
మర్రిపాలెం(విశాఖపట్నం): విద్యుత్ షాక్‌కు గురై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్‌లోని అయ్యప్పనగర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్‌తో కలిసి అయ్యప్పనగర్‌లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్‌లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది.
ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్‌కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్‌తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సరీ్వస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు.