పుంగనూరు: చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారంతా రెచ్చిపోయి ప్రశాంతంగా ఉండే పుంగనూరులో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. రోడ్ షోకు బందోబస్తు నిర్వహించి రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైనే విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్టు రాళ్లు రువ్వారు, వాహనాలకు నిపు పెట్టారు, అక్కడున్న వారంతా టీడీపీ కార్యకర్తల వీరంగాన్ని బెంబేలెత్తిపోయి ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. పాపం పోలీసులు మాత్రం వీధిలో భాగంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై రక్తమోడేలా హింసాత్మక దాడులు చేశారు.
అల్లర్ల గురించి పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్ మీడియాకు వివరిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారన్నారు. పుంగనూరులో ప్రశాంతతకు విఘాతం కలిగించి విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతోనే అల్లర్లు జరిగాయి. వాస్తవానికి వారికి ఆ మార్గంలో రావడానికి అనుమతే లేదు. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే మార్గాన్ని ఎంచుకుని ఇక్కడికి చొరబడ్దారు. వారు చేసిన దాడుల్లో సామాన్యులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
చంద్రబాబు రోడ్ షో గురించి ప్రకటించగానే అల్లర్ల సృష్టించాలని వారు ముందే పథకం రచించారు. పథకం ప్రకారమే వారు తమ వెంట ఆయధాలను తెచ్చుకున్నారు. వారు దాడులు చేస్తున్నా ప్రతిదాడి చేయకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసి పోలీసులు సహనాన్ని పాటించారు. ముఖ్యంగా గాయపడిన పోలీసులు ఎంతో సంయమనాన్ని పాటించారన్నారు.
తామే దాడి చేసి పోలీసులు తమపై దాడి చేశారంటూ ఎదురు ఆరోపణలు చేస్తుండడం శోచనీయం. పోలీసులు రెచ్చగొట్టారనేది పూర్తిగా అవాస్తవం. మేము పోలీసులం.. మాకు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒక్కటే. ఎవ్వరికైనా రక్షణ కల్పించడమే మా కర్తవ్యం. మేం చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడమే మా లక్ష్యం. ఎవరి కార్యక్రమాలకైనా విధిగా మేం భద్రతగా కల్పిస్తాం. అది మా బాధ్యతని గుర్తు చేశారు.
రక్షణ కల్పించే మాపైనే వారు దాడి చేసి గాయపరిచారు. ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా విధ్వంసం సృష్టించేందుకే ప్రయత్నించారు. తోటి కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ చేసేందుకు ఉసిగొల్పారు. సంఘటన గురించి తెలియగానే డీజీపీ వెంటనే విచారణకు ఆదేశించారన్నారు.
గాయపడిన పోలీసుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. విధి నిర్వహణలో ఆంధ్ర పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిచాలి. ఈ కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంతటివారైనా చట్టాన్ని గౌరవించాలి. కిందిస్థాయి వారికి పై స్థాయిలోని వారే చెప్పాలని అన్నారు చిత్తూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్.
ఇది కూడా చదవండి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment