ruya hospital
-
AP: ప్రేమోన్మాది దాడి.. యువతి పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతిపై దాదాపు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.వివరాల ప్రకారం..‘వేముల మండలం కొత్తపల్లికి చెందిన షర్మిలపై శనివారం సాయంత్రం ప్రేమోన్మాది కులాయప్ప దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదని షర్మిలపై 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో, బాధితురాలు.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను శనివారం రాత్రి పులివెందుల నుంచి కడప రిమ్స్‌కు తరలించారు.అయితే, షర్మిల.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప నుండి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో దాడికి పాల్పడిన కులాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి తర్వాత కులాయప్ప పరారీలో ఉన్నాడు. -
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అన్నమయ్య: ఘోర ప్రమాదంతో జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం.. లారీతో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున పీలేరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు.. బాధితులను కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక బెల్గాం జిల్లా అత్తిని మండలం బడచిగ్రామానికి చెందిన 14 మంది.. తిరుమల దర్శనం కోసం ఓ తుఫాన్ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా.. తెల్లవారు మూడు గంటల సమయంలో మఠంపల్లి క్రాస్(కె.వి పల్లి మండలం) వద్ద వాళ్ల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని తొలుత పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ దుర్గాప్రశాంతి మృతి కేసులో మిస్టరీ వీడింది. దుర్గాప్రశాంతిది హత్యగా పోలీసులు తేల్చారు. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు చక్రవర్తి నోరు విప్పడంతో అసలు విషయం బయటపడింది. కొద్దిరోజులుగా తనను పక్కకు పెట్టడం, పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ రావడంతోనే దుర్గాప్రశాంతిని చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇక్కడ ఆస్పత్రిలో కోలుకున్న చక్రవర్తి ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోచేతితో గొంతుబిగించి.. చిత్తూరుకు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమార్తె దుర్గాప్రశాంతికి, తెలంగాణలోని కొత్తగూడేనికి చెందిన చక్రవర్తికి ఫేస్బుక్ ద్వారా రెండేళ్లుగా పరిచయం ఉంది. దుర్గాప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చక్రవర్తి భద్రాచలంలో ఉన్న తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి దుకాణం తెరచి ఇక్కడే ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు కాస్త సమయం కావాలని దుర్గాప్రశాంతి కోరేది. వారం రోజులుగా వారి మధ్య విభేదాలొచ్చా యి. తనకు ఫోన్ చేయవద్దని, పెళ్లి ఇప్పుడే వ ద్దని ఆమె స్పష్టం చేసింది. ఈ మాటలను పట్టించుకోని చక్రవర్తి నిత్యం ఫోన్లు చేస్తుండటంతో తన మొబైల్ చాట్స్ అన్నీ డిలీట్ చేయాలని చక్రవర్తికి చెప్పి అతడి మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసింది. తనను ఎందుకు పక్కకు పెట్టావని ప్రశ్నిస్తూ, పెళ్లి చేసుకోమని కోరుతూ చక్రవర్తి మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మెయిల్ నుంచి దుర్గాప్రశాంతికి ఎని మిది పేజీల లేఖ రాశాడు. దీనికి ఆమె సమాధానం ఇవ్వలేదు. మధ్యాహ్నం ఆమె బ్యూటీపార్లర్‌లో ఉంటుందని తెలిసిన చక్రవర్తి 12.30 గంటల ప్రాంతంలో పార్లర్‌లోకి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా దుర్గాప్రశాంతి అంగీకరించలేదు. దీంతో ఓ బ్లేడ్ తీసుకుని చేయి కోసుకున్నాడు. భయపడిన దుర్గ పార్లర్ నుంచి బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నించింది. వెంటనే తన మోచేతితో దుర్గ గొంతును ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరంతో ఉన్న చక్రవర్తి పట్టు నుంచి దుర్గాప్రశాంతి తప్పించుకోలేక.. ఊపిరాడక క్షణాల్లో ప్రాణాలొదిలింది. దీంతో భయపడిన నిందితుడు తాను కూడా చనిపోవాలని బ్లేడుతో గొంతు, చేయి, శరీరంపై కోసుకుని తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. దిశ పోలీసుల దర్యాప్తు ఈ కేసును చిత్తూరు దిశ పోలీసులకు అప్పగిస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వన్‌టౌన్ పోలీసుల వద్ద ఉన్న సమాచా రాన్ని దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్ తీసుకున్నారు. దిశ సీఐ బాలయ్యతో కలిసి వైద్యులచే దుర్గాప్రశాంతి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు చక్రవర్తిపై హత్య, అట్రాసిటీ, ఆత్మహత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
తిరుపతి జిల్లా: పూడి క్రాస్ వద్ద ఆర్టీసి బస్సు బోల్తా
-
హృదయం పదిలం
సాక్షి, అమరావతి: సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా హృద్రోగ మరణాలను నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాపాయ పరిస్థితిని తప్పించవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్.టి. ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) కార్యక్రమాన్ని అమలు చేసేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించింది. సాధారణ పరిభాషలో స్టెమీ అంటే గుండె రక్తనాళాలు 100 శాతం పూడుకుపోవడంతో వచ్చే గుండెపోటు. ఇలాంటి సందర్భాల్లో ఆరు గంటల్లోగా లక్షణాలను గుర్తించి పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్) అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. రాష్ట్రంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 32.4 శాతం హృదయ సంబంధిత వ్యాధులే కారణం. 38 లక్షల మందికి పైగా గుండె జబ్బు బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం జగన్ వీటిపై దృష్టి సారించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ బాధితుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచాలని ఆదేశించారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో.. హబ్ అండ్ స్పోక్ విధానంలో ‘స్టెమీ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 26 జిల్లాల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం కలిగిన ఆస్పత్రులను హబ్‌గా అభివృద్ధి చేసి జిల్లా, ఏరియా ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్దుతారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇప్పటికే క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉండగా మిగిలిన చోట్ల కూడా అందుబాటులోకి తేనున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రులను హబ్స్‌గా నోటిఫై చేస్తారు. హబ్‌లో కార్డియాలజీ, యాంజియోప్లాస్టీ సదుపాయాలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో జనరల్ ఫిజీషియన్, స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలందిస్తారు. ఛాతీ నొప్పి, గుండె పోటు సంబంధిత లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి అత్యవసర వైద్య సేవలు అందించేలా సదుపాయాలు సమకూరుస్తారు. ఐసీయూ సెట్టింగ్‌తో (కరోనరీ కేర్ యూనిట్), ఎలక్టో కార్డియోగ్రామ్ (ఈసీజీ), కార్డియోవర్టర్, థ్రాంబోలైసిస్ థెరపీ నిర్వహించడానికి అవసరమైన మందులు, ఇతర సదుపాయాలు ఉంటాయి. బాధితులను అత్యవసరంగా పెద్దాస్పత్రులకు తరలించేందుకు వీలుగా 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులోనూ ఈసీజీ సౌకర్యం ఉంటుంది. సేవలు ఇలా.. ఏరియా, జిల్లా ఆస్పత్రులకు ఛాతీ నొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే టెలీ ఈసీజీ తీస్తారు. రిపోర్టు హబ్‌లో ఉండే కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. దీన్ని పరిశీలించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా? అనే అంశాలను కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. స్పోక్ కేంద్ర వైద్యుడిని అప్రమత్తం చేసి అవసరం మేరకు ‘థ్రాంబోలైసిస్’ ఇంజక్షన్ ఇస్తారు. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హబ్/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు. రెండు నెలల్లో.. స్టెమీ కార్యక్రమాన్ని రెండు నెలల్లో అన్ని చోట్లా ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. స్పోక్ ఆస్పత్రులకు స్టెమీ కిట్స్ పంపిణీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దీంతో గోల్డెన్ అవర్‌లో బాధితులకు సత్వర వైద్యం లభిస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తిరుపతిలో ఇప్పటికే అమలు.. స్టెమీ కార్యక్రమాన్ని గత రెండున్నరేళ్లుగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. తిరుపతి, చిత్తూరు, రాజంపేట, వైఎస్సార్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు రుయా ఆస్పత్రిలోని హబ్‌కు అనుసంధానమై గుండెపోటు బాధితులకు సత్వర వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ వంద మందికిపైగా ప్రాణాలను కాపాడామని రుయా మెడిసిన్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ మునీశ్వరరెడ్డి తెలిపారు. -
కుటుంబం కనుమరుగు.. మృత్యుంజయురాలికి మెరుగైన చికిత్స
తిరుపతి తుడా: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన ఏడుగురి మృతదేహాలను సోమవారం వారి బంధువులకు అప్పగించారు. మృత్యువును జయించిన జిషితకు తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. చిన్నారి రెండు కాళ్లకు తొడ భాగంలో ఎముకలు విరిగినట్టు గుర్తించారు. బాలికకు ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు. చిన్నారి షాక్ నుంచి తేరుకోకపోవడంతో తరచూ ఉలిక్కి పడుతోంది. కడుపు ఉబ్బడం, ఆ భాగంలో కొంతమేర నలుపెక్కడంతో వివిధ రకాల పరీక్షలు చేశారు. కడుపుపై బలమైన దెబ్బ తగలడం వల్ల లోపల ఏదైనా ఒక పార్ట్ నలగడం లేదా రక్తం గడ్డకట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. చిన్నారికి ప్రాణాపాయం లేదని డాక్టర్ మనోహర్ చెప్పారు. అమ్మానాన్నలు, అవ్వాతాతలను కోల్పోయి చికిత్స పొందుతున్న జిషిత ఆలనా పాలన మహిళా కానిస్టేబుల్ శాంతి చూస్తున్నారు. మృతదేహాల అప్పగింత మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు కారులో బయల్దేరిన మెరైన్ ఇంజనీర్ సురేష్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో ఏడుగురు మృతి చెందగా, రెండేళ్ల పాప జిషిత ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో ఫోరెన్సిక్ విభాగాధిపతి మమత ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు పర్యవేక్షణలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్డీవో కనకన రసారెడ్డి, డీఎస్పీ నరసప్ప మృతుల బంధువులతో తరచూ మాట్లాడుతూ సూచనలు ఇచ్చారు. ఏడుగురి మృతదేహాలు, నగదు, వస్తు సామగ్రిని డీఎస్పీ నరసప్ప, సీఐ శ్రీనివాసులు సమక్షంలో బంధువులకు అప్పగించారు. రెండు అంబులెన్స్‌లలో మృతదేహాలను శ్రీకాకుళం, విజయనగరంలోని వారి స్వస్థలాలకు తరలించారు. మేం కూడా వచ్చి ఉంటే బతికివారేమో.. తిరుపతికి వారితో కలిసి తాము కూడా రావాల్సి ఉందని, తక్కువ సమయం ఉండటంతో రాలేకపోయామని సురేష్‌కుమార్ తోడల్లుడు మధు చెప్పారు. వాళ్లతో కలిసి తాము కూడా వచ్చి ఉంటే అంతా బతికే వారేమోనన్నారు. అంతా కలిసి బయలుదేరి ఉంటే ప్రైవేట్ వాహనంలోనో, రైలులోనో బయల్దేరేవాళ్లమని, అలా చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. మృత్యుంజయురాలు జిషితను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. -
ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం వల్లే తిరుపతి రుయా ఘటన
-
ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీఎం జగన్ ఆదేశం
-
రుయా ఆస్పత్రిలో పరిస్థితిని పర్యవేక్షించిన ఎంపీ గురుమూర్తి
-
లిఫ్ట్ ప్రమాదం.. గాయపడిన తిరుమల భక్తుడు
సాక్షి, చిత్తూరు: తిరుమలలోని ఓ అతిథి గృహంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతిధి గృహంలోని లిఫ్ట్ బుధవారం ప్రమాదానికి గురవడంతో ఓ భక్తుడు గాయపడిన సంఘటన స్తానికంగా ఆందోళన కలిగించింది. అతిథి గృహంలో కరెంట్ నిలిచిపోవడంతో రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో భక్తులను లిఫ్ట్ నుంచి బయటకు దించే క్రమంలో ఓ భక్తుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సిబ్బంది వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సదరు భక్తుడిని వెంకటగిరికి చెందిన జయప్రకాశ్‌గా అధికారులు గుర్తించారు. -
ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్
సాక్షి, తిరుపతి : తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. (కరోనా: ఆదర్శంగా నిలిచిన భూమన) -
రుయాలో కరోనా అనుమానితుడు!
సాక్షి,చిత్తూరు : తిరుపతి రుయా ఆస్పత్రిలో కోవిడ్–19 వైరస్ అనుమానితుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తైవాన్‌కు చెందిన చెన్ షి షున్(35)ను రుయాలోని ప్రత్యేక వార్డులో చేర్పించారు. ఈ నెల 17న అతడు తైవాన్ నుంచి పలు యంత్రాలను అమరరాజ గ్రూప్స్‌కు తీసుకు వచ్చి, వాటిని అమర్చే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి రెండు రోజులుగా జలుబు, దగ్గరు తీవ్రతరం అయ్యాయి. వాటిని కోవిడ్ లక్షణాలుగా భావించిన శనివారం రుయాకు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా... రక్త నమునాలను పరీక్షల నిమిత్తం పుణెకు పంపాలని వైద్యులు భావిస్తున్నారు. (అమెరికాలో తొలి కోవిడ్-19 మృతి) వాటి ఫలితాలు వచ్చేవరకూ అతడిని జిల్లా వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో ఉంచాలని భావిస్తున్నట్లు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీ రమణయ్య, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సుబ్బారావు, ఆర్ఎంవో డాక్టర్ హరికృష్ణ తెలిపారు. కాగా కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి రుయాలో చేరినట్లు వార్తలతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.... తైవాన్ వ్యక్తి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. (ప్రపంచంపై పిడుగు ) -
‘కరోనా’ సోకిందంటూ వ్యక్తి ఆత్మహత్య
తొట్టంబేడు(చిత్తూరు జిల్లా): తనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో చిత్తూరు జిల్లాలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన బాలకృష్ణ (50) గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రుయాకు వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చి తనకు కరోనా వైరస్ సోకిందని, తనను ముట్టుకోవద్దని కుటుంబ సభ్యులతో చెప్పాడు. దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి తరిమి ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. సోమవారం తెల్లవారుజామున బాలకృష్ణ ఇంట్లోంచి బయటికొచ్చి తన పొలానికి వెళ్లి అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్ సెంటర్ సీజ్
పీలేరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా పీలేరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆస్పత్రిని పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం) కమిటీ మంగళవారం సీజ్ చేసింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ రమాదేవి మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన హైరిస్క్ మానిటరింగ్ టీమ్ నుంచి తమకు అందిన సమాచారం మేరకు అగ్రహారానికి చెందిన కవిత (వివాహిత) గర్భస్రావంతో తిరుపతి రుయాలో చేరిందన్నారు. ఈ మహిళ కుటుంబసభ్యులను విచారించగా పీలేరు నోబుల్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యామని, అక్కడ డాక్టర్ గాలేటి బాషా తమకు గర్భవిచ్ఛిత్తి నిమిత్తం చేసిన చికిత్స ఫలితంగా ఆరోగ్యం విషమించడంతో ఇక్కడికి పంపారని తెలిపారన్నారు. పీసీపీఎన్డీటీ కమిటీ సభ్యురాలు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పూజారి లోకవర్ధన్ ఆధ్వర్యంలో సాధారణ విచారణ నిమిత్తం పీలేరులోని నోబుల్ నర్శింగ్ హోమ్‌కు వచ్చారు. అక్కడ తమ ఎదుటే పీలేరుకు చెందిన మస్తాన్ భార్య సునీర్ (27)అనే మహిళకు స్కానింగ్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు పూర్తి చేసుకుందని, గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు వారికి తెలియజేయడం తమ కళ్లెదుటే జరిగిందన్నారు. దీంతో తాము వచ్చిన విచారణకు తోడు ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక మర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీలేరు తహసీల్దారు నేతృత్వంలో నర్శింగ్ హోమ్‌లో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటరును సీజ్ చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం అక్కడి డాక్టర్ గాలేటి బాషాపై చర్యలుంటాయని వివరించారు. నర్శింగ్ హోమ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తేలిందన్నారు. -
ప్రాణం తీసిన పోలీసు చేజింగ్
సాక్షి, చిత్తూరు అర్బన్ : చిత్తూరులో పోలీసులు చేజింగ్ ఓ ప్రాణాన్ని బలిగొంది. అయితే చనిపోయిన వ్యక్తి దొంగని చెబుతున్న పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు నగరంలో సోమవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అశోకపురం వద్ద ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వెళుతుండటాన్ని గుర్తించారు. వీరిని ఆపడానికి ప్రయత్నించగా యువకులు వేగంగా వెళ్లిపోయారు. ఇద్దరినీ చేజ్ చేయడానికి ఓ రక్షక్, రెండు బ్లూకోల్ట్స్ ద్విచక్రవాహనాల్లో పోలీసులు వెంటపడ్డారు. యువకులు ఎంఎస్ఆర్ కూడలి మీదుగా పలమనేరు రోడ్డుపైకి వెళ్లారు. పోలీసుల చేజింగ్‌తో కంగారుపడ్డ ఓ యువకుడు హీరోహోండా షోరూమ్ ఎదుట అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో యువకుడి తల పగిలి తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో యువకుడు ద్విచక్రవాహనాన్ని వదిలి పారిపోయాడని పోలీసులు చెబుతుండగా.. అదుపులోకి తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. కాగా యువకుడు మృతిచెందడంతో ఉన్నతాధికారులకు కారణాలు ఏంచెప్పాలో తెలియక పోలీసులు మృతదేహాన్ని తొలుత చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. అప్పటికే యువకుడు మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో కంగారుపడ్డ పోలీసులు ఓ ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌ను పిలిచి గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో డ్రైవర్ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వ్యక్తిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నుంచి తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అప్పటికే ఇతను మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో.. తమకు కూడా విషయం తెలియదని, గుర్తుతెలియని వ్యక్తని అంబులెన్సు డ్రైవర్ చెప్పడంతో మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాను రాత్రి గస్తీలో ఉండగా ఓ యువకుడు తన కళ్లెదుటే డివైడర్‌కు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పడిపోయాడంటూ ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో గుర్తుతెలియ ని వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదే సమయంలో అశోకపురంలో రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు, గుర్తుతెలియని ఇద్దరు యువకులు వీటిని తీసుకెళ్లినట్లు వన్‌టౌన్ స్టేషన్లో మరో కేసు నమోదవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు ఎవరని తెలిస్తే తప్ప.. ఆ యువకులు దొంగలా..? కాదా అనే విషయం బయటపడుతుంది. పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుంటే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
'పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తాం'
సాక్షి, తిరుపతి : పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిని శనివారం మంత్రుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రోగులను పరామర్శించిన మంత్రులు వారికి అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. రుయా ఆసుపత్రి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళతామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, ఆదిమూలపు సురేశ్, ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు. -
రుయా పేరును భ్రష్టుపట్టించారు
సాక్షి, తిరుపతి : ‘రాయలసీమకే తలమానికమైన రుయా ఆస్పత్రిని భ్రష్టుపట్టించారు..గత ప్రభుత్వ హయాంలో నిధులను అడ్డంగా దోచుకున్నారు.. ఇక మీ ఆటలు సాగవు..మీరు మారి ఆస్పత్రి నిర్వహణలో మార్పు తీసుకురండి..లేకపోతే చర్యలు తప్పవు’ అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆస్పత్రి అధికారులను హెచ్చరిం చారు. రుయాలో కే ట్యాక్స్ వ్యవహారం వెలుగులోకి రావడం.. సూపరింటెండెంట్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం..ఆస్పత్రి అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే సోమవారం ఆస్పత్రిలో పర్యటిం చారు. అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర విభాగాన్ని, కోడెల తనయుడు బినామీ పేరుతో నిర్వహిస్తున్న ల్యాబ్‌ను పరి శీలించారు. భూమన మాట్లాడుతూ పేద రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన గత పాలకులు రుయా వేదికగా దోపిడీకి పాల్పడ్డారన్నారు. మీడియాలో రుయా అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. దీనిపై అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ రుయాను సందర్శించి కోడెల తనయు డు కనుసన్నల్లో నడుస్తున్న ప్రైవేట్ ల్యాబ్‌ను రద్దు చేయాలని ఆదేశించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా అవినీతి అక్రమాల్లో మార్పు రాలేదా అని నిలదీశారు. మాజీ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రోగులకు అన్యాయం చేస్తూ అక్రమార్కులకు మేలు చేసేలా వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. ఇక అవినీతికి ముగిం పు పలికి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సెంట్రల్ ల్యాబ్ నిర్వహణను తక్షణం మెడికల్ కళాశాల, రుయా సంయుక్తంగా నిర్వహించాలని ఆదేశించారు. జనరిక్ మందుల షాపులు కేటాయించాలని నెలన్నర క్రితం ఆదేశాలు వచ్చినా అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రుయా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రుయా ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ సరస్వతీదేవి, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి, సీఎంఓ డాక్టర్ వెంకట్రమణ, రుయా వర్కింగ్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్ హేమకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్కే బాబు, ఎంఎస్ మణి, పి.రాజేంద్ర, హి మాం సాహెబ్, నరేంద్రనా«థ్ కుసుమకుమారి, లక్ష్మీరెడ్డి, శ్రీదేవి, కిరణ్, పవన్ పాల్గొన్నారు. -
మృతదేహాన్ని ముసిరిన ఈగలు, చీమలు
సాక్షి, తిరుపతి తుడా : చికిత్స పొందుతూ పురిటిబిడ్డ మృతి చెందాడని కాలువ పక్కన పడేసి వెళ్లిన ఘటన తిరుపతి రుయా ఆసుపత్రిలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు..గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన మనోహర్, సరిత దంపతులకు ఇటీవల మగబిడ్డ జన్మించాడు. అయితే పుట్టుకతోనే మెనింగో మైలో సీల్ అనే జన్యుపరమైన వ్యాధితో జన్మించాడు. పురిటిబిడ్డకు చికిత్స చేయించేందుకు తిరుపతి రుయాలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో 28న చేర్పించారు. ఆ బిడ్డ 29వ తేదీన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. బిడ్డ మృతి చెందడంతో తెల్లవారుజామున చిన్న పిల్లల ఆసుపత్రి సమీపంలో కాలువ పక్కన ఖాళీ స్థలంలో ఆ పురిటి బిడ్డ మృతదేహాన్ని పడేసి వెళ్లారు. దీంతో చీమలు, ఈగలు ముసురుకుని ఉన్న ఆ పసికందు మృతదేహాన్ని ఉదయాన చూసిన స్థానికులు చలించిపోయారు. సమాచారమివ్వడంతో రుయా అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోలీసులకు తెలియజేయడంతో వారు దర్యాప్తు చేశారు. బిడ్డ ఆధారంగా తల్లిదండ్రులను గుర్తించి వారిని పిలిపించారు. విచారణ చేశారు. తమ బిడ్డ మృతి చెందడంతో ఇంటికి తీసుకెళ్లలేక ఇక్కడే పాతిపెట్టాలని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులతో మాట్లాడి వారికి డబ్బులిచ్చి వెళ్లిపోయామని, వారు ఇలా పడేస్తారని అనుకోలేదని పేర్కొన్నారు. అనంతరం బిడ్డ మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఆ తర్వాత పసికందు మృతదేహాన్ని తిరుపతిలోనే ఖననం చేసి తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కుక్కల బారిన పసికందు మృతదేహం పడి ఉంటే పరిస్థితి భయానకంగా ఉండేదని కొందరు వ్యాఖ్యానించారు. ఇదలా ఉంచితే, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసు అవుట్ పోస్టులను బలోపేతం చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదని నివేదికలు చెబుతున్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుం డా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
సాక్షి, తిరుపతి (అలిపిరి): రుయాలో జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిట్‌వైఫరీ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పౌజియా(19) మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ వేధింపులే ఆత్మహత్యాయత్నానికి కారణమని బాధితురాలు మీడియా ముందు గోడును వెళ్లబోసుకుంది. ప్రస్తుతం విద్యార్థిని ఆర్‌ఐసీయులో కోలుకుంటోంది. ప్రిన్సిపాల్ వేధింపులు దామలచెరువుకు చెందిన పౌజియా జీఎన్ఎం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో వంటలు బాగుండడం లేదని ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో ప్రిన్సిపాల్ ఆమెను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్ ఇష్టానుసారంగా తిడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నట్లు నర్సింగ్ విద్యార్థినులు ‘సాక్షి’ ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నట్లు వివరించారు. 10 మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు నర్సింగ్ హాస్టల్లో ఆహారం సరిగా లేదని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల కాలంలో 60 మంది విద్యార్థినుల్లో 10 మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. నాసిరకం భోజనం అందిస్తుండడం వల్లే అనారోగ్యం బారినపడుతున్నట్లు విమర్శలున్నాయి. పౌజియా ఆత్మహత్యాయత్నానికి ఇది కూడా ఓ కారణంగా విద్యార్థినులు చెబుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం.. రుయాలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై విచారిస్తాం. విచారణలో తేలిన వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రిన్సిపాల్ రష్యారాణి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులందాయి. – డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి నర్సింగ్ విద్యార్థినులు నా బిడ్డలతో సమానం నర్సింగ్ విద్యార్థినులు నా బిడ్డలతో సమానం. వారి పట్ల నేను ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదు. కుటుంబ సమస్యల కారణంగా పౌజియా నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది. ఇందులో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. – రష్యారాణి, ప్రిన్సిపాల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, రుయా ఆస్పత్రి -
రుయా ఆస్పత్రిలో దారుణం
సాక్షి, తిరుపతి : సిబ్బంది నిర్లక్ష్యం, సదుపాయాల లేమి కారణంగా ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగింది. తిరుపతికి చెందిన బాబు అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని జనరల్ వార్డులో చేర్చారు. అనంతరం అక్కడి సిబ్బంది, డాక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత బాబుకి ఫిట్స్ వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మానవత్వంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడి స్టెచర్ లేదంటూ దాదాపు అరగంట పాటు అతన్ని ఆపారు. తర్వాత వైద్యులు వచ్చి బాబుని పరీక్షించి మృతి చెందారని తెలిపారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతపెద్ద ఆస్పత్రిలో కనీసం రోగులను తీసుకెళ్లడానికి స్టెచర్ లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సందర్శించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం. -
వంచించాడు... యాసిడ్‌తో దాడి చేశా!
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : నన్ను పెళ్లి చేసుకుంటానని వంచించాడు.. ఏడాది పాటు నాతో సాన్నిహిత్యంగా మెలిగి తరువాత వదలించుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్న నా భర్త ఏడుకొండలను నా చేతే డాక్టర్ ఆదర్శ్ చంపించాడు.. అంటూ తిరుపతి కోర్డు ఆవరణలో డాక్టర్ ఆదర్శ్‌పై యాసిడ్ దాడిచేసిన నర్సు అరుణ (35) వెల్లడించింది. యాసిడ్ దాడి అనంతరం ఆమె పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యాహ్నం కోలుకున్న తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌పై యాసిడ్ దాడికి కారణాలను ఆమె మాటల్లోనే.. ‘‘రెండేళ్ల క్రితం డాక్టర్ ఆదర్శ్‌తో పరిచయమైంది. తిరుపతిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అతనితో పాటు నర్సుగా పనిచేశాను. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురంలో నివాసం ఉంటున్నాను. నా భర్త అనారోగ్యానికి తోడు కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకుని డాక్టర్ ఆదర్శ్ నాకు దగ్గరయ్యాడు. తోడుగా ఉంటానని.. తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. అనారోగ్యంతో ఉన్న నా భర్త తాగుడుకు బానిస కావడంతో నాచేతనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేలా చేశాడు. ఏడాది పాటు నాతో లివింగ్ రిలేషన్ పెట్టుకుని మోసం చేశాడు. అప్పట్లో ఆదర్శ్‌పై ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆదర్శ్ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో వాయిదాకు వస్తాడని తెలుసుకున్నా.. అతన్ని నడిరోడ్డులో చెప్పుతో కొట్టి యాసిడ్ తాగి చనిపోవాలనుకున్నా.. అయితే డాక్టర్ ఆదర్శ్ నన్ను చూసి పరుగెత్తాడు. దీంతో యాసిడ్‌తో దాడి చేయాల్సి వచ్చింది. ఆ తరువాత నేను పురుగుల మందు తాగాను..’’ ఆదర్శ్‌ను శిక్షించాలి డాక్టర్ ఆదర్శ్ నాలాగా మరో ఐదుగురిని మోసం చేసినట్లు తెలిసింది. అటువంటి వ్యక్తిని నడిరోడ్డులో నిలబెట్టాలి. అప్పుడే నాలాంటి వారికి న్యాయం జరుగుతుంది. పోలీసులు ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి శిక్షించాలి. కోలుకుంటోంది అరుణ పురుగుల మందు తాగడంతో అపస్మార స్థితిలోకి వెళ్లిందని, ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందివ్వడంతో కోలుకుంటోందని రుయా ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతోందని చెప్పారు. -
సీఎం సారూ! రుయాకు వైద్యం చేయండి మీరు
రుయా ఆస్పత్రిలో వైద్య సేవలు రోజు రోజుకూ అధ్వానంగా మారుతున్నాయి. వైద్యుల కొరత పెద్దగా లేకపోయినా ఏళ్ల తరబడీ నర్సింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం ఇన్‌పేషెంట్లకు మెరుగైన సేవలు అందడం కరువవుతోంది. 4వ తరగతి ఉద్యోగుల కొరత వేధిస్తున్నా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదు. అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల అందివ్వడంలోనూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆస్పత్రిలో మెడికల్ షాపు మూతపడి ఏడాది గడుస్తున్నా ఇంత వరకు టెండర్లు జరగనీయకుండా టీడీపీ నేతలు మోకాలడ్డుతున్నారు. ఉన్నతాధికారులు సొంత పనులకు ప్రాధాన్యతనిస్తూ ఆస్పత్రిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రాయలసీమ ప్రాంత నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా 1962లో రుయా ఆస్పత్రిని ప్రారంభించారు. రుయాకు నిత్యం 1500 నుంచి 2వేల మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. ఆస్పత్రిలో 1,098 పడకలు ఉన్నాయి. 850 మంది ఇన్‌పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. వార్డుల్లో సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. వైద్యుల కొరత రుయా ఆస్పత్రిలో 18 విభాగాలున్నాయి. ఇందులో న్యూరో సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, యూరా లజీ, ప్లాస్టిక్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజి, కార్డియో థోరాసిక్ సర్జరీ, రేడియోథెరపి వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి ప్రారంభం నాటితో పోల్చితే ప్రస్తుతం ఎన్నోరెట్లు ఓపీ పెరిగింది. ప్రస్తుతం రుయాలో 146 మంది వైద్య బృందం, పీజీ వైద్యులు ఓపీ, వార్డులకు సేవలందిస్తున్నారు. నిర్లక్ష్యం ఖరీదు ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్డియాలజీ, కేన్సర్ వార్డులు పూర్తిగా మూతపడ్డాయి. ఈ రెండు విభాగాల్లో గతంలో పీజీ సీట్లు ఉండేవి. ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారడంతో సీట్లకు కోతపడింది. ఆస్పత్రి కార్డియోథోరాసిక్ సర్జరీ వైద్యులు ఇద్దరున్నా వారికి తగిన ఆపరేషన్ థియేటర్, ఓపీ లేకపోవడంతో వారికి పనిలేకుండా పోయింది. నిపుణులున్నా వారి సేవలను ఉపయోగించుకోలేని దుస్థితిలో రుయా ఆస్పత్రి ఉంటోంది. ఇక డెంటల్ విభాగంలో సర్జరీల ఊసే లేదాయె! ఏళ్ల తరబడి భర్తీకి నోచని పోస్టులు రుయాలో నర్సింగ్, పారా మెడికల్, 4వ తరగతి సిబ్బంది పోస్టులను కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడం రోగులకు శాపంగా మారింది. వాస్తవానికి 240 మంది నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం 90 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఇంకా 150 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. నర్సింగ్ సిబ్బంది లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందే నర్సుల అవతారం ఎత్తిన సందర్భాలూ లేకపోలేదు! ప్రస్తుతం రుయాను ట్రైనీ నర్సింగ్ విద్యార్థినులతో లాక్కొస్తున్నారు. 58 మంది పారామెడికల్ సిబ్బంది అవసరమైతే కేవలం 23 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక, 98 మంది 4వ తరగతి ఉద్యోగులు ఉండాల్సింది పోయి కేవలం 25 మంది మాత్రమే ఉన్నారు. ఇలా రుయాను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల కొత్తగా ఔట్సోర్సింగ్ కింద 20 మంది సిబ్బందిని నియమించినా ఉన్నతాధికారుల మధ్య విభేదాల కారణంగా మరికొన్ని పోస్టులు భర్తీకి నోచుకోలేదు. మెడికల్ షాపు టెండర్‌కుటీడీపీ నేతల మోకాలడ్డు రుయాలో 2017 డిసెంబర్ 24న సాధారణ మెడికల్ షాపు నిర్వహణ గడువు ముగిసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు టెండర్ల జోలికి వెళ్లలేదు. తెలుగు తమ్ముళ్లు పట్టుపట్టడంతో టెండర్ల ప్రతిపాదన చేయలేదు. మంత్రి అమరనాథరెడ్డి సిఫార్సు ఓ తెలుగు తమ్ముడికి ఉండడంతో టెండర్ ప్రతిపాదన సిద్ధం చేసినా అది అటకెక్కింది. రుయా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కుమారుడి మృతిని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరుపతి : నగరంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ తల్లి ఆసుపత్రి ఆవరణంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన గంగాధర్ టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న గంగాధర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన గంగాధర్ తల్లి కుమారి రుయా ఆసుపత్రి ఆవరణంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వామపక్షాలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రుయా ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. -
తిరుపతిలో దారుణం
తిరుపతి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో టీటీడీ కాంట్రాక్టు కార్మికుడు గంగాధర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన గంగాధర్‌ను దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రుయా ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని గంగాధర్ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తల్లి, కుమారుడు మృతిచెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కన్నతండ్రి కర్కశత్వం
మదనపల్లె క్రైం: కన్న కూతురిపై కర్కశంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. తాగిన మైకంలో గర్భవతి అని కూడా చూడకుండా దాడిచేసి కొట్టాడు. దీంతో పొట్టమీద బలమైన దెబ్బ తగిలి గర్భంలోని కవల శిశువులు మృత్యువాతపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించి మృతశిశువులను బయటికి తీశారు. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. బసినికొండకు చెందిన నరసింహులు, రమణయ్య కుమార్తె లక్ష్మీదేవికి గత ఏడాది మండలంలోని ఓబులరెడ్డిపల్లె శివకుమార్‌తో వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం గర్భవతి. భర్త తాగుడుకు బానిసై వదిలేయడంతో పుట్టింట్లో ఉంటోంది. తాగుబోతు భర్త మరో వివాహం చేసుకుని, మొదటి భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమెకు న్యాయం జరగలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులపైనే ఆధారపడి కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలో వారం క్రితం ఆమె తండ్రి నరసింహులు మద్యం తాగి వచ్చి తల్లి రమణమ్మను కొడుతుండగా లక్ష్మీదేవి అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన తండ్రి గర్భిణి అని చూడకుండా పొట్టపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. రుయాలో పరీక్షించిన వైద్యులు కడుపులోని కవలలు చనిపోయారని నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించి బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు బాధితురాలి తల్లి రమణమ్మ తెలిపింది. -
రుయాకు మహర్దశ !
తిరుపతి (అలిపిరి) : శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 19.58 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్లు, విద్యుత్ వసతులు, భవన నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. ఫైర్ సేప్టీ వ్యస్థతో పాటు ఆపరేషన్ థియేటర్లలో అత్యాధునిక బ్యాక్టీరియా ఫ్రీ సిస్టం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొదటి దఫా రుయాకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. అదే విధంగా కాన్పుల ఆస్పత్రి అభివృద్ధికి రూ.3.2 కోట్లు మంజూరయ్యాయి. ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ సాధన కోసం.. రుయా, మెటర్నటీ ఆస్పత్రులను ఆరు నెలల క్రితం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్) కమిటీ పరిశీలించింది. పలు లోపాలను గుర్తించి వాటిని భర్తీ చేయాలని సూచించింది. ముఖ్యంగా ఆస్పత్రిలో ఫైర్ సేప్టీ వ్యవస్థ, భవన నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లో వసతులను సమకూర్చుకోవాలని సూచించింది. దీంతో రుయా, మెటర్న టీ ఆస్పత్రులు ఎలాగైనా ఎన్ఏబీహెచ్ గుర్తింపు కోసం మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. పనులకు త్వరలో శ్రీకారం రుయాలో వచ్చే నెల మొదటి వారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రానుంది. రుయాలో అభివృద్ధి పనుల అనంతరం మరోమారు ఎన్ఏబీహెచ్ సభ్యులు సందర్శించనున్నారు. అభివృద్ధి పనులపై సంతృప్తి చెందితే ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ వచ్చే అవకాశం ఉంది. అక్రిడిటేషన్ సాధిస్తే రుయాకు ఇన్‌పేషెంట్ల సంఖ్య బట్టి నిధులు మంజూరవుతాయి. ఆస్పత్రిలో పరిశీలన రుయా ఆస్పత్రిలో ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్‌కు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన స్థల పరిశీలన, మౌలిక సదుపాయల కల్పన తదితర అంశాలపై ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) ఈఈలు గురువారం రుయా ఆస్పత్రిని పరిశీలించారు. నూతన ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఎలక్ట్రికల్, ఫైర్‌సేప్టీ వ్యవస్థ ఏర్పాటుకు మ్యాప్‌లను పరిశీలించారు. రుయా ఆస్పత్రిని పరిశీలించిన వారిలో ఏపీఎంఎస్ఐడీసీ డిజైన్ ఈఈ నెహ్రూ, ఈఈ నగేష్‌తో పాటు రుయా ఆర్ఏంఓ డాక్టర్ శ్రీహరి, రుయా అభివృద్ధి కమిటీ సభ్యులు చిన్నబాబు, అడ్మినిస్టేటర్ ఉమాశంకర్ ఉన్నారు. -
రుయాలో కీచక వైద్యులు
తిరుపతి (అలిపిరి): రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో కీచకపర్వం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే లైంగిక వేధింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేని ఎస్వీ మెడికల్ కళాశాల పీడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఈ మెయిల్ ద్వారా మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన గవర్నర్... విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారు. పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ కిరీటి, ప్రొఫెసర్ శశికుమార్‌లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు వారి చేతుల్లో ఉన్నాయని వేధిస్తున్నారని ఆరోపించింది. ఓ పాపకు తల్లినైన తాను వారి బాధలు భరించలేక ఓ సారి ఆత్మహత్యకు యత్నించగా, తన భర్త కాపాడినట్లు వివరించింది. పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్... లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జయా భాస్కర్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌లతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేస్తోంది. -
నవవధువు మృతి
మదనపల్లె క్రైం: గత నెల 22వ తేదీన అదనపు కట్నం తీసుకురాలేదని భర్త కిరోసిన్ పోసి నిప్పటించడంతో తీవ్రంగా గాయపడిన నవ వధువు 12 రోజులు మృత్యువుతో పోరాడి బుధవారం రుయా ఆస్పత్రిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, ముదివేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె షమీన(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లులో ఉంటున్న ఎస్.కె ఇస్మాయిల్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెకు ఐదు నెలలకే అత్తగారి వేధింపులు మొదలయ్యాయి. షమీనాను భర్త ఇస్మాయిల్, ఆడబిడ్డ గుల్జార్, అత్తామామలు రెడ్డిబూ, దస్తగిరి అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు పాల్పడ్డారు. ఆమె డబ్బు తీసుకురాకపోవడంతో గత నెల 22వ తేదీన షమీనాపై భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 80 శాతం శరీరం కాలిపోయిన షమీనాను స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ బుధవారం పరిస్థితి విషమించి మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిందని..
తిరుపతి (అలిపిరి): మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిందని కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేయడంతో చంద్రకళ అనే మహిళ శనివారం సాయంత్రం జీవకోన గాంధీనగర్‌లోని తల్లిదండ్రుల ఇంటిలో ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు ఆమెను రుయా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం ఆమె కోలుకుంటోంది. చంద్రకళ తండ్రి గౌరీశంకర్ మాట్లాడుతూ మదనపల్లెకు చెందిన గిరిబాబు, అతని భార్య నాగమణి కలిసి తన కూతు రు చంద్రకళపై లేనిపోని ఆరోపణలు చేశారని తెలిపారు. తన కూతురు మదనపల్లెలో ఓ స్కూలుల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న సమయంలో గిరిబాబు లోబరుచుకునే ప్రయత్నం చేశాడని, తీవ్రంగా ప్రతిఘటించిన తన కూతురిపై రూ.7 లక్షలు దొంగతనం చేసిందంటూ తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. గుట్కా వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డ గిరిబాబుతో చంద్రకళ భర్త గురుప్రసాద్ కలిసి తన కూతురును వేధిస్తున్నారని వాపోయారు. వారి వేధింపుల కారణంగా ఇద్దరు పిల్లలున్న తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందన్నారు. కూతురు రాసిన సూసైడ్నోటుతో అలిపిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
-
జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరుపతి: పట్టణంలోని రూయా ఆస్పత్రిలో జూనియర్ హౌజ్ డాక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే రూయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వెంకటరమణ ఆత్మహత్యాయత్నంతో రూయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంకటరమణపై రుయాలో క్లర్క్‌గా పని చేస్తున్న కృష్ణ కుమారి చేయి చేసుకోవడంపై జూడాలు మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. వెంకటరమణ ఆత్మహత్యాయత్నంపై చిత్తూరు సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్ సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ కుమారిని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. -
తిరుపతి రుయా ఆస్పత్రికి జబ్బు
-
రూయా ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య
తిరుపతి: తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆదివారం ఉదయం బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 35 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి బాత్రూంలోకి వెళ్లి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో బాత్రూం శుభ్రం చేయడానికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లిన సమయంలో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న అతడిని కనుగొన్నారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు. ఈ సంఘటన ఆస్పత్రిలో కలకలం సృష్టించింది. అతను ఏ వ్యాధితో చికిత్స కోసం వచ్చాడు, ఎక్కడివాడు వంటి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. -
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు 30వ మలుపు వద్ద అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తమిళనాడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. -
ఆటో-కారు ఢీ : మహిళ మృతి
చిత్తూరు: వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఐతెపల్లి వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ కారు ముందు వెళ్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఇంటి కప్పు కూలి 13 మందికి గాయాలు
కేవీబీపాళెం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా కేవీబీపాళెం మండలం బంగారు కండ్రిగ గ్రామంలో శనివారం వేకువజామున ఒక ఇంటి పైకప్పు కూలి 13 మంది కుటుంబసభ్యులు గాయపడ్డారు. వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నగరి మున్సిపల్ చైర్ పర్సన్ కు పెద్దిరెడ్డి పరామర్శ
తిరుపతి: రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరామర్శించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా రెండేళ్లలో దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్‌పై పోలీసులు సమక్షంలోనే దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అండతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరి రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కె.శాంతకుమారిపైన దౌర్జన్యానికి దిగారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ మోకాళ్లతో కడుపులో బలంగా పొడిచారు. దీంతో కిందపడిపోయిన చైర్పర్సన్ స్పృహ కోల్పోయారు. ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. నగరి మున్సిపాల్టీలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘రంజాన్ తోఫా’ పంపిణీ నేపథ్యంలో ఈ అమానుష చర్యలు చోటు చేసుకున్నాయి. -
బస్సును ఢీకొన్న ఆటో
శ్రీకాళహస్తి: పట్టణంలోని హౌసింగ్ బో ర్డు సమీపంలో శనివారం రాత్రి బస్సును ఆటో ఢీకొనడంతో ఐదుగురు తీవ్రం గా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు ఆటో ప్రయాణికులను ఎక్కించుకుని శ్రీకాళహస్తి నుంచి తొండవునాడు మీదుగా ఏర్పేడు వుండలంలోని బండారుపల్లి గ్రావూనికి బయలుదేరింది. హౌ సింగ్ బోర్డు వద్ద తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న బస్సును ఢీకొంది. శ్రీకాళహస్తి వుండలంలోని టీఎంవీకండ్రిగకు చెందిన జయుంతి(39), పుల్లారెడ్డికండ్రిగకు చెందిన అవుు్మలు(51), రాజయ్యు(55), ఏర్పేడు వుండలానికి చెందిన చెంగల్రాయుల్(45), పట్టణంలోని ప్రాజెక్టు వీధికి చెందిన ఆటో డ్రైవర్ సాధమ్ హుస్సేన్ (34) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 ద్వారా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథవు చికిత్స అనంతరం వారిని వైద్యులు తిరుపతి రూయూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
'బాబు అధికారంలోకి వచ్చాక 10 ఎన్ కౌంటర్లు'
తిరుపతి : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద బుధవారం ఉద్రికత్త నెలకొంది. ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం తెల్లవారుజామున చిత్తూరు శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్ర చందనం కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు రుయా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. దాంతో తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర హక్కుల సంఘాలు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. చంద్రబాబు సర్కారు పథకం ప్రకారమే ఇరవవైమంది కూలీలను పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. పొట్టకూటి కోసం కాయకష్టం చేసే పేద ప్రజలను ఎదురుకాల్పులు పేరుతో దారుణంగా మట్టుపెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పది ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. వేలకోట్ల రూపాయలను దండుకునే ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించలేని ప్రభుత్వం కూలీలను పొట్టన పెట్టుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైద్యం వికటించి వ్యక్తి మృతి
తిరుపతి(చిత్తూరు): వైద్యం వికటించడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. తిరుపతిలోని ఎస్టీవీ నగర్‌కు చెందిన సురేష్(32) అయాసం కారణంగా ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, అక్కడ వైద్య చేసే క్రమంలో డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ తీసుకున్న కొద్దిసేపటికి అది వికటించడంతో అతను మృతి చెందాడు. దీంతో బంధవులు ఆస్పత్రి ఎదుట గొడవకు దిగారు. దీంతో సిబ్బంది మొత్తం ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మాకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. -
ఆటో బోల్తా; ఆరుగురికి గాయాలు
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఇనగలూరు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆటో బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాష్ట్రంలో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ
సాక్షి, నెట్వర్క్: స్వైన్ ఫ్లూ రోజురోజుకు రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ తల్లి, కూతురికి స్వైన్ ఫ్లూ సోకగా, మరోవైపు గుంటూరు, అనంతపురానికి చెందిన వ్యక్తులు ఈ వ్యాధితో హైదరాబాద్‌లో మరణించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రిటైర్డు బ్యాంకు ఉద్యోగి శివప్రసాద్ కూతురు ప్రవల్లిక హైదరాబాదు నుంచి అనారోగ్యంతో పట్టణానికి చేరుకుంది. ఆమె తల్లి హరిప్రియకు కూడా జ్వరం రావడంతో వారిద్దర్నీ తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అనుమానంతో వారి శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపగా వారికి వ్యాధి సోకినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా బొప్పూడికి చెందిన కుర్రా శ్రీనివాసరావు(40) స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్‌లో మంగళవారం మరణించాడు. అలాగే అనంతపురం జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్‌కు చెందిన సుఖేశిని(65) కూడా స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్‌లో మృతి చెందింది. మరోవైపు విశాఖలోని గోపాలపట్నంకు చెందిన 15 ఏళ్ల బాలికకు స్వైన్‌ఫ్లూ సోకింది. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ; 40మందికి గాయాలు
-
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ; 40మందికి గాయాలు
తిరుమల: తిరుమల రెండో ఘాట్ లోని 11వ మైలురాయి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించినట్టు సమాచారం. బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం బస్సు నడపడంతోనే ఈ ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. రుయా ఆస్పత్రి వద్ద బస్సు డ్రైవర్ పై దాడి చేసేందుకు ప్రయాణికులు దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గాయపడినవారంతా గుజరాత్ రాజకోట్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
వెంటిలేటర్‌పై రుయా!
రుయా ఆస్పత్రిలో యంత్రాలకు జబ్బు చేసింది. అత్యవసర సేవలు అందడం లేదు. అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా, ఉపయోగించుకోలేని దీనస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే ఆస్పత్రిలో కోట్ల విలువైన పరికరాలు మూలన పడుతున్నాయి. వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి. ఇక్కడి వాతావరణం చూస్తే అసలు అత్యవసర విభాగం ఉన్నా లేనట్టుగా తయారైంది. తిరుపతి కార్పొరేషన్: ‘వైద్యోనారాయణ’గా పేరుగాంచిన రుయాలో విలువైన వైద్య పరికరాలు చూస్తే ఆసుపత్రికి జబ్బు చేసిందా అన్న సందేహం వస్తోంది. అత్యవసర విభాగంలో అడ్మిట్ అవుతున్న వారు, రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారు, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం వస్తున్న వారే అధిక భాగం ఉన్నారు. వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఏఎంసీ విభాగంలో ఆర్ఐసీ(రెస్పిరేటరి ఇంటెన్సివ్ కేర్)లో రోగులకు వైద్య సేవలు అంది స్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో దాదాపు 18 వెంటిలేటర్లు మూలన పడ్డాయి. కేవలం రెండు మాత్రమే సేవలందిస్తున్నాయి. అవికూడా తరచూ మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నమ్ముకుని డాక్టర్లు మెరుగైన సేవలు అందించలేక పోతున్నారు. రోగుల సహాయకులు బతిమిలాడితే వేలూరు సీఎంసీకి వెల్లండి అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇక అత్యవసర విభాగంలోని ఎక్స్‌రే మిషన్ ఆరు నెలలుగా పనిచేయడం లేదు. యాక్సిడెంట్ కేసుల్లో వచ్చే వారికి ముందుగా ఎక్స్‌రే తీయడం వలన ప్రమాద స్థాయిని గుర్తించి తక్షణ వైద్య సహాయం అందించవచ్చు. ఎక్స్‌రే మిషన్ పనిచే యక పోవడంతో ఆసుపత్రి ప్రధాన భవనంలోని ఎక్స్‌రే భవనానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. కాళ్లు, చేతులు విరిగిన వారు అంతదూరం వెళ్లాలంటే ప్రాణం మీదకొస్తోంది. గాలిలో దీపంలా ప్రాణాలు రూ.5 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేసి వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్న రుయా ఆసుపత్రికి వాటి నిర్వహణ భారంగా మారింది. మరమ్మతులకు గురైన వాటిని సరిచే సేందుకు సాంకేతిక నిపుణులు లేరు. రోజుల తరబడి పరికరాలు మూలనపడ్డంతో అత్యవసర సేవలకు వచ్చే వారి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ప్రాణాప్రాయ స్థితిలో రోజూ పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుండ గా వెంటిలేటర్లు లేని కారణంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 29 మంది అత్యవసర సేవల కోసం వస్తే వెంటి లేటర్ లేని కారణంగా 9 మంది మృత్యువాత పడ్డట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. రుయాలో వెంటిలేటర్లు లేక పోవడంతో రోగులను ఇక్కడి డాక్టర్లే దగ్గరుండి ప్రయివేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో రోగి అవసరాన్ని బట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లలేని పేదవారు వైద్యుల కాళ్లపై పడి ఎలాగైనా బతి కించమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వెంటలేటర్లు పనిచేయడం లేదని, సరే పంప్ ఏర్పాటు చేస్తాం, వాటిని మీరే చేతులతో పంపింగ్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ పద్ధతిలో చేయి ఒక్క క్షణం ఆగినా రోగి ప్రాణాలకే ప్రమాదం. ఇక ఆరోగ్యశ్రీ పేషేంట్ల పరిస్థితి మరీ దారుణం. వీరికి వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వెంటిలేటర్లు పని చేయకున్నా, ముఖానికి పైపులు పెట్టి ఫొటోలు తీసుకుం టూ ‘షో’ చే స్తున్నారన్న విమర్శలు వినపిస్తున్నాయి. పనిచేయక పోవడం వాస్తవమే... అత్యవసర వార్డుల్లో వెంటిలేటర్లు పనిచేయక పోవడం వాస్తవమే. ఉన్నతాధికారులకు లెటరు రాశాం. ప్రభుత్వం ఐదు వెంటిలేటర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటిని త్వరగా ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభిస్తాం. -డాక్టర్ వీరాస్వామి, సూపరింటెండెంట్, రుయా ఆసుపత్రి, తిరుపతి -
ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం
-
ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం
తిరుపతి : అటవీ శాఖ కార్యాలయంలో ఓ ఎర్ర చందనం స్మగ్లర్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటగిరి అటవీ ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. అధికారులు వారిని వెంటకగిరి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లలో రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. -
'ఆమె అతడిని...అతడు మరో ఆమెను ప్రేమించాడు'
తిరుపతి : ఓ ట్రయాంగిల్ లవ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఆమె అతడిని ప్రేమించింది. అతను మరో అమ్మాయిని ప్రేమించాడు. అది తెలిసి కూడా... ప్రియుడి కోసం ఆ యువతి గడపదాటి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ రెండు రోజులు అతని వెంటే తిరిగింది. దాంతో ఆ యువతి కుటుంబ సభ్యులు తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటూ అతడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతడు కంగారుపడి... తనకోసం వచ్చిన ఆమెను ఇంటివద్ద వదిలిపెట్టేందుకు బయల్దేరాడు. అయితే రైలు దిగగానే.. అమ్మాయి బంధువులు కన్పించారు. అంతే ఏమి చేయాలో వారిద్దరికి అర్థం కాలేదు... భయంతో పట్టాలపైకి దూకారు. అయితే అదే సమయంలో అటుగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టింది. దీంతో అతడి కాళ్లు విరిగిపోగా, ఆమె గాయపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పలమనేరు మండలానికి చెందిన ప్రియ, గంగవరం మండలానికి చెందిన ప్రసాద్ బాబును రెండేళ్లుగా ప్రేమిస్తోంది. అయితే ప్రసాద్ బాబు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ప్రియ ఇల్లు వదిలి ప్రసాద్ దగ్గరకు వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రియ తల్లిదండ్రులు ప్రసాద్‌కు ఫోన్ చేసి... కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో ప్రియను ఇంటి దగ్గర వదిలి పెట్టేందుకు తిరుపతి వచ్చాడు. అదే సమయంలో రైల్వేస్టేషన్లో ప్రియ బంధువులు కన్పించటంతో భయపడిపోయిన ప్రియ, ప్రసాద్‌లు రైలుపట్టాలపైకి దూకారు. అటుగా వచ్చిన రైలు వారిని ఢీకొనటంతో ప్రసాద్ కాళ్లు తెగిపోగా... ప్రియకు గాయలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
తిరుపతి : పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదనే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. అర్థరాత్రి వీరిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రేమజంటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడినివారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట గంగవరం మండలానికి చెందిన ప్రసాద్, ప్రియగా పోలీసులు గుర్తించారు. ఇరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
తిరుమలలో తొక్కిసలాట, ముగ్గురికి గాయాలు
-
తిరుమలలో తొక్కిసలాట, ముగ్గురికి గాయాలు
తిరుమల : తిరుమలలో అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. గర్భాలయంలోకి ప్రవేశించిన అనంతరం ధ్వజ స్థంభం వద్ద భక్తులు ఒక్కసారిగా తోసుకు రావటంతో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా యాదవేలుకు చెందినవారు. చిత్తూరు జిల్లా నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరుమలకు చేరుకున్న కళాకారుల బృందాలకు టిటిడి బుధవారం స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ కళాకారుల బృందాలను నిన్న సాయంత్రం శ్రీవారి దర్శనానికి అనుమతించారు. మహాద్వారం దాటి వెళ్లిన అనంతరం సిబ్బంది ఒక్కసారిగా భక్తులను వదలడంతో భక్తులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా వెండి వాకిలి వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో వారి వెంట ఉన్న చిన్నారులు స్వల్ప గాయాలకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. గాయపడిన పావని, జయలక్ష్మి, లోకేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. -
తిరుపతిలో మరో అగ్ని ప్రమాదం