సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలవ్వడం ఆ పార్టీకి మరికొన్ని చికుల్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ అవే ఫలితాలను పునరావృత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు చిత్తుచిత్తుగా ఓటమి చవిచూశారు. దశాబ్దాల పాటు టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించడం ఆ పార్టీ నేతల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చరిత్రలో లేని విధంగా ప్రతిపక్ష పార్టీ దెబ్బతింది. టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఈ ఫలితాలను ప్రతిపక్ష నేతను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఎవరు చేసిన తప్పిదాలకు వారే బాధ్యత వహించకతప్పదనే రీతిలో చంద్రబాబు ఓటమిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల ఓటమి, కరోనా వైరస్ తెచ్చిన లాక్‌డౌన్ వంటి క్లిష్టపరిస్థితిల్లోనూ చంద్రబాబు నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. 35 ఏళ్లు రాజకీయ భవిష్యత్ కల్పించిన కుప్పం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించలేదని విమర్శలు వినిపించాయి. దీంతో ఆయన తీరుపై కుప్పం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో తగిన బుద్దిచెప్పారు. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఓడించి.. కర్రుకాల్చి వాతపెట్టారు. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది.
రాజీనామాకు సిద్ధపడ్డ టీడీపీ ఇంచార్జ్..!
ఎన్నికల ఫలితాలు టీడీపీలో ముసలానికి కారణం అయ్యాయి. పార్టీ ఓటమికి మీరంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు నేతలు విమర్శలకు దిగుతున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పీఎస్ మునిరత్నంపై స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం వచ్చిన మునిరత్నం, చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్‌లకు స్థానికంగా చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు నేతలపై కార్యకర్తలు తిరుగుబాటు యత్నించారు. ఈ ఇద్దరి తీరు వల్లే ఎన్నికల్లో ఓటమి చెందామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రామకుప్పంలో నిర్వహించిన టీడీపీ సమావేశం గందరగోళంగా మారింది. దీంతో టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేసేందుకు మునిరత్నం సిద్ధపడ్డారు. నేతలు సముదాయించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
చంద్రబాబు కుప్పం పర్యటన
రాష్ట్ర ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రెండు రోజులు పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment