సీఎం సారూ! రుయాకు వైద్యం చేయండి మీరు | Ruya Hospital Staff Negligence on Medical Services | Sakshi
Sakshi News home page

సీఎం సారూ! రుయాకు వైద్యం చేయండి మీరు

Dec 6 2018 11:09 AM | Updated on Dec 6 2018 11:09 AM

Ruya Hospital Staff Negligence on Medical Services - Sakshi

రుయా ఆస్పత్రిలో వైద్య సేవలు రోజు రోజుకూ అధ్వానంగా మారుతున్నాయి. వైద్యుల కొరత పెద్దగా లేకపోయినా ఏళ్ల తరబడీ నర్సింగ్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం ఇన్‌పేషెంట్లకు మెరుగైన సేవలు అందడం కరువవుతోంది. 4వ తరగతి ఉద్యోగుల కొరత వేధిస్తున్నా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదు. అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల అందివ్వడంలోనూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆస్పత్రిలో మెడికల్‌ షాపు మూతపడి ఏడాది గడుస్తున్నా ఇంత వరకు టెండర్లు జరగనీయకుండా టీడీపీ నేతలు మోకాలడ్డుతున్నారు. ఉన్నతాధికారులు సొంత పనులకు ప్రాధాన్యతనిస్తూ ఆస్పత్రిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రాయలసీమ ప్రాంత నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా 1962లో రుయా ఆస్పత్రిని ప్రారంభించారు. రుయాకు నిత్యం 1500 నుంచి 2వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. ఆస్పత్రిలో 1,098 పడకలు ఉన్నాయి. 850 మంది ఇన్‌పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. వార్డుల్లో సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.

వైద్యుల కొరత  
రుయా ఆస్పత్రిలో 18 విభాగాలున్నాయి. ఇందులో న్యూరో సర్జరీ, పిడియాట్రిక్‌ సర్జరీ, యూరా లజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజి, కార్డియో థోరాసిక్‌ సర్జరీ, రేడియోథెరపి వంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి ప్రారంభం నాటితో పోల్చితే ప్రస్తుతం ఎన్నోరెట్లు ఓపీ పెరిగింది. ప్రస్తుతం రుయాలో 146 మంది వైద్య బృందం, పీజీ వైద్యులు ఓపీ, వార్డులకు సేవలందిస్తున్నారు.

నిర్లక్ష్యం ఖరీదు
ఎస్వీ మెడికల్‌ కళాశాల, రుయా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్డియాలజీ, కేన్సర్‌ వార్డులు పూర్తిగా మూతపడ్డాయి. ఈ రెండు విభాగాల్లో గతంలో పీజీ సీట్లు ఉండేవి. ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారడంతో సీట్లకు కోతపడింది. ఆస్పత్రి కార్డియోథోరాసిక్‌ సర్జరీ వైద్యులు ఇద్దరున్నా వారికి తగిన ఆపరేషన్‌ థియేటర్, ఓపీ లేకపోవడంతో వారికి పనిలేకుండా పోయింది. నిపుణులున్నా వారి సేవలను ఉపయోగించుకోలేని దుస్థితిలో రుయా ఆస్పత్రి ఉంటోంది. ఇక డెంటల్‌ విభాగంలో సర్జరీల ఊసే లేదాయె!

ఏళ్ల తరబడి భర్తీకి నోచని పోస్టులు
రుయాలో నర్సింగ్, పారా మెడికల్, 4వ తరగతి సిబ్బంది పోస్టులను కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడం రోగులకు శాపంగా మారింది. వాస్తవానికి 240 మంది నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం 90 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఇంకా 150  నర్సింగ్‌ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. నర్సింగ్‌ సిబ్బంది లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందే నర్సుల అవతారం ఎత్తిన సందర్భాలూ లేకపోలేదు! ప్రస్తుతం రుయాను ట్రైనీ నర్సింగ్‌ విద్యార్థినులతో లాక్కొస్తున్నారు. 58 మంది పారామెడికల్‌ సిబ్బంది అవసరమైతే కేవలం 23 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక, 98 మంది 4వ తరగతి ఉద్యోగులు ఉండాల్సింది పోయి కేవలం 25 మంది మాత్రమే ఉన్నారు. ఇలా రుయాను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల కొత్తగా ఔట్‌సోర్సింగ్‌ కింద 20 మంది సిబ్బందిని నియమించినా  ఉన్నతాధికారుల మధ్య విభేదాల కారణంగా మరికొన్ని పోస్టులు భర్తీకి నోచుకోలేదు.

మెడికల్‌ షాపు టెండర్‌కుటీడీపీ నేతల మోకాలడ్డు
రుయాలో 2017 డిసెంబర్‌ 24న సాధారణ మెడికల్‌ షాపు నిర్వహణ గడువు ముగిసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు టెండర్ల జోలికి వెళ్లలేదు. తెలుగు తమ్ముళ్లు పట్టుపట్టడంతో టెండర్ల ప్రతిపాదన చేయలేదు. మంత్రి అమరనాథరెడ్డి సిఫార్సు ఓ తెలుగు తమ్ముడికి ఉండడంతో టెండర్‌ ప్రతిపాదన సిద్ధం చేసినా అది అటకెక్కింది. రుయా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement