో ఉంటున్నాడు. వీరిద్దరు 2018లో నిషేధిత గుట్కా ప్యాకెట్ల వ్యాపారం చేశారు. బీదర్ నుంచి కార్లలో గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి వరంగల్, కరీంగనగర్, జనగాం జిల్లాలో అధిక లాభాలకు దుకాణదారులకు విక్రయించేవారు. ఈ క్రమంలో పాలకుర్తి, జనగాం, జమ్మికుంట పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. దాంతో ఆర్థికంగా నష్టపోయారు. ముఠాగా ఏర్పడి దోపిడీలు తర్వాత బీదర్ నుంచి గుట్కాను తీసుకువచ్చే వ్యాపారులను దోపిడీ చేయాలని పథకం వేశారు. గుట్కా విక్రయంపై నిషేధం ఉండడంతో దోపిడీ చేసినా ఫిర్యాదు చేయరనే నమ్మకంతో ఇందుకు తెగబడ్డారు. ఇందులో భాగంగా మల్లాపూర్ భవానీ నగర్లో ఉంటున్న యాదాద్రి జిల్లా బొమ్మలారామారం మండలం ఫకీర్‌గూడేనికి చెందిన ఆటో డ్రైవర్ గంగాదేవి ప్రభాకర్(28), భవానీనగర్‌కు చెందిన సేల్స్‌మేన్‌గా పనిచేసే సయ్యద్ అమీర్(22) మహ్మద్ ఫరీద్(25), నాచారంలోని మల్లాపూర్‌కు చెందిన రజనీకాంత్‌తో కలిసి ప్రధాన నిందితులు వీరన్న, నరేష్ ముఠా ఏర్పాటు చేశారు. బీదర్ నుంచి ఎవరూ, ఎప్పుడు,ఎలా గుట్కా ప్యాకెట్లు తీసుకొస్తున్నారో పరిశీలించేవారు. వరంగల్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులు కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్టు గుర్తించిన ఈ ముఠా ఈనెల 19న రాత్రి రెండు కార్లలో ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ సమీపంలో వ్యాపారుల కారును ఆపారు. తాము హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, విచారణ కోసం కూకట్‌పల్లికి రావాలని వ్యాపారులను బలవంతంగా చెంగిచెర్ల ప్రధాన రోడ్ వద్దకు తీసుకువెళ్లారు. వ్యాపారుల జేబుల్లోంచి రూ.1.50 లక్షల నగదును లాక్కు కున్నారు. మల్లాపూర్‌కు తీసుకువెళ్లి వ్యాపారుల ఏటీఎం కార్డుల నుంచి రూ.20 వేలు డ్రా చేసుకుని, రెండు బంగారు ఉంగరాలు, 1800 యూఏస్ డాలర్లు, మూడు సెల్ఫోన్లు తీసుకున్నారు. తర్వాత రూ.1.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను తీసుకెళ్లిపోయారు. బాధితులు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీకెమెరా ఫుటేజీ ఆధారంగా ఈమేరకు ఎస్ఓటీ, క్రైం, ఐటీ సెల్ పోలీసులు విచారణలో భాగంగా సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు యమ్నంపేట్ క్రాస్ రోడ్ వద్ద వీరన్న, నరేష్, గంగాదేవి ప్రభాకర్, సయ్యద్ అమీర్, మహ్మద్ ఫరీద్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఘట్కేసర్ వద్ద దోపిడీతో పాటు ఈ నెల 11న ఓఆర్ఆర్ హైవేలో పోలీసులమని కారును ఆపి, రూ.60 వేల నగదు, రెండు సెల్ఫోన్లు గుట్కా వ్యాపారిని దోపిడీ చేసినట్టు ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులు రజనీకాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసులైతే పీడీ యాక్టు గుట్కా తినడం వల్ల నోటి కేన్సర్ వస్తుంది. ఎంతోమంది ఇది తినడం వల్ల మృతి చెందుతున్నారు. నా మిత్రుల్లో కొందరు కూడా అలాగే చనిపోయారు. గుట్కా తినడం మానేయాలి. ఈ వ్యాపారం చేసే వారు వెంటనే మానేయాలి. గుట్కా విక్రయిస్తూ రెండు సార్లు కేసులైతే వారిపైపీడీ యాక్టు పెడతాం. -
జాతీయ రహదారులుగా 3,135 కి.మీ.: వేముల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు 3,135 కి.మీ రోడ్డును కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా జాతీయ రహదారులుగా ఆమోదించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వీటిలో 1,366 కి.మీలను కొత్త జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించినట్టు చెప్పారు. మిగతా 1,769 కి.మీ పొడవును జాతీయ రహదారులుగా ప్రకటించాల్సి ఉందన్నారు. ఆదివారం కౌన్సిల్ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వేసిన ప్రశ్నకు, బాలసాని లక్ష్మీనారాయణ, భానుప్రసాద్, జీవన్‌రెడ్డి, పురాణం సతీశ్ వేసిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘రిజర్వాయర్ల వద్ద టూరిజం స్పాట్లు..’ రాష్ట్రంలోని పోచారం, శ్రీరాంసాగర్, కరీంనగర్, కోదండపూర్‌తో పాటు అన్ని రిజర్వాయర్ల వద్ద టూరిజం స్పాట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిల, తదితర ప్రాంతా ల్లో టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసి, ప్రజలకు వివిధ సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా 35 హోటళ్లను నిర్వహిస్తున్నట్టు, 15 చోట్ల పర్యాటక ఆస్తులను హోటళ్ల నిర్వహణ కోసం లీజ్‌కు ఇచ్చినట్టు తెలిపారు. సభ్యులు గంగాధరగౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. -
టోల్ కట్టమన్నందుకు సిబ్బందిపై అమానుష దాడి
-
టోల్ కట్టమన్నందుకు సిబ్బందిపై అమానుష దాడి
హరియాణ : లక్షలు ఖరీదుచేసి వాహనాలు కొనుగోలు చేసే కొందరు టోల్ చెల్లించేందుకు మాత్రం తెగ ఇదైపోతారు. టోల్‌ప్లాజాలో పనిచేసే ఉద్యోగులపై ఎక్కడా లేని కోపం ప్రదర్శిస్తారు. గురుగ్రామ్‌లో నెలక్రితం టోల్ ప్లాజాలో పనిచేసే మహిళా సిబ్బందిపై ఓ వాహనదారుడి దాడి ఘటన మరువకముందే అలాంటి ఘటనే శనివారం ఉదయం చోటుచేసుకుంది. కారు టోల్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించిన ఓ ఇద్దరు అక్కడి సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దుర్భాషలాడుతూ పక్కనే ఉన్న డ్రమ్‌తో టోల్ సిబ్బందిలో ఒకరి తలపై బలంగా కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహోద్యోగులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హరియాణాలోని బహదూర్‌పూర్ వద్ద గల తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. ఇక ఈ వ్యవహారం కొనసాగుతుండగానే సదరు వాహన డ్రైవరు కారును టోల్ గేట్ దాటించేశాడు. అక్కడున్న సీసీటీవీల్లో దాడి దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. తమ విధులను అడ్డుకోవడంతోపాటు దాడులు చేస్తుండటంతో టోల్ బూత్‌లలో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని టోల్ నిర్వాహకులు వాపోతున్నారు. -
హోటల్ పేరుకు ‘దారి’ చూపింది
కర్నూలు(హాస్పిటల్): ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మంచి పేరు పెడితే అది ప్రాచుర్యమై విజయవంతం అవుతుందని భావిస్తారు. ఎంతో ఆలోచించి మంచి పేరు పెడతారు. కాగా బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇటీవల ఏర్పాటైన ఓ హోటల్‌కు రహదారే పేరు చూపింది. జాతీయ రహదారిపై ఐటీసీ ఎదురుగా ఉన్న బోర్డుతో పాటు హంద్రీ బిడ్రి దాటిన వెంటనే హైదరాబాద్‌కు 210 కిలోమీటర్ల దూరంలో ఉందని ఓ రాయి కనిపిస్తుంది. ఇదే రాయి వద్ద హోటల్ ఏర్పాటు కావడంతో నిర్వాహకులు తమ హోటల్‌కు–210 అని నామకరణం చేశారు. హోటల్‌కు తగిన పేరు కోసం వందల సంఖ్యలో పేర్లు అనుకుని చివరకు రాయిపై నెంబర్ కనిపించే సరికి అదే పేరుగా నిర్ణయించడం విశేషం. -
జాతీయ ‘రక్త’దారి..
సాక్షి, తూర్పుగోదావిరి : జాతీయ రహదారులు రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. జిల్లాలో గోపాలపురం నుంచి తుని వద్ద గల పాయకరావు పేట వరకు 140 కిలో మీటర్లు ఉన్న జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జాతీయ రహదారి గోతులమయం కావడం, రహదారుల వెంబడి మద్యం షాపుల ఏర్పాటు, ప్రమాదకర మలుపులు, గ్రామాలను కలుపుతూ వెళ్లిన జంక్షన్ల వద్ద సరైన రక్షణ ఏర్పాటు చేయకపోవడం, మద్యం మత్తులో, నిద్ర మత్తులో, లైసెన్స్ లేని డ్రైవర్లు సైతం జాతీయ రహదారులపై హేవే వాహనాలు డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా గత టీడీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారమే ప్రధాన ఆదాయంగా నిబంధనలు తుంగలో తొక్కి లైసెన్స్‌లు ఇచ్చేసింది. దీంతో మద్యం సేవించి లారీ డ్రైవర్లు, హే టెక్ బస్సు డ్రైవర్లు, ఇతర వానం డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. హైవేలపై పర్యవేక్షణ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు మాముళ్ల మత్తులో వాహనాలు తనిఖీలు నిర్వహించకుండానే వదిలి వేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే సమయంలో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించకుండా జారీ చేయడంతో రోడ్డు ప్రమాదాలకు అవి కూడా కారణమవుతున్నాయి. గత మూడేళ్లలో 1,490 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 419 మంది మృతి చెందారు. 1,653 మందికి గాయాలయ్యాయి. ఏటా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని వందలాది మంది ప్రజాలు ప్రాణాలు కోల్పోతున్నా హైవే అథారిటీ అధికారులు కళ్లు తెరవడం లేదు. గోతులను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారిలో గోతులు పడడంతో వేగంగా వెళ్లే వాహనాలు వాటిని తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు వాహనం గోతుల నుంచి తప్పించేందుకు కొంత పక్కకు తిప్పడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనం ఢీ కొని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల ఐదో తేదీ సోమవారం దివాన్‌చెరువు ఆటోనగర్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొత్త వెలుగు బంద గ్రామానికి చెందిన మరుకుర్తి శ్రీనివాస్, లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గోతులను తప్పించే క్రమంలో వెనుక వైపు నుంచి లారీ వచ్చి వారిని ఢీ కొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి పిల్లలు అనాథలయ్యారు. తాజాగా ఆదివారం జరిగిన రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజానగరం మండలం తోకాడకు చెందిన భార్యాభర్తలు రాయుడు నరసింహ మూర్తి, అతడి భార్య సత్యవతి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తమ కుమారుడు గోవింద్‌తో కలిసి బైక్‌పై శ్రీరామ్‌నగర్‌లోని బంధువుల ఇంట జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. వీరిని జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గోవిందుతో పాటు వెనుక కూర్చున భార్యాభర్తలు ఎగిరి కిందపడడంతో వారి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాలు నిత్యం హైవేలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ జంక్షన్లు జిల్లాలో జాతీయ రహదారి 140 కిలో మీటర్లు ఉండగా జాతీయ రహదారిపై నుంచి పట్టణాలు, నగరాలకు వేళ్లే మార్గాలు, అప్రోచ్ రోడ్లు, ఇతర జంక్షన్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుని పరిధిలో జగన్నాథగిరి, గవరయ్య కోనేరు సెంటర్, తేటగుంట సెంటర్, సి.ఇ చిన్నాయ పాలెం, బెండపూడి, కత్తిపూడి, రామవరం, గండేపల్లి, మల్లేపల్లి, రాజానగరం, రాజమహేంద్రవరం లాలా చెరువు, మోరంపూడి సెంటర్, బొమ్మూరు జంక్షన్, కడియం, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో డేంజర్ జంక్షన్లు ఉన్నాయి. హైవేకు అప్రోచ్ రోడ్లు ఉండడం వలన నగరాల నుంచి హైవేకు వెళ్లే మార్గాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెంటర్లలో సరైన రక్షణ చర్యలు చేపకట్టకపోవడం, జాతీయ రహదారికి సంబంధం లేకుండా బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతులు పూడుస్తున్నాం జాతీయ రహదారిలో ప్రతిరోజూ రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల శాఖ వారు బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్లు అప్రోచ్ డైవర్షన్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కడియపు లంక నుంచి దివాన్ చెరువు వరకూ ఐదు టీమ్‌లు ఏర్పాటు చేసి వర్షానికి ఏర్పడిన గోతులు యుద్ధప్రాతిపదికన పూడుస్తున్నాం. – శ్రీనివాసరావు, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ గోతులతో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహాదారి పై ఏర్పాడిన గోతుల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో పోటు అప్రోచ్ రోడ్లు, జంక్షన్లు వద్ద ఒక్క సారిగా రోడ్డు పైకి వాహనాలు వేగంగా వచ్చేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాము. డ్రంకన్ డ్రైÐŒ , వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నాము. – ఎస్. వెంకట్రావు, ట్రాఫిక్ డీఎస్పీ,రాజమహేంద్రవరం అర్బన్ -
జూడాల ఆందోళన ఉద్రిక్తం
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ)ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆరు రోజులుగా ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసనలు తెలుపుతున్న జూడాలు బుధవారం జాతీయ రహదారిపైకి వచ్చి మహానాడు రోడ్డు జంక్షన్‌ను దిగ్బంధం చేశారు. వారి ఆందోళన అర్ధగంటకు పైగా సాగడంతో నాలుగు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఆందోళన విరమించాలని కోరారు. అందుకు జూడాలు నిరాకరించడంతో బలవంతంగా వాహనాల్లో ఎక్కించి భవానీపురం, వన్‌టౌన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో ఓ జూడాపై డీసీపీ హర్షవర్ధన్ దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఐఎంఏ ప్రతినిధుల సంప్రదింపులు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ టీవీ రమణమూర్తి, డాక్టర్ మనోజ్ తదితరులు వన్‌టౌన్, భవానీపురం పోలీసుస్టేషన్లకు వెళ్లి జూడాలను వదిలివేయాలని కోరారు. వారి భవిష్యత్‌తో కూడిన అంశం కావడంతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్య సృష్టించాలని కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం వారికి లేదని చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత జూడాలను పోలీసులు వదిలివేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జూడాలు.. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలంటూ నిరసన దీక్షకు దిగారు. జూడాలను బూట్ కాలితో తన్నుతున్న టీటీడీ వీజీవో అశోక్‌కుమార్ గౌడ్ మంత్రి, కార్యదర్శులకు వినతిపత్రాలు ఎన్ఎమ్సీని రద్దు చేసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కూడిన వినతిపత్రాలను జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డికి సమర్పించారు. అలిపిరి వద్ద ఆందోళన.. రసాభాస ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. భక్తులు తిరుమలకు వెళ్లే అలిపిరి మార్గంలో రాస్తారోకో నిర్వహించడంతో మూడు గంటల పాటు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరుకుని జూడాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ వైపు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సహనం నశించి భక్తులు వైద్య విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారి అశోక్‌కుమార్ గౌడ్ వైద్య విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు కాలితో తన్నడంతో ఒక్కసారిగా జూడాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అధికారి చర్యలకు నిరసనగా మరోసారి ఆందోళనకు దిగారు. ఎంతకీ వినకపోవడంతో వారిని అరెస్టు చేసి ఎమ్మార్పల్లిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు తరలించారు. -
నితిన్ గడ్కరీని కలిసిన కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ హైవేలుగా గుర్తించాలని గడ్కరీని కోరారు. సమావేశానంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణపై గడ్కరీతో చర్చించామన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ నాశనం అయ్యాయని, జాతీయ రహదారులుగా గుర్తిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం గుంతలు కూడా పూడ్చడం లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ 8 లైన్ల రహదారిలో భాగంగా ఎల్బీనగర్ నుంచి కుత్బుల్లాపూర్ వరకు వదిలేశారని ఆరోపించారు. 3,150 కిలోమీటర్ల రహదారులను కేంద్రం జాతీయ రహదారులుగా గుర్తించిందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 1300 కిలోమీటర్ల మేర రహదారులనే జాతీయ రహదారులుగా గుర్తించిందన్నారు. అటవీ అధికారిణి అనితపై దాడి ఘటన చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుందన్నారు. పోలీసులకు ఇచ్చినట్లే అటవీ అధికారులకు సైతం లైసెన్స్డ్ ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి రాని సీఎంకు నూతన సచివాలయ భవనం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగంపై కోర్టును ఆశ్రయిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. -
పాత కక్షలతోనే ‘నడిరోడ్డు’పై హత్య
పటాన్చెరు టౌన్: పట్టపగలు జాతీయ రహదారిపై ఒక వ్యక్తిని హత్య కేసులో నిందితుడు ఖలీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్య కోసం నిందితుడు రూ.6 లక్షలు సుపారీ తీసుకున్నట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలో గత నెల 31న హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన మహబూబ్ హుస్సేన్ (25)ను నడిరోడ్డుపై కొబ్బరి బోండాల కత్తితో హత్య చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా బియ్యం రవాణా చేసే వాళ్లలో ఒక వర్గానికి, మరో వర్గానికి పడకనే లక్డారంలో గత నవంబర్‌లో జరిగిన హర్షద్ హత్యకు ప్రతీకారంగా అతడి సోదరులు మహబూబ్‌ను హత్య చేయించినట్లు తెలిసింది. నిందితులు కర్ణాటక గుల్బర్గాకు చెందిన వారుగా సమాచారం. ప్రధాన నిందితుడి నుంచి పోలీసులు ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మహబూబ్ హత్య కేసులో 10 మందికిపైగా ఉన్నారని సమాచారం. హత్య చేస్తున్న సమయంలో రోడ్డుకు అవతలి వైపు కారులో కొందరు, మరి కొందరు ద్విచక్ర వాహనాలపై ఉన్నట్లు తెలిసింది. రెండు మూడ్రోజుల్లో నిందితులను రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ రాజేశ్వర్‌రావును వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందన్నారు. నిం దితుడి అరెస్ట్‌ను ఆయన ధ్రువీకరించలేదు. -
ప్రజాధనం రోడ్డు పాలు
ఒంగోలు సిటీ:ఒంగోలు నగర శివారు అభివృద్ధిలో వేగం పుంజుకుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మార్గాల వెంట రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం వయా పోలీసు శిక్షణా కళాశాల మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ పెరగిపోయింది. ఇక్కడి మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేయడానికి అంచనాలను తయారు చేశారు. ఎన్నికలకు ముందుగా నగరపాలక సంస్థలో నిధులు ఉండడంతో ఈ మార్గంలోని మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధికి చేయడానికి నిర్ణయించారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా శిక్షణ కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులతో పాటు బాణాసంచా గోదాములు, మామిడిపాలెంకు వెళ్లే వారితో రద్దీగా మారింది. రోడ్డు వేయడం అనివార్యమైంది ఎన్నికలు కొద్ది వారాల్లోనే వస్తాయనంగా ఈ రోడ్డు పనికి హడావుడిగా టెండర్లను వేసి పనులు మొదలు పెట్టారు. అనతి కాలంలోనే రోడ్డు పని పూర్తయిందనిపించారు. రోడ్డు వేసిన కొద్ది రోజుల వరకు నిగనిగలాడింది. ఆ తర్వాత ఎండలు మొదలయ్యాయి. ఎండ వేడికి నెర్రెలు బారింది. రోడ్డుమార్గంలో అంతా పగుళ్లు వచ్చేశాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు వాహనాలు, ద్విచక్రవాహనాలు వెళ్లినా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. ద్విచక్ర వాహనం నెర్రెబారిన రోడ్డులో వెళ్లాలంటే ప్రమాదాలను తప్పించుకొని మరీ వెళ్లాల్సిందే. నిత్యం ప్రమాదాలకు హేతువుగా ఈ రోడ్డు మారింది. రూ. కోటిపైనే నెర్రెపాలు.. జాతీయ రహదారి అభివృద్ధి పనులకు సుమారు రూ.కోటిపైనే నిధులను వెచ్చించారు. వేసిన రోడ్డు వేసినట్టే దెబ్బతింది. ప్రజల డబ్బు మొత్తం వృథా అయింది. సుమారు నాలుగున్నర కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డును నిర్మించారు. మట్టి రోడ్డుపై ముందు వెట్‌మిక్స్ వేసి రోడ్డును అభివృద్ధి చేశారు. మట్టిరోడ్డుపై ఒక పొర వెట్‌మిక్స్ వేసి ఆ తర్వాత రెండు పొరలు తారు రోడ్డు వేశారు. ఈ ప్రాంతం చౌడునేల. మెతక స్వభావంతో ఉంటుంది. ఇక్కడ రోడ్డు వేయడానికి సాంకేతికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పటిష్ట పరిచి ఆ తర్వాత రోడ్డు అభివృద్ధి పనులు చేయాలి. రోడ్డు ప్రతిపాదించిన సమయానికి సమయం అంతగా లేదు. అందుబాటులో నిధులు ఉన్నాయి. ఇంకేం వెంటనే తారు పరిచి రోడ్డు వేస్తే పోలా అనుకున్నారేమో చకచకా పనులు కానిచ్చేశారు. కొద్ది రోజులకే బయటపడిన డొల్లతనం.. రోడ్డు వేసిన కొద్ది రోజులకే ఎండ వేడికి తారు మెతకబడి తారు బయటకు వచ్చింది. తారు ఉష్ణోగ్రతల దెబ్బకి బురబురలాడి పనిలోని డొల్లతనాన్ని బయటవేసింది. ఎక్కడిక్కడే రోడ్డు బద్దలుగా విరిగింది. రోడ్డు మార్గంలో పలు చోట్ల నెర్రెబారింది. ఈ ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు దర్జాగా వాహనాలు వచ్చేవి. ఇప్పుడు వాహనాలు రావాలంటే ఎక్కడ బండి పడిపోతుందోనని భయపడుతున్నారు. రోడ్డు పనిలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఎక్కడ నాణ్యతలను పాటించలేదు. కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చడానికి, అధికారులు తమ పర్సంటేజీలను దండుకొనేందుకే తూతూ మంత్రంగానే రోడ్డు పనిని కానిచ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులకు కనుమరుగు.. రానున్న కొద్దిరోజులకే రోడ్డు కనుమరుగయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎండ వేడికే నెర్రెబారిన రోడ్డు కాస్త చినుకులు పడ్డాయంటే ఇక రోడ్డు తారు లేచి పోవడం ఖాయమంటున్నారు. తేలికపాటి వర్షం కురిసినా రోడ్డుపై తారు లేచిపోతుందని అంటున్నారు. వర్షాకాలం మొదలయ్యేలోగానే రూ. కోటి రోడ్డు కన్పించకుండా పోతుందన్న వ్యాఖ్యానాలు స్థానికుల నుంచి నెలకున్నాయి. జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం మార్గంలో వేసిన రోడ్డు పనిలో నాణ్యత విషయంలో అడుగడుగునా లోపాలే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కల్పించుకొని విచారిస్తేనే రోడ్డు నాణ్యత విషయంలోని డొల్లతనం బయటపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో రెండో సారి మంత్రి అయిన నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖలైన జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాదీ, ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. 22 హరిత ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి ప్రాజెక్టులను వచ్చే వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గడ్కరీ వివరించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశాల్లో మోటారు వాహనాల బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోటారు వాహనాల సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి గడ్కరీ చెప్పారు.2017లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉందని, అయితే గత ఫిబ్రవరిలో లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడటంతో బిల్లు మురిగిపోయిందని అన్నారు. కొత్త మంత్రి వర్గం ఆమోదం లభించిన వెంటనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. -
రోడ్ల ఉపరితల నిర్మాణంలో నవశకం
సాక్షి, హైదరాబాద్: రోడ్ల ఉపరితల నిర్మాణ డిజైన్లలో అనుసరించాల్సిన నూతన పద్ధతులతోపాటు ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాన్ని ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం రూపొందించింది. సాంప్రదాయక రోడ్డు నిర్మాణ పద్ధతులతో వీటిని సరిపోల్చిన పరిశోధకులు నూతన విధానం ఆచరణ సాధ్యమని వెల్లడించారు. వీరి పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్’అనే అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. 2022 నాటికి దేశంలో 65 వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ (హెచ్) పరిశోధక బృందం రూపొందించిన నూతన నమూనా రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ నెట్వర్క్ గల రెండో దేశంగా భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గణాంకాల పరంగా ప్రస్తుతం భారత్‌లో ప్రతీ వేయి మంది పౌరులకు సగటున 4.37 కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. వీటిలో జాతీయ, గ్రామీణ, అంతర్గత రహదారుల పేరిట అనేక రకాలైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. 2 దశాబ్దాలుగా భారత్‌లో రహదారుల నిర్మాణం ఊపందుకోగా 2016 నుంచి 62.5 శాతం రహదారులకు సాంకేతిక పద్ధతిలో ఉపరితలం నిర్మించారు. ఉపరితల డిజైన్ కీలకం.. రోడ్ల నిర్మాణంలో ఉపరితల డిజైన్ అత్యంత సంక్లిష్లమైన ప్రక్రియ కాగా.. ట్రాఫిక్ రద్దీ, స్థానికంగా సహజంగా లభించే నిర్మాణ సామగ్రిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. సుఖమయమైన ప్రయాణానికి వీలుగా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉపరితల నిర్మాణ డిజైన్‌ను ఇంజనీర్లు రూపొందిస్తారు. జారుడు స్వభావం లేకుండా, రాత్రివేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పరావర్తనం చెందకుండా, శబ్ద కాలుష్యం తక్కువగా ఉండేలా రోడ్ల ఉపరితల నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం మన్నేలా నాణ్యత కలిగిన రోడ్డు ఉపరితల నిర్మాణంతోపాటు, ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాలను రూపొందించడంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ముందడుగు వేశారు. పొరలతో కూడిన ఉపరితలం.. అనుసరణీయం నేలపై వివిధ రకాల నిర్మాణ సామగ్రితో నిర్మించే పొరలపై రహదారి ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శిరీష్ సారిడే నేతృత్వంలోని పరిశోధక బృందం గుర్తించింది. సంక్లిష్టమైన పొరలతో నిర్మించే రోడ్డు ఉపరితలం నాణ్యతను నేల స్వభావం, నిర్మాణ సామగ్రి, స్థానిక పర్యావరణ, వాతావరణ పరిస్థితులు, వాహన రద్దీ తదితర అంశాలు ప్రభావితం చేస్తాయని తేల్చారు. వీటన్నింటినీ అధిగమించి రోడ్డు ఉపరితలం వాహన భారాన్ని తట్టుకునేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది. నాలుగు రకాల పొరలతో కూడిన రహదారి నిర్మాణంపై ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేల్చారు. సాధారణంగా రోడ్లను సబ్గ్రేడ్, గ్రాన్యులార్ సబ్ బేస్, బేస్, బిటుమినస్ అనే 4 రకాలైన పొరలతో నిర్మిస్తారు. వీటిలో బిటుమినస్ లేయర్ మందం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే బేస్ లేయర్‌పైనే ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధక బృందం గుర్తించింది. మరమ్మతులు కూడా సులభం అత్యంత దృఢమైన కాంక్రీట్‌తో నిర్మించే రహదారులు వాహన భారాన్ని నేరుగా మోయగలిగినా.. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. పొరలతో కూడిన రహదారుల నిర్మాణంలో స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిని వినియోగించే వీలుండటంతోపాటు, దశలవారీగా పనులు చేసే వీలుంటుంది. మరమ్మతులు చేయడం కూడా సులభమని పరిశోధకులు తేల్చారు. తాము రూపొందించిన నూతన రోడ్డు డిజైన్‌ను ‘రిలయబిలిటీ బేస్డ్ డిజైన్ ఆప్టిమైజేషన్ (ఆర్‌బీడీవో)’గా వ్యవహరిస్తున్న పరిశోధక బృందం.. తమ పరిశోధన ఫలితాలను రహదారుల ఉపరితల డిజైన్లకు మార్గదర్శిగా భావించే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అఫీషియల్స్ (ఆష్తో) ప్రమాణాలతో పోల్చి చూశారు. ఆష్తో ప్రమాణాలతో పోలిస్తే తాము రూపొందించిన నూతన విధానం 10 నుంచి 40 శాతం మేర మెరుగ్గా ఉందని పరిశోధక బృందం సభ్యులు డాక్టర్ మునావర్ బాషా, పీఆర్టీ ప్రణవ్ వెల్లడించారు. -
మృత్యుదారి
కర్నూలు, వెల్దుర్తి: హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44) ప్రమాదాలకు నిలయంగా మారింది. పలుచోట్ల డిజైనింగ్ లోపాలు, నిర్వహణ సరిగా లేకపోవడం తదితర కారణాలతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనేకమంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. శనివారం సాయంత్రం వెల్దుర్తి చెక్‌పోస్టు క్రాస్‌రోడ్డు వద్ద ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వోల్వో బస్సు.. బైక్‌ను, తుపాన్ వాహనాన్ని ఢీకొనడంతో 16 మంది మరణించిన విషయం విదితమే. ఇందుకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని చెబుతున్నప్పటికీ, వాటితో పాటు ‘హైవే’ లోపాలు కూడా ప్రమాదాలకు ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా వెల్దుర్తి ప్రాంతంలో కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు సంభవిస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డేంజర్ ‘టర్న్‌లు’ జాతీయ రహదారి నుంచి గ్రామాల్లోకి వెళ్లేందుకు, వాహనాలు రోడ్డు మారేందుకు ఏర్పాటు చేసిన యూటర్న్ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెల్దుర్తి మండల పరిధిలోని అల్లుగుండు క్రాస్, బొమ్మిరెడ్డిపల్లె క్రాస్, అమేజాన్ హోటల్ సమీప క్రాస్, వెల్దుర్తి చెక్‌పోస్ట్ క్రాస్, చెరుకులపాడు క్రాస్, డోన్ వైపు వెల్దుర్తి ఎంట్రెన్స్ క్రాస్, సూదేపల్లె క్రాస్ ఇలా.. ప్రతి యూటర్న్‌లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 25న లద్దగిరి క్రాస్ సమీపంలో మినీవ్యాన్ బోల్తా పడి ఇద్దరు దర్మరణం చెందారు. ఏప్రిల్ 28న వెల్దుర్తి అమేజాన్ హోటల్ క్రాస్‌లో బైక్ అదుపుతప్పి ఒకరు చనిపోయారు. అదేరోజు వెల్దుర్తి చెక్‌పోస్ట్ క్రాస్‌లో బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో బైక్పైనున్నఒకరు మృతి చెందారు. ఇదే ప్రాంతంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఏకంగా 16 మంది మృత్యువాత పడడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. నిర్వహణ లోపాలు.. రాంగ్‌రూట్ ప్రయాణాలు శనివారం ఘోర ప్రమాదం జరిగిన వెల్దుర్తి క్రాస్‌లో జాతీయ రహదారి డిజైన్‌లో లోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. గ్రామంలోకి ప్రవేశించే ఈ క్రాస్‌లో ఏళ్లుగా డిమాండ్ ఉన్న అండర్‌వే, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయలేదు. నిర్మించిన క్రాస్‌లోనూ సరైన సిగ్నల్స్, జీబ్రా లైన్స్, లైటింగ్ లేవు. తక్కువ దూరంలోనే డివైడర్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రమాదాలు అధికమవుతున్నాయి. వాహనదారులు సైతం దూరం తక్కువ అవుతుందన్న కారణంతో ప్రతి క్రాస్ వద్ద రాంగ్‌రూట్ ప్రయాణాలు చేస్తుండడం ప్రమాదాలకు ఊతమిస్తోంది. అల్లుగుండు క్రాస్‌లో పెట్రోల్ బంక్‌కు వెళ్లడానికి, బొమ్మిరెడ్డిపల్లెలోకి, హోటళ్లకు, పొలాలకు వెళ్లడానికి, వెల్దుర్తి చెక్‌పోస్ట్ క్రాస్‌లో లద్దగిరి, కోడుమూరు వైపు వెళ్లడానికి, నార్లాపురం గ్రామం నుంచి రావడానికి, చెరుకులపాడు, డోన్ వైపు క్రాస్‌లలో పెట్రోల్ బంక్, చెరుకులపాడు, తొగర్చెడు, హోటళ్లు, దాబాలకు వెళ్లేందుకు రాంగ్‌రూట్ ప్రయాణాలు చేస్తున్నారు. ఇక అతివేగం సర్వసాధారణమైంది. జాతీయ రహదారిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన కాంట్రాక్టర్లు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. రోడ్డు ఎగుడుదిగుడుగా ఉన్నా, నిబంధనలకనుగుణంగా లేకున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజలు, వాహనదారుల్లో మార్పు రావాలి–డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బసిరెడ్డి ప్రజలు, వాహనదారులు నిబంధనలను పాటించకపోతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వారిలో మార్పు రావాలని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) బసిరెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తి చెక్‌పోస్ట్ క్రాస్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన ఆర్టీఓ జగదీశ్వరరావుతో కలిసి పరిశీలించారు. క్రాస్‌లో రోడ్డు పొడవు, వెడల్పును కొలతలు వేయించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ రహదారుల శాఖకు తమ శాఖ ద్వారా పలు సూచనలు చేయనున్నట్లు తెలిపారు. క్రాస్‌ల వద్ద లాంగ్ రంబుల్ స్ట్రిప్స్ (మొదలు చిన్న చిన్నగా ఉంటూ వచ్చి ఆఖరుకు ఒకింత పెద్దగా ఉండే ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు), లైటింగ్ సిస్టం, సీసీ కెమెరాలు, రోడ్డు వెడల్పు, రోడ్డు పరిస్థితులు, క్రాస్‌లలో గల సమస్యలపై నివేదికలను తమ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. వారి వెంట ఎంవీఐలు శంకర్రావ్, శ్రీనివాసరావ్, రమణ, అతికా నవాజ్‌లు ఉన్నారు. అలాగే ప్రమాద సమయంలో బస్సు వేగం, బస్సులో సౌకర్యాలు, కండీషన్ తదితరాలను పోలీసు శాఖలోని టెక్నికల్ ఇన్చార్జ్ రాఘవరెడ్డి పరిశీలించారు. -
జాతీయ రహదారిపై అన్నదాతల ఆందోళన
-
దారి కాసిన ప్రమాదం
పశ్చిమగోదావరి, తణుకు : నేషనల్ హైవేపై రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న సంఘటన.. ఆగి ఉన్న వాహనాన్ని తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన మరో సంఘటన.. ఇలా పదహారో నంబర్ జాతీయ రహదారి నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో రక్తసిక్తమవుతోంది. రెండు జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళుతున్నాయి. అందులో 16వ నంబర్ జాతీయ రహదారి అత్యంత కీలకం. చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లే ఈ రహదారి మీదుగా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తాయి. జిల్లాలో మెజారిటీ ప్రాంతం ఈ రహదారి మీదే ఉంది. జిల్లాలో కలపర్రు టోల్గేట్ వద్ద నుంచి ప్రారంభమై ఏలూరు, దెందులూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా సిద్ధాంతం మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల కారణంగా ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన వాహనాల కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల అధికారులు సైతం నిర్థారించారు. మరోవైపు ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సైతం ఈ రహదారిపైనే బస్సులను ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ తంతు నడుస్తోంది. తణుకు పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డుతో పాటు సొసైటీ రోడ్డు, శర్మిష్ట జంక్షన్, తేతలి వైజంక్షన్ ఇలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతున్నారు. ఇలాంటి వాహనాలకు అడ్డుకునేందుకు రవాణా, పోలీసు శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. అడుగడుగునా లోపాలు చెన్నై నుంచి కోల్‌కతా వరకు నాలుగు లేన్లలో విస్తరించిన పదహారో నంబర్ జాతీయ రహదారి తణుకు మండలం దువ్వ నుంచి సుమారు 12 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటోంది. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా పట్టణం, గ్రామాలు విస్తరిస్తుండటంతో రోడ్డు దాటేందుకు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా సెంటర్లలో నిర్వహణ లోపం నిర్వహణ లోపం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటు చేసిన సూచికలు, హెచ్చరిక బోర్డులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పాటు ఆయా సెంటర్లలో బస్సులు, ఇతరత్రా వాహనాలు నిలిపేందుకు బస్బే పేరుతో స్థలం వదలాల్సి ఉండగా ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహన చోదకులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి 40 కిలోమీటర్లకు 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడంలేదు. దువ్వ సమీపంలోని వెంకయ్య వయ్యేరు, దువ్వ జంక్షన్, తేతలి గ్రామ జంక్షన్, తేతలి జంక్షన్, అయ్యప్పస్వామి దేవాలయం జంక్షన్, శర్మిష్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై జంక్షన్ తదితర ప్రాంతాలను ప్రమాదకర జంక్షన్లుగా గుర్తించారు. అయితే ఆయా జంక్షన్లలో రోడ్డు పక్కనే వాహనాలు ఉంచుతుండటంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చర్యలు తీసుకుంటాం.. రోడ్డు పక్కనే నిలిపి ఉంచే వాహనాలను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలపకుండా చర్యలు తీసుకుంటాం. ట్రావెల్స్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరిస్తాం. ప్రధానంగా హైవేపై వాహనాలు నిలిపి ఉంచితే కేసులు నమోదు చేస్తాం.– డీఎస్.చైతన్యకృష్ణ, సీఐ, తణుకు ట్రావెల్స్ దందా హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై వంటి పట్టణాలకు నిత్యం తణుకు పట్టణం మీదుగా ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 20 నుంచి 30 వరకు బస్సులు పట్టణంలోకి వచ్చి వెళుతుండగా మరో వందకు పైగా బస్సులు హైవే మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. తణుకు పట్టణంలోని పలువురు ట్రావెల్స్ యజమానులు బుక్కింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల్లో ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రధాన రోడ్లుపై ట్రావెల్స్ బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి దేవాలయం, టౌన్‌హాల్ కాంప్లెక్స్, సొసైటీ రోడ్డులోని కామథేను కాంప్లెక్స్, పాలిటెక్నిక్ కళాశాల సెంటర్లలో నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలుపుతున్నారు. మరోవైపు హైవేపై సైతం ట్రావెల్స్ బస్సులు విచ్చలవిడిగా నిలుపుతుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి.ప్రధాన కూడళ్లలో ఇలా బస్సులు నిలుపుతుండగా వేగంగా వచ్చే వాహనాలు గుర్తించలేకపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. -
జాతీయ రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం
తూర్పుగోదావరి, రాజానగరం: జాతీయ రహదారిపై చేపట్టిన మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతోపాటు డివైడర్‌పై ఉన్న విద్యుద్దీపాలు కూడా వెలగకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో ఆదివారం సాయంత్రం కురిసిన గాలివాన కూడా తోడవడంతో బైకులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సూర్యారావుపేట జంక్షన్ వద్ద ఆరు నెలల కిందట చేపట్టిన రహదారి మరమ్మతు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. జంక్షన్ లోనే కాకుండా చాగల్నాడు కాలువపై నిర్మించిన వంతెనపై కూడా పనులు అసంపూర్తిగా జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారిని ఆధునిక యంత్రాలతో మరమ్మతులు చేసేందుకు వీలుగా గోకి వదిలేయడం ఇప్పుడు సమస్యలకు తావిస్తోంది. వర్షానికి బైకులు స్కిడ్డయి పల్టీలు కొడుతుండడంతో పలువురికి గాయాలవుతున్నాయి. ఈ విధంగా ఆదివారం సాయంత్రం ఈ రెండు ప్రాంతాల్లో పది మంది వరకు బైకులపై నుంచి జారిపడి స్వల్పగాయాలపాలయ్యారు. అదే సమయంలో అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రగడ చిక్రీ, మరికొందరు మిత్రుల సాయంతో వారికి సహాయక చర్యలు అందించారు. వీధి దీపాలు వెలగడంతోపాటు బారికేడ్లు ఉండిఉంటే ఈ ప్రమాదాలు జరగవని బైకు నుంచి జారి పడి గాయపడిన రాజమహేంద్రవరానికి చెందిన జి.అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైవే బోర్డులో ఉన్న నంబరు చూసి రాజానగరం పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదంటూ విచారం వ్యక్తం చేశారు. -
రహదారి రాజకీయం
జాతీయ రహదారులు రానురాను అధ్వానంగా తయారవుతున్నాయి. ప్రజల అవసరాలు పెరిగినంతగా రవాణా వ్యవస్థ మెరుగుపడ లేదు. సౌకర్యవంతమైన ప్రయాణం, సరుకుల రవాణాలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇక కొత్త ప్రాజెక్టులు.. ప్రతిపాదనలను తయారు చేస్తున్నా చిత్తశుద్ధి కొరవడటంతో అడుగు ముందుకు పడటం లేదు. రకరకాల ప్రణాళికలు ఏళ్ల తరబడి ఊరిస్తూనే ఉన్నాయి. ఆర్భాటంగా ప్రకటించిన అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేదీ ఇదే దారిలో ఉంది. ఒంగోలు సిటీ: జిల్లాలో ఒంగోలు, కనిగిరి, మార్కాపురం రోడ్లు భవనాల డివిజన్ల పరిధిలో 992.260 కిమీ జాతీయ రహదారులు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రహదారులను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త ప్రాజెక్టులను చేపట్టడం, ప్రసుత్తం ఉన్న జాతీయ రహదారులను విస్తరించే పనులను వేగంగా చేయాలి. ప్రజల ఆశలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి జరగడం లేదు. జిల్లాలో మొత్తం 3,709.860 కి.మీ రహదారులు ఉంటే వీటిలో 992.260 కి.మీ మాత్రమే జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో జిల్లా ప్రధాన రహదారులు 1,794.952 కి.మీ, గ్రామీణ రహదారులు 922.648 కి.మీ ఉన్నాయి. ఇందులో సిమెంట్ కాంక్రీటు రోడ్లు 296.805 కి.మీ, తారు రోడ్లు 3,152.054 కి.మీ, మట్టిరోడ్లు 261.001 కి.మీ ఉన్నాయి. ఇంత అభివృద్ది చెందుతున్నా, పాలకులు రూ.కోట్లతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామంటున్నా ఇంకా మట్టిరోడ్లు దర్శనమిస్తున్నాయి. తారు రోడ్లలోనూ 1,376 కి.మీ వరకు దెబ్బతిన్నాయి. విపరీతమైన గుంతలు ఉన్నాయి. ఒంగోలు డివిజన్ పరిధిలోని రోడ్లయితే ఇంకా బాగా దెబ్బతిని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటే రవాణా వ్యవస్ధ ఏ పాటిగా మెరుగుపడ్తుందన్న విమర్శలు ఉన్నాయి. పర్సంటేజీలకే సరి.. జిల్లా నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మంత్రిగా పని చేసిన కాలంలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. తన అనుయాయులకు రోడ్లు కాంట్రాక్టులు ఇచ్చారని, దండిగా పర్సంటేజీలు చేతులు మారాయని, ఎమ్మెల్యేలు తాము అనుకున్న వారికి కాంట్రాక్టులు ఇప్పించి సొమ్ము చేసుకున్నారని, కొందరైతే సబ్ కాంట్రాక్టులు పొంది జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా శిద్దా రాఘవరావుపైనా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలు, కొండపి, కనిగిరి, ఎస్‌ఎన్‌పాడు, దర్శి తదితర ప్రాంతాలలో వచ్చిన రహదారుల పనుల్లో రాజకీయాలు చోటు చేసుకోవడంతో పాటు భారీగా పర్సంటేజీలు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని రహదారులు, హైవే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ప్రభలంగా ఉన్నాయి. ఆదిలోనే వదిలేసిన నివేదికలు.. హైవే ప్రాజెక్టులు రాబోతున్నాయని యంత్రాంగాన్ని హడావుడి చేశారు. చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్సులను పెట్టడం, భూసేకరణపై హడావుడి చేయడం చూసిన జనానికి ఇక హైవే ప్రాజెక్టులు వెంటనే రానున్నాయని, కష్టాలు తీరనున్నాయని భావించారు. ఇదంతా పాలపొంగేనని గమనించిన ప్రజలు టీడీపీ ప్రభుత్వంలోని పాలకుల మోసాన్ని గ్రహించారు. ⇔ దోర్నాల వద్ద టి జంక్షన్ ఆవశ్యకత ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 8 మండలాలు, 20 గ్రామాల్లో 172 ఎకరాలను సేకరించాలి. 19 గ్రామాల్లో భూసేకరణకు అవార్డు పాస్ చేశారు. ఇందు కోసం రూ.35.74 కోట్లు కేటాయించారు. కనిగిరిలో కొందరు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ ఇటీవలే పరిష్కారం అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక నష్ట పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకోవాలి. ⇔ ఒంగోలు–చీరాల ఎన్‌హెచ్‌లో 57.87 ఎకరాలను సేకరించాలి. ఆరు మండలాలు 14 గ్రామాల్లో విస్తరించి ఉంది. రూ.74.13 కోట్లు కేటాయించారు. చదలవాడతో పాటు వివిధ ప్రాంతాలలో రైతులు రోడ్డు అలైన్‌మెంట్‌పై ఆక్షేపించారు. పంచాయతీ చెరువును ఆక్రమించి రోడ్డు వేస్తున్నారని అడ్డగించారు. ఈ వివాదం నడుస్తోంది. ⇔ గిద్దలూరు–గుంటూరు సెక్షన్లో 9 మండలాలు 36 గ్రామాల్లో భూసేకరణ చేయాలి. 192.25 ఎకరాలు భూమి సేకరించాలి. ఇందులో సర్వే జరిగింది. నష్ట పరిహారం విడుదల కావాల్సి ఉంది. ⇔ అనంతపురం–గిద్దలూరు సెక్షన్ మూడు గ్రామాలలో భూసేకరణ చేయాలి. 25.71 హెక్టార్ల భూమిలో సర్వేలో చేశారు. దీనికి 3–జి నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ⇔ కర్నూలు–దోర్నాల సెక్షన్లో ఎన్‌హెచ్ అభివృద్ధి పనులకు రూ.222.12 కోట్లు అంచనా వేశారు. దోర్నాలలో మూడు గ్రామాలను కవర్ చేయాలి. నవంబర్‌లో 3–జి నోటిఫికేషన్ ఇచ్చారు. ⇔ పూరిమిట్ల–సీఎస్‌పురం వయా సీతారాంపురం హైవే 296.991 ఎకరాలను సేకరించాలి. 4 మండలాలు 32 గ్రామాల్లో సేకరించాలి. సర్వే నివేదికలు తయారవుతున్నట్లుగా చెబుతున్నారు. కడప ఎన్‌హెచ్ ఈఈ పరిశీలనలో ఉంది. ⇔ అమరావతి ఎక్స్‌ప్రెస్ పరిధిలో 1739.65 ఎకరాలు ప్రతిపాదించారు. 12 మండలాల్లో 45 గ్రామాల్లో సర్వే చేశారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్డీవోల నుంచి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ⇔ గిద్దలూరు–హైదరాబాద్ హైవే సర్వే పనులు ఇంకా ముందుకు పోలేదు. నిధుల కేటాయింపు లేదు. ఆర్భాటంగా హైవే ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసినా ఈ పనులకు నయాపైసా కేటాయించ లేదు. దోర్నాల వద్ద టి జంక్షన్ కోసం మాత్రమే నిధులు కేటాయించినా ఇందులోను పరిహారం ఇంకా ఇవ్వలేదు. దీంతో అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కలగానే మిగిలింది. ఆర్భాటపు ప్రకటనలు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలుపుతు జిల్లాలోని రహదారులను అనుసంధానం చేస్తూ రకరకాల ప్రతిపాదనలను చేశారు. వాటిని ఆర్భాటంగా ప్రకటించారు. నయాపైసా ఇవ్వకుండా, హైవే ప్రాజెక్టులను ప్రకటించిన ఘతన చంద్రబాబుదే అన్న విమర్శలు వచ్చాయి. జిల్లా ప్రధాన రహదారులను హైవే ప్రాజెక్టుల పరి«ధిలో కలపాలని ప్రతిపాదించారు. రెండేళ్ల పాటు సమీక్షలు, సర్వేలు, నివేదికలపై హడావుడి చేశారు. తీరా ఎన్నికల కోసంగా ఇవన్నీ చేస్తున్నామని ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేశారు. ఒక్క సారిగా ప్రజల కలల సౌధాన్ని కూలగొట్టారు. దావులపల్లి–దోర్నాల టి జంక్షన్ ప్రతిపాదించారు. చీరాల–ఒంగోలు, గిద్దలూరు–గుంటూరు సెక్షన్, అనంతపురం–గిద్దలూరు సెక్షన్, కర్నూలు–దోర్నాల సెక్షన్, పోరుమామిళ్ల– సీఎస్ పురం వయా సీతారాంపురం, తిరిగి సీఎస్‌పురం–సింగరాయకొండ వయా పామూరు, కందుకూరు రోడ్డు, అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే, గిద్దలూరు–హైదరాబాద్ హైవే ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇవన్నీ నిజంగానే చిత్తశుద్ధితో చేస్తే జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలకు అనుసంధానంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు ప్రయాణం సులువుగా, సౌకర్యవంతగా మారుతుంది. సరకు రవాణాలో వేగం పెరిగి వ్యాపార రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఇవన్నీ కాగితాలకే పరిమితం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ హైవే ప్రాజెక్టులను రూపొందించారన్న విమర్శలు ఉన్నాయి. -
ఉసురు తీసిన టిప్పర్.. పరారీలో డ్రైవర్
నెల్లూరు , వెంకటాచలం: మండలంలోని జాతీయ రహదారి ఆదివారం రాత్రి రక్తమోడింది. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ మోటార్‌బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన వెంకటాచలం మండలం కనుపూరు సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన షేక్ నాగూరుబాషా కుమారుడు షేక్.రియాజ్ (19), షేక్.చాంద్‌బాషా కుమారుడు ఎస్కే షాన్వాజ్ (17), షేక్ మస్తాన్ కుమారుడు ఎస్కే ఫయాజ్ (17) వరుసకు సోదరులు. రియాజ్ కొయ్య పని చేస్తుంటాడు. షాన్వాజ్ వెల్డింగ్ పనికి వెళ్లేవాడు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురూ బుజబుజనెల్లూరు నుంచి తమ బంధువుల గ్రామమైన ఇస్లాంపేటకు మోటార్‌బైక్‌పై రాత్రి ఆరు గంటల సమయంలో బయలుదేరారు. బైక్ కనుపూరు సమీపానికి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు చెల్లాచెదురుగా పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు చూసి వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ పరారీ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలంలో టిప్పర్‌ను వదిలేసి పొలాలు మీదుగా వెళ్లిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఓ డ్రైవర్ చేత టిప్పర్‌ను పక్కనపెట్టించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అంతులేని విషాదం రోడ్డు ప్రమాదంలో బుజబుజనెల్లూరుకు చెందిన యువకులు రియాజ్, షాన్వాజ్, ఫయాజ్‌లు మృతిచెందారని తెలియడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను అంబులెన్స్‌లో పోలీసు స్టేషన్ వద్దకు తీసుకువచ్చారని తెలియడంతో మృతుల కుటుంబసభ్యులు రాత్రి 8.30 గంటల సమయంలో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నవ్వుతూ ఇంటి నుంచి వెళ్లిన యువకుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటివద్దనే ఉన్న ముగ్గురు యువకులు గంటల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. సీఐ జి.శ్రీనివాసరావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీసు స్టేషన్‌కు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైవేపై నిఘా కరువు
జాతీయ రహదారిలో పోలీసు నిఘా కరువైంది. దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో హైవేపై రాకపోకలు సాగించాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు హడలెత్తుతున్నారు. కావలి నియోజకవర్గంలో హైవేపై మంగళవారం అర్ధరాత్రి రూ.4.50 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల దోపిడీ జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. హైవేపై నిఘా డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది. నెల్లూరు(క్రైమ్): జిల్లాలో కావలి నుంచి తడ వరకు 175 కి.మీ మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. 15 పోలీసు స్టేషన్లున్నాయి. రహదారిపై పోలీసు నిఘా కొరవడడంతో దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్నాయి. స్థానిక దొంగలతో పాటు అంతర్రాష్ట్ర నేరగాళ్లు రహదారి వెంబడి మాటేసి అందిన కాడికి దోచుకెళుతున్నారు. ఒక్కో సమయంలో హత్యలకు వెనుకాడడం లేదు. ప్రధానంగా విలువైన వస్తువులు (బంగారు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అల్యూమినియం, కాపర్ వైర్లు తదితరాలు) తరలించే వాహనాలను మార్గమధ్యలో అటకాయించి అందులోని వారిపై దాడి చేసి వాహనాలతో సహా దోచుకెళుతున్నారు. గతంలో ఒకటి, అరా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండగా ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. దీంతో విలువైన వస్తువులతో రహదారిలో ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ద్విచక్ర వాహనచోదుకులపైనా దాడులు అధికమయ్యాయి. కొన్ని ఘటనలు గతంలో తమిళనాడు తూత్తుకుడి నుంచి కాపర్లోడ్తో గుజరాత్‌కు బయలుదేరిన లారీని మార్గమధ్యలో అటకాయించిన దుండుగులు డ్రైవర్‌ను హతమార్చి లారీని హైజాక్ చేశారు. తడ సమీపంలో ఓ లారీలో నుంచి గృహోపకరణాలు దొంగలించారు. వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో ఓ బాంగారు వ్యాపారి కారును అటకాయించి అతనిపై దాడిచేసి రూ.3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కోవూరు సమీపంలో రూ.10 లక్షలు విలువచేసే లారీ టైర్లను దోచుకున్నారు. ఆ దిశగా పనిచేయడంలేదు జాతీయ రహదారి వెంబడి నేరాలు, ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా హైవే పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటైంది. కావలి నుంచి తడ వరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10 పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటికి జీపీఎస్ సిస్టంను అమర్చి కమాండ్ కంట్రోల్ సిస్టంకు అనుసంధానం చేశారు. ఒక్కో వాహనంలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు లేదా ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సదరు వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలి. ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా చూడాలి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తిస్తే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించాల్సి ఉంది. అయితే ఆ దిశగా పెట్రోలింగ్ వాహనాలు పనిచేయడంలేదు. సిబ్బంది వాహనాన్ని ఎక్కడో ఒకచోట నిలుపుకుని కాసులవేటలో నిమగ్నమయ్యారనే విమర్శలున్నా యి. ఇసుక, గ్రానైట్, అక్రమ రవాణా చేసే వారి నుంచి, పశువులను రవాణా చేసే వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి. పోలీ సు నిఘా వైఫల్యాన్ని పసిగట్టిన దుండగులు పోలీసు గస్తీ లేని ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జాతీయ రహదారి వెంబడి గస్తీని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. -
గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు
ఆర్మూర్: పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతులు మంగళవారం రోడ్డెక్కారు. సుమారు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిపైనే బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిషేధాజ్ఞలు విధించినప్పటికీ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది రైతులు తరలివచ్చి ఆర్మూర్ మండలం మా మిడిపల్లి చౌరస్తాలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఎర్రజొన్న క్వింటాలుకు రూ.3,500, పసుపు క్వింటాలుకు రూ.15 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని, తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఈ నెల 16న బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, వేల్పూర్ మండల కేంద్రాల్లో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి లో, ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, రైతులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వాహనాలను వేరే మార్గం నుంచి తరలించారు. -
అతివేగమే మింగేసింది..
జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి నుంచి వస్తున్న కారు హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలి దాటిన తర్వాత కోడూరుపాడు సమీపంలోని సర్కార్ జూట్ మిల్ వద్ద అదుపు తప్పి హైవే డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది. కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. రాజమహేంద్రవరం నుంచి ఇన్నోవా కారులో గురువారం రాత్రి డ్రైవర్ బుద్ధి వెంకటేశ్వరరావు అలియాస్ శ్రీను అతడి స్నేహితుడు బొడ్డు రాంబాబుతో కలసి విజయవాడ బయలుదేరాడు. విజయవాడ వెళ్లేందుకు రావులపాలెం బస్టాండ్ వద్ద ఎదురుచూస్తున్న ప్రయాణికులు గుంతక్ సంఘమేశ్వర్, శ్రీనివాసరావు, రమణారావు, జాషువను కారు ఎక్కించుకున్నారు. వాహనం హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలి దాటిన తరువాత కోడూరుపాడు సమీపంలోని సర్కార్ జూట్ మిల్స్ వద్ద అదుపు తప్పి హైవే డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న డ్రైవర్ బుద్ధి వెంకటేశ్వరరావు (25), తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన అతడి స్నేహితుడు బొడ్డు రాంబాబు(22), కారులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం బాన్సువాడకు చెందిన గుంతక్ సంఘమేశ్వర్ (23) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. విజయవాడ కోమలవిలాస్ సెంటర్‌కు చెందిన శ్రీనివాసరావు, రావులపాలేనికి చెందిన రమణారావు, గుంటూరు ఏటీ అగ్రహారంకు చెందిన జాషువా ఐన్‌స్టీన్ గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న హనుమాన్‌జంక్షన్ సీఐ ఎన్.రాజశేఖర్, వీరవల్లి ఎస్ఐ చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నిద్ర మత్తులో ప్రమాదం.. నిద్ర మత్తులో మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా వాహానాన్ని నడపటం వలనే రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి ఇన్నోవా కారును విజయవాడలో అప్పగించేందుకు బయలు దేరిన డ్రైవర్ వెంకటేశ్వరరావు తోడుగా స్నేహితుడు రాంబాబును వెంట పెట్టుకుని బయలు దేరాడు. కారు ఖాళీగా ఉండటంతో డబ్బులు వస్తాయనే ఆశతో మార్గమధ్యంలో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. డ్రైవర్ వెంకటేశ్వరరావు నిర్లక్ష్యం తన పాటు మరో ఇద్దరు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనపై వీరవల్లి ఎస్ఐ చంటిబాబు కేసు నమోదు చేశారు. -
నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు: సంక్రాంతి పండగ వేళ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంగం మండలం గాంధీ సంఘం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై-నెల్లూరు నేషనల్ హైవేపై లారీ.. బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు మద్యం సేవించినట్టుగా వారు పేర్కొన్నారు. మృతులను సంగం మండలానికి చెందిన వెంకటేశ్వర్లు(30), కొడవలూరు మండలం మండలానికి చెందిన నానా సాహెబ్(35), దగదర్తి మండలానికి చెందిన రాము(32)లుగా గుర్తించారు. -
మహిళల మానవహారం
-
సమానత్వం కోసం మానవహారం
తిరువనంతపురం: స్త్రీ–పురుష సమానత్వం కోసం కేరళలో మహిళలు కదంతొక్కారు. మంగళవారం 65వ జాతీయ రహదారిపై కాసర్‌గఢ్ నుంచి దక్షిణ కొన వరకు 620 కిలోమీటర్ల పొడవున మహిళలు మానవహారం చేపట్టారు. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ మానవహారంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా పురుషులు మానవహారం చేపట్టారు. మానవహారం ద్వారా కులం, మతం అనే అడ్డుగోడలను మహిళలు కూలదోస్తారని కేరళ ముఖ్యమంత్రి విజయన్ విశ్వాసం వ్యక్తంచేశారు. కాసరగఢ్ వద్ద ఆరోగ్య మంత్రి షిలాజా, వెలయంబలమంలో సీపీఐ జాతీయ నేత బృందాకారత్ మానవహారంలో పాల్గొన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ మానవహారానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ముందు సీఎం విజయన్ సామాజిక సంస్కర్త ’అయ్యంకాలి’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మానవహారంపై బీజేపీ కార్యకర్తల దాడి కాసర్‌గఢ్ జిల్లాలోని చెట్టుకుండ్‌లో బీజేపీ–ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మానవ హారంపై దాడికి తెగబడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్లు రువ్వడంతో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. రెండు మీడియా చానల్స్ సిబ్బందిపై దాడి చేసి ఘటనకు సంబంధించిన వీడియోలను తొలగించా ల్సిందిగా బెదిరించారు. జాతీయ రహదారిపై నిలబడి ఉన్న మహిళలకు దగ్గరలోని పొదలకు కొంతమంది నిప్పు పెట్టారని, వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులపై రాళ్ళ దాడి చేశారని జిల్లా పోలీసు అధికారి అబ్దుల్ కరీం చెప్పారు. -
జాతీయ రహదారిపై విజిలెన్స్ తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుం డా, అధికలోడుతో వెళుతున్న లారీలు, టిప్పర్లకు జరిమానా విధించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీకంఠనా«థ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, పీవీ నారాయణ, డీసీటీఓ రవికుమార్, విష్ణు, ఎంవీఐలు శ్రీనివాసరావు, సుధాకర్‌రెడ్డి, పూర్ణచంద్రరావు, ఏజీ ఆనంద్, బాలరాజు, సిబ్బంది మూడుబృందాలుగా విడిపోయారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వెంకటాచలం టోల్‌ప్లాజా, నాయుడుపేట జంక్షన్, కావలి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుండా వెళుతున్న మూడు గ్రానైట్ లారీలు, ఏడు మెటల్ లారీలు, రెండు బొగ్గు లారీలు, అధికలోడుతో వెళుతున్న క్వార్ట్జ్, ఇటుక, లారీలను నిలిపివేశా రు. ఓవర్‌లోడ్ వాహనాల నుంచి రూ 8,48,020, మైనింగ్ బిల్లులేని వాటి నుంచి రూ.35,930, అగ్రి కల్చర్ మార్కెటింగ్ రుసుము కట్టని వాహనాల నుంచి రూ.3,14,425 జరిమానా వసూలు చేశా రు. తనిఖీలు నిత్యం జరుగుతూ ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలియజేశారు. -
జాతీయ రహదారిపై స్కార్పియో బోల్తా
విశాఖపట్నం, పాయకరావుపేట: జాతీయరహదారిపై సీతారామపురం జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. పరవాడ మండలం మడకపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది అయ్యప్ప స్వాములు తూర్పుగోదావరిజిల్లా శంఖవరం సమీపంలో ఉన్న ఆంధ్ర శబరిమలలో ఇరుముడి సమర్పించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనానికి సీతారామపురం వద్ద మోటారు సైక్లిస్ట్‌ను అడ్డంగా వచ్చాడు. అతనిని తప్పించబోయి అదుపు తప్పిన స్కార్పియో రోడ్డు పక్కకు వెళ్లి పోయి, పల్టీలు కొట్టింది.ఈప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న నాగుబల్లి రాము, సానాపతి రమణ, అప్పారావు, శ్రీనులకు స్పల్పగాయాలయ్యాయి. అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన మోటారు సైక్లిస్ట్ ఉరుము రాజు, ఇతని కుమార్తె రాజకుమారిలకు కూడా స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అచ్యుతాపురం మండలం యర్రవరం గ్రామానికి చెందిన రాజు, అతని కుమార్తె రాజకుమారి ఇటుకబట్టీలో పనిచేసేందుకు సీతారామపురం వచ్చారు. పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామం వెళ్లి సాయంత్రం తిరిగి సీతారామపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియోను వీరి బైక్ పక్కగా ఢీకొట్టడం వల్ల వీరు కూడా రోడ్డుపై పడి గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బాబూరావు తెలిపారు. అయ్యప్ప దయ వల్లే ప్రాణాలు దక్కాయి... ప్రమాదం జరిగిన తీరు చూస్తే భారీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని భావిస్తారు. జాతీయరహదారిపై స్కార్పియో వాహనం రెండు పల్టీలు కొట్టింది. డివైడర్‌పైకి ఎక్కిపోయింది.ఆ సమయంలో వాహనంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయ్యప్ప దయవల్ల ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం గాని పెద్ద గాయాలు గానీ తగల్లేదని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు, వాహనం బోల్తాపడిన దృశ్యాన్ని చూసి రాకపోకలు సాగించే వారు స్థానికులు సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. చివరకి ఎవరికి ఏమీజరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
దారి చూడు.. దుమ్ము చూడు..!
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం రూరల్: జిల్లాలో ప్రధాన రహదారుల్లో ఒకటైన దేవరపల్లి– తల్లాడ జాతీయ రహదారిపై ప్రయాణం వాహనదారుల పాలిట నరకప్రాయంగా మారుతోంది. జీలుగుమిల్లి నుంచి జంగారెడ్డిగూడెం వరకు ధ్వసమైన రహదారిని మరమ్మతులు చేస్తున్నారు. అయితే మరమ్మతుల్లో భాగంగా రహదారిలో పలు ప్రాంతాల్లో లేయర్లను తొలగించారు. పలు ప్రాంతాల్లో రహదారిని పూర్తి చేయకపోవడంతో వాహనాల రాకపోకల సమయంలో లేస్తున్న దుమ్ము వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దుమ్ము లేస్తున్న సమయంలో వాహనాలు గుర్తించక ఎక్కడ ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనన్న భయంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. జంగారెడ్డిగూడెం సబ్‌స్టేషన్ వద్ద, వేగవరం బీసీ కాలనీ, జొన్నవారిగూడెం సమీపంలో రహదారిపై లేయర్ తొలగించి వదిలేశారు. దుమ్ము లేస్తున్న ఈ ప్రాంతాల్లో సంబంధిత శాఖాధికారులు కనీసం వాటర్ సర్వీసింగ్ పనులు కూడా చేయడం లేదు. దుమ్ము రేగడం వల్ల అనా రోగ్యాలకు గురికావడంతో పాటు ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తాయోన్న భయంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటిౖMðనా అధికారులు స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తయ్యేలోపు దుమ్ము రేగకుం డా వాటర్ సర్వీసింగ్ పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
బస్సు లోయలో పడి.. 20 మంది దుర్మరణం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు లోయలో పడి 20 మంది మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలోని కెలా మోత్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు బనిహల్ నుంచి రంబన్ వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రగతికి దారేది?
చిత్తూరు అర్బన్: రూ.వందల కోట్ల ప్రాజెక్టు.. 37 కి.మీ దూరం రోడ్డు.. ఇప్పటికి పూర్తయ్యింది 1.6 కి.మీ..ఉన్నది ఏడాది మాత్రమే గడువు..ఓ వైపు కలెక్టర్ నుంచి చీవాట్లు..మరోవైపు సమయం మించిపోతోంది..ఏం చేయాలి..? ఏం చేద్దాం..! ఇదీ.. చిత్తూరు వైపు జరుగుతున్న జాతీయ రహదారి పనులను సబ్ లీజుకు దక్కించుకున్న నలుగురు భాగస్వాముల ఆందోళన. అధికారమే పెట్టుబడిగా రూ.306 కోట్ల విలువైన పనులను బినామీ పేరిట సబ్ లీజుకు చేజిక్కించుకున్న చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి వ్యూహం బెడిసికొడుతోంది. చిత్తూరు మీదుగా జరుగుతున్న ఎన్‌హెచ్–4 పనులు పూర్తిగా స్తంభించడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచడం లేదు. అనుభవం లేకున్నా రూ.వందల కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే ఎటులేదన్నా రూ.50 కోట్ల వరకు మిగుల్చుకోవచ్చనుకున్న టీడీపీ ప్రజాప్రతినిధి పాచిక పారడం లేదు. జనం కంట్లో దుమ్ము.. బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెనుంచి తమిళనాడులోని రాణిపేట సరిహద్దు ఉన్న ఆంధ్ర బార్డర్ వరకు చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి నాలుగు లేన్ల విస్తరణ పనులను హైదరాబాద్‌కు చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఇందుకోసం రూ.306 కోట్లు కేటాయించింది. గాయత్రీ కంపెనీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి నాయుడు, పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు నాయుడు, మరో ఇద్దరు కలిసి ప్రాజెక్టు పనులను సబ్లీజుకు తీసుకున్నారు. ఈ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగడం లేదు. దీంతోపాటు మొదలైన పూతలపట్టు, పలమనేరు, మదనపల్లె జాతీయ రహదారుల విస్తరణ పనులు 70 శాతం పూర్తయితే చిత్తూరు ప్రోగ్రెస్ ఇందులో సగానికి కూడా చేరుకోలేదు. నిర్ణీత గడువు లోపు రోడ్డు పనులు పూర్తవుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా నిత్యం దుమ్ముధూళితో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా టీడీపీ నేతల్లో చలనం కనిపించడం లేదు. పుంజుకోని పనులు.. 37 కిలోమీటర్ల దూరం జరగాల్సిన రోడ్డు పనులు గతేడాది నవంబరు 15న ప్రారంభించారు. అగ్రిమెంటు ప్రకారం వచ్చే ఏడాది నవంబరు 14వ తేదీకి పూర్తి కావాలి. ఇప్పటివరకు రెండు నాలుగు లేన్ల రోడ్డులో 1.63 కి.మీ మాత్రమే వందశాతం పూర్తయ్యింది. చెరోవైపు అక్కడక్కడ రోడ్డు వేయడంతో సగటున 6.4కి.మీ పూర్తి చేశారు. ఈ దూరంలో 74 ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. 32 మాత్రమే పూర్తి చేశారు. ఇందుకు దశలవారీగా రూ.56.26 కోట్ల బిల్లులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయి వారం రోజులవుతోంది. చేసిన కొద్దిపాటి పనులకు బిల్లులు వస్తేనే మళ్లీ మొదలుపెట్టాలని టీడీపీ నేతలు భీష్మించుకూర్చోవడమే దీనికి ప్రధాన కారణం. కలెక్టర్ ఆగ్రహం.. ప్రతివారమూ ఎన్‌హెచ్–4 పనులను పర్యవేక్షిస్తూ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఆర్వీ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహిస్తున్నారు. గీర్వాణి ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో తీవ్రజాప్యం నెలకొనడంతో కన్సల్టెన్సీపై కలెక్టర్ మండిపడుతున్నారు. పనులను జెడ్పీ చైర్పర్సన్ సబ్లీజుకు తీసుకుని నెమ్మదిగా చేస్తుండడం వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొందని గతవారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ నటిస్తున్న టీడీపీ నేతలు ఇప్పటికైనా సామర్థ్యం ఉన్న వారికి పనులు అప్పగించి పక్కకు తప్పుకుంటారో.. చిత్తూరు అభివృద్ధికి గుదిబండగా మారతారోనని సామాన్యులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. -
కారు అపహరణ
కర్నూలు, డోన్ రూరల్: మండల పరిధిలోని జగదుర్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. టీఎస్ 14ఏ 5164 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారును ముగ్గరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బెంగుళూరుకు వెళ్లాలని ముగ్గురు వ్యక్తులు కారు బాడుగకు తీసుకున్నారని, కారు ఓనర్, కమ్ డ్రైవర్ అయిన విష్ణు బాడుగకు ఒప్పుకుని బెంగుళూరుకు వెళ్తుండగా.. డోన్ మండల పరిధిలోని జగదుర్తి గ్రామం వద్ద మూత్రం పోయడానికని దిగిన వెంటనే అతడిపై దాడి చేసి, కారు అపహరించుకుని వెళ్లారని తెలిపారు. వెంటనే తేరుకున్న విష్ణు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడని, సీఐ రాజగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. -
పోటీపడి ఏరుకున్నారు !
దొడ్డబళ్లాపురం : ఫ్రీగా వస్తే ప్రాణాలు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఈ దృశ్యాలు చూస్తే... అవును...నెలమంగల పరిధిలోని 4వ జాతీయ రహదారి మార్గంలో గుండేనహళ్లి వద్ద ఉల్లిపాయల లోడ్‌తో వెళ్తున్న లారీ నుండి కొన్ని మూటలు జారి రోడ్డుమీద చెల్లాచెదురుగా పడిపోవడంతో జనం తండోపతండాలుగా వచ్చి ఉల్లిపాయలను పోటీపడి మరీ ఏరుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా వస్తున్నా పట్టించుకోకుండా ఉల్లిపాయలు ఏరుకున్నారు. కార్లలో వెళ్లే వారు సైతం నిలిపి మరీ ఉల్లిపాయలు ఏరుకోవడం కనిపించింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
జాతీయ రహదారిపై ప్రమాదం
గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం గూడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన దావులూరి సుధాకరబాబు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య చేబ్రోలు శైలజ (40) తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటుగా మరికొందరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు శైలజ డోకిపర్రులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమె తన భర్త దావులూరి సుధాకర్‌బాబుతో కలిసి ద్విచక్ర వాహనంపై శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరారు. వీరి ముందు ఓ వ్యాన్ ప్రయాణికులతో విజయవాడ వైపునకు వెళుతోంది. అదే సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపునకు అతివేగంగా వస్తున్న కారు గూడూరు సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. వ్యాన్‌ను ఒక పక్కగా ఢీకొంటూ వచ్చి దాని వెనుక నుంచి వస్తున్న స్కూటీని కూడా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న దావులూరి సుధాకర్‌బాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న శైలజ గాలిలో ఎగిరి పక్కన ఉన్న కాలువలో పడి అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయింది. బాధితురాలిని స్థానికులు బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ద్విచక్ర వాహనం కంటే ముందుగా వ్యాన్‌ను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు బందరు మండలం సుల్తానగరానికి చెందిన మట్టా అంజమ్మ (56), సత్రంపాలెంకు చెందిన కోరశిక నాంచారయ్య (19), బందరుకోటకు చెందిన బచ్చుల వెంకన్న (45), Ðపోలాటిదిబ్బకు చెందిన మొకా చంద్రరావు (36), గూడూరు మండలం ఆకుమర్రులాకుకు చెందిన పేరే పుష్పలీల (40)గాయపడ్డారు. వీరందరికీ గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేశారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు మాత్రం కారును అక్కడే వదిలి పరారయ్యాడు. -
ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ
బుచ్చిరెడ్డిపాళెం: లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఓ లారీ అదుపు తప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన ఘటన పట్టణంలోని కామాక్షికాలనీ సమీపంలో ముంబయి జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. కృష్ణపట్నం నుంచి బొగ్గుతో వెళ్తున్న లారీ బుచ్చిరెడ్డిపాళేనికి రాగానే డ్రైవర్ కునుకు వేయడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తమయ్యేలోగా ఓ చెట్టును ఢీకొంది. పక్కనే ఇంటి ముందు భాగాన్ని ఢీకొంది. చెట్లు మొదళ్లతో సహా బయటకు వచ్చింది. ఇంటి ముందు భాగమంతా పూర్తిగా దెబ్బతింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరిగింది. లారీ బోల్తా పడింది. స్వల్పగాయాల పాలైన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటి ముందు భాగంలో ఎవరూ నిద్రించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. -
బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్
-
దేశానికి పట్టిన శని.. కాంగ్రెస్
సాక్షి, జడ్చర్ల : దేశంతో పాటు రాష్ట్రానికి పట్టిన శని అని... ఆ పార్టీ తరిమికొట్టడం ద్వారా తమిళనాడు, కేరళ, తదితర రాష్ట్రాలు బాగుపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా అదే తరహాలో ముందుకు సాగి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల మండలంలోని పల్గుగడ్డ తండాలో శుక్రవారం ఆయన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని పాలించగా ప్రజలు దగా పడ్డారని.. కేవలం నాలుగేళ్ల కాలంలో తాము అనేక అభివృద్ధి కార్యఖ్రమాలు చేపట్టామని తెలిపారు. ఇక్కడ చేపడుతున్న పథకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. నాటి శ్రీరాముడి పాలన మాదిరిగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వెల్లడించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, వైస్ ఎంపీపీ రాములు, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు ఇమ్ము, మార్కెట్ డైరెక్టర్ గోవర్దన్‌రెడ్డితో పాటు కొంగళి జంగయ్య, తావుర్యానాయక్, శ్రీకాంత్, ప్రణీల్ పాల్గొన్నారు. జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి జడ్చర్ల–కోదాడ జాతీయరహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆదేశించారు. జడ్చర్ల – మిడ్జిల్ మద్యలో జరుగుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై కాంట్రాక్టర్, ఉద్యోగులతో చర్చించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా, ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా పనులు చేపడుతూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఆయన వెంట మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యురాలు హైమావతి, తదితరులు ఉన్నారు. -
భద్రతకు దారేది?
నాలుగు రోజుల క్రితం.. ఆర్టీసీ బస్సు–రెండు లారీలు–ఓ క్వాలిస్ ఢీకొని 13 నిండు ప్రాణాలు బలయ్యాయి.. అది రాజీవ్ రహదారి ..ఈ నాలుగు వరుసల రోడ్డును అనేక లోపాలతో నిర్మించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలకు ఆస్కారమిచ్చే రోడ్డు ఇది. దీని లోటుపాట్లను కొంతమేర సరిదిద్దేందుకు రోడ్లు భవనాల శాఖ డీపీఆర్ రూపొందించి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి పంపింది. కానీ సచివాలయంలో ఆ ఫైలు మూడేళ్లుగా దుమ్ముకొట్టుకుపోతోంది. ఇక్కడ జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి! మంగళవారం.. బస్సు–లారీ ఢీకొని ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఇది వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి! ..వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ రెండు వరుసల రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించాలన్న ప్రణాళిక మూడేళ్లది. కానీ దాంతో తమకు సంబంధం లేదన్నట్టుగా మిషన్ భగీరథ అధికారులు రోడ్డును ఆనుకునే భారీ పైప్‌లైన్ నిర్మించారు. రోడ్డును విస్తరించాలంటే పైప్‌లైన్‌ను తొలగించాలి. కానీ ఎలా? ఈ ఆలోచనతోనే పనులు అటకెక్కాయి. ఇరుకురోడ్డుపై రక్తం పారుతోంది! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి రామగుండం వరకు 248 కి.మీ. మేర ఉన్న రాజీవ్ రహదారిని 2010లో రూ.1,400 కోట్లతో 4 వరుసలుగా విస్తరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను కొట్టేసి రెండు వైపులా రోడ్డు వేసి పని ముగిసిందనిపించారు. ఎక్కడా శాస్త్రీయ సర్వేకు అవకాశమే ఇవ్వకుండా నిర్లక్ష్యంగా రోడ్డును వెడల్పు చేశారు. ఇక ఆ తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సభాసంఘం వేసి విచారణకు ఆదేశించింది. నిపుణులతో కలసి రోడ్డును ఆసాంతం పరిశీలించిన సంభాసంఘం.. ఆ రోడ్డు అత్యంత నాసిరకంగా ఉందని, అనేక లోపాలున్నాయని తేల్చింది. తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రోడ్లు, భవనాల శాఖ దానికి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధికారులు రోడ్డును పరిశీలించి కొన్ని సూచనలతో ప్రభుత్వానికి మరో నివేదిక అందించారు. రూ.వెయ్యి కోట్లతో డీపీఆర్ రూపొందించి పంపారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఆ ఫైల్ తిరిగి రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవటంతో లోపాలు సరిదిద్దే పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. రోడ్లు భవనాల శాఖ చేతులెత్తేసి ఆ రోడ్డును వదిలేసింది. ఆ ప్రతిపాదనలు ఇవే... నాలుగు వరుసల రోడ్డు, మధ్యలో సెంట్రల్ మీడియన్ ఉండటంతో వాహనాల వేగం అధికంగా ఉంటుంది. ఇలాంటి రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ల మధ్య నుంచి సాగటానికి వీల్లేదు. ఇందుకు ఈ రోడ్డుపై బైపాస్‌ల నిర్మాణం ముఖ్యమని నిపుణులు తేల్చారు. శామీర్‌పేట, తుర్కపల్లి, ఒంటి మామిడి, ములుగు, గౌరారం, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, కుకునూర్‌పల్లి, దుద్దెడ, రామునిపట్ల, ఇబ్రహీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లిల్లో బైపాస్‌లు నిర్మించాలని సూచించారు. సిద్దిపేట వెలుపల సిద్దిపేట–కరీంనగర్ బై–పాస్ కూడలి వద్ద దాదాపు 800 మీటర్ల పొడవుతో నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించాలి. సిద్దిపేటలోకి వెళ్లే వాహనాలు.. బై–పాస్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు అక్కడ వేరు పడతాయి. సిద్దిపేట శివారులోని ఎల్కతుర్తి వద్ద సిద్దిపేట–వరంగల్ జంక్షన్‌పై భారీ అండర్‌పాస్ నిర్మించాలి. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పైనుంచి, ప్రధాన కారిడార్ దిగువ నుంచి ముందుకు సాగుతుంది. ఈ రోడ్డును ఆనుకుని ఉన్న 68 గ్రామాల వద్ద ప్రత్యేంగా బస్–బేలను ఏర్పాటు చేయాలి. ప్రయాణికుల బస్సులు రోడ్డుపై ఆగితే ప్రమాదాలు జరుగుతున్నందున... కొంత దిగువకు వెళ్లి ఆగుతాయి. ఇందుకోసం 20 ఎకరాలను ప్రత్యేకంగా సేకరించాల్సి ఉంది. నాలుగు లేన్ల రోడ్లలో సాధారణంగా సెంట్రల్ మీడియన్ 4.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ ఈ రోడ్డుపై 1.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాల ఫోకస్ లైట్లు డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు దాన్ని వెడల్పు చేయాలంటే రోడ్డు నుంచి విస్తరించాలి. సమన్వయం లేని ‘మిషన్’..! ప్రతి ఊరికి రక్షిత మంచినీటిని చేరవేసే మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయంలో అధికారులు అనుసరించిన తీరు కొన్ని రోడ్ల విస్తరణకు శాపంగా మారింది. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు కొనసాగించేప్పుడు మిగతా విభాగాలతో సమన్వయం అవసరం. కానీ అది లోపించింది. వరంగల్–కరీంనగర్ హైవే ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. ఈ రోడ్డుపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో నాలుగు వరుసలకు విస్తరించాలని చాలాకాలంగా అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారిగా ప్రతిపాదించారు. దీనికి కేంద్రం సమ్మతించటంతో విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి అప్పగించారు. రోడ్డును విస్తరించే యోచనలో ఉన్న విషయం అన్ని విభాగాల అధికారులకు తెలుసు. కానీ మిషన్ కాకతీయ ప్రాజెక్టు అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డు విస్తరణకు ఉద్దేశించి గతంలోనే ఆర్‌అండ్‌బీకి సేకరించి పెట్టిన వందల అడుగుల స్థలంలో పైప్లైన్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆర్అండ్బీ అధికారులు అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని చూసుకో వాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రోడ్డును విస్తరించాలంటే ఆ పైపులైన్లను తొలగించాల్సి వస్తోంది. దీన్ని తప్పించేందుకు అధికారులు కొత్త పంథాను అనుసరించేందుకు నడుం బిగించారు. పైప్‌లైన్ లేని మరోవైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి అటువైపు మాత్రమే రోడ్డును విస్తరించాలనేది ఆ ఆలోచన. దీంతో అటువైపు ఉన్న ప్రజలు, తమ భూములు ఎక్కువగా పోతున్నాయని దానికి అంగీకరించడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టేలా చేశారు. దీంతో రోడ్డు విస్తరణ పడకేసింది. అదే ఇరుకు రోడ్డు కొనసాగుతుండటం.. వాహనాల సంఖ్య ఇంకా పెరుగుతుండటంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్ లేకుండా ఉండి ఉంటే.. ఈపాటికి విస్తరణ పని మొదలై కొన్ని చోట్ల రోడ్డు విశాలంగా మారి ఉండేది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఖాజీపేట : ఖాజీపేట మండలం అగ్రహారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి పోరుమామిళ్లకు చెందిన షేక్ సర్దార్ (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుని పరిశీలించారు. జరిగిన సంఘటన రోడ్డు ప్రమాదమా లేక హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే షేక్.సర్దార్ ది ప్రకాశం జిల్లా కొమరోలు. ఇతను పోరుమామిళ్లకు చెందిన షేక్ మహబూబ్‌నిషాను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఏడాది తర్వాత నుంచి పోరుమామిళ్లలో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. 16వతేదీ రాత్రి అగ్రహారం సమీపంలోని జాతీయ రహదారిపై మృతదేహం ఉందని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ హాజీవలి పరిశీలించారు. అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. అతని జేబులోని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతని పేరు సర్దార్‌గా నిర్ధారించారు. స్వగ్రామం కొమరోలుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 16వ తేదీ ఉదయం సర్దార్ కారు తీసుకుని వస్తానని చెప్పి కడపకు వెళ్లాడు. కడపకు చేరున్న తరువాత ఫోన్ చేశాడు. తిరిగా సాయంత్రం బయలు దేరుతానని చెప్పాడు. అయితే అర్థరాత్రి భర్త చనిపోయినట్లు సమాచారం రావడంతో ఇక్కడకి వచ్చామని చెబుతోంది. మృతిపై అనేక అనుమానాలు సర్దార్ మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోరుమామిళ్లకు చెందిన వ్యక్తి ఖాజీపేట జాతీయ రహదారిపై ఎలా మృతి చెందాడన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోరుమామిళ్లకు వెళ్లాల్సిన వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడు. కారును తీసుకు వస్తానని భార్యతో చెప్పిన వాడు కారులో రావాలి.. లేదా ఇంటికి వెళ్లాలంటే ఏదైనా వాహనంలో కానీ బస్సులో కానీ వెళ్లాలి. కానీ వాహనంలో వచ్చినట్లు కనిపించడంలేదు.. అతను ఖాజీపేట జాతీయ రహదారిపై ఎందుకు ఉన్నాడు.. ప్రమాదం జరిగిన సమయంలో శరీరంపై చొక్కాలేదు. చెప్పులు దూరంగా పడి ఉన్నాయి. మృతుడి తలపై నుంచి వాహనం వెళ్లడంతో తల పూర్తిగా ఛిద్రమైంది. ఎవ్వరైనా అతనిపై దాడిచేసి ఇక్కడ పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.