
చిన్నారిని లాలిస్తున్న మహిళా కానిస్టేబుల్ శాంతి
తిరుపతి తుడా: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన ఏడుగురి మృతదేహాలను సోమవారం వారి బంధువులకు అప్పగించారు. మృత్యువును జయించిన జిషితకు తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. చిన్నారి రెండు కాళ్లకు తొడ భాగంలో ఎముకలు విరిగినట్టు గుర్తించారు. బాలికకు ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు.
చిన్నారి షాక్ నుంచి తేరుకోకపోవడంతో తరచూ ఉలిక్కి పడుతోంది. కడుపు ఉబ్బడం, ఆ భాగంలో కొంతమేర నలుపెక్కడంతో వివిధ రకాల పరీక్షలు చేశారు. కడుపుపై బలమైన దెబ్బ తగలడం వల్ల లోపల ఏదైనా ఒక పార్ట్ నలగడం లేదా రక్తం గడ్డకట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. చిన్నారికి ప్రాణాపాయం లేదని డాక్టర్ మనోహర్ చెప్పారు. అమ్మానాన్నలు, అవ్వాతాతలను కోల్పోయి చికిత్స పొందుతున్న జిషిత ఆలనా పాలన మహిళా కానిస్టేబుల్ శాంతి చూస్తున్నారు.
మృతదేహాల అప్పగింత
మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు కారులో బయల్దేరిన మెరైన్ ఇంజనీర్ సురేష్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో ఏడుగురు మృతి చెందగా, రెండేళ్ల పాప జిషిత ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో ఫోరెన్సిక్ విభాగాధిపతి మమత ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు పర్యవేక్షణలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్డీవో కనకన రసారెడ్డి, డీఎస్పీ నరసప్ప మృతుల బంధువులతో తరచూ మాట్లాడుతూ సూచనలు ఇచ్చారు. ఏడుగురి మృతదేహాలు, నగదు, వస్తు సామగ్రిని డీఎస్పీ నరసప్ప, సీఐ శ్రీనివాసులు సమక్షంలో బంధువులకు అప్పగించారు. రెండు అంబులెన్స్‌లలో మృతదేహాలను శ్రీకాకుళం, విజయనగరంలోని వారి స్వస్థలాలకు తరలించారు.
మేం కూడా వచ్చి ఉంటే బతికివారేమో..
తిరుపతికి వారితో కలిసి తాము కూడా రావాల్సి ఉందని, తక్కువ సమయం ఉండటంతో రాలేకపోయామని సురేష్‌కుమార్ తోడల్లుడు మధు చెప్పారు. వాళ్లతో కలిసి తాము కూడా వచ్చి ఉంటే అంతా బతికే వారేమోనన్నారు. అంతా కలిసి బయలుదేరి ఉంటే ప్రైవేట్ వాహనంలోనో, రైలులోనో బయల్దేరేవాళ్లమని, అలా చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. మృత్యుంజయురాలు జిషితను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment