
ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఇంజినీరు కోనారి ప్రసాద్ (28) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ నెల 10న హత్యకు పాల్పడిన అన్నదమ్ములైన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్య వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఐ నారాయణరావు, తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు కోనారి ప్రసాద్‌కు నెమలాం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లను భర్త అచ్యుతరావు గమనించాడు. విషయాన్ని తమ్ముడు శివకృష్ణకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్‌ను అంతమొందించాలని నిర్ణయించారు. బెంగళూరులో పనిచేస్తున్న ప్రసాద్ గ్రామానికి రావడంతో హత్యపథకం అమలుచేయాలని నిశ్చయానికి వచ్చారు. ఆయనతో ముందురోజు మాట్లాడారు. విజయరాంపురంలోని అమ్మమ్మవారి ఇంటికి వెళ్తున్న విషయం, తిరిగి ఏ సమయానికి వస్తాడన్న విషయం తెలుసుకున్నారు. మాట్లాడదామని నెమలాం సమీపంలోని వారి పొలాల వద్దకు పిలిచారు. ప్రసాద్‌తో శివకృష్ణ మాట్లాడుతుండగా వెనుకనుంచి తలపై కర్రతో అచ్యుతరావు బలంగా మోదాడు.
తర్వాత ఇద్దరూ కలిసి కర్రలతో దాడిచేశారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ కాలుజారి పిల్లకాలువలోని రాయిపై పడిపోవడంతో అక్కడకు వెళ్లి మరోసారి దాడిచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డుపై తెచ్చి పడేశారు. అనంతరం బైక్‌ను కూడా కర్రలతో ధ్వంసం చేసి రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత ప్రమాదంగా అనుమానించారు. ఘటనా స్థలాన్ని చూసి హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ, సీఐ, తెర్లాం ఎస్‌ఐలను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment