ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌దే పెత్తనం
చంద్రబాబుని ఎమ్మెల్యేలు కలవాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి
పోలీసులు, అధికారులు అందరూ శ్రీకాంత్ కనుసన్నల్లోనే
పార్టీ కార్యకర్తల ఆందోళనతో
బాబును కలిసేందుకు పర్మిషన్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు పర్యటనలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిని సీనియర్ నేతలు కలిసేందుకు సైతం ఆంక్షలు విధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కార్యకర్తలనైతే తన నిరంకుశ వైఖరితో అడుగడుగునా అవమానించారని పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని మండిపడుతున్నాయి. ఆయన అనుమతి లేనిదే సీఎం సమీపంలోకి సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన చెందుతున్నాయి. చివరకు పోలీసులు.. ఉన్నతాధికారులను తన కనుసన్నల్లోనే నడిపించారని ఆరోపిస్తున్నాయి. అభిమానంతో అధినేతను కలవాలని వస్తే ఇదెక్కడి పెత్తనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం నియోజకవర్గానికి విచ్చేశారు. ఇక అప్పటి నుంచి మొత్తం పర్యటన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కనుసన్నల్లోనే సాగడం టీడీపీ శ్రేణులను అసంతృప్తికి గురిచేసింది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్సీ చెప్పాలి. అది ఎమ్మెల్యే అయినా.. సీనియర్, టీడీపీ, జనసేన నేతలైనా సరే. ఆయన చెప్పకపోతే సీఎంని కలిసే అవకాశమే లేదు.
అలా ఒకరోజంతా ఓపికగా వేచి చూసిన కూటమి నేతలు, కార్యకర్తలు సహనం నశించి బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎట్టకేలకు సీఎం చంద్రబాబుని కలిసేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు మొదటి సారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి వచ్చారు. మంగళవారం కుప్పానికి చేరుకున్న చంద్రబాబు.. బుధవారం సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబుని కలిసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా.. అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రిని కలవొచ్చని ఆశగా కుప్పానికి చేరుకున్న వారికి నిరాశే ఎదురైంది.
అడ్డంకులు.. అవమానాలు!
ఎమ్మెల్యేల నుంచి.. సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో సీఎం చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అడుగడుగునా అడ్డంకులు, అవమానాలే ఎదురైనట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం అంటే సెక్యూరిటీ సహజమే అయినా.. ఎమ్మెల్యే అయితే పెద్దగా తనిఖీలు లేకుండా నేరుగా పంపేస్తుంటారు. అలాంటిది కుప్పంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవమే ఎదురైంది.
తాను ఎమ్మెల్యేని చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదని, పంపేందుకు ససేమిరా అన్నారని తెలిపారు. ఐడీ కార్డు ఉందా? మీరు ఎమ్మెల్యేనేనా? రుజువు ఏంటి? అంటూ సవాలక్ష ప్రశ్నలతో తీవ్ర అవమానాలకు గురిచేసినట్లు చెబుతున్నారు. ‘సీఎంని కలవాలంటే.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ నుంచి ఫోన్ చేయించండి లేదా చెప్పించండి’ అంటూ సమాధానం ఎదురైందంటున్నారు. సరే శ్రీకాంత్‌తో చెప్పిద్దాం అంటే ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులే కాకుండా.. అధికారులు సైతం ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడిచినట్లు వివరించారు. ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నాయకులకు కూడా సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులందరినీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం లోటే..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మంత్రి వర్గంలో పెద్దపీట వేశారు. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విప్ పదవి సైతం ఇచ్చారు. జిల్లాపై తనకున్న అభిమానం చాటుకున్నారు. అయితే ఇప్పుడు అదే స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడంపై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరికై నా మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఇలా ఉండేది కాదనే అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లా ఎమ్మెల్యేలకే న్యాయం చేయకపోతే ఎలా? అని ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఆందోళనతో దిగొచ్చినా ప్రయోజనం శూన్యం!
కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం.. సీఎం కుప్పానికి రావడంతో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేననేతలు చంద్రబాబుని కలిసేందుకు ఉత్సాహం చూపించారు. మంగళవారం ఉదయం నుంచి వేచి ఉన్న వారికి బుధవారం కూడా చంద్రబాబుని కలిసే అవకాశం రాలేదు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తోపాటు పోలీసులను ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహించిన కూటమి శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ వారిని లోనికి పంపించమని పోలీసులను ఆదేశించారు. అయితే లోపలికి వెళ్లినా.. కొందరికి మాత్రమే సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం దొరికిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment