
'బాబు అధికారంలోకి వచ్చాక 10 ఎన్ కౌంటర్లు'
తిరుపతి : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద బుధవారం ఉద్రికత్త నెలకొంది. ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్పై మానవ హక్కుల సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం తెల్లవారుజామున చిత్తూరు శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్ర చందనం కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు రుయా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు.
దాంతో తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర హక్కుల సంఘాలు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. చంద్రబాబు సర్కారు పథకం ప్రకారమే ఇరవవైమంది కూలీలను పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. పొట్టకూటి కోసం కాయకష్టం చేసే పేద ప్రజలను ఎదురుకాల్పులు పేరుతో దారుణంగా మట్టుపెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పది ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. వేలకోట్ల రూపాయలను దండుకునే ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించలేని ప్రభుత్వం కూలీలను పొట్టన పెట్టుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.