
విశాఖ: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సింహాచలం గోడ నిర్మాణంలో ఎలాంటి టెండర్ లేదు. నోటి మాటతో నిర్మాణం జరిగింది. దీంతో పాటు వైదిక నిబంధనలను ఉల్లంఘించినట్లు సింహాచలం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ చేపట్టిన రెండో రోజు విచారణలో తేలింది.
విచారణలో భాగంగా త్రిసభ్య కమిషన్ విషాదానికి సంబంధించి ఆలయ అర్చకులు, వైదికుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. సింహగిరిలో కూలిన గోడపై త్రిసభ్య కమిటీ సభ్యుల విచారణలో.. దేవాలయంలో నోటి మాటతో గోడ నిర్మాణం చేపట్టారని, అనుమతులు, ప్రొసీజర్ ఫాలోకాలేదని స్పష్టమైంది. పైగా వైదిక నిబంధనలు సైతం ఉల్లంఘించారని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌కు సింహాచలం ఆలయ అర్చకులు వివరించారు.
‘మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పాం. అయినా మా మాట వినకుండా గోడ నిర్మాణం చేపట్టారని’ సింహాచలం వైదికులు, అర్చకులు వివరించారు. అర్చకులు, వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను ఇవాళ ఏపీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో త్రిసభ్య కమిషన్ పొందుపరచనుంది.
